గొర్లను పెంచే వారు తప్పకుండా మొదట షెడ్డు నిర్మించుకోవాలి. ఎండ, చలి, వర్షాల నుంచి పూర్తి రక్షణ ఉండేలా చూసుకోవాలి. పిల్లిపెసర, బబ్బెర్లు, గడ్డితో పాటు సుబాబుల్ చెట్ల పెంపకం కోఫార్ రకం గడ్డి, జొన్నను మేతగా వేయాలి. అటవీ ప్రాంతాలు ఉన్న చోట వీటిని మేతకోసం బయటకు కూడా తీసుకెళ్లవచ్చు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
వర్షకాలంలో గొర్ల కాళ్లకు పుండ్లు కావడం, ముక్కు నుంచి చీము కారడం, చిటుకు వ్యాధులు వంటివి వస్తాయి. వీటి నివారణకు ప్రతిఏటా ప్రభుత్వం పంపిణీ చేస్తున్న మందులను వేయించాలి. జీవాలు కుంటినా, ముక్కు నుంచి చీమిడి కారినా వెంటనే వెటర్నరీ అధికారులకు చూపించాలి. గొర్లు షెడ్డు లోపలకు వెళ్లే దారిలో చిన్నపాటి నీటి తొట్టిని నిర్మించుకుని పొటాషియం పర్మాంగనేట్ వేసి గొర్లు ఉదయం మేతకు వెళ్లేటప్పుడు, సాయంత్రం తిరిగి పాకలోకి వచ్చేటప్పుడు జీవాలు ఈ నీటిలో నుంచి నడిచేలా చూడాలి. దీంతో కాళ్లకు పుండ్లు అయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది.
నెల్లూరు క్రాస్ బ్రీడ్ మేలైన రకం
గొర్లలో అనేక రకాలు ఉంటాయి. వీటిలో నెల్లూరు క్రాస్ బ్రీడ్ బాగుంది. ఈ రకం జీవాలను ఎనిమిదేళ్లపాటు పెంచవచ్చు. ఇవి ఏడాదికి మూడు పిల్లల చొప్పున 8 ఏళ్లకు 12 ఈతలు ఈనుతుంది. అప్పటికి ముప్పై కిలోల బరువు ఉంటుంది. ఒక్కో గొర్రెకు బహిరంగ మార్కెట్లో రూ.6వేల ధర పలుకుతుంది. ఎనిమిదేళ్లు నిండిన గొర్లు బరువు పెరగవు కాబట్టి వెంటనే వీటిని విక్రయించాలి.
గొర్రెలు ఈనగానే పుట్టిన పిల్లలను 15 రోజుల పాటు పాకలోనే ఉంచాలి. తల్లిగొర్రె వెంట పంపరాదు. 15 రోజుల వరకు కేవలం తల్లి పాలు మాత్రమే తాగించాలి.
40 గొర్లకు ఒక విత్తన పొటేలును పెంచుకోవాలి. దీన్ని కూడా ఎనిమిది ఏళ్ల వరకు విత్తన పొటేలుగా ఉపయోగించుకుని అనంతరం అమ్మేయాలి.
ప్రభుత్వ ప్రోత్సాహకాలు
ప్రభుత్వం గొర్ల పెంపకానికి నాబార్డ్ ద్వారా సబ్సిడీపై రుణాలు అందజేస్తోంది. ఎస్సీ, ఎస్టీలతో పాటు గొర్ల పెంపక సంఘం దారులకు ఇందులో ప్రాధాన్యం ఉంటుంది. గొర్లకు మేత కోసం సబ్సిడీపై మినరల్ మిక్చర్‌తో పాటు కంది, పెసర, మినుముల పొట్టు, పల్లి చెక్కను సబ్సిడీపై అందజేస్తోంది. గొర్ల ఆరోగ్య పరిస్థితిని బట్టి ఒక్కోదానికి నిత్యం 150 నుంచి 200 గ్రాముల వరకు బలవర్ధక ఆహారం ఇవ్వాలి.
జీవాలకు విధిగా బీమా చేయించాలి.
ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ హయాంలో గొర్లకు బీమా అందడం లేదు. దీంతో వీటి పోషకులు నష్టపోయే ప్రమాదముంది.
గొర్ల పెంపకం.. లాభదాయకం
Published Tue, Sep 30 2014 12:16 AM | Last Updated on Sat, Sep 2 2017 2:07 PM
Advertisement
Advertisement