water levals
-
నిండుగా తుంగభద్ర.. రికార్డు స్థాయిలో నీటి నిల్వలు
సాక్షి, అమరావతి: తుంగభద్ర డ్యామ్‌లో డిసెంబరు నాలుగోవారానికి రికార్డు స్థాయిలో నీటి నిల్వలు ఉన్నాయి. డ్యామ్ చరిత్రలో తొలిసారిగా శనివారం 1632.14 అడుగుల్లో 97.55 టీఎంసీల నీరు ఉంది. దీంతో ఆయకట్టు రైతుల్లో నూతనోత్సాహం నెలకొంది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఖరీఫ్ పంటల కోతలు దాదాపుగా పూర్తయినా, డ్యామ్‌లో ఈ స్థాయిలో నీరు ఉండటం లేట్ ఖరీఫ్‌తో పాటు రబీకీ ఉపయోగకరమని రైతులు, అధికారులు చెబుతున్నారు. తుంగభద్ర డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,633 అడుగులు. పూర్తి నీటి నిల్వ 100.86 టీఎంసీలు. చదవండి: సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక రైళ్లు గతేడాది ఇదే రోజు (డిసెంబరు 25కి) 1625.26 అడుగుల్లో 73.74 టీఎంసీలు నిల్వ ఉంది. ఈ ఏడాది అంతకంటే ఎక్కువ నీరుంది. గత పదేళ్లలో ఇదే రోజుకి సగటున 55.20 టీఎంసీలు మాత్రమే. అంటే డ్యామ్‌లో గత పదేళ్ల కంటే ఈ ఏడాది 42.35 టీఎంసీలు అధికంగా నిల్వ ఉంది. దీంతో లేట్ ఖరీఫ్, రబీ పంటలకు సమృద్ధిగా నీటిని సరఫరా చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఒక్క సారే కేటాయించిన మేరకు వినియోగం తుంగభద్ర డ్యామ్‌లో 230 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని అంచనా వేసిన బచావత్ ట్రిబ్యునల్ కర్ణాటకకు 151.49 (ఆవిరి నష్టాలు 12.50), ఆంధ్రప్రదేశ్‌కు 72 (ఆవిరి నష్టాలు 5.50), తెలంగాణకు 6.51 టీఎంసీలు కేటాయించింది. రాష్ట్రానికి కేటాయించిన నీటిలో హెచ్చెల్సీకి 32.5, ఎల్లెల్సీకి 29.5, కేసీ కెనాల్ ద్వారా 10 టీఎంసీలు సరఫరా చేస్తారు. నీటి లభ్యత సరిగా లేకపోవడంతో 1980–81లో మినహా మిగిలిన ఏ సంవత్సరాల్లోనూ కేటాయించిన మేరకు మూడు రాష్ట్రాలూ నీటిని వాడుకోలేదు. డ్యామ్‌లో పూడిక పేరుకుపోవడం, వర్షాభావం కారణంగా నీటి లభ్యత తగ్గింది. దీంతో దామాషా పద్ధతిలో మూడు రాష్ట్రాలకు తుంగభద్ర బోర్డు నీటిని కేటాయిస్తోంది. అయితే, ఈ ఏడాది తుంగభద్ర పరివాహక ప్రాంతంలో సమృద్ధిగా వర్షాలు కురవడంతో డ్యామ్‌లోకి శనివారం వరకు 382.47 టీఎంసీల నీరు వచ్చింది. దీంతో తుంగభద్ర బోర్డు మూడు రాష్ట్రాలకూ 109 టీఎంసీలు విడుదల చేసింది. ఇందులో హెచ్చెల్సీ, ఎల్లెల్సీ ద్వారా 35 టీఎంసీలను రాష్ట్రం వినియోగించుకుంది. స్పిల్ వే గేట్లు, విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా 135 టీఎంసీలను బోర్డు దిగువకు వదిలేసింది. డ్యామ్‌లో ఇప్పటికీ 97.55 టీఎంసీలు ఉండటంతో అందులో కనీస నీటి మట్టానికి పైన లభ్యతగా ఉన్న నీటిలో రాష్ట్ర వాటా కింద కనీసం 18 టీఎంసీలు వచ్చే అవకాశం ఉందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. దీనివల్ల తుంగభద్ర హెచ్చెల్సీ కింద అనంతపురం జిల్లాలో లేట్ ఖరీఫ్, వైఎస్సార్ కడప, కర్నూలు జిల్లాల్లో రబీ, ఎల్లెల్సీ కింద కర్నూలులో ఆరుతడి పంటలకు సమృద్ధిగా నీళ్లందించవచ్చని అధికారులు చెబుతున్నారు. -
అడుగుఅడుగునా కష్టాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర తాగునీటి అవసరాలకు ప్రధాన వనరుగా ఉన్న నాగార్జునసాగర్‌లో నీటి మట్టం గణనీయంగా పడిపోతోంది. పూర్తిస్థాయిలో ఎం డలు తీవ్రతరమవడంతో.. రిజర్వాయర్‌లో నీటి మట్టాలు అడుగంటుతున్నాయి. మరో అడుగు దాటితే సాగర్‌లో నిల్వల కనీస నీటి మట్టానికి చేరనుంది. సాగర్ కనీస నీటిమట్టం 510 అడుగులు కాగా.. ప్రస్తుత మట్టం 511.40 అడుగులు గా ఉంది. మరో 3, 4 రోజుల్లో ఇది 510 అడుగులకు చేరనుంది. 505 అడుగుల వరకే ఓకే! సాగర్ ప్రాజెక్టు నుంచే ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 516 ఫ్లోరైడ్ గ్రామాలతోపాటు ఇతర 300 గ్రామా లకు, జంట నగరాల తాగునీటి అవసరాలకు కృష్ణా నీటిని సరఫరా చేస్తున్నారు. అయితే ఈ ఏడాది అనుకున్న స్థాయిలో ప్రవాహాలు లేక, సాగు అవసరాలకు సాగర్ నీటిని వినియోగించడంతో నిల్వలు తగ్గాయి. దీంతో సాగర్‌లో ప్రస్తు తం 590 అడుగులకు గానూ 511.40 అడుగులకు చేరాయి. ఈ మట్టంలో లభ్యత జలాలు 134 టీఎంసీ ఉన్నప్పటికీ ఇందులో కనీస నీటి మట్టాలకు ఎగువన వినియోగార్హమైన నీరు కేవలం 4 టీఎంసీలు మాత్రమే. దీనికి తోడు ఎగువన ఉన్న శ్రీశైలంలోనూ నీటి మట్టాలు పడిపోయాయి. 885 అడుగులకు గానూ 808.60 అడుగులకు నీటి మట్టం చేరింది. దీంతో అక్కడి నుంచి సాగర్‌కు నీటి విడుదల చేయడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో లభ్యత నీటితో ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణ తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని కృష్ణా బోర్డు సాగర్‌లో 505 అడుగుల వరకు, శ్రీశైలంలో 800 అడుగుల వరకు నీటిని వాడుకునే అవకాశం కల్పించింది. గరిష్టంగా 14 టీఎంసీలే రెండు ప్రాజెక్టుల పరిధిలో గరిష్టంగా 14 టీఎంసీల మేర మాత్రమే నీటిని వాడుకునే అవకాశం ఉంది. ఇందులో తెలంగాణకు 9 టీఎంసీ, ఏపీకి 5 టీఎంసీల నీటివాటా ఉంది. ఈ నీటినే ఇరు రాష్ట్రాలు ఆగస్టు వరకు వినియోగించుకోవాలి. అయితే గతంలో రాష్ట్ర తాగునీటికై తీవ్ర ఎద్దడి నెలకొన్నప్పుడు సాగర్‌లో 500 అడుగుల వరకు వెళ్లి నీటిని తీసుకున్నారు. ఇందుకు సాగర్ ఫోర్‌షోర్‌లో అత్యవసర మోటర్ల వ్యవస్థను జలమండలి ఏర్పాటు చేసి పంపింగ్ చేసింది. ఈమారు తాగునీటికి కొరత ఏర్పడితే ఇదే పద్ధతిలో నీటిని తీసుకునే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల సకాలంలో వర్షాలు కురిసినా ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల జలాశయాలు నిండి.. శ్రీశైలం రిజర్వాయర్‌ను దాటి సాగర్ వరక వరద జలాలు చేరాలంటే ఆగస్టు, సెప్టెంబర్ వరకూ వేచిచూడాల్సిందే. ఎగువ నుంచి వరద జలాలు వచ్చే వరకూ అంటే జూన్, జూలై, ఆగస్టు నెలల్లో తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు తప్పవు. ఈ సమయంలో గోదావరి జలాలపై ఆధారపడ్డ ఎల్లంపల్లి బ్యారేజీ నుంచి జంట నగరాల తాగునీటి అవసరాలు తీర్చక తప్పదు. నల్లగొండ జిల్లాకు మాత్రం ఈసారి తాగునీటికి మాత్రం ఇబ్బందులు తప్పేలా లేదు. -
నిండుకుండల్లా మధ్యతరహా ప్రాజెక్టులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు మధ్యతరహా ప్రాజెక్టులన్నీ నిండుకుండలను తలపిస్తున్నాయి. గోదావరి, కృష్ణా బేసిన్ల పరిధిలోని 19 మధ్యతరహా ప్రాజెక్టులన్నీ నిండటంతో ఆయకట్టు రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలోని సాత్నాల, మత్తడివాగు, సుధ్దవాగు, వట్టివాగు, ఎన్టీఆర్ సాగర్, పీపీ రావు ప్రాజెక్టు, కొమురం భీం, గొల్లవాగు, నీల్వాయి, రాలివాగు ప్రాజెక్టులన్నీ నిండటంతో ప్రాజెక్టుల గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. వరంగల్ జిల్లాలోని లక్నవరం, పాలెంవాగు, గుండ్లవాగు ప్రాజెక్టులు, ఖమ్మం జిల్లాలోని తాలిపేరు, పెద్దవాగు, కిన్నెరసాని ప్రాజెక్టులు సైతం నిండుకుండలను తలపిస్తున్నాయి. ఈ ప్రాజెక్టుల కింద మొత్తంగా 3.44 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా ఇప్పటికే 2.09 లక్షల ఎకరాల ఆయకట్టులో పంటల సాగు జరిగింది. ప్రస్తుత వర్షాలకు ప్రాజెక్టులన్నీ నిండటంతో గరిష్టంగా 3 లక్షల ఎకరాల ఆయకట్టు నీటికి ఢోకా ఉండదని అధికారులు అంచనా వేస్తున్నారు. నిండిన ఎల్లంపల్లి..: గోదావరి బేసిన్లో తొలిసారి ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఈ సీజన్లో గరిష్టంగా 1,87,037 క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రాజెక్టులో నిల్వ సామర్ధ్యం 20.18 టీఎంసీలుకాగా ప్రస్తుతం నిల్వ 19.12 టీఎంసీలకు చేరడంతో ఆదివారం మధ్యాహ్నం 16 గేట్లు ఎత్తి దిగువకు 2,89,184 క్యూసెక్కుల నీటిని వదిలారు. ఆదివారం సాయంత్రానికి ఇన్‌ఫ్లో 43,120 క్యూసెక్కులకు తగ్గినప్పటికీ 8 గేట్లు ఎత్తి అంతే మొత్తం నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ నీరంతా దిగువనున్న సుందిళ్ల బ్యారేజీ వైపు వెళ్లడంతో అక్కడ పనులకు ఆటంకం ఏర్పడింది. ఇది సహా కడెం ప్రాజెక్టులోకి భారీ ప్రవాహాలు వస్తున్నాయి. ప్రాజెక్టులోకి ఆదివారం మధ్యాహ్నానికి 50 వేల క్యూసెక్కులు రావడంతో ప్రాజెక్టులో నిల్వ 7.60 టీఎంసీలకుగానూ 7.06 టీఎంసీలకు చేరింది. దీంతో ప్రాజెక్టు నుంచి దిగువకు 61,277 క్యూసెక్కులు వదులుతున్నారు. ఇక ఎస్సారెస్పీలోకి సైతం 3,224 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా ఇక్కడ 90 టీఎంసీలకుగాను ప్రస్తుతం 16.35 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ‘కృష్ణా’లో స్థిరంగా వరద.. 150 టీఎంసీలకు సాగర్ ఎగువనున్న మహారాష్ట్ర, కర్ణాటకల్లో కురుస్తున్న వర్షాలకు ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు నిండటంతో వాటిలోకి వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు వదులుతున్నారు. ఆల్మట్టిలోకి ఆదివారం సాయంత్రం 30,900 క్యూసెక్కుల మేర వరద వచ్చి చేరుతుండగా అంతే నీటిని దిగువకు వదిలేస్తున్నారు. ఎగువ ప్రవాహాలకు తోడు స్థానిక ప్రవాహాలు తోడవడంతో నారాయణపూర్‌కు 43,373 క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో 42 వేల క్యూసెక్కులను దిగువకు వదిలారు. మరోవైపు తుంగభద్రకు రెండ్రోజుల కిందటి వరకు లక్ష క్యూసెక్కుల వరద రాగా అది ప్రస్తుతం 66వేల క్యూసెక్కులకు తగ్గింది. ప్రాజెక్టు నిండటంతో అక్కడి నుంచి 79,220 క్యూసెక్కులు వదిలేస్తున్నారు. రాష్ట్ర పరిధిలోని జూరాలకు 24 వేల క్యూసెక్కులు వస్తుండగా 38 వేల క్యూసెక్కులను దిగువకు వదిలారు. దీంతో శ్రీశైలానికి 35,430 క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రస్తుతం శ్రీశైలంలో 215 టీఎంసీలకుగాను 139.63 టీఎంసీల నీటి నిల్వ ఉంది. నాగార్జున సాగర్ అవసరాల దృష్ట్యా శ్రీశైలం నుంచి 35 వేల క్యూసెక్కుల నీటిని వదలడంతో సాగర్‌లోకి 27,805 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. దీంతో ప్రాజెక్టు మట్టం 312 టీఎంసీలకుగాను 150 టీఎంసీలకు చేరింది. -
గట్టెక్కించిన సీలేరు
అమలాపురం : గోదావరి డెల్టాలో రబీ వరిసాగు గట్టెక్కింది. శివారుకు సకాలంలో సాగునీరందకున్నా.. గోదావరిలో పంపులు ఏర్పాటు చేసి వృథా జలాలను కాలువల ద్వారా చేలకు మళ్లించకున్నా.. సొంతంగా మోటార్లు పెట్టుకున్న రైతులకు ప్రభుత్వం డీజిల్ ఖర్చులివ్వకున్నా.. మురుగునీటి కాలువలపై సకాలంలో క్రాస్బండ్లు వేయకున్నా.. చంద్రబాబు సర్కార్ పైసా విదల్చకున్నా.. డెల్టాలో రబీ పంట పండింది. 16 టీఎంసీల నీటికొరత ఉంటుందని అధికారులు చెప్పినా.. అంచనాలకు మించి నీరు రావడంతో రబీసాగు నీటి ఎద్దడికి ఎదురొడ్డి నిలిచింది. అదెలా సాధ్యమయ్యిందంటే.. ఎద్దడి సమయంలో గోదావరి డెల్టాలో రబీసాగును ‘సీలేరు’ ఎప్పటిలానే ఒడ్డున పడేసింది. ఈసారి రికార్డు స్థాయిలో ఆదివారం నాటికి ఏకంగా 66.056 టీఎంసీల నీటిని గోదావరిలోకి వదలడం ద్వారా.. ఉభయ గోదావరి జిల్లాల్లోని సుమారు 7 లక్షల మంది రైతులకు జీవనాధారమైన రబీ సాగు నిర్విఘ్నంగా పూర్తయ్యింది. నీటి ఎద్దడి ఉందన్నా.. ధవళేశ్వరంలోని సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ దిగువన ప్రధాన పంట కాలువలకు ఈ నెల 10 నుంచి నీటి సరఫరాను నిలిపివేస్తామని అధికారులు ఇప్పటికే ప్రకటించిన విçషయం తెలిసిందే. శివార్లలో సాగు ఆలస్యమైనందున మరో ఐదు రోజులు గడువు పొడిగించాలని రైతులు కోరుతున్నారు. రబీ సాగుకు ఈ ఏడాది ఎద్దడి తప్పని అధికారులు ముందే చెప్పారు. రబీ షెడ్యూలు కాలంలో తాగు, పారిశ్రామిక అవసరాలకు పోగా, కేవలం సాగుకు 83 టీఎంసీల నీరు అవసరమని, నీటి లభ్యత 67 టీఎంసీలు మాత్రమే ఉంటుందని తేల్చారు. అయినప్పటికీ మొత్తం ఆయకట్టుకు సాగునీరందించాలని జిల్లాకు చెందిన మంత్రులు, అధికార పార్టీ పెద్దలు సూచించారు. కానీ, వివిధ పద్ధతుల్లో నీటి సేకరణకు ప్రభుత్వం నుంచి నయాపైసా కూడా మంజూరు చేయించలేదు. తాంబూలాలు ఇచ్చేశాం.. తన్నుకు చావండన్నట్టుగా డెల్టాలో రైతులను, నీటిపారుదల అధికారులను గాలికి వదిలేశారు. దీంతో రైతులు ఉన్న నీటినే పొదుపుగా వాడుకొని రబీని గట్టెక్కించారు. సీలేరు నుంచి రికార్డు స్థాయిలో నీటి సేకరణ అధికారుల అంచనాలకు తగ్గట్టుగానే గోదావరిలో సహజ జలాలు తక్కువగా వచ్చాయి. గోదావరి సహజ జలాల అంచనా 24 టీఎంసీలు కాగా, ఆదివారం నాటికి 22.754 టీఎంసీల నీరు వచ్చింది. ఇది అధికారుల అంచనాకన్నా సుమారు ఒక్క టీఎంసీ తక్కువ. ఇదే సమయంలో మనకు సీలేరు నుంచి 49 టీఎంసీల వరకూ నీరు వచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేశారు. వాస్తవానికి రబీ కాలంలో సీలేరు నుంచి మనకు వచ్చే నీరు 40 టీఎంసీలే. అత్యవసర పరిస్థితుల్లో బైపాస్ పద్ధతిలో మరో 5 టీఎంసీల వరకూ తెచ్చుకోవచ్చు. ఎందుకైనా మంచిదని సీలేరు నుంచి 49 టీఎంసీలు సేకరించాలని అధికారులు నిర్ణయించారు. అయితే వారి అంచనాలకు మించి ఇప్పటివరకూ రికార్డు స్థాయిలో ఏకంగా 66.056 టీఎంసీల నీరు సేకరించారు. కాలువలు మూసేనాటికి మరో రెండు టీఎంసీలు కలిపితే 68.056 టీఎంసీలు సీలేరు నుంచి సేకరించినట్టవుతుంది. ఇప్పటికీ సీలేరు నుంచే.. డెల్టా ప్రధాన పంట కాలువలైన తూర్పు డెల్టాకు 1,825, మధ్య డెల్టాకు 1,190, పశ్చిమ డెల్టాకు 3,175 క్యూసెక్కుల చొప్పున మొత్తం 6,190 క్యూసెక్కుల నీరు ఇస్తున్నారు. దీనిలో సహజ జలాలు 1,032 క్యూసెక్కులు కాగా, సీలేరు నుంచి వస్తున్నది 5,158 టీఎంసీలు కావడం విశేషం. ఇప్పటికీ బైపాస్ పద్ధతిలో నీరు తీసుకువస్తున్నారంటే గోదావరి డెల్టాకు సీలేరు ప్రాధాన్యం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. పవర్ డ్రాప్ నుంచి అత్యధికంగా 4 వేల క్యూసెక్కులు, బైపాస్ పద్ధతిలో మరో 2 వేల క్యూసెక్కుల చొప్పున 6 వేల క్యూసెక్కులు సేకరించేవారు. కానీ ఈసారి ఏకంగా కొన్ని రోజుల పాటు 7,500 వరకూ సీలేరు నుంచి సేకరించాల్సి వచ్చింది. -
'నీటిమట్టాన్ని సక్రమంగానే నిర్వహిస్తున్నాం'
విజయవాడ: రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టుల వద్ద నీటిమట్టాన్ని సక్రమంగానే నిర్వహిస్తున్నామని ఏపీ భారీ నీటిపారుదల శాఖా మంత్రి దేవినేని ఉమ తెలిపారు. ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రస్తుతం 11.3 అడుగుల నీటి మట్టం ఉందని, బ్యారేజీ ద్వారా 15,110 క్యూసెక్కుల కృష్ణా జలాలను సాగు కోసం కాలువల ద్వారా విడుదల చేస్తున్నామని తెలిపారు. శ్రీశైలంలో నీటిమట్టం తక్కువగా ఉందని, ఐతే నీటి మట్టం ఇంకా పెంచాలని కొందరు బాధ్యతారాహిత్యంగా ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. పట్టిసీమ ద్వారా 7 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణకు తరలించామని, దానిని 80 టీఎంసీలకు పెంచాలన్నది సీఎం చంద్రబాబు కోరికని మంత్రి తెలిపారు.