MLC Ramchandra Rao
-
కాంగ్రెస్, టీఆర్ఎస్ దొందూ దొందే
సాక్షి, నాగర్‌కర్నూల్ : యురేనియం నిక్షేపాల సర్వేపై గతంలోనే యూపీఏ అనుమతులు ఇచ్చినా ప్రస్తుత బీజేపీ ప్రభుత్వంపై బురదజల్లేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు ఆరోపించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సీఎన్‌రెడ్డి సేవాసదన్‌లో విలేకరులతో ఆయన మాట్లాడారు. 2016లోనే టీఆర్ఎస్ ప్రభుత్వం వన్యప్రాణుల సంరక్షణ కమిటీ నల్లమల అటవీప్రాంతంలో యురేనియం నిక్షేపాల కోసం బోర్లు వేయడానికి అనుమతులు మంజూరు చేసిందన్నారు. ఈ రెండు పార్టీలు దొందూ దొందేనని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు దేశంలో ఎక్కడయినా నిక్షేపాలు ఉంటే వాటిపై సర్వే చేస్తాయన్నారు. వన్యప్రాణులు, అటవీసంపద పరిరక్షణకు రాష్ట్రం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి బీజేపీ మద్దతు ఇస్తుందన్నారు. అనంతరం మాజీ ఐఏఎస్ అధికారి చంద్రవదన్ మాట్లాడుతూ 370 ఆర్టికల్ వల్ల సామాన్యులకు ఎలాంటి లాభం లేదని అందుకే దానిని కశ్మీర్లో రద్దు చేశారన్నారు. దీని ఫలితాలను ప్రజలకు వివరించడానికే సంపర్క్ అభియాన్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో బీజేపీ యువమోర్చా రాష్ట్ర కార్యదర్శి బాల్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు సుబ్బారెడ్డి, అసెంబ్లీ ఇన్చార్జ్ దిలీపాచారి, పార్లమెంట్ కన్వీనర్ సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సాహసోపేత నిర్ణయం.. ఉప్పునుంతల (అచ్చంపేట): 370 ఆర్టికల్ రద్దు ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న సాహసోపేత నిర్ణయమని ఎమ్మెల్సీ రామచంద్రరావు అన్నారు. మంగళవారం ఉప్పునుంతలలో విలేకరులతో ఆయన మాట్లాడారు. దీనివల్ల కొద్ది మంది చేతుల్లో ఉన్న ఆర్థిక వ్యవస్థను ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారన్నారు. కశ్మీర్లో అభివృద్ధి జరిగి యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. ము ఖ్యంగా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం పూర్తిగా కనుమరుగవుతుందన్నారు. నల్లమలలో యురేని యం తవ్వకాల కోసం అప్పటి యూపీఏ ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన విషయాన్ని మర్చి పోయి ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు కట్టా సుధాకర్‌రెడ్డి. మేడిపూరి మల్లేశ్వర్, మం గ్యానాయక్, కుందేళ్ల సైదులుయాదవ్, ఎల్లయ్యయాదవ్, మహేష్‌యాదవ్ పాల్గొన్నారు. -
డేటింగ్ పేరుతో ‘డ్యాష్’
సాక్షి,సిటీబ్యూరో: సైబర్ నేరగాళ్లు నగర యువకుడికి డేటింగ్ పేరుతో ‘డ్యాష్’ ఇచ్చారు... ఓ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవడంతో యువతితో ఫోన్ చేయించి ఎర వేశారు... వివిధ దఫాల్లో మొత్తం రూ.4.08 లక్షలు కాజేశారు. చివరకు మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు సోమవారం ఫిర్యాదు చేయడంతో సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బోయిన్‌పల్లికి చెందిన అభిషేక్ ఉద్యోగం కోసం ఆన్లైన్లో అనేక వెబ్సైట్లను పరిశీలిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే అతడి కన్ను డ్యాషీడేటింగ్.ఇన్ వెబ్‌సైట్‌పై పడింది. ఆ సైట్లోకి ప్రవే«శించిన అతను తన పేరు రిజిస్టర్ చేసుకున్నాడు. ఆ తర్వాత అతడి సెల్‌కు ఓ మహిళ కాల్ చేసి తన పేరు పూనంగా పరిచయం చేసుకుంది. వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకున్నందున రూ.1000 తమ ఖాతాలో డిపాజిట్ చేస్తే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుందని, ఆపై డేటింగ్‌కు అవకాశాలు వస్తాయని చెప్పింది. దీంతో అభిషేక్ ఆమె చెప్పిన ఖాతాలో డబ్బు డిపాజిట్ చేశాడు. ఆపై మరోసారి కాల్ చేసిన పూనం రూ. 20,800 డిపాజిట్ చేయాలని కోరడంతో అలానే చేశాడు. ఇలా పలుమార్లు ఆమె నుంచి ఫోన్లు కావడంతో అభిషేక్ డబ్బు డిపాజిట్ చేసుకుంటూ పోయాడు. ఇలా వివిధ దఫాలుగా మొత్తం రూ.4,08,798 వివిధ బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేశాడు. ఇంత మొత్తం చెల్లించినా డేటింగ్ కోసం వెబ్సైట్ నిర్వాహకుల నుంచి ఎలాంటి సమాచారం అందకపోవడంతో అనుమానించిన అభిషేక్ వారిని సంప్రదించడానికి ప్రయత్నించాడు. పూనం కాల్ చేసిన సెల్ఫోన్లు అన్నీ స్విచ్ఛాఫ్‌లో ఉండటంతో మోసపోయినట్లు గుర్తించాడు. నగర సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు అభిషేక్ డబ్బు డిపాజిట్ చేసిన బ్యాంకు ఖాతాల వివరాల సహా వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ‘ఎమ్మెల్సీ’ కేసు దర్యాప్తు ముమ్మరం... క్రెడిట్ కార్డు అప్డేట్ చేయాలంటూ బీజేపీ ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్‌రావు నుంచి రూ.58 వేలు కాజేసిన కేసులో సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఎమ్మెల్సీ రాంచందర్‌రావుకు గత నెల 31న ఓ వ్యక్తి ఫోన్ చేసి తన పేరు రవిగా పరిచయం చేసుకుని తాను ఆర్బీఎల్ బ్యాంకు ఎగ్జిక్యూటివ్‌నని, మీ క్రెడిట్ కార్డు గడువు కొద్దిరోజుల్లో ముగుస్తుందని అప్డేట్ చేసుకోవాలంటూ సూచించాడు. అతని మాటలు నమ్మిన ఎమ్మెల్సీ తన క్రెడిట్ కార్డులకు సంబంధించిన కార్డు నెంబర్లు, వాటి గడువు తేది, సీవీవీ నెంబర్లు చెప్పేశారు. మరుసటి రోజు వివిధ బ్యాంకు ఖాతాల నుంచి రూ.58 వేలు డ్రా అయినట్లు సమాచారం అందడంతో తాను మోసపోయినని గుర్తించిన ఆయన ఫిర్యాదు చేయడంతో సీసీఎస్ ఆధీనంలోని సైబర్ క్రైమ్ ఠాణాలో కేసు నమోదైంది. నిందితుడు వినియోగించిన సెల్‌ఫోన్ నెంబర్‌తో పాటు ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
టీఆర్ఎస్ బ్లాక్మెయిల్ రాజకీయాలు
మహబూబ్‌నగర్ : రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతూ ఇతర పార్టీల నాయకులను తమ పార్టీలో చేర్చుకుంటున్నారని ఎమ్మెల్సీ రాంచందర్‌రావు ఆరోపించారు. సోమవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. ప్రశ్నించేవారిని బెదిరించి పార్టీలో చేర్చుకుంటున్నారని, వినకపోతే అధికారాన్ని వినియోగించుకుని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్కు బీజేపీ భయం పుట్టుకుందని, ఎవరెన్ని కుట్రలు చేసినా రాబోయే రోజులు బీజేపీవేనన్నారు. 2019ఎన్నికలే లక్ష్యంగా తెలంగాణలో అధికారాన్ని సాధించేందుకు పార్టీ క్యాడర్ పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్, జిల్లా అధ్యక్షురాలు పద్మజారెడ్డి, ప్రధానకార్యదర్శి పి.శ్రీనివాస్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు వీరబ్రహ్మచారి, నాయకులు పడాకుల బాల్‌రాజ్, కిష్ట్యానాయక్ పాల్గొన్నారు. -
చేప పిల్లల కొనుగోళ్లలో గోల్మాల్: పొంగులేటి
- చేప పిల్లల లెక్కింపు, పర్యవేక్షణకు ఉన్న - మెకానిజమేంటో చెప్పాలని డిమాండ్ సాక్షి, హైదరాబాద్: మత్స్య పరిశ్రమ అభివృద్ధి పేరిట ప్రభుత్వం చేపట్టిన చేప పిల్లల కొనుగోళ్ల ప్రక్రియలో పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. ‘రాష్ట్రంలో మత్స్య పరిశ్రమ’ అంశంపై శుక్రవారం శాసన మండలిలో జరిగిన స్వల్పకాలిక చర్చ అధికార పక్షాన్ని ఇరుకున పడేసింది. మత్స్యకారుల సొసైటీలకు సుమారు 30 కోట్ల చేప పిల్లలను సరఫరా చేసేందుకు ప్రభుత్వం టెండర్లు పిలిచిందని, ఇండెంట్ మేరకు కాంట్రాక్టర్లు చేప పిల్లలను కొనుగోలు చేశారా, కొనుగోలు చేసిన వాటిని మత్స్యకార సొసైటీలకు అప్పగించారా అని ప్రశ్నించారు. కాంట్రాక్టర్లు సరఫరా చేసిన చేప పిల్లల లెక్కింపు, మత్స్యకారులకు పంపిణీపై ప్రభుత్వం వద్ద ఉన్న కౌంటింగ్ అండ్ మానిటరింగ్ మెకానిజమ్ ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. లెక్కల్లో ఎక్కువ చూపి తక్కువ సంఖ్యలో సరఫరా చేసే దళారులు చాలామంది ఉన్నారని, దళారులను అరికట్టేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చెప్పాలన్నారు. గంగపుత్రులకు, ముదిరాజ్‌లకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సొసైటీలలో అర్హులైన వారే సభ్యులుగా ఉన్నారో లేదో తనిఖీ చేయాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందని చెప్పారు. క్యాష్‌లెస్ లావాదేవీల నుంచి మత్స్యకారులకు మినహాయింపు ఇవ్వాలని, నగదు రహితంపై అవగాహన కల్పించాలని సూచించారు. చేప పిల్లలను కొనుగోలు చేసే క్రమంలో.. రాష్ట్ర ప్రజలు ఎక్కువగా ఇష్టపడే రకాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. వ్యవసాయం, నీటిపారుదల, మత్స్య శాఖలను అనుసంధానించి చేపల పెంపకంపై పర్యవేక్షణకు ప్రత్యేక టాస్క్‌పోర్స్‌ను ఏర్పాటు చేయాని సూచించారు. మత్స్య కారులకు సరైన భద్రత, బీమా సదుపాయాలను ప్రభుత్వం కల్పించాలని కోరారు. మధ్యాహ్న భోజనంలో చేపల కూర! రాష్ట్రంలో మత్స్య పరిశ్రమను అభివృద్ధి చేసే క్రమంలో చేపల వినియోగంపైనా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వానికి పొంగులేటి సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా వారానికి ఒకరోజు చేపల కూర పెట్టే అంశాన్ని పరిశీలించాలని కోరారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు ఎక్కువగా ఇష్టపడే కొర్రమీను, బురదమట్ట, చందమామ రకాల చేప పిల్లల పెంపకానికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. పూల రవీందర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మరిన్ని చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలను నెలకొల్పాలని ప్రభుత్వానికి సూచించారు. మత్స్యకారులకు బ్యాంకుల ద్వారా రుణాలను అందించి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. మజ్లిస్ ఎమ్మెల్సీ హైదర్ రజ్వీ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లోని పురాతన చేపల మార్కెట్లను అభివృద్ధి చేయాలని కోరారు. ముషీరాబాద్, బేగంబజార్ మార్కెట్లలో అపరిశుభ్ర వాతావరణం కనిపిస్తోందని తెలిపారు. బీజేపీ ఎమ్మెల్సీ రాంచంద్రరావు మాట్లాడుతూ.. ప్రభుత్వం కోడిగుడ్ల వినియోగంపై ప్రచారం చేస్తున్నట్లుగానే చేపల గురించి కూడా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి జవాబు చెప్పాల్సి ఉండగా.. సమాధానాన్ని, సభను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ స్వామిగౌడ్ ప్రకటించారు. అనంతరం క్యాష్‌లెస్ లావాదేవీలపై మండలి సభ్యులకు ఎస్బీహెచ్ అధికారులు అవగాహన కల్పించారు. -
'అటెండర్ ఉద్యోగం కూడా భర్తీచేయకపోవడం సిగ్గుచేటు'
మెదక్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే లక్ష ఉద్యోగాలిస్తామన్న కేసీఆర్ ఏడాది పాలనలో కనీసం అటెండర్ ఉద్యోగం కూడా భర్తీ చేయకపోవడం సిగ్గుచేటని ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు విమర్శించారు. టీఆర్ఎస్ సర్కార్ నిరుద్యోగుల పాలిట శాపంగా మారిందన్నారు. ఆదివారం మెదక్‌లో విలేకరులతో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో యువకులు, విద్యార్థులే కీలకపాత్ర పోషించారన్నారు. కేజీ టు పీజీ ఉచిత విద్య ఉత్తిమాటగా మారిందని విమర్శించారు. తెలంగాణలోని 11విశ్వవిద్యాలయాలకు వైస్‌చాన్సలర్లు లేకుండా పోయారన్నారు. హామీలను నెరవేర్చడంలో కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారన్నారు.