Seafood industry
-
చేపలు కోట్లను తింటున్నాయా!
నెల్లూరు(సెంట్రల్): చేపల పెంపకం కోసం రూ.కోట్లు ఖర్చుపెడుతున్నామంటున్నారు. కాని ఈ కోట్లు ఎక్కడ ఖర్చుపెడుతున్నారో లెక్కల్లో మాత్రమే చూపుతున్నారు. ప్రధానంగా జిల్లాలోని జలాశయాల్లో ఉచిత చేపల పెంపకంపై నీలినీడలు అలముకున్నాయి. రాజకీయ నాయకుల రంగప్రవేశంతో మొత్తం పక్కదారి పడుతోంది. అర్హులైన వారికి ఉచితంగా చేపల పంపిణీ కార్యక్రమం అనుకున్న రీతిలో జరగడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కోటి చేప పిల్లలు పెంపకం ఎక్కడ జరుగుతుందని విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో మొత్తం మత్స్యశాఖ ద్వారా చేస్తున్న చేపల పెంపకంపై విమర్శలు వినిపిస్తున్నాయి. లక్షల్లో ఎక్కడ వదిలారు జిల్లాలోని సోమశిల, కండలేరులతో పాటు పలు జలాశయాల్లో ఉచితంగా రూ.2 కోట్లతో కోటి చేప పిల్లలను వదులుతామని అధికారులు, పాలకులు చెబుతున్నారు. ఇప్పటి వరకు 10 లక్షల చేపపిల్లలను వదిలామని, మరో 90 లక్షల పిల్లలను త్వరలోనే వదులుతామని పేర్కొంటున్నారు. కాని వేలల్లో వదిలేసి లక్షల్లో లెక్కలు చూపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి చేపపిల్లలను లెక్కించే పరిస్థితి లేక పోవడంతో ఎన్ని వదిలారో వాస్తవంగా తెలియడం లేదు. లెక్కల్లో మాత్రం లక్షల్లో వదిలినట్టు చూపిస్తున్నారు. పంపిణీలోను మతలబు జిల్లాలో 244 మత్స్యకార సొసైటీలు ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు. సొసైటీలలోని వారికి ఉచితంగా చేపలను పంపిణీ చేయాల్సి ఉంది. కాని అది కూడా అర్హులకు కాకుండా కొందరు అధికార పార్టీ చెప్పిన వారికి ఇస్తున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా ఉచితంగా ఇస్తామన్న చేపలు పలువురు అధికార పార్టీ నాయకులు చేపల చెరువుల్లో వదులుతున్నారనే ఆరోపణలు కూడా వినిపించక మానడం లేదు. దీంతో మత్స్యశాఖ ద్వారా పంపిణీ చేసే చేపలు పక్కదారి పడుతున్నట్టు తెలుస్తోంది. అధికార పార్టీ నేతల చేతివాటం కోటి పిల్లలను ఎక్కడ పంపిణీ చేసేది ఎవరూ స్పష్టత ఇవ్వడం లేదు. జిల్లాలోని ఏడు జలాశయాల్లో పంపిణీ అంటున్నారు. కాని చేపపిల్లలు లెక్కించడం కుదరదుకాబట్టి వేలల్లో వదులుతూ లక్షల్లో చూపిస్తున్నట్టు విమర్శలు వస్తున్నాయి. ప్రధానంగా అధికార పార్టీకి చెందిన పలువురు మత్స్యశాఖ అధికారులపై ఒత్తిడి తీసుకుని వచ్చి, తమకు నచ్చిన ప్రాంతాల్లో, వారికి అనుకూలంగా ఉన్న జలాశయాల్లో వదిలేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే దాదాపుగా చేపపిల్లలను వదిలేయాల్సిది పోయి వదులుతామని చెప్పడంపైనా విమర్శలున్నాయి. కోటి టార్గెట్‌ను పూర్తి చేస్తాం జిల్లాలోని పలు జలాశయాల్లో కోటి చేప పిల్లలను వదిలే విధగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. ఇప్పటికే దాదాపుగా 10 లక్షలు వదిలేశాం. మిగిలిన వాటిని త్వరలోనే వదులుతాం. అర్హులైన వారికి మాత్రమే ఉచితంగా పంపిణీ చేస్తాం. – శ్రీహరి, జేడీ మత్స్యశాఖ అర్హులకు అందడం లేదు ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేసే విధానం ఎక్కడా అర్హులకు అందిన దాఖలాలు లేవు. అధికార పార్టీ నాయకులు చెప్పిన వారికి అరకొర ఇచ్చేసి వెళ్తున్నారు. చేప పిల్లలు కావాలని ఎవరైనా అడిగితే అధికార పార్టీ నాయకుల సిఫారుసు కావాలని చెబుతున్నారు. ఇదెక్కడి న్యాయం. జలాశయాల్లో చేప పిల్లలను చెప్పిన ప్రకారం వదలాలి.–కొమారి శ్రీనివాస్, మత్స్యకారుడు, కావలి -
వంద కేజ్ కల్చర్ సెంటర్లు
- చేపల పెంపకానికి ఎన్ఎఫ్డీబీ అధునాతన పరిజ్ఞానమిది -కేంద్రం ద్వారా ప్రత్యేక నిధులు మంజూరు చేస్తాం: దత్తాత్రేయ సాక్షి, హైదరాబాద్: మత్స్య పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అమల్లోకి తెస్తోందని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ఈమేరకు జాతీయ మత్స్య అభివృద్ధి సంస్థ (ఎన్ఎఫ్డీబీ) సరికొత్తగా కేజ్ కల్చర్‌ను పరిచయం చేస్తోందన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో వంద కేజ్ కల్చర్ సెంటర్లను తెరిచేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నామని, త్వరలో వీటిని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. సోమవారం దిల్కుషా అతిథిగృహంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్ఎఫ్డీబీ రూపొందించిన కొత్త టెక్నాలజీతో దిగుబడి బాగుంటుందని వివరించారు. ‘రాష్ట్రంలో చేపల పెంపకం ఆశించినంతగా లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది రూ.70కోట్లతో చేప పిల్లలను చెరువుల్లో వేసింది. కానీ పెద్ద చేపలు చిన్న చేపల్ని మింగేశాయి’ అని అన్నారు.. చేపల మార్కెట్ల ఏర్పాటుకు కేంద్రం రాష్ట్రానికి రూ.9.65 కోట్లు కేటాయించి, రూ.4.45 కోట్లు విడుదల చేసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులను సద్వినియోగం చేసుకోవడం లేదని దత్తాత్రేయ చెప్పారు. రాష్ట్రానికి కొత్త యూనివర్సిటీ... రాష్ట్రంలో కొత్తగా ‘ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఫర్ ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్’ ఏర్పాటు చేయనున్నట్లు దత్తాత్రేయ తెలిపారు. ఈ వర్సిటీ ఏర్పాటుకు రెండొందల ఎకరాల భూమి కావాలని, రాష్ట్ర ప్రభుత్వం భూకేటాయింపులు జరిపిన వెంటనే ప్రారంభిస్తామన్నారు. ఇఫ్లూ ఆధ్వర్యంలో స్పోకెన్ ఇంగ్లిష్, స్పోకెన్ హిందీ కోర్సులను త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఈ కోర్సులు పూర్తి ఉచితంగా అందిస్తామన్నారు. త్వరలో ఇఫ్లూ యంత్రాంగం ఐదు గ్రామాలను దత్తత తీసుకోనుందన్నారు. ఐటీఐ మల్లెపల్లిలో కొత్తగా పది ట్రేడ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నామని, ఇప్పటికే మారుతి–సుజుకీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు. -
మత్స్య, పాడి రంగాల్లో అగ్రగామి కావాలి
• ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం కేసీఆర్ ఆదేశం • మత్స్య పరిశ్రమ, గొర్రెల పెంపకం అభివృద్ధిపై కార్యాచరణ ప్రణాళిక • మత్స్య కార్పొరేషన్ లేదా ఫెడరేషన్ ఏర్పాటు అవసరం • ఫిషరీస్ కళాశాలల కోసం స్థలం ఎంపిక చేయాలని సూచన సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మత్స్య పరిశ్రమ, గొర్రెల పెంపకం అభివృద్ధి చెందేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రతి చెరువు చేపల పెంపకానికి ఆదరువు కావాలని.. గొర్రెలు, పాడి సంపదతో రాష్ట్రం అగ్రగామిగా ఎదగాలని పేర్కొన్నారు. చేపల ఉత్పత్తి కేంద్రాలను పునర్వ్యవస్థీకరించాలని, గొర్రెల పెంపకం కోసం పంపిణీ కార్యక్రమం సమాం తరంగా 30 జిల్లాల్లో చేపట్టాలని సూచించారు. భవిష్యత్తులో చేపలను, గొర్రెలను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే స్థాయికి తెలంగాణ చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మత్స్య పరిశ్రమ, గొర్రెల పెంపకం, పాడి పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి శనివారం ప్రగతిభవన్‌లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. పశు సంవర్థక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేష్ చంద్ర, మత్స్యశాఖ కమిషనర్ బి.వెంకటేశ్వర్రావు, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డి.వెంకటేశ్వర్లు, సీఎంవో అధికారులు పాల్గొన్నారు. మత్స్య పరిశ్రమ అభివృద్ధికి, గొర్రెల పెంపకాన్ని ముమ్మరంగా చేపట్టడానికి వినూత్న కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయా లని, అందుకు అధికారుల్లో నిబద్ధత కావాలని సీఎం వ్యాఖ్యానించారు. కార్పొరేషన్ అవసరం... మత్స్య పరిశ్రమ అభివృద్ధి కోసం కార్పొరేషన్ లేదా ఫెడరేషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరముందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో పలు వెనుకబడిన కులాల వారు మత్స్య పరిశ్రమ మీద ఆధారపడి జీవిస్తున్నారని, వారికి సంబంధించిన సమగ్ర సమాచారం సేకరించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4 లక్షల యాదవ కుటుంబాలు గొర్రెల పెంపకం మీద ఆధారపడి ఉన్నాయని, వారికి ప్రభుత్వం తగిన తోడ్పాటు అందిస్తుందని చెప్పారు. కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో అనువైన స్థలాలను ఎంపిక చేసి ఫిషరీస్ కళాశాలలను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. సొసైటీలు ఏర్పాటు చేయాలి... మత్స్య కార్మికులకు, గొర్రెల పెంపకం దార్లకు సొసైటీలు స్థాపించాలని.. ఈ వృత్తుల్లో ఉన్న ఇతర కులాల వారిని కూడా ఆ సొసైటీల్లో సభ్యులుగా చేర్పించాలని కేసీఆర్ ఆదేశించారు. రాజకీయాలకు తావులేకుండా సొసైటీల నిర్మాణాలు ఉండాల న్నారు. మొత్తం మత్స్యకారుల సంఖ్య, సొసైటీల సంఖ్యను నమోదు చేసి... చేపల పెంపకం ద్వారా వచ్చే లాభాన్ని అందరికీ సమానంగా పంచేందుకు ప్రణాళిక రూపొందించాలన్నారు. మత్స్యశాఖ, కార్పొరేషన్ లేదా ఫెడరేషన్‌కు చెందిన వివిధ స్థాయి అధికారులు మూడు నాలుగు జట్లుగా ఏర్పడి.. క్షేత్ర స్థాయిలో చేపల సీడ్స్ సరఫరా, మార్కెటింగ్, చేపలు పట్టే యంత్రాల పంపిణీ తదితర పని విభజనను చేసుకుని కార్యాచరణ చేపట్టాలన్నారు. మార్కెటింగ్ ప్రతినిధులు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో పర్యటించి చేపల అమ్మకాల ద్వారా అధిక లాభాలు పొందే వ్యూహాన్ని రూపొందించాలని.. ఈ విషయంలో అంకాపూర్ గ్రామాన్ని ఉదాహరణగా తీసుకోవాలని సూచించారు. అధ్యయనం చేయండి రాష్ట్రంలోని ఏ ప్రదేశంలో ఏ రకమైన చేపలు తినడానికి ఇష్టపడతారో అధ్యయనం చేసి.. అందుకనుగుణంగా చేపల పెంపకం చేపట్టాలని సీఎం కేసీఆర్ సూచించారు. కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతల పథకాలు, ఇతర నీటి పారుదల ప్రాజెక్టులకు సంబంధించిన రిజర్వా యర్లలో ఏడాది పొడవునా నీరు పుష్కలంగా లభ్యమవుతుందని.. దీనిని చేపల పెంపకానికి అనుకూలంగా మార్చుకోవాలని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా చెరువులను పునరుద్ధరిస్తు న్నందున వాటిని చేపల ఉత్పత్తి కేంద్రాలుగా మార్చాలన్నారు. పాడిపై వ్యూహం రూపొందించండి పాడి పరిశ్రమ అభివృద్ధికి చేపట్టవలసిన కార్యా చరణను కేసీఆర్ అధికారులకు సూచించారు. రాష్ట్రంలో నిత్యం వినియోగానికి అవసరమైన పాల ఉత్పత్తులను మన రాష్ట్రంలోనే ఉత్పత్తి చేయటానికి అవసరమైన వ్యూహాన్ని రూపొం దించాలన్నారు. పశుసంవర్థక శాఖకు రాష్ట్రం లోని వివిధ ప్రాంతాల్లో స్థలాలున్నాయని.. వాటిని గొర్రెల మార్కెటింగ్‌కు వినియోగించా లని ఆదేశించారు. భవిష్యత్‌లో శాఖ ప్రాధాన్య త పెరగనున్నందున ఉద్యోగుల నియామకం చేపట్టాలన్నారు. మత్స్య కార్మికులకు, గొర్రెల పెంపక దారులకు మనోధైర్యం కలిగే చర్యలు చేపట్టాలని.. అందుకు సాంస్కృతిక సారథి ద్వారా లఘు చిత్రాలు, పాటలు, సీడీలను రూపొందించాలని సూచించారు. తాను ప్రగతి భవన్లో మత్స్య కార్మికులు, గొర్రెల పెంపకం దార్లతో దశల వారీగా సమావేశమై చర్చిస్తానని కేసీఆర్ పేర్కొన్నారు. -
ప్రతిపక్షాలవి అనవసర విమర్శలు
ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ సాక్షి, హైదరాబాద్: మత్స్య పరిశ్రమ అభివృద్ధికి వచ్చే బడ్జెట్లో నిధులు పెంచుతామని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ప్రకటించడం పట్ల మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి మంచి కార్యక్రమాలను కూడా విపక్షాలు విమర్శించడం శోచనీయమని, చిల్లరమల్లర రాజకీయాలు మానుకుని రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని హితవు పలికారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంగళవారం ఆయన మాట్లాడుతూ.. సమైక్య రాష్ట్రంలో చేపల పెంపకం కోస్తా ప్రాంతానికే పరిమితమైందని, గత పాలకులు తెలంగాణ మత్స్యకారుల పొట్టగొట్టారని విమర్శించారు. చేపల పెంపకానికి తెలంగాణలో అన్ని రకాల వనరులున్నప్పటికీ అన్ని రంగాల వల్లే మత్స్య పరిశ్రమ రంగం సమైక్య పాలకుల నిర్లక్ష్యానికి గురైందని చెప్పారు. స్వాతంత్య్రం వచ్చిననాటి నుంచి ఇప్పటి వరకు చేపలపై చర్చ జరగలేదని, కుల వృత్తులపై చర్చ జరగడం ఇదే తొలిసారని, ప్రతిపక్షాలు మాత్రం ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. చేపల పెంపకానికి నూరు శాతం సబ్సిడీ ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. -
చేప పిల్లల కొనుగోళ్లలో గోల్మాల్: పొంగులేటి
- చేప పిల్లల లెక్కింపు, పర్యవేక్షణకు ఉన్న - మెకానిజమేంటో చెప్పాలని డిమాండ్ సాక్షి, హైదరాబాద్: మత్స్య పరిశ్రమ అభివృద్ధి పేరిట ప్రభుత్వం చేపట్టిన చేప పిల్లల కొనుగోళ్ల ప్రక్రియలో పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. ‘రాష్ట్రంలో మత్స్య పరిశ్రమ’ అంశంపై శుక్రవారం శాసన మండలిలో జరిగిన స్వల్పకాలిక చర్చ అధికార పక్షాన్ని ఇరుకున పడేసింది. మత్స్యకారుల సొసైటీలకు సుమారు 30 కోట్ల చేప పిల్లలను సరఫరా చేసేందుకు ప్రభుత్వం టెండర్లు పిలిచిందని, ఇండెంట్ మేరకు కాంట్రాక్టర్లు చేప పిల్లలను కొనుగోలు చేశారా, కొనుగోలు చేసిన వాటిని మత్స్యకార సొసైటీలకు అప్పగించారా అని ప్రశ్నించారు. కాంట్రాక్టర్లు సరఫరా చేసిన చేప పిల్లల లెక్కింపు, మత్స్యకారులకు పంపిణీపై ప్రభుత్వం వద్ద ఉన్న కౌంటింగ్ అండ్ మానిటరింగ్ మెకానిజమ్ ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. లెక్కల్లో ఎక్కువ చూపి తక్కువ సంఖ్యలో సరఫరా చేసే దళారులు చాలామంది ఉన్నారని, దళారులను అరికట్టేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చెప్పాలన్నారు. గంగపుత్రులకు, ముదిరాజ్‌లకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సొసైటీలలో అర్హులైన వారే సభ్యులుగా ఉన్నారో లేదో తనిఖీ చేయాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందని చెప్పారు. క్యాష్‌లెస్ లావాదేవీల నుంచి మత్స్యకారులకు మినహాయింపు ఇవ్వాలని, నగదు రహితంపై అవగాహన కల్పించాలని సూచించారు. చేప పిల్లలను కొనుగోలు చేసే క్రమంలో.. రాష్ట్ర ప్రజలు ఎక్కువగా ఇష్టపడే రకాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. వ్యవసాయం, నీటిపారుదల, మత్స్య శాఖలను అనుసంధానించి చేపల పెంపకంపై పర్యవేక్షణకు ప్రత్యేక టాస్క్‌పోర్స్‌ను ఏర్పాటు చేయాని సూచించారు. మత్స్య కారులకు సరైన భద్రత, బీమా సదుపాయాలను ప్రభుత్వం కల్పించాలని కోరారు. మధ్యాహ్న భోజనంలో చేపల కూర! రాష్ట్రంలో మత్స్య పరిశ్రమను అభివృద్ధి చేసే క్రమంలో చేపల వినియోగంపైనా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వానికి పొంగులేటి సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా వారానికి ఒకరోజు చేపల కూర పెట్టే అంశాన్ని పరిశీలించాలని కోరారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు ఎక్కువగా ఇష్టపడే కొర్రమీను, బురదమట్ట, చందమామ రకాల చేప పిల్లల పెంపకానికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. పూల రవీందర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మరిన్ని చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలను నెలకొల్పాలని ప్రభుత్వానికి సూచించారు. మత్స్యకారులకు బ్యాంకుల ద్వారా రుణాలను అందించి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. మజ్లిస్ ఎమ్మెల్సీ హైదర్ రజ్వీ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లోని పురాతన చేపల మార్కెట్లను అభివృద్ధి చేయాలని కోరారు. ముషీరాబాద్, బేగంబజార్ మార్కెట్లలో అపరిశుభ్ర వాతావరణం కనిపిస్తోందని తెలిపారు. బీజేపీ ఎమ్మెల్సీ రాంచంద్రరావు మాట్లాడుతూ.. ప్రభుత్వం కోడిగుడ్ల వినియోగంపై ప్రచారం చేస్తున్నట్లుగానే చేపల గురించి కూడా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి జవాబు చెప్పాల్సి ఉండగా.. సమాధానాన్ని, సభను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ స్వామిగౌడ్ ప్రకటించారు. అనంతరం క్యాష్‌లెస్ లావాదేవీలపై మండలి సభ్యులకు ఎస్బీహెచ్ అధికారులు అవగాహన కల్పించారు.