టీఆర్ఎస్ బ్లాక్‌మెయిల్ రాజకీయాలు
మహబూబ్‌నగర్ : రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు పాల్పడుతూ ఇతర పార్టీల నాయకులను తమ పార్టీలో చేర్చుకుంటున్నారని ఎమ్మెల్సీ రాంచందర్‌రావు ఆరోపించారు. సోమవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు.
ప్రశ్నించేవారిని బెదిరించి పార్టీలో చేర్చుకుంటున్నారని, వినకపోతే అధికారాన్ని వినియోగించుకుని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌కు బీజేపీ భయం పుట్టుకుందని, ఎవరెన్ని కుట్రలు చేసినా రాబోయే రోజులు బీజేపీవేనన్నారు. 2019ఎన్నికలే లక్ష్యంగా తెలంగాణలో అధికారాన్ని సాధించేందుకు పార్టీ క్యాడర్ పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్, జిల్లా అధ్యక్షురాలు పద్మజారెడ్డి, ప్రధానకార్యదర్శి పి.శ్రీనివాస్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు వీరబ్రహ్మచారి, నాయకులు పడాకుల బాల్‌రాజ్, కిష్ట్యానాయక్ పాల్గొన్నారు.