sheep farming
-
భారీ పరిశ్రమగా గొర్రెల పెంపకం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గొర్రెల పెంపకాన్ని భారీ పరిశ్రమగా అభివృద్ధి చేసే సంకల్పంతో ప్రభుత్వం ఉందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. ఆదివారం ప్రగతి భవన్లో గొర్రెల పెంపకం, మత్స్య పరిశ్రమ అభివృద్ధిపై ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు. తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధిలో గొర్రెల పెంపకం, మత్స్య పరిశ్రమ కీలకం కానున్నా యని అన్నారు. ఇతర దేశాలకు గొర్రె మాంసాన్ని ఎగుమతి చేసే స్థాయికి గొర్రెల పెంపకం పరిశ్రమ ఎదగాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ఈ రెండు రంగాలను విస్తృతంగా అభివృద్ధి చేయడానికి అవసరమైన ప్రణాళిక రూపొం దించేలా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఇందులో మంత్రులు ఈటల రాజేందర్, జోగు రామన్న, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, జూపల్లి కృష్ణారావు, జగదీశ్రెడ్డిలను సభ్యులుగా నియమించారు. నీటిపారుదల రంగం ద్వారా ప్రజలకు భారీ మేలు జరగనుందని, వివిధ వృత్తులపై ఆధారపడిన ప్రజలకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించే ప్రణాళికను ప్రభుత్వం రూపొం దిస్తోందని సీఎం చెప్పారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలన్నదే ప్రభుత్వ అభిమతమన్నారు. గొర్రెల పెంపకానికి శాఖాపరంగా అవసరమైన సహాయ సహకారాలు అందించాలని అధికారులను ఆదేశించారు. గొర్రెల సంపద అభివృద్ధి ద్వారా యాదవులంతా ఆర్థికంగా ఎదగాలన్నారు. సమావేశంలో స్పీకర్ మధుసూదనచారి, మంత్రులు నాయిని, ఈటల, తలసాని, పోచారం, తుమ్మల, ఎంపీ వినోద్, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చైర్మన్ పెద్దిరెడ్డి సుదర్శన్‌రెడ్డి, గొర్రెల పెంపకందారుల ఫెడరేషన్ చైర్మన్ రాజయ్య యాదవ్, పశు సంవర్ధకశాఖ చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేశ్ చందా, డైరెక్టర్ వెంకటేశ్వరరావు, సీఎంవో అధికారి భూపాల్ రెడ్డి, మెదక్ జెడ్పీ చైర్మన్ మురళీధర్ యాదవ్ పాల్గొన్నారు. -
మత్స్య, పాడి రంగాల్లో అగ్రగామి కావాలి
• ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం కేసీఆర్ ఆదేశం • మత్స్య పరిశ్రమ, గొర్రెల పెంపకం అభివృద్ధిపై కార్యాచరణ ప్రణాళిక • మత్స్య కార్పొరేషన్ లేదా ఫెడరేషన్ ఏర్పాటు అవసరం • ఫిషరీస్ కళాశాలల కోసం స్థలం ఎంపిక చేయాలని సూచన సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మత్స్య పరిశ్రమ, గొర్రెల పెంపకం అభివృద్ధి చెందేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రతి చెరువు చేపల పెంపకానికి ఆదరువు కావాలని.. గొర్రెలు, పాడి సంపదతో రాష్ట్రం అగ్రగామిగా ఎదగాలని పేర్కొన్నారు. చేపల ఉత్పత్తి కేంద్రాలను పునర్వ్యవస్థీకరించాలని, గొర్రెల పెంపకం కోసం పంపిణీ కార్యక్రమం సమాం తరంగా 30 జిల్లాల్లో చేపట్టాలని సూచించారు. భవిష్యత్తులో చేపలను, గొర్రెలను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే స్థాయికి తెలంగాణ చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మత్స్య పరిశ్రమ, గొర్రెల పెంపకం, పాడి పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి శనివారం ప్రగతిభవన్‌లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. పశు సంవర్థక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేష్ చంద్ర, మత్స్యశాఖ కమిషనర్ బి.వెంకటేశ్వర్రావు, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డి.వెంకటేశ్వర్లు, సీఎంవో అధికారులు పాల్గొన్నారు. మత్స్య పరిశ్రమ అభివృద్ధికి, గొర్రెల పెంపకాన్ని ముమ్మరంగా చేపట్టడానికి వినూత్న కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయా లని, అందుకు అధికారుల్లో నిబద్ధత కావాలని సీఎం వ్యాఖ్యానించారు. కార్పొరేషన్ అవసరం... మత్స్య పరిశ్రమ అభివృద్ధి కోసం కార్పొరేషన్ లేదా ఫెడరేషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరముందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో పలు వెనుకబడిన కులాల వారు మత్స్య పరిశ్రమ మీద ఆధారపడి జీవిస్తున్నారని, వారికి సంబంధించిన సమగ్ర సమాచారం సేకరించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4 లక్షల యాదవ కుటుంబాలు గొర్రెల పెంపకం మీద ఆధారపడి ఉన్నాయని, వారికి ప్రభుత్వం తగిన తోడ్పాటు అందిస్తుందని చెప్పారు. కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో అనువైన స్థలాలను ఎంపిక చేసి ఫిషరీస్ కళాశాలలను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. సొసైటీలు ఏర్పాటు చేయాలి... మత్స్య కార్మికులకు, గొర్రెల పెంపకం దార్లకు సొసైటీలు స్థాపించాలని.. ఈ వృత్తుల్లో ఉన్న ఇతర కులాల వారిని కూడా ఆ సొసైటీల్లో సభ్యులుగా చేర్పించాలని కేసీఆర్ ఆదేశించారు. రాజకీయాలకు తావులేకుండా సొసైటీల నిర్మాణాలు ఉండాల న్నారు. మొత్తం మత్స్యకారుల సంఖ్య, సొసైటీల సంఖ్యను నమోదు చేసి... చేపల పెంపకం ద్వారా వచ్చే లాభాన్ని అందరికీ సమానంగా పంచేందుకు ప్రణాళిక రూపొందించాలన్నారు. మత్స్యశాఖ, కార్పొరేషన్ లేదా ఫెడరేషన్‌కు చెందిన వివిధ స్థాయి అధికారులు మూడు నాలుగు జట్లుగా ఏర్పడి.. క్షేత్ర స్థాయిలో చేపల సీడ్స్ సరఫరా, మార్కెటింగ్, చేపలు పట్టే యంత్రాల పంపిణీ తదితర పని విభజనను చేసుకుని కార్యాచరణ చేపట్టాలన్నారు. మార్కెటింగ్ ప్రతినిధులు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో పర్యటించి చేపల అమ్మకాల ద్వారా అధిక లాభాలు పొందే వ్యూహాన్ని రూపొందించాలని.. ఈ విషయంలో అంకాపూర్ గ్రామాన్ని ఉదాహరణగా తీసుకోవాలని సూచించారు. అధ్యయనం చేయండి రాష్ట్రంలోని ఏ ప్రదేశంలో ఏ రకమైన చేపలు తినడానికి ఇష్టపడతారో అధ్యయనం చేసి.. అందుకనుగుణంగా చేపల పెంపకం చేపట్టాలని సీఎం కేసీఆర్ సూచించారు. కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతల పథకాలు, ఇతర నీటి పారుదల ప్రాజెక్టులకు సంబంధించిన రిజర్వా యర్లలో ఏడాది పొడవునా నీరు పుష్కలంగా లభ్యమవుతుందని.. దీనిని చేపల పెంపకానికి అనుకూలంగా మార్చుకోవాలని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా చెరువులను పునరుద్ధరిస్తు న్నందున వాటిని చేపల ఉత్పత్తి కేంద్రాలుగా మార్చాలన్నారు. పాడిపై వ్యూహం రూపొందించండి పాడి పరిశ్రమ అభివృద్ధికి చేపట్టవలసిన కార్యా చరణను కేసీఆర్ అధికారులకు సూచించారు. రాష్ట్రంలో నిత్యం వినియోగానికి అవసరమైన పాల ఉత్పత్తులను మన రాష్ట్రంలోనే ఉత్పత్తి చేయటానికి అవసరమైన వ్యూహాన్ని రూపొం దించాలన్నారు. పశుసంవర్థక శాఖకు రాష్ట్రం లోని వివిధ ప్రాంతాల్లో స్థలాలున్నాయని.. వాటిని గొర్రెల మార్కెటింగ్‌కు వినియోగించా లని ఆదేశించారు. భవిష్యత్‌లో శాఖ ప్రాధాన్య త పెరగనున్నందున ఉద్యోగుల నియామకం చేపట్టాలన్నారు. మత్స్య కార్మికులకు, గొర్రెల పెంపక దారులకు మనోధైర్యం కలిగే చర్యలు చేపట్టాలని.. అందుకు సాంస్కృతిక సారథి ద్వారా లఘు చిత్రాలు, పాటలు, సీడీలను రూపొందించాలని సూచించారు. తాను ప్రగతి భవన్లో మత్స్య కార్మికులు, గొర్రెల పెంపకం దార్లతో దశల వారీగా సమావేశమై చర్చిస్తానని కేసీఆర్ పేర్కొన్నారు. -
ఒక ఊరి చిత్రం
ఈ రోజుల్లో మొబైల్‌ఫోన్ లేని ఊరుందా? ఇంజక్షన్ అంటే తెలియని ప్రజలున్నారా? ప్రపంచమే ఓ కుగ్రామమైన వేళ ఇంకా అలాంటి గ్రామాలేంటి అంటారా?.. కానీ, అటువంటి గ్రామం ఉంది. అక్కడి ప్రజలకు మందులు తెలియవు. స్కూల్ మాట దేవుడెరుగు.. ఆ ఊరికి విద్యుత్తే లేదు. చుట్టూ గుట్టలు, లోయలు. కనుచూపు మేర పరుచుకున్న పచ్చదనం. మేనిని తాకుతూ వెళ్లే మేఘాలు. స్వచ్ఛమైన నీటితో ఉరకలెత్తే సుఫిన్ నది. ఆత్మీయత నిండిన మనసులు. శ్రమే దైవంగా బతికే మనుషులు ఆ ఊరి సొంతం. ఆ గ్రామం పేరు కలాప్. ఆ అందాలను తన కెమెరాలో బంధించి ప్రపంచానికి పరిచయం చేస్తున్నాడు ఆనంద్‌శంకర్. ..:: శ్రావణ్ జయ అబ్బురపరిచే ప్రకృతి ఉత్తరాఖండ్ జిల్లాలోని ఉత్తర కాశీలో ఉన్న కలాప్ సొంతం. 450 జనాభా ఉన్న ఆ గ్రామ ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. గ్రామస్తులకు ఆదాయమార్గం అంటే మేకలు, గొర్రెల పెంపకమే. ఆ ఊరికి హస్పిటల్, స్కూల్, కరెంటు వంటివేవీ లేవు. వాటి గురించి అక్కడ ప్రజలకూ తెలియదు. రహదారుల వంటి మౌలిక సదుపాయాలు అసలే లేవు. ప్రభుత్వం అంటేనే తెలియదు అక్కడి ప్రజలకు. అలాంటివారిలో చైతన్యం కల్పించి వాళ్ల జీవితాల్లో వెలుగులు నింపాలనుకున్నాడు ఆనంద్ శంకర్. బిజినెస్ స్టాండర్డ్‌లో జర్నలిస్ట్ వృత్తికి స్వస్తి చెప్పి, సొంతూరు బెంగళూరును వదిలి కలాప్లోనే నివాసముంటున్నాడు. ఆ ప్రజల జాగృతి కోసం ‘కలాప్ ట్రస్ట్’ను ప్రారంభించాడు. అక్కడి అందాలను కెమెరాల్లో బంధించి, ఆ గ్రామం గురించి ప్రపంచానికి తెలియజెప్పేందుకు ఇటీవల నగరంలోని లామకాన్‌లో ఫొటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశాడు. ఎగ్జిబిషన్ ఏర్పాటు ఉద్దేశం ఆయన మాట ల్లోనే... ‘చుట్టూ ప్రకృతి సోయగం ఎంత ఉన్నా ఆ ఊరును ఎవరూ పట్టించుకోకపోవడానికి కారణం ప్రచారం లేకపోవడమే. ప్రభుత్వం, ప్రైవే టు సంస్థలు కలాప్ను సందర్శించిన దాఖలాల్లేవు. నేను 2013లో ఆ ఊరికి వెళ్లాను. గొర్రెలు, మేకల పెంపకం తప్ప ఆ గ్రామానికి ఎలాంటి ఆదాయ మార్గం లేదు. కలాప్ ప్రజల భాష కూడా మౌఖికమే తప్ప లిఖిత పూర్వకమైనది కాదు. స్వతహాగా ఫోటోగ్రాఫర్నైన నేను అక్కడి ప్రకృతి సోయగాలకు ముగ్ధుడయ్యాను. అప్పుడే ఫొటోల ద్వారా ఆ ఊరికి ప్రచారం కల్పించాలన్న ఆలోచన వచ్చింది. ప్రస్తుతం అక్కడి అందమైన లొకేషన్లను ఫొటోల్లో బంధించి వాటిని కలాప్ ట్రస్ట్ దార్వా విక్రయించి, వచ్చిన డబ్బును గ్రామాభివృద్ధికి వినియోగిస్తున్నా. అక్కడి ఇళ్లు చూస్తే అక్కడి ఆర్కిటెక్చర్ ఎంత సంపన్నమైనదో తెలుస్తుంది. అందుకే వారికి ఇతర చేతి వృత్తులను నేర్పిస్తున్నాను. 2014 అక్టోబర్‌లో అక్కడ తొలిసారిగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశాం. ఎక్కువమంది విటమిన్ బీ12 లోపం, ఎనీమియాతో బాధపడుతున్నారు. కలాప్ ట్రస్ట్ ద్వారా వచ్చే ఆదాయాన్ని వారి అభ్యున్నతికే ఖర్చు చేస్తాం. ప్రభుత్వం స్పందించినా స్పందించకపోయినా... నా ఫొటోల ప్రచారంతో ఆ ఊరికి యాత్రికులు, పర్వతారోహకులు కచ్చితంగా వస్తారు. టూరిజం అభివృద్ధి అవుతుంది. అందమైన ప్రకృతికి నిలయమైన కలాప్లో షూటింగ్ స్పాట్స్‌కి కొదవ లేదు. సినిమా వాళ్లు కూడా రావడం వల్ల అక్కడి ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయని అనుకుంటున్నా’. ట్రెక్కింగ్‌కి అనుకూలం... శీతాకాలంలో 3 నుంచి ఐదడుగుల మేర మంచుతో కప్పి ఉండే కలాప్ డెహ్రడూన్‌కి 210 కిలోమీటర్ల దూరంలో ఉంది. దిల్లీకి 450 కిలోమీటర్ల దూరం. కలాప్ సమీపంలోని నెట్వార్కి కారులో వెళ్లడానికి 6 గంటలు, బస్సులోనైతే పది గంటలు పడుతుంది. ట్రెక్కింగ్‌కి రెండు మార్గాలున్నాయి. వేసవి కాలం మార్గంలో 8 కిలోమీటర్లు నడవడానికి 6 గంటలు పడుతుంది. శీతాకాలం మార్గంలో 5 కిలోమీటర్లు నడిచేందుకు 4 గంటల సమయం పడుతుంది. -
గొర్రెలను వ్యాధుల నుంచి రక్షించుకోండి..
మంచిర్యాల రూరల్ : గొర్రెల పెంపకంలో సరైన యాజమాన్య పద్ధతులు పాటించకుంటే మంద త్వరగా వృద్ధి చెందదు. గొర్రెల్లో వచ్చే వ్యాధులపై కాస్త అవగాహన కలిగి ఉండి, వాటికి సరైన చికిత్స సమాయానికి అందించాలి. తగిన జాగ్రత్తలు తీసుకుంటే గొర్రెలను వ్యాధుల బారి నుం చి కాపాడుకోవచ్చు. నవంబర్ నెల నుంచి ఏప్రి ల్ వరకు గొర్రెలకు మశూచి వ్యాధి(పాక్స్ వైరస్) ముప్పు పొంచి ఉంటుందని, గొర్రెల పెంపకందారులు అప్రమత్తంగా ఉండాలని హాజీపూర్ పశువైద్యాధికారి అర్చన సూచించారు. ముందస్తుగా టీకాలు వేయించడం మంచిదని, గాలిద్వారా వచ్చే ఈ వైరస్ వ్యాపించిన గొర్రెలు ఆహారం తీసుకోక, శ్వాస ఆడక ప్రాణాలు విడుస్తాయని హెచ్చరించారు. వ్యాధి వ్యాప్తి, లక్షణాలు, నివారణ చర్యలను వివరించారు. గొర్రెల మంద వృద్ధి చెందాలంటే.. గొర్రెల మంద రోగాల బారిన పడితే వాటికి పశు వైద్యుల సలహాతో మందులను వాడాలి. తెలిసీ తెలియకుండా మందులను వేయవద్దు. పుట్టిన జీవాలను నిర్లక్ష్యం చేయకుండా తప్పనిసరిగా ముర్రుపాలు తాగించాలి. ఆ పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే మంద త్వరగా వృద్ధి చెందుతుంది. గొర్రెల దొడ్లను ప్రతీ రోజు శుభ్రం చేయాలి. నేల ఎప్పుడూ పొడిగా ఉండేలా చేయాలి. వారానికి ఒకసారి సున్నం చల్లాలి. సాయంకాలం వేళల్లో దోమల నివారణకు పొగబెట్టాలి. మందతో తరచూ రోగాల బారిన పడే జీవాలను తొలగిస్తూ ఉండాలి. పుష్టికరమైన మేత జీవాల ఆరోగ్యం, ఉత్పాదక సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. బయటమేపే ప్రదేశాల్లో గొర్రెలు శుభ్రమైన నీటిని తాగేలా చూడాలి. మంద ఒక దగ్గర పెడితే ఖనిజ లవణాలు గల ఇటుకలు, కల్లుప్పును నాకించాలి. బయట మేపడమే కాకుండా, మంద వద్ద కూడా చౌకగా తయారు చేసిన దాణా అందించాలి. మశూచి వ్యాధి లక్షణాలు.. వ్యాధి సోకిన గొర్రెల్లో వారం రోజుల్లో దాని లక్షణాలు బయటపడతాయి వ్యాధి సోకిన గొర్రెలకు జ్వరం తీవ్రంగా ఉంటుంది. చర్మంపై వెంట్రుకలు లేని భాగం, తోక కింద, పెదవులు, ముక్కు రంధ్రాలు, జననేంద్రియాలు, పాల పొదుగుపై ఎర్రని దద్దులు, పొక్కులు ఏర్పడతాయి. కళ్ల నుంచి నీరు, నోటి నుంచి సొంగ, ముక్కు నుంచి చిక్కటి చీముడు కారుతుంది. శ్వాసకోశ వ్యవస్థను వ్యాధి ఆశిస్తే, గొర్రెలు శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. జీర్ణకోశ వ్యవస్థను ఆశిస్తే రక్తపు విరేచనాలు అవుతాయి. చూడి గొర్రెలకు వ్యాధి ప్రబలితే ఈసుకుని పోతాయి. వ్యాధి వ్యాప్తి చెందే విధానం గాలి ద్వారా మశూచి వైరస్ వ్యాప్తి చెందుతుంది. వ్యాధిగ్రస్త గొర్రె నుంచి మరొక దానికి వ్యాప్తిస్తుంది. దాణా తొట్టెలు, నీటి తొట్టెలు, ఇతర వస్తువుల ద్వారా ఇది వ్యాప్తి చెందుతుంది. గాలి ద్వారా వైరస్ ఊపిరితిత్తుల్లో చేరి ఇతర గొర్రెలకు వ్యాపిస్తుంది. నివారణ చర్యలు.. ప్రతి సంవత్సరం నవంబర్‌లో గొర్రెలకు మశూచి వ్యాధి నివారణ టీకాలు వేయించాలి. కొత్త జీవాలను మందలో చేర్చే ముందు వాటిని కొద్ది రోజులు మందకు దూరంగా ఉంచాలి. వాటి ఆరోగ్యాన్ని పరీక్షించాలి. అవి ఆరోగ్యంగా ఉంటేనే మందలో కలపాలి. వ్యాధి సోకిన గొర్రెల వద్దకు వ్యాధి సోకని వాటిని వెళ్లనీయకూడదు. వ్యాధి లక్షణాలు కనబడితే వెంటనే స్థానిక పశువైద్యాధికారులను సంప్రదించాలి. వ్యాధి సోకిన తర్వాత పాటించాల్సిన చర్యలు వ్యాధి సోకిన గొర్రెలను వెంటనే మంద నుంచి వేరు చేయాలి. తేలికగా జీర్ణమయ్యే ఆహారం ఇవ్వాలి. వ్యాధి వల్ల చనిపోయిన గొర్రెలను లోతుగా గొయ్యి తీసి ఖననం చేయాలి. వ్యాధితో జీవాలు చనిపోయిన ప్రదేశం, అవి తాగిన నీటి తొట్లు, తిన్న దాణా తొట్లను క్రిమిసంహారక ద్రావణంలో శుభ్రపర్చాలి. -
గొర్ల పెంపకం.. లాభదాయకం
గొర్లను పెంచే వారు తప్పకుండా మొదట షెడ్డు నిర్మించుకోవాలి. ఎండ, చలి, వర్షాల నుంచి పూర్తి రక్షణ ఉండేలా చూసుకోవాలి. పిల్లిపెసర, బబ్బెర్లు, గడ్డితో పాటు సుబాబుల్ చెట్ల పెంపకం కోఫార్ రకం గడ్డి, జొన్నను మేతగా వేయాలి. అటవీ ప్రాంతాలు ఉన్న చోట వీటిని మేతకోసం బయటకు కూడా తీసుకెళ్లవచ్చు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు వర్షకాలంలో గొర్ల కాళ్లకు పుండ్లు కావడం, ముక్కు నుంచి చీము కారడం, చిటుకు వ్యాధులు వంటివి వస్తాయి. వీటి నివారణకు ప్రతిఏటా ప్రభుత్వం పంపిణీ చేస్తున్న మందులను వేయించాలి. జీవాలు కుంటినా, ముక్కు నుంచి చీమిడి కారినా వెంటనే వెటర్నరీ అధికారులకు చూపించాలి. గొర్లు షెడ్డు లోపలకు వెళ్లే దారిలో చిన్నపాటి నీటి తొట్టిని నిర్మించుకుని పొటాషియం పర్మాంగనేట్ వేసి గొర్లు ఉదయం మేతకు వెళ్లేటప్పుడు, సాయంత్రం తిరిగి పాకలోకి వచ్చేటప్పుడు జీవాలు ఈ నీటిలో నుంచి నడిచేలా చూడాలి. దీంతో కాళ్లకు పుండ్లు అయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది. నెల్లూరు క్రాస్ బ్రీడ్ మేలైన రకం గొర్లలో అనేక రకాలు ఉంటాయి. వీటిలో నెల్లూరు క్రాస్ బ్రీడ్ బాగుంది. ఈ రకం జీవాలను ఎనిమిదేళ్లపాటు పెంచవచ్చు. ఇవి ఏడాదికి మూడు పిల్లల చొప్పున 8 ఏళ్లకు 12 ఈతలు ఈనుతుంది. అప్పటికి ముప్పై కిలోల బరువు ఉంటుంది. ఒక్కో గొర్రెకు బహిరంగ మార్కెట్లో రూ.6వేల ధర పలుకుతుంది. ఎనిమిదేళ్లు నిండిన గొర్లు బరువు పెరగవు కాబట్టి వెంటనే వీటిని విక్రయించాలి. గొర్రెలు ఈనగానే పుట్టిన పిల్లలను 15 రోజుల పాటు పాకలోనే ఉంచాలి. తల్లిగొర్రె వెంట పంపరాదు. 15 రోజుల వరకు కేవలం తల్లి పాలు మాత్రమే తాగించాలి. 40 గొర్లకు ఒక విత్తన పొటేలును పెంచుకోవాలి. దీన్ని కూడా ఎనిమిది ఏళ్ల వరకు విత్తన పొటేలుగా ఉపయోగించుకుని అనంతరం అమ్మేయాలి. ప్రభుత్వ ప్రోత్సాహకాలు ప్రభుత్వం గొర్ల పెంపకానికి నాబార్డ్ ద్వారా సబ్సిడీపై రుణాలు అందజేస్తోంది. ఎస్సీ, ఎస్టీలతో పాటు గొర్ల పెంపక సంఘం దారులకు ఇందులో ప్రాధాన్యం ఉంటుంది. గొర్లకు మేత కోసం సబ్సిడీపై మినరల్ మిక్చర్‌తో పాటు కంది, పెసర, మినుముల పొట్టు, పల్లి చెక్కను సబ్సిడీపై అందజేస్తోంది. గొర్ల ఆరోగ్య పరిస్థితిని బట్టి ఒక్కోదానికి నిత్యం 150 నుంచి 200 గ్రాముల వరకు బలవర్ధక ఆహారం ఇవ్వాలి. జీవాలకు విధిగా బీమా చేయించాలి. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ హయాంలో గొర్లకు బీమా అందడం లేదు. దీంతో వీటి పోషకులు నష్టపోయే ప్రమాదముంది.