గొర్రెలను వ్యాధుల నుంచి రక్షించుకోండి.. | To protect the sheep from diseases | Sakshi
Sakshi News home page

గొర్రెలను వ్యాధుల నుంచి రక్షించుకోండి..

Published Fri, Nov 7 2014 2:14 AM | Last Updated on Sat, Sep 2 2017 3:59 PM

To protect the sheep from diseases

మంచిర్యాల రూరల్ : గొర్రెల పెంపకంలో సరైన యాజమాన్య పద్ధతులు పాటించకుంటే మంద త్వరగా వృద్ధి చెందదు. గొర్రెల్లో వచ్చే వ్యాధులపై కాస్త అవగాహన కలిగి ఉండి, వాటికి సరైన చికిత్స సమాయానికి అందించాలి. తగిన జాగ్రత్తలు తీసుకుంటే గొర్రెలను వ్యాధుల బారి నుం చి కాపాడుకోవచ్చు.

నవంబర్ నెల నుంచి ఏప్రి ల్ వరకు గొర్రెలకు మశూచి వ్యాధి(పాక్స్ వైరస్) ముప్పు పొంచి ఉంటుందని, గొర్రెల పెంపకందారులు అప్రమత్తంగా ఉండాలని  హాజీపూర్ పశువైద్యాధికారి అర్చన సూచించారు. ముందస్తుగా టీకాలు వేయించడం మంచిదని, గాలిద్వారా వచ్చే ఈ వైరస్ వ్యాపించిన గొర్రెలు ఆహారం తీసుకోక, శ్వాస ఆడక ప్రాణాలు విడుస్తాయని హెచ్చరించారు. వ్యాధి వ్యాప్తి, లక్షణాలు, నివారణ చర్యలను వివరించారు.

 గొర్రెల మంద వృద్ధి చెందాలంటే..
 గొర్రెల మంద రోగాల బారిన పడితే వాటికి పశు వైద్యుల సలహాతో మందులను వాడాలి. తెలిసీ తెలియకుండా మందులను వేయవద్దు. పుట్టిన జీవాలను నిర్లక్ష్యం చేయకుండా తప్పనిసరిగా ముర్రుపాలు తాగించాలి. ఆ పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే మంద త్వరగా వృద్ధి చెందుతుంది.

     గొర్రెల దొడ్లను ప్రతీ రోజు శుభ్రం చేయాలి.
     నేల ఎప్పుడూ పొడిగా ఉండేలా చేయాలి.
     వారానికి     ఒకసారి సున్నం చల్లాలి.
     సాయంకాలం వేళల్లో దోమల నివారణకు పొగబెట్టాలి.
     మందతో తరచూ రోగాల బారిన పడే జీవాలను తొలగిస్తూ ఉండాలి.
     పుష్టికరమైన మేత జీవాల ఆరోగ్యం, ఉత్పాదక సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది.
     బయటమేపే ప్రదేశాల్లో గొర్రెలు శుభ్రమైన నీటిని తాగేలా చూడాలి.
     మంద ఒక దగ్గర పెడితే ఖనిజ లవణాలు గల ఇటుకలు, కల్లుప్పును నాకించాలి.
     బయట మేపడమే కాకుండా, మంద వద్ద కూడా చౌకగా తయారు చేసిన దాణా అందించాలి.
 
మశూచి వ్యాధి లక్షణాలు..
వ్యాధి సోకిన గొర్రెల్లో వారం రోజుల్లో దాని లక్షణాలు బయటపడతాయి
వ్యాధి సోకిన గొర్రెలకు జ్వరం తీవ్రంగా ఉంటుంది.
చర్మంపై వెంట్రుకలు లేని భాగం, తోక కింద, పెదవులు, ముక్కు రంధ్రాలు, జననేంద్రియాలు, పాల పొదుగుపై ఎర్రని దద్దులు, పొక్కులు ఏర్పడతాయి.
కళ్ల నుంచి నీరు, నోటి నుంచి సొంగ, ముక్కు నుంచి చిక్కటి చీముడు కారుతుంది.
శ్వాసకోశ వ్యవస్థను వ్యాధి ఆశిస్తే, గొర్రెలు శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. జీర్ణకోశ వ్యవస్థను ఆశిస్తే రక్తపు విరేచనాలు అవుతాయి. చూడి గొర్రెలకు వ్యాధి ప్రబలితే ఈసుకుని పోతాయి.
 
వ్యాధి వ్యాప్తి చెందే విధానం
     గాలి ద్వారా మశూచి వైరస్ వ్యాప్తి చెందుతుంది.
     వ్యాధిగ్రస్త గొర్రె నుంచి మరొక దానికి వ్యాప్తిస్తుంది.
     దాణా తొట్టెలు, నీటి తొట్టెలు, ఇతర వస్తువుల ద్వారా ఇది వ్యాప్తి చెందుతుంది.
     గాలి ద్వారా వైరస్ ఊపిరితిత్తుల్లో చేరి ఇతర గొర్రెలకు వ్యాపిస్తుంది.
 
నివారణ చర్యలు..
   ప్రతి సంవత్సరం నవంబర్‌లో గొర్రెలకు మశూచి వ్యాధి నివారణ టీకాలు వేయించాలి.
   కొత్త జీవాలను మందలో చేర్చే ముందు వాటిని కొద్ది రోజులు మందకు దూరంగా ఉంచాలి. వాటి ఆరోగ్యాన్ని పరీక్షించాలి. అవి ఆరోగ్యంగా ఉంటేనే మందలో కలపాలి.
   వ్యాధి సోకిన గొర్రెల వద్దకు వ్యాధి సోకని వాటిని వెళ్లనీయకూడదు.
   వ్యాధి లక్షణాలు కనబడితే వెంటనే స్థానిక పశువైద్యాధికారులను సంప్రదించాలి.
 వ్యాధి సోకిన తర్వాత పాటించాల్సిన చర్యలు
   వ్యాధి సోకిన గొర్రెలను వెంటనే మంద నుంచి వేరు చేయాలి.
   తేలికగా జీర్ణమయ్యే ఆహారం ఇవ్వాలి.
   వ్యాధి వల్ల చనిపోయిన గొర్రెలను లోతుగా గొయ్యి తీసి ఖననం చేయాలి.
   వ్యాధితో జీవాలు చనిపోయిన ప్రదేశం, అవి తాగిన నీటి తొట్లు, తిన్న దాణా తొట్లను క్రిమిసంహారక ద్రావణంలో శుభ్రపర్చాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement