సాక్షి, అమరావతి: తుంగభద్ర డ్యామ్‌లో డిసెంబరు నాలుగోవారానికి రికార్డు స్థాయిలో నీటి నిల్వలు ఉన్నాయి. డ్యామ్ చరిత్రలో తొలిసారిగా శనివారం 1632.14 అడుగుల్లో 97.55 టీఎంసీల నీరు ఉంది. దీంతో ఆయకట్టు రైతుల్లో నూతనోత్సాహం నెలకొంది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఖరీఫ్ పంటల కోతలు దాదాపుగా పూర్తయినా, డ్యామ్‌లో ఈ స్థాయిలో నీరు ఉండటం లేట్ ఖరీఫ్‌తో పాటు రబీకీ ఉపయోగకరమని రైతులు, అధికారులు చెబుతున్నారు. తుంగభద్ర డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,633 అడుగులు. పూర్తి నీటి నిల్వ 100.86 టీఎంసీలు.
చదవండి: సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక రైళ్లు
గతేడాది ఇదే రోజు (డిసెంబరు 25కి) 1625.26 అడుగుల్లో 73.74 టీఎంసీలు నిల్వ ఉంది. ఈ ఏడాది అంతకంటే ఎక్కువ నీరుంది. గత పదేళ్లలో ఇదే రోజుకి సగటున 55.20 టీఎంసీలు మాత్రమే. అంటే డ్యామ్‌లో గత పదేళ్ల కంటే ఈ ఏడాది 42.35 టీఎంసీలు అధికంగా నిల్వ ఉంది. దీంతో లేట్ ఖరీఫ్, రబీ పంటలకు సమృద్ధిగా నీటిని సరఫరా చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
ఒక్క సారే కేటాయించిన మేరకు వినియోగం
తుంగభద్ర డ్యామ్‌లో 230 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని అంచనా వేసిన బచావత్ ట్రిబ్యునల్ కర్ణాటకకు 151.49 (ఆవిరి నష్టాలు 12.50), ఆంధ్రప్రదేశ్‌కు 72 (ఆవిరి నష్టాలు 5.50), తెలంగాణకు 6.51 టీఎంసీలు కేటాయించింది. రాష్ట్రానికి కేటాయించిన నీటిలో హెచ్చెల్సీకి 32.5, ఎల్లెల్సీకి 29.5, కేసీ కెనాల్ ద్వారా 10 టీఎంసీలు సరఫరా చేస్తారు. నీటి లభ్యత సరిగా లేకపోవడంతో 1980–81లో మినహా మిగిలిన ఏ సంవత్సరాల్లోనూ కేటాయించిన మేరకు మూడు రాష్ట్రాలూ నీటిని వాడుకోలేదు. డ్యామ్‌లో పూడిక పేరుకుపోవడం, వర్షాభావం కారణంగా నీటి లభ్యత తగ్గింది.
దీంతో దామాషా పద్ధతిలో మూడు రాష్ట్రాలకు తుంగభద్ర బోర్డు నీటిని కేటాయిస్తోంది. అయితే, ఈ ఏడాది తుంగభద్ర పరివాహక ప్రాంతంలో సమృద్ధిగా వర్షాలు కురవడంతో డ్యామ్‌లోకి శనివారం వరకు 382.47 టీఎంసీల నీరు వచ్చింది. దీంతో తుంగభద్ర బోర్డు మూడు రాష్ట్రాలకూ 109 టీఎంసీలు విడుదల చేసింది. ఇందులో హెచ్చెల్సీ, ఎల్లెల్సీ ద్వారా 35 టీఎంసీలను రాష్ట్రం వినియోగించుకుంది. స్పిల్ వే గేట్లు, విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా 135 టీఎంసీలను బోర్డు దిగువకు వదిలేసింది. డ్యామ్‌లో ఇప్పటికీ 97.55 టీఎంసీలు ఉండటంతో అందులో కనీస నీటి మట్టానికి పైన లభ్యతగా ఉన్న నీటిలో రాష్ట్ర వాటా కింద కనీసం 18 టీఎంసీలు వచ్చే అవకాశం ఉందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. దీనివల్ల తుంగభద్ర హెచ్చెల్సీ కింద అనంతపురం జిల్లాలో లేట్ ఖరీఫ్, వైఎస్సార్ కడప, కర్నూలు జిల్లాల్లో రబీ, ఎల్లెల్సీ కింద కర్నూలులో ఆరుతడి పంటలకు సమృద్ధిగా నీళ్లందించవచ్చని అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment