అభివృద్ధి ఓర్వలేకే.. బీజేపీ ఆందోళన
సాక్షి, కామారెడ్డి: హరిత తెలంగాణను సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంటే ఓర్వలేని బీజేపీ నేతలు రాజకీయ పబ్బం గడుపుకోవడానికి హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయంలో ధర్నాకు దిగారని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. గురువారం ఆయన కామారెడ్డిలో విలేకరులతో మాట్లాడారు. రైతుల ప్రయోజనాల కోసం కాకుండా రాజకీయ ప్రయోజనాలను ఆశించి బీజేపీ నేతలు ఈ ధర్నా చేశారన్నారు.
టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో రూ. 17 వేల కోట్ల పంట రుణాలను మాఫీ చేసిందన్నారు. గతంలో పంట నష్టపోయిన రైతులకు రూ. 480 కోట్లు పంట నష్టపరిహారం ఇచ్చి ఆదుకున్నామన్నారు. రైతులకు సరిపడా విత్తనాలు, ఎరువులు అందించామని, 9 గంటలపాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తూ రైతులకు అండగా నిలిచామని పేర్కొన్నారు.