చేప పిల్లల కొనుగోళ్లలో గోల్‌మాల్‌: పొంగులేటి | Ponguleti comments on fish purchases | Sakshi
Sakshi News home page

చేప పిల్లల కొనుగోళ్లలో గోల్‌మాల్‌: పొంగులేటి

Published Sat, Dec 31 2016 1:19 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

చేప పిల్లల కొనుగోళ్లలో గోల్‌మాల్‌: పొంగులేటి - Sakshi

చేప పిల్లల కొనుగోళ్లలో గోల్‌మాల్‌: పొంగులేటి

- చేప పిల్లల లెక్కింపు, పర్యవేక్షణకు ఉన్న
- మెకానిజమేంటో చెప్పాలని డిమాండ్‌

సాక్షి, హైదరాబాద్‌: మత్స్య పరిశ్రమ అభివృద్ధి పేరిట ప్రభుత్వం చేపట్టిన చేప పిల్లల కొనుగోళ్ల ప్రక్రియలో పెద్ద ఎత్తున గోల్‌మాల్‌ జరిగిందని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. ‘రాష్ట్రంలో మత్స్య పరిశ్రమ’ అంశంపై శుక్రవారం శాసన మండలిలో జరిగిన స్వల్పకాలిక చర్చ అధికార పక్షాన్ని ఇరుకున పడేసింది. మత్స్యకారుల సొసైటీలకు సుమారు 30 కోట్ల చేప పిల్లలను సరఫరా చేసేందుకు ప్రభుత్వం టెండర్లు పిలిచిందని, ఇండెంట్‌ మేరకు కాంట్రాక్టర్లు చేప పిల్లలను కొనుగోలు చేశారా, కొనుగోలు చేసిన వాటిని మత్స్యకార సొసైటీలకు అప్పగించారా అని ప్రశ్నించారు. కాంట్రాక్టర్లు సరఫరా చేసిన చేప పిల్లల లెక్కింపు, మత్స్యకారులకు పంపిణీపై ప్రభుత్వం వద్ద ఉన్న కౌంటింగ్‌ అండ్‌ మానిటరింగ్‌ మెకానిజమ్‌ ఏంటో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

లెక్కల్లో ఎక్కువ చూపి తక్కువ సంఖ్యలో సరఫరా చేసే దళారులు చాలామంది ఉన్నారని, దళారులను అరికట్టేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చెప్పాలన్నారు. గంగపుత్రులకు, ముదిరాజ్‌లకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సొసైటీలలో అర్హులైన వారే సభ్యులుగా ఉన్నారో లేదో తనిఖీ చేయాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందని చెప్పారు. క్యాష్‌లెస్‌ లావాదేవీల నుంచి మత్స్యకారులకు మినహాయింపు ఇవ్వాలని, నగదు రహితంపై అవగాహన కల్పించాలని సూచించారు. చేప పిల్లలను కొనుగోలు చేసే క్రమంలో.. రాష్ట్ర ప్రజలు ఎక్కువగా ఇష్టపడే రకాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. వ్యవసాయం, నీటిపారుదల, మత్స్య శాఖలను అనుసంధానించి చేపల పెంపకంపై పర్యవేక్షణకు ప్రత్యేక టాస్క్‌పోర్స్‌ను ఏర్పాటు చేయాని సూచించారు. మత్స్య కారులకు సరైన భద్రత, బీమా సదుపాయాలను ప్రభుత్వం కల్పించాలని కోరారు.

మధ్యాహ్న భోజనంలో చేపల కూర!
రాష్ట్రంలో మత్స్య పరిశ్రమను అభివృద్ధి చేసే క్రమంలో చేపల వినియోగంపైనా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వానికి పొంగులేటి సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా వారానికి ఒకరోజు చేపల కూర పెట్టే అంశాన్ని పరిశీలించాలని కోరారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు ఎక్కువగా ఇష్టపడే కొర్రమీను, బురదమట్ట, చందమామ రకాల చేప పిల్లల పెంపకానికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. పూల రవీందర్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మరిన్ని చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలను నెలకొల్పాలని ప్రభుత్వానికి సూచించారు. మత్స్యకారులకు బ్యాంకుల ద్వారా రుణాలను అందించి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.

మజ్లిస్‌ ఎమ్మెల్సీ హైదర్‌ రజ్వీ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లోని పురాతన చేపల మార్కెట్లను అభివృద్ధి చేయాలని కోరారు. ముషీరాబాద్, బేగంబజార్‌ మార్కెట్లలో అపరిశుభ్ర వాతావరణం కనిపిస్తోందని తెలిపారు. బీజేపీ ఎమ్మెల్సీ రాంచంద్రరావు మాట్లాడుతూ.. ప్రభుత్వం కోడిగుడ్ల వినియోగంపై ప్రచారం చేస్తున్నట్లుగానే చేపల గురించి కూడా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి జవాబు చెప్పాల్సి ఉండగా.. సమాధానాన్ని, సభను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు చైర్మన్‌ స్వామిగౌడ్‌ ప్రకటించారు. అనంతరం క్యాష్‌లెస్‌ లావాదేవీలపై మండలి సభ్యులకు ఎస్‌బీహెచ్‌ అధికారులు అవగాహన కల్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement