rabbi
-
నిండుగా తుంగభద్ర.. రికార్డు స్థాయిలో నీటి నిల్వలు
సాక్షి, అమరావతి: తుంగభద్ర డ్యామ్‌లో డిసెంబరు నాలుగోవారానికి రికార్డు స్థాయిలో నీటి నిల్వలు ఉన్నాయి. డ్యామ్ చరిత్రలో తొలిసారిగా శనివారం 1632.14 అడుగుల్లో 97.55 టీఎంసీల నీరు ఉంది. దీంతో ఆయకట్టు రైతుల్లో నూతనోత్సాహం నెలకొంది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఖరీఫ్ పంటల కోతలు దాదాపుగా పూర్తయినా, డ్యామ్‌లో ఈ స్థాయిలో నీరు ఉండటం లేట్ ఖరీఫ్‌తో పాటు రబీకీ ఉపయోగకరమని రైతులు, అధికారులు చెబుతున్నారు. తుంగభద్ర డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,633 అడుగులు. పూర్తి నీటి నిల్వ 100.86 టీఎంసీలు. చదవండి: సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక రైళ్లు గతేడాది ఇదే రోజు (డిసెంబరు 25కి) 1625.26 అడుగుల్లో 73.74 టీఎంసీలు నిల్వ ఉంది. ఈ ఏడాది అంతకంటే ఎక్కువ నీరుంది. గత పదేళ్లలో ఇదే రోజుకి సగటున 55.20 టీఎంసీలు మాత్రమే. అంటే డ్యామ్‌లో గత పదేళ్ల కంటే ఈ ఏడాది 42.35 టీఎంసీలు అధికంగా నిల్వ ఉంది. దీంతో లేట్ ఖరీఫ్, రబీ పంటలకు సమృద్ధిగా నీటిని సరఫరా చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఒక్క సారే కేటాయించిన మేరకు వినియోగం తుంగభద్ర డ్యామ్‌లో 230 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని అంచనా వేసిన బచావత్ ట్రిబ్యునల్ కర్ణాటకకు 151.49 (ఆవిరి నష్టాలు 12.50), ఆంధ్రప్రదేశ్‌కు 72 (ఆవిరి నష్టాలు 5.50), తెలంగాణకు 6.51 టీఎంసీలు కేటాయించింది. రాష్ట్రానికి కేటాయించిన నీటిలో హెచ్చెల్సీకి 32.5, ఎల్లెల్సీకి 29.5, కేసీ కెనాల్ ద్వారా 10 టీఎంసీలు సరఫరా చేస్తారు. నీటి లభ్యత సరిగా లేకపోవడంతో 1980–81లో మినహా మిగిలిన ఏ సంవత్సరాల్లోనూ కేటాయించిన మేరకు మూడు రాష్ట్రాలూ నీటిని వాడుకోలేదు. డ్యామ్‌లో పూడిక పేరుకుపోవడం, వర్షాభావం కారణంగా నీటి లభ్యత తగ్గింది. దీంతో దామాషా పద్ధతిలో మూడు రాష్ట్రాలకు తుంగభద్ర బోర్డు నీటిని కేటాయిస్తోంది. అయితే, ఈ ఏడాది తుంగభద్ర పరివాహక ప్రాంతంలో సమృద్ధిగా వర్షాలు కురవడంతో డ్యామ్‌లోకి శనివారం వరకు 382.47 టీఎంసీల నీరు వచ్చింది. దీంతో తుంగభద్ర బోర్డు మూడు రాష్ట్రాలకూ 109 టీఎంసీలు విడుదల చేసింది. ఇందులో హెచ్చెల్సీ, ఎల్లెల్సీ ద్వారా 35 టీఎంసీలను రాష్ట్రం వినియోగించుకుంది. స్పిల్ వే గేట్లు, విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా 135 టీఎంసీలను బోర్డు దిగువకు వదిలేసింది. డ్యామ్‌లో ఇప్పటికీ 97.55 టీఎంసీలు ఉండటంతో అందులో కనీస నీటి మట్టానికి పైన లభ్యతగా ఉన్న నీటిలో రాష్ట్ర వాటా కింద కనీసం 18 టీఎంసీలు వచ్చే అవకాశం ఉందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. దీనివల్ల తుంగభద్ర హెచ్చెల్సీ కింద అనంతపురం జిల్లాలో లేట్ ఖరీఫ్, వైఎస్సార్ కడప, కర్నూలు జిల్లాల్లో రబీ, ఎల్లెల్సీ కింద కర్నూలులో ఆరుతడి పంటలకు సమృద్ధిగా నీళ్లందించవచ్చని అధికారులు చెబుతున్నారు. -
ఇక రబీయే దిక్కు!
► రాష్ట్రంలో దారుణంగా ఖరీఫ్ పంటల పరిస్థితి ► ముసురుకుంటున్న తీవ్ర కరువు పరిస్థితులు ► ఇప్పటికే నెల రోజులుగా జాడలేని వర్షాలు ► ముందస్తు రబీకి వెళ్లక తప్పదంటున్న వ్యవసాయ వర్సిటీ శాస్త్రవేత్తలు ► రైతులను, ఖరీఫ్ పంటలను వదిలేసి సమగ్ర సర్వేపైనే అధికారుల దృష్టి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఖరీఫ్ పంటల పరిస్థితి దారుణంగా మారింది. వర్షాలు సరిగా కురవక పంటలు ఎండిపోతున్నాయి. ఇలా కళ్లముందే పంటలు దెబ్బతింటుండడంతో రైతులు ఆందోళనలో మునిగిపోయారు. పం టల పరిస్థితి ఇంత ఘోరంగా ఉన్నా వ్యవసా యాధికారులు ఏమీ పట్టనట్టు ఉండిపోతు న్నారు. కేవలం సమగ్ర రైతు సర్వేపైనే దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ప్రత్యామ్నాయ ప్రణాళికను సిద్ధం చేశారు. ఖరీఫ్ పంటలు ఎండిపోతున్న నేపథ్యంలో ముందస్తు రబీకి వెళ్లాలని.. ఇప్పటికే పంటలు ఎండిపోయిన చోట ఆముదం, కంది వంటి ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని సూచిస్తున్నారు. మరోవైపు వర్షాలు కురిసే పరిస్థితి లేకపోవడంతో వ్యవసాయ శాఖ అన్ని జిల్లాల వ్యవసాయాధికారులతో మంగళవారం ప్రత్యేక సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. దుర్భరంగా పరిస్థితి జూలైలో 40% లోటు వర్షపాతం నమోదైంది. చాలా చోట్ల దాదాపు నెల రోజులుగా వర్షాల జాడలేదు. దీంతో డ్రైస్పెల్ పరిస్థితులు ఏర్పడ్డాయి. 10 జిల్లాల్లో లోటు నమోదైంది. మరో 18 జిల్లాల్లో సాధారణంగా, మూడు జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. మొత్తంగా 214 మండలాల్లో లోటు వర్షపాతం రికార్డయింది. దీంతో ప్రస్తుతం సాగులో ఉన్న 82.8 లక్షల ఎకరాల ఖరీఫ్ పంటల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. 44 లక్షల ఎకరాల్లో పత్తి పంట ఎండిపోయే దశలో ఉందని వ్యవ సాయ శాఖ అధికారులే చెబుతున్నారు. డ్రైస్పెల్ కారణంగా అనేక జిల్లాల్లో పత్తికి గులాబీ రంగు కాయతొలుచు పురుగు పట్టింది. 43 రోజులకు మించియ వర్షాలు పడకపోతే∙తీవ్ర కరువు ప్రాంతాలుగా నిర్ధారి స్తారు. ఈ లెక్కన ప్రస్తుతం రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇలాగే మరో 10 రోజులు కొనసాగితే తీవ్ర కరువు ముంచెత్తనుంది. పట్టించుకోని అధికారులు: అయితే, వ్యవసాయ శాఖలో ఏమాత్రం కదలిక కనిపించడం లేదు. ఖరీఫ్ పంటల వాస్తవ పరిస్థితిని అంచనా వేసేందుకు జిల్లాలకు వెళ్లాల్సిన ఆ శాఖ ఉన్నతాధికారులు హైదరాబాద్ దాటి కాలు బయటపెట్టడం లేదు. పైగా రైతు సమగ్ర సర్వే అంటూ గడిపేస్తున్నారు. హైదరాబాద్‌లోనూ ఆ శాఖ ఉన్నతాధికారులు ఎవరికీ అందుబాటులో లేకుండా సమావేశాలకే పరిమితమవుతున్నారన్న విమర్శలున్నాయి. చివరికి మండల వ్యవసాయాధికారులు కూడా రైతులకు అందుబాటులో ఉండటం లేదని.. రైతు సమగ్ర సర్వే వివరాల నమోదు పనిలోనే ఉంటున్నారని పేర్కొంటున్నారు. ముందస్తు తప్పదా? ఖరీఫ్ సాగు కష్టంలో పడడంతో వ్యవసాయ వర్సిటీ శాస్త్రవేత్తలు ప్రత్యా మ్నాయ పంటల ప్రణాళికను సిద్ధం చేశారు. ప్రస్తుతం ఎండిపోయే దశలో ఉన్న పంటలపై 2 శాతం యూరియా స్ప్రే చేయాలని సూచిస్తున్నారు. ఇప్పటికే ఖరీఫ్ పంటలు ఎండిపోయిన చోట ఆముదం, కంది పంటలు వేసుకోవాలని సూచిస్తున్నారు. పత్తి, వరి విషయంలో కొద్దిరోజులు వేచి చూడాలని.. నెలాఖరు వరకు కూడా వర్షాలు కురవక, పంటల పరిస్థితి కుదుటపడకుంటే ముందస్తు రబీకి వెళ్లడమే దిక్కు అని స్పష్టం చేస్తున్నారు. సాధారణంగా రబీ సాగు అక్టోబర్ నుంచి మొదలవుతుంది.