
మండపేట: పొద్దస్తమానూ పొలంలో పనిచేసే రైతు తన కష్టానికి తగిన ప్రతిఫలం ఆశిస్తాడు. అందుకోసం వీరిపక్షాన చేదోడు వాదోడుగా నిలిచేందుకు ఇప్పటికే ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటుచేసింది. నవంబరులో వచ్చే తుఫానుల బెడదను తప్పించడంతో పాటు మూడవ పంటకు మార్గం సుగమం చేసేందుకు ముందస్తు సాగుకు శ్రీకారం చుట్టింది. జిల్లాలలో తొలకరి సాగుకు రైతులు సన్నద్దమవుతున్న నేపథ్యంలో మార్కెట్‌లో మంచి రాబడి తెచ్చే వంగడాలు, సాగులో మెళకువలపై రైతులకు అవగాహన కల్పిస్తోంది.
తూర్పున 93,204 ఎకరాలు, మధ్య డెల్టాలోని 98,258 ఎకరాల్లోను తొలకరి సాగు ఏర్పాట్లలో రైతులు నిమగ్నమయ్యారు. సాధారణంగా జూన్ రెండో వారం తర్వాత కాలువలకు నీటిని విడుదల చేసేవారు. ఆగస్టు నెలాఖరు వరకూ నాట్లు వేసేవారు. ఏటా నవంబరులో వచ్చే తుపానులు పంటకు తీవ్ర నష్టం కలుగజేస్తుండటంతో ప్రభుత్వం ముందస్తు సాగు చేపట్టేలా రైతును ప్రోత్సహిస్తోంది. మునుపెన్నడూ లేని విధంగా ఈ సీజన్‌లో జూన్ 1వ తేదీన కాలువలకు నీటిని విడుదల చేసింది. జూలై రెండవ వారం నాటికి నాట్లు వేసుకోవడం ద్వారా అక్టోబరు నెలాఖరు నాటికి కోతలు పూర్తవుతాయని భావిస్తున్నారు.
దీనివలన నవంబరులో వచ్చే ప్రకృతి వైపరీత్యాల నుంచి పంటను కాపాడుకోవచ్చునని వ్యవసాయశాఖ విశ్వసిస్తోంది. డిసెంబరు చివరి నాటికి రబీ నాట్లు వేసుకుని మార్చి నెలాఖరవుకు కోతలు కోయడం ద్వారా మూడవ పంటగా అపరాల సాగుకు మార్గం సుగమమవుతుంది. భూసారం పెరగడంతో పాటు రైతులకు మూడు నుంచి నాలుగు బస్తాల అదనపు దిగుబడి వస్తుందంటున్నారు. తొలకరిని లాభసాటి చేసేందుకు మార్కెట్‌లో రాబడినిచ్చే వంగడాల సాగు చేసేలా రైతులను చైతన్యవంతం చేస్తోంది. సాగుకు అనుకూల రకాలు, మెళకువలపై వ్యవసాయ సిబ్బంది పొలాల్లో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. తూర్పుడెల్టాలోని మండపేట, రామచంద్రపురం నియోజకవర్గాల్లో ఇప్పటికే నారుమడులు వేసే పనిలో రైతులు నిమగ్నమయ్యారు.
ఇవి సాగు చేయాలి
ఎంటీయూ 7029 (స్వర్ణ), ఎంటీయూ 1121 (శ్రీధతి), ఎంటీయూ 1064 (అమర), ఎంటీయూ 1061 (ఇంద్ర), బీపీటీ – 5204 (సాంబ మసూరి)
ఇన్ని విత్తనాలు అవసరం
∙దుక్కిదున్ని వెదజల్లే పద్ధతిలో ఎకరానికి 20–25 కిలోల విత్తనం అవసరం
∙దమ్ముచేసి వెదజల్లే విధానం కింద 12–15 కిలోల విత్తనం
∙నారుమడికి ఎకరానికి 20 కిలోల విత్తనం మాత్రమే వాడాలి
ఈ జాగ్రత్తలు పాటించాలి
∙పడిపోయే స్వభావం ఉన్న ఎంటీయూ 7029, ఎంటీయూ 1061, బీపీటీ 5204 వరి రకాలను ముంపు ప్రాంతాల్లో వెదజల్లే పద్దతిలో సాగుచేయవద్దని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.
∙అవసరానికి మించి ఎరువులు వాడటం వలన ఎంటీయూ 1121, బీపీటీ 5204 రకాలను ఎండాకు తెగులు ఆశించి నష్టం కలుగచేస్తుంది.
విత్తనశుద్ధి చేసుకోవాలి
సాగుకు విత్తన ఎంపిక ఎంత కీలకమో పంట తెగుళ్ల బారిన పడకుండా, ఆరోగ్యవంతమైన, ధృడమైన నారుకు విత్తనశుద్ది అంతే అవసరం. విత్తన దశలో మొలక రావడాన్ని అడ్డుకునే శిలీంద్రాల నివారణకు విత్తన శుద్ధి దోహదం చేస్తుంది. లేనిపక్షంలో మొలక సక్రమంగా రాకపోవడంతో పాటు పంటపై అగ్గి తెగులు, పొడ తెగులు, వేరుకుళ్లు తెగుళ్లు ఆశిస్తాయి. విత్తన శుద్ధి రెండు రకాలుగా చేయవచ్చు. పొడి విత్తనశుద్ధిలో కేజీ విత్తనాలకు మూడు గ్రాముల కార్భండైజం మందును కలపాలి. తడి విత్తనశుద్ధిలో కేజీ విత్తనాలకు ఒక గ్రాము కార్భండైజం ఒక లీటరు నీటిలో కలిపి ఆ మందు ద్రావణంలో విత్తనాలు శుద్ధి చేయాలని ఆయన సూచించారు.
– సీహెచ్‌కేవీ చౌదరి, ఆలమూరు ఏడీఏ
Comments
Please login to add a commentAdd a comment