తొలకరి ఆశలతో సాగుకు సన్నద్ధం | Preparing for cultivation | Sakshi
Sakshi News home page

తొలకరి ఆశలతో సాగుకు సన్నద్ధం

Published Thu, May 11 2017 1:19 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

తొలకరి ఆశలతో సాగుకు సన్నద్ధం - Sakshi

ఈసారీ అడపాదడపా చినుకులు
అన్నదాతలో మొలకెత్తిన ఉత్సాహం
వెంటాడుతున్న విత్తన కొరత
వేరుశనగ  రైతాంగం ఆందోళన


దశాబ్దకాలంగా ఏటా నష్టాలు చవిచూస్తున్న జిల్లాలోని వేరుశనగ రైతులు ఈ ఏడాది ఖరీఫ్‌పై ఆశలు పెంచుకుంటున్నారు. అయితే తొలకరి జల్లుగా పలకరించి.. ఆ తర్వాత వరుణుడు ముఖం చాటేస్తుండడంతో సాగుపై సందిగ్ధత నెలకొంది. గతేడాది ప్రభుత్వం రెయిన్‌గన్‌లతో పంటలను రక్షిస్తామంటూ ఊదరగొట్టినా చివరికి ఫలితం మా త్రం తీవ్ర నష్టాన్నే మిగిల్చింది. అయితే ప్రస్తుతం ఊరిస్తున్న కారుమబ్బులతో ఈ ఏడాది పంటకు పెట్టుబడి, విత్తనాల కోసం రైతులు వెతుకులాటను ప్రారంభించారు. ప్రభుత్వం మాత్రం సగం పంటకు సరిపోయే విత్తనాలను మాత్రమే సబ్సిడీపై అందించనుంది.

చిత్తూరు (అగ్రికల్చర్‌): ఏటా ఖరీఫ్‌ సీజనులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా జిల్లాలోని రైతులు పంట నష్టపోతున్నారు. అయినా మొక్కవోని ధైర్యంతో వేరుశనగ పంటసాగుకు పూనుకుంటు న్నారు. ఖరీఫ్‌ ప్రారంభంలోనే తొలకరి పలకరించడంతో ఎంతో ఉత్సాహంగా వేరుశనగను సాగుచేయడం, ఆఖరికి నష్టాలను చవిచూడడం పరిపాటైపోయింది. అదే తరహాలోనే గత రెండు వారాలుగా జిల్లాలో అడపాదడపా తొలకరి చినుకులు పలకరిస్తున్నాయి. నిత్యం కారుమబ్బులతో వరుణుడు దోబూచులాడుతుండడంతో రైతుల్లో సాగుపై ఆశలు రేకెత్తిస్తున్నాయి. జిల్లాలోని రైతులు ఏటా ఖరీఫ్‌ సీజన్‌లో వర్షాధార వేరుశనగను ప్రధాన వాణిజ్య పంటగా సాగు చేస్తారు.

అత్యధికంగా పడమటి మండలాల
రైతులు ఈ పంటను సాగుచేయడం పరిపాటి. తూర్పున 15 మండలాలు  మినహా మిగిలిన 51 మండలాల్లో 1.36 లక్షల హెక్టార్ల సాధారణ విస్తీర్ణంలో రైతులు వేరుశనగ పండిస్తారు. సకాలంలో వర్షాలు కురిస్తే జూన్‌ 7 నుంచి ప్రారంభమయ్యే మృగశిర కార్తె, జూన్‌ 22 నుంచి ప్రారంభమయ్యే ఆరుద్రకార్తెలో వేరుశనగను విత్తడం పూర్తి చేస్తారు. ఈ సమయంలో విత్తిన పంటల నుంచి  దిగుబడి ఆశించిన మేరకు రావడం జరుగుతుంది. ఇందుకు అనుగుణంగానే ఈ ఖరీఫ్‌కు గాను గత పదిరోజులుగా జిల్లాలోని పలు మండలాల్లో  వర్షాలు ఓ మోస్తరుగా కురుస్తున్నాయి. దీంతో రైతుల్లో వేరుశనగ పంట సాగుపై ఆశలు చిగురించాయి.

గతఏడాది  తీవ్ర నష్టం
2015 నవంబరులో కురిసిన భారీ వర్షాలతో జిల్లాలోని రైతులు రబీ సీజనులో పంటలను ఎంతో ఉత్సాహంగా సాగు చేశారు. తరువాత 2016 ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభంలోనే ఓ మోస్తరు వర్షపాతం నమోదైంది. దీంతో రైతులు  రెట్టించిన ఉత్సాహంతో వేరుశనగ పంటను జిల్లావ్యాప్తంగా అత్యధికంగా 1.21 లక్షల హెక్టార్లలో సాగు చేశారు. అయితే ఆగస్టు మొదటి వారం నుంచి పూర్తిగా వరుణుడు కనుమరుగయ్యాడు. తీవ్ర వర్షాభావం ఏర్పడడంతో రైతులు విత్తిన వేరుశనగ గింజలు నేలపాలయ్యేయే గానీ, పంట చేతికందలేదు. ఫలితంగా జల్లా రైతులకు ఈ ఖరీఫ్‌కు విత్తేందుకు అవసరమైన విత్తన కాయలు కూడా లేకుండా పోయాయి.

విత్తనాల కోసం అన్వేషణ ప్రారంభం
ఖరీఫ్‌ సాగుకు అవసరమైన విత్తన కాయల కోసం రైతులు అన్వేషణ ప్రారంభించారు. హెక్టారు విస్తీర్ణంలో విత్తేందుకు గాను 150 కిలోల వేరుశనగ కాయలు అవసరం.  జిల్లాలో మొత్తం 1.36 లక్షల హెక్టార్ల సాధారణ విస్తీర్ణంలో విత్తేందుకు గాను దాదాపు 2.04 లక్షల క్వింటాళ్ల వేరుశనగ కాయలు అవసరం ఉంది. ఏటా ప్రభుత్వం  సబ్సిడీపై అందించే  వేరుశనగ కాయలుతో పాటు రైతులు తమ వద్ద ఉండే కాయలను కూడా కలుపుకుని  విత్తేవారు. అయితే గత ఏడాది ఏమాత్రం పంట చేతికందని కారణంగా రైతులకు విత్తన కాయలు కూడా చేతికందలేదు. ప్రభుత్వం మాత్రం ఈ ఖరీఫ్‌కు జిల్లాకు 84,500 కింటాళ్ల వేరుశనగ కాయలు మాత్రమే కేటాయించింది.  దీంతో రైతులు విత్తన కాయలు కోసం వెదుకులాట ప్రారంభించారు.

భారీగా విత్తన కాయల ధరలు..
రైతులు వేరుశనగ విత్తన కాయల కోసం ప్రైవేటు వ్యాపారులు, మిల్లర్ల వద్దకు  పరుగులు తీస్తున్నారు.  దీన్ని ఆసరాగా చేసుకున్న వ్యాపారులు పక్క జిల్లాల నుంచి తెప్పిస్తున్నామంటూ, కిలో కాయలు రూ. 50 నుంచి రూ. 60 వరకు విక్రయిస్తున్నారు. దీంతో రైతులు ఎకరా విస్తీర్ణంలో వేరుశనగ విత్తేందుకు గాను కాయలకే రూ. 3 వేల నుంచి రూ. 3,600 వరకు వెచ్చించాల్సి ఉంది.  దీనికితోడు దుక్కులు దున్నేందుకు గాను ట్రాక్టర్‌కు గంటకు రూ. 600 నుంచి రూ. 800 వరకు Ðð చ్చించాలి. అదేగాక జిప్సం, కూలీలు తదితరాలు కలిపి ఖర్చులు మోపెడవుతున్నాయి. ఇంత వ్యయప్రయాసలకు ఓర్చి పంట సాగు చేసినా ఆశించిన మేరకు దిగుబడి అందుతుందనే నమ్మకం రైతుల్లో  ఏమాత్రం లేదు. అధిక మొత్తం పెట్టుబడిగా పెట్టాల్సి రావడంతో ఈ ఖరీఫ్‌కు వేరుశనగ సాగయ్యేనా..? అన్న అనుమానాలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి.

ప్రభుత్వం అదుకోవాలి
వేరుశనగ సాగు చేయాలంటే పెట్టుబడులు అధిక మొత్తంలో పెట్టాలి. గతేడాది తీవ్ర నష్టం వాటిళ్లడం వల్ల ప్రస్తుతం రైతుల వద్ద విత్తనకాయలు లేవు. దీనికితోడు ధరలు భారీగా పెరిగాయి. ఇలాంటి సమయంలో ప్రభుత్వం వేరుశనగ రైతులను ఆదుకోవాలి.  సబ్సిడీ కాయలు రైతులకు కావలసిన మేరకు అందించాలి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement