మత్స్య, పాడి రంగాల్లో అగ్రగామి కావాలి | cm kcr about seafood industry and sheep farming | Sakshi
Sakshi News home page

మత్స్య, పాడి రంగాల్లో అగ్రగామి కావాలి

Published Sun, Jan 8 2017 2:32 AM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM

మత్స్య, పాడి రంగాల్లో అగ్రగామి కావాలి - Sakshi

మత్స్య, పాడి రంగాల్లో అగ్రగామి కావాలి

ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం కేసీఆర్‌ ఆదేశం
మత్స్య పరిశ్రమ, గొర్రెల పెంపకం అభివృద్ధిపై కార్యాచరణ ప్రణాళిక
మత్స్య కార్పొరేషన్‌ లేదా ఫెడరేషన్‌ ఏర్పాటు అవసరం
ఫిషరీస్‌ కళాశాలల కోసం స్థలం ఎంపిక చేయాలని సూచన  


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో మత్స్య పరిశ్రమ, గొర్రెల పెంపకం అభివృద్ధి చెందేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రతి చెరువు చేపల పెంపకానికి ఆదరువు కావాలని.. గొర్రెలు, పాడి సంపదతో రాష్ట్రం అగ్రగామిగా ఎదగాలని పేర్కొన్నారు. చేపల ఉత్పత్తి కేంద్రాలను పునర్వ్యవస్థీకరించాలని, గొర్రెల పెంపకం కోసం పంపిణీ కార్యక్రమం సమాం తరంగా 30 జిల్లాల్లో చేపట్టాలని సూచించారు. భవిష్యత్తులో చేపలను, గొర్రెలను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే స్థాయికి తెలంగాణ చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

మత్స్య పరిశ్రమ, గొర్రెల పెంపకం, పాడి పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి శనివారం ప్రగతిభవన్‌లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. పశు సంవర్థక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేష్‌ చంద్ర, మత్స్యశాఖ కమిషనర్‌ బి.వెంకటేశ్వర్రావు, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్‌ డి.వెంకటేశ్వర్లు, సీఎంవో అధికారులు పాల్గొన్నారు. మత్స్య పరిశ్రమ అభివృద్ధికి, గొర్రెల పెంపకాన్ని ముమ్మరంగా చేపట్టడానికి వినూత్న కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయా లని, అందుకు అధికారుల్లో నిబద్ధత కావాలని సీఎం వ్యాఖ్యానించారు.

కార్పొరేషన్‌ అవసరం...
మత్స్య పరిశ్రమ అభివృద్ధి కోసం కార్పొరేషన్‌ లేదా ఫెడరేషన్‌ ఏర్పాటు చేయాల్సిన అవసరముందని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో పలు వెనుకబడిన కులాల వారు మత్స్య పరిశ్రమ మీద ఆధారపడి జీవిస్తున్నారని, వారికి సంబంధించిన సమగ్ర సమాచారం సేకరించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4 లక్షల యాదవ కుటుంబాలు గొర్రెల పెంపకం మీద ఆధారపడి ఉన్నాయని, వారికి ప్రభుత్వం తగిన తోడ్పాటు అందిస్తుందని చెప్పారు. కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో అనువైన స్థలాలను ఎంపిక చేసి ఫిషరీస్‌ కళాశాలలను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.

సొసైటీలు ఏర్పాటు చేయాలి...
మత్స్య కార్మికులకు, గొర్రెల పెంపకం దార్లకు సొసైటీలు స్థాపించాలని.. ఈ వృత్తుల్లో ఉన్న ఇతర కులాల వారిని కూడా ఆ సొసైటీల్లో సభ్యులుగా చేర్పించాలని కేసీఆర్‌ ఆదేశించారు. రాజకీయాలకు తావులేకుండా సొసైటీల నిర్మాణాలు ఉండాల న్నారు. మొత్తం మత్స్యకారుల సంఖ్య, సొసైటీల సంఖ్యను నమోదు చేసి... చేపల పెంపకం ద్వారా వచ్చే లాభాన్ని అందరికీ సమానంగా పంచేందుకు ప్రణాళిక రూపొందించాలన్నారు. మత్స్యశాఖ, కార్పొరేషన్‌ లేదా ఫెడరేషన్‌కు చెందిన వివిధ స్థాయి అధికారులు మూడు నాలుగు జట్లుగా ఏర్పడి.. క్షేత్ర స్థాయిలో చేపల సీడ్స్‌ సరఫరా, మార్కెటింగ్, చేపలు పట్టే యంత్రాల పంపిణీ తదితర పని విభజనను చేసుకుని కార్యాచరణ చేపట్టాలన్నారు. మార్కెటింగ్‌ ప్రతినిధులు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో పర్యటించి చేపల అమ్మకాల ద్వారా అధిక లాభాలు పొందే వ్యూహాన్ని రూపొందించాలని.. ఈ విషయంలో అంకాపూర్‌ గ్రామాన్ని ఉదాహరణగా తీసుకోవాలని సూచించారు.

అధ్యయనం చేయండి
రాష్ట్రంలోని ఏ ప్రదేశంలో ఏ రకమైన చేపలు తినడానికి ఇష్టపడతారో అధ్యయనం చేసి.. అందుకనుగుణంగా చేపల పెంపకం చేపట్టాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతల పథకాలు, ఇతర నీటి పారుదల ప్రాజెక్టులకు సంబంధించిన రిజర్వా యర్లలో ఏడాది పొడవునా నీరు పుష్కలంగా లభ్యమవుతుందని.. దీనిని చేపల పెంపకానికి అనుకూలంగా మార్చుకోవాలని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా చెరువులను పునరుద్ధరిస్తు న్నందున వాటిని చేపల ఉత్పత్తి కేంద్రాలుగా మార్చాలన్నారు.

పాడిపై వ్యూహం రూపొందించండి
పాడి పరిశ్రమ అభివృద్ధికి చేపట్టవలసిన కార్యా చరణను కేసీఆర్‌ అధికారులకు సూచించారు. రాష్ట్రంలో నిత్యం వినియోగానికి అవసరమైన పాల ఉత్పత్తులను మన రాష్ట్రంలోనే ఉత్పత్తి చేయటానికి అవసరమైన వ్యూహాన్ని రూపొం దించాలన్నారు. పశుసంవర్థక శాఖకు రాష్ట్రం లోని వివిధ ప్రాంతాల్లో స్థలాలున్నాయని.. వాటిని గొర్రెల మార్కెటింగ్‌కు వినియోగించా లని ఆదేశించారు. భవిష్యత్‌లో శాఖ ప్రాధాన్య త పెరగనున్నందున ఉద్యోగుల నియామకం చేపట్టాలన్నారు. మత్స్య కార్మికులకు, గొర్రెల పెంపక దారులకు మనోధైర్యం కలిగే చర్యలు చేపట్టాలని.. అందుకు సాంస్కృతిక సారథి ద్వారా లఘు చిత్రాలు, పాటలు, సీడీలను రూపొందించాలని సూచించారు. తాను ప్రగతి భవన్‌లో మత్స్య కార్మికులు, గొర్రెల పెంపకం దార్లతో దశల వారీగా సమావేశమై చర్చిస్తానని కేసీఆర్‌ పేర్కొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement