నీటి విడుదలే ప్రశ్నార్థకం
52,825 క్వింటాళ్ల వరి విత్తనాలు అవసరం
ఇప్పటివరకు రైతులకు ఇచ్చింది 412 క్వింటాళ్లు
మచిలీపట్నం : ఖరీఫ్ సాగు సందిగ్ధంలో పడింది. సీజన్ ప్రారంభమై పక్షం రోజులపైనే గడిచిపోయాయి. అయినా నారుమడులకు సాగునీటి విడుదలపై పాలకులు పెదవి విప్పటం లేదు. ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి వ్యవసాయ శాఖ భారీ ప్రణాళిక రూపొందించింది. కీలకమైన సాగునీటి విడుదలపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయకపోవటంతో రైతుల్లో అయోమయం నెలకొంది. ఆగస్టులో జరిగే పుష్కరాల నాటికైనా నీటిని విడుదల చేస్తారా లేదా అనే ప్రశ్నలు రైతుల నుంచి వినవస్తున్నాయి. ఇటీవల వర్షాలు కురిసినా అవి పంటల సాగుకు అక్కరకు రాని పరిస్థితి నెలకొంది. ఖరీఫ్ సీజన్‌లో జిల్లాలో 6.25 లక్షల ఎకరాల్లో వరి 1.37 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని అధికారులు ప్రణాళిక రూపొందించారు. మొక్కజొన్న, పెసర, కంది, మినుము, వేరుశెనగ, నువ్వులు, పత్తి, మిరప, చెరకు, పసుపు పంటలతో కలుపుకుని 8.68 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా వేశారు. కురిసిన వర్షాలకు తోడు కాలువల ద్వారా నీరు విడుదలైతేనే సాగుకు అవకాశం ఏర్పడుతుందని రైతులు చెబుతున్నారు. సాగునీటి విడుదలపై సందిగ్ధత నెలకొనటంతో వ్యవసాయాధికారులు వివిధ రకాల విత్తనాలను రప్పించే అంశంపై ఆచితూచి అడుగులేస్తున్నారు. గత ఏడాది ఖరీఫ్ సీజన్‌లో అధికారికంగా కాలువలకు సాగునీటిని విడుదల చేయకపోవటంతో వర్షాధారంగానే రైతులు పంటలు సాగు చేశారు. పట్టిసీమ ద్వారా సాగునీటిని విడుదల చేస్తామని పాలకులు చెబుతున్నా అది ఎంతమేరకు ఆచరణకు నోచుకుంటుందనేది ప్రశ్నార్థకమే.
సూక్ష్మధాతు ఎరువుల సరఫరా ఎప్పటికో...
జిల్లాలో ఈ ఏడాది 60,680 మట్టి నమూనాలను సేకరించారు. రైతులందరికీ భూసార పరీక్షలకు సంబంధించిన ఫలితాలను అందజేశారు. ఈ ఏడాది నుంచి ఈ-పోస్ ద్వారా ఎరువులు సరఫరా చేస్తుండటంతో మరో 32,981 శాంపిళ్లను సేకరించాలని కలెక్టర్ బాబు.ఎ వ్యవసాయ శాఖాధికారులను ఆదేశించారు. వీటిలో ఇప్పటి వరకు 3,595 శాంపిళ్లను సేకరించారు. భూసార పరీక్షల ఆధారంగా ఎరువుల వినియోగంతో పాటు సూక్ష్మధాతు లోపాలను గుర్తించే వీలు కలిగింది. ఇందుకోసం 12,500 టన్నుల జింకు, 11,150 టన్నుల బోరాన్, 1500 టన్నుల జిప్సం అవసరమని నిర్ణయించారు. ఇప్పటివరకు 109 టన్నుల జింకు, 8.19 టన్నుల బోరాన్, 833 టన్నుల జిప్సం మాత్రమే దిగుమతి అయ్యింది. జిప్సం 234 టన్నులను రైతులకు అందజేశారు. భూసారాన్ని పెంచేందుకు పచ్చిరొట్ట ఎరువుల వినియోగంపైనా వ్యవసాయాధికారులు దృష్టిసారించారు. జీలుగ విత్తనాలు 9808 టన్నులను దిగుమతి చేసుకుని 8266 టన్నులను రైతులకు అందజేశారు. పిల్లి పెసర 2662 టన్నులను దిగుమతి చేసి 202 టన్నులను రైతులకు అందించారు.
ఎంటీయూ, బీపీటీ రకాలకు ప్రాధాన్యం
జిల్లాలో 6.25 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని నిర్ణయించగా 52,825 క్వింటాళ్ల వరి విత్తనాలను సబ్సిడీపై అందించాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. ఎంటీయూ 1061, బీపీటీ 5204 రకం వరి విత్తనాలను సరఫరా చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటి వరకు 9630 క్వింటాళ్ల విత్తనాలను సిద్ధంగా ఉంచారు. వీటిలో 412 క్వింటాళ్లను మాత్రమే రైతులకు అందజేశారు. ఈ ఖరీఫ్‌లో పెసర 12,500 ఎకరాల్లో సాగవుతుందని నిర్ణయించగా, 560 క్వింటాళ్ల ఎల్‌జీజీ-460 రకం విత్తనాలు సిద్ధంగా ఉంచారు. మినుము 390 క్వింటాళ్లు అవసరమని నిర్ణయించగా 560 క్వింటాళ్లు ఎల్‌బీజీ-752, పీయూ-31 విత్తనాలను సిద్ధం చేశారు. ఇప్పటివరకు 17 క్వింటాళ్లు మాత్రమే రైతులకు అందజేశారు. వేరుశెనగ కె-6, కె-9 రకం విత్తనాలు 550 క్వింటాళ్లు, మొక్కజొన్న 180 క్వింటాళ్ల విత్తనాలు అవసరమని నిర్ణయించగా ఇప్పటి వరకు విత్తనాలు దిగుమతి కాలేదు. పత్తి 1.37 లక్షల ఎకరాల్లో సాగవుతుందని అంచనా వేయగా 2.95 లక్షల ప్యాకెట్ల విత్తనాలు అవసరమని, వాటిని ప్రైవేటు సంస్థలు సరఫరా చేయాలని ఇండెంట్ పెట్టారు. వాతావరణం సాగుకు అనుకూలంగా మారుతున్న తరుణంలో విత్తనాలు దిగుమతి చేసుకుంటామని వ్యవసాయ శాఖ జేడీ యు.నరసింహారావు ‘సాక్షి’కి తెలిపారు.