వంద కేజ్ కల్చర్ సెంటర్లు
- చేపల పెంపకానికి ఎన్‌ఎఫ్‌డీబీ అధునాతన పరిజ్ఞానమిది
-కేంద్రం ద్వారా ప్రత్యేక నిధులు మంజూరు చేస్తాం: దత్తాత్రేయ
సాక్షి, హైదరాబాద్: మత్స్య పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అమల్లోకి తెస్తోందని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ఈమేరకు జాతీయ మత్స్య అభివృద్ధి సంస్థ (ఎన్‌ఎఫ్‌డీబీ) సరికొత్తగా కేజ్ కల్చర్‌ను పరిచయం చేస్తోందన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో వంద కేజ్ కల్చర్ సెంటర్లను తెరిచేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నామని, త్వరలో వీటిని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. సోమవారం దిల్‌కుషా అతిథిగృహంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
ఎన్‌ఎఫ్‌డీబీ రూపొందించిన కొత్త టెక్నాలజీతో దిగుబడి బాగుంటుందని వివరించారు. ‘రాష్ట్రంలో చేపల పెంపకం ఆశించినంతగా లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది రూ.70కోట్లతో చేప పిల్లలను చెరువుల్లో వేసింది. కానీ పెద్ద చేపలు చిన్న చేపల్ని మింగేశాయి’ అని అన్నారు.. చేపల మార్కెట్ల ఏర్పాటుకు కేంద్రం రాష్ట్రానికి రూ.9.65 కోట్లు కేటాయించి, రూ.4.45 కోట్లు విడుదల చేసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులను సద్వినియోగం చేసుకోవడం లేదని దత్తాత్రేయ చెప్పారు.
రాష్ట్రానికి కొత్త యూనివర్సిటీ...
రాష్ట్రంలో కొత్తగా ‘ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఫర్ ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్’ ఏర్పాటు చేయనున్నట్లు దత్తాత్రేయ తెలిపారు. ఈ వర్సిటీ ఏర్పాటుకు రెండొందల ఎకరాల భూమి కావాలని, రాష్ట్ర ప్రభుత్వం భూకేటాయింపులు జరిపిన వెంటనే ప్రారంభిస్తామన్నారు. ఇఫ్లూ ఆధ్వర్యంలో స్పోకెన్ ఇంగ్లిష్, స్పోకెన్ హిందీ కోర్సులను త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఈ కోర్సులు పూర్తి ఉచితంగా అందిస్తామన్నారు. త్వరలో ఇఫ్లూ యంత్రాంగం ఐదు గ్రామాలను దత్తత తీసుకోనుందన్నారు. ఐటీఐ మల్లెపల్లిలో కొత్తగా పది ట్రేడ్‌లను అందుబాటులోకి తీసుకొస్తున్నామని, ఇప్పటికే మారుతి–సుజుకీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు.