
సాక్షి, హైదరాబాద్: ఖరీఫ్‌లో పత్తికి ప్రత్యామ్నాయంగా రైతులు పప్పుధాన్యాలను సాగు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సూచించాలని వ్యవసాయశాఖ యోచిస్తోంది. వరి సాగు పెంచాలని భావిస్తోంది. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం కూడా ఇదే అంశాన్ని సూచించింది. ఖరీఫ్ పంటల సాగుపై ఆ శాఖ వచ్చే సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనుంది.
పత్తి మిగిల్చిన నష్టంతో...
2016–17 ఖరీఫ్‌కు వ్యవసాయశాఖ చేసిన ప్రచారంతో ఆ సీజన్‌లో పత్తి సాగు తగ్గి పప్పుధాన్యాల సాగు పెరిగింది. ఆ ఏడాది మార్కెట్లో పత్తి ధర భారీగా పెరగ్గా.. పప్పుధాన్యాల ధరలు దారుణంగా పడిపోయాయి. ఈ నేపథ్యంలో 2017–18 ఖరీఫ్‌లో 98 లక్షల ఎకరాల్లో రైతులు అన్ని పంటలను సాగు చేస్తే, అత్యధికంగా 47.72 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. అయితే 10 లక్షల ఎకరాలకు పైగా బీజీ–2 పత్తికి గులాబీరంగు పురుగు సోకడం, అకాల వర్షాలతో అనేకచోట్ల పత్తి రంగు మారిపోవటం, అనుమతి లేని బీజీ–3 పత్తిని కంపెనీలు అంటగట్టడం, నకిలీ విత్తనాలతో పత్తిరైతుకు ఈ ఏడాది అప్పులే మిగిలాయి. రాష్ట్రంలో 3 కోట్ల క్వింటాళ్ల పత్తి ఉత్పత్తి అవుతుందని అంచనా వేస్తే, అందులో సగం కూడా దిగుబడి వచ్చే పరిస్థితి లేదు.
నికార్సయిన విత్తనమేదీ?
బీజీ–2 వైఫల్యంతో ఏ పత్తి విత్తనం నికార్సయిందో ప్రభు త్వం నిర్ధారించే పరిస్థితి లేదు. బీజీ–3 జీవవైవిధ్యానికి గండికొడుతుండటంతో దానికి కేంద్రం అనుమతివ్వలేదు. పత్తిలో మరో కొత్త విత్తనాన్ని వ్యవసాయశాఖ సూచించలేదు. దీంతో ఖరీఫ్‌లో రైతులు ఏ పత్తి విత్తనం వేయాలన్న దానిపై గందరగోళం నెలకొంది. వ్యవసాయశాఖ సూచిస్తున్నట్లుగా ప్రత్యామ్నాయ పంటలసాగుపై ప్రభు త్వం ప్రచారం చేసినా రైతులు ముందుకు రావడంలేదు. కందిని కనీసమద్దతు ధరకు కేంద్రం కొనుగోలు చేయ డంలో పరిమితులు, పప్పుధాన్యాల ధరలు పడిపోవడం తో ఏ పంట వేయాలో తేల్చుకోలేకపోతున్నారు. వ్యవసాయశాఖ స్పష్టత ఇస్తేనే ముందుకు సాగాలని యోచిస్తున్నారు.