
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర తాగునీటి అవసరాలకు ప్రధాన వనరుగా ఉన్న నాగార్జునసాగర్‌లో నీటి మట్టం గణనీయంగా పడిపోతోంది. పూర్తిస్థాయిలో ఎం డలు తీవ్రతరమవడంతో.. రిజర్వాయర్‌లో నీటి మట్టాలు అడుగంటుతున్నాయి. మరో అడుగు దాటితే సాగర్‌లో నిల్వల కనీస నీటి మట్టానికి చేరనుంది. సాగర్ కనీస నీటిమట్టం 510 అడుగులు కాగా.. ప్రస్తుత మట్టం 511.40 అడుగులు గా ఉంది. మరో 3, 4 రోజుల్లో ఇది 510 అడుగులకు చేరనుంది.
505 అడుగుల వరకే ఓకే!
సాగర్ ప్రాజెక్టు నుంచే ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 516 ఫ్లోరైడ్ గ్రామాలతోపాటు ఇతర 300 గ్రామా లకు, జంట నగరాల తాగునీటి అవసరాలకు కృష్ణా నీటిని సరఫరా చేస్తున్నారు. అయితే ఈ ఏడాది అనుకున్న స్థాయిలో ప్రవాహాలు లేక, సాగు అవసరాలకు సాగర్ నీటిని వినియోగించడంతో నిల్వలు తగ్గాయి. దీంతో సాగర్‌లో ప్రస్తు తం 590 అడుగులకు గానూ 511.40 అడుగులకు చేరాయి. ఈ మట్టంలో లభ్యత జలాలు 134 టీఎంసీ ఉన్నప్పటికీ ఇందులో కనీస నీటి మట్టాలకు ఎగువన వినియోగార్హమైన నీరు కేవలం 4 టీఎంసీలు మాత్రమే. దీనికి తోడు ఎగువన ఉన్న శ్రీశైలంలోనూ నీటి మట్టాలు పడిపోయాయి. 885 అడుగులకు గానూ 808.60 అడుగులకు నీటి మట్టం చేరింది. దీంతో అక్కడి నుంచి సాగర్‌కు నీటి విడుదల చేయడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో లభ్యత నీటితో ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణ తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని కృష్ణా బోర్డు సాగర్‌లో 505 అడుగుల వరకు, శ్రీశైలంలో 800 అడుగుల వరకు నీటిని వాడుకునే అవకాశం కల్పించింది.
గరిష్టంగా 14 టీఎంసీలే
రెండు ప్రాజెక్టుల పరిధిలో గరిష్టంగా 14 టీఎంసీల మేర మాత్రమే నీటిని వాడుకునే అవకాశం ఉంది. ఇందులో తెలంగాణకు 9 టీఎంసీ, ఏపీకి 5 టీఎంసీల నీటివాటా ఉంది. ఈ నీటినే ఇరు రాష్ట్రాలు ఆగస్టు వరకు వినియోగించుకోవాలి. అయితే గతంలో రాష్ట్ర తాగునీటికై తీవ్ర ఎద్దడి నెలకొన్నప్పుడు సాగర్‌లో 500 అడుగుల వరకు వెళ్లి నీటిని తీసుకున్నారు. ఇందుకు సాగర్ ఫోర్‌షోర్‌లో అత్యవసర మోటర్ల వ్యవస్థను జలమండలి ఏర్పాటు చేసి పంపింగ్ చేసింది. ఈమారు తాగునీటికి కొరత ఏర్పడితే ఇదే పద్ధతిలో నీటిని తీసుకునే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల సకాలంలో వర్షాలు కురిసినా ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల జలాశయాలు నిండి.. శ్రీశైలం రిజర్వాయర్‌ను దాటి సాగర్ వరక వరద జలాలు చేరాలంటే ఆగస్టు, సెప్టెంబర్ వరకూ వేచిచూడాల్సిందే. ఎగువ నుంచి వరద జలాలు వచ్చే వరకూ అంటే జూన్, జూలై, ఆగస్టు నెలల్లో తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు తప్పవు. ఈ సమయంలో గోదావరి జలాలపై ఆధారపడ్డ ఎల్లంపల్లి బ్యారేజీ నుంచి జంట నగరాల తాగునీటి అవసరాలు తీర్చక తప్పదు. నల్లగొండ జిల్లాకు మాత్రం ఈసారి తాగునీటికి మాత్రం ఇబ్బందులు తప్పేలా లేదు.