ప్రతిపక్షాలవి అనవసర విమర్శలు
ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్
సాక్షి, హైదరాబాద్: మత్స్య పరిశ్రమ అభివృద్ధికి వచ్చే బడ్జెట్‌లో నిధులు పెంచుతామని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ప్రకటించడం పట్ల మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి మంచి కార్యక్రమాలను కూడా విపక్షాలు విమర్శించడం శోచనీయమని, చిల్లరమల్లర రాజకీయాలు మానుకుని రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని హితవు పలికారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంగళవారం ఆయన మాట్లాడుతూ.. సమైక్య రాష్ట్రంలో చేపల పెంపకం కోస్తా ప్రాంతానికే పరిమితమైందని, గత పాలకులు తెలంగాణ మత్స్యకారుల పొట్టగొట్టారని విమర్శించారు.
చేపల పెంపకానికి తెలంగాణలో అన్ని రకాల వనరులున్నప్పటికీ అన్ని రంగాల వల్లే మత్స్య పరిశ్రమ రంగం సమైక్య పాలకుల నిర్లక్ష్యానికి గురైందని చెప్పారు. స్వాతంత్య్రం వచ్చిననాటి నుంచి ఇప్పటి వరకు చేపలపై చర్చ జరగలేదని, కుల వృత్తులపై చర్చ జరగడం ఇదే తొలిసారని, ప్రతిపక్షాలు మాత్రం ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. చేపల పెంపకానికి నూరు శాతం సబ్సిడీ ఇచ్చింది టీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని పేర్కొన్నారు.