విత్తనాలు బ్లాక్‌లో అమ్మితే చర్యలు తప్పవు
Published Wed, May 10 2017 11:49 PM | Last Updated on Wed, Apr 3 2019 4:04 PM
– జేడీఏ ఉమామహేశ్వరమ్మ
కర్నూలు(అగ్రికల్చర్): మిరప, బీటీ పత్తి విత్తనాలను బ్లాక్‌లో అమ్మితే చర్యలు తప్పవని జేడీఏ ఉమామహేశ్వరమ్మ సీడ్ కంపెనీల ప్రతినిధులను హెచ్చరించారు. బుధవారం తన చాంబరులో సీడ్ కంపెనీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో జేడీఏ మాట్లాడుతూ ఖరీప్ సీజన్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో మిరప, పత్తి విత్తనాల అమ్మకాలు పారదర్శకంగా జరగాలన్నారు. ప్రతి కంపెనీ మిరపలో దేశవాలీ, హైబ్రిడ్ విత్తన రకం వారిగా ఏఏ పంపిణీ దారుకు ఎంత క్వాంటిటీ విత్తనాలు సరఫరా చేశారనే వివరాలు తక్షణం ఇవ్వాలని కంపెనీల ప్రతినిధులను ఆదేశించారు.
బ్లాక్‌లో అధిక ధరలకు మిరప, పత్తి విత్తనాలను విక్రయించారని ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాకు బీటీ పత్తి విత్తనాలు 10.15 లక్షల ప్యాకెట్లను ప్రభుత్వం కేటాయించిందని, ఇందులో అత్యధికంగా కావేరి, నూజివీడు కంపెనీలే సరఫరా చేయాల్సి ఉందని ఈ మేరకు విత్తన ప్యాకెట్లను పొజిషన్ చేయాలని ఆదేశించారు. బ్లాక్‌లో విత్తనాలు అమ్మకుండా నిఘా పెంచినట్లు తెలిపారు. నర్సరీలను ఉద్యాన శాఖ అధికారులు రిజిష్టర్ చేయాలని ఏడీలకు సూచించారు. నర్సరీలపై నిఘా లేకపోతే వాటికి విత్తనాలు ఎక్కడి నుంచి వస్తున్నాయనే దానిపై స్పష్టత ఉండదన్నారు. నారు పెంచి అమ్ముకునే అన్ని నర్సరీలకు వెంటనే లైసెన్స్ ఇవ్వాలని సూచించారు. సమావేశంలో ఏడీఏ ఉమామహేశ్వరరెడ్డి, ఏఓ శారద, ఉద్యానశాఖ ఏడీలు రఘునాథరెడ్డి, సతీష్ పాల్గొన్నారు.
Advertisement