సాక్షి, కామారెడ్డి: వచ్చే ఎన్నికలలో బాన్సువాడ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఎవరు పోటీ చేస్తారన్న ప్రచారానికి తెరపడింది. మళ్లీ తానే బరిలో నిలుస్తానని స్వయంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. సీఎం ఆదేశం, పార్టీ నాయకులు, కార్యకర్తల కోరిక మేరకు తానీ నిర్ణయం తీసుకున్నానన్నారు.
పోచారం శ్రీనివాస్‌రెడ్డి స్పీకర్ హోదాలో ఉండడంతో పార్టీ కార్యక్రమాలన్నీ ఆయన తనయుడు డీసీసీబీ చైర్మన్ అయిన పోచారం భాస్కర్‌రెడ్డి చూస్తున్నారు. నియోజకవర్గ నేతలు, అధికారులను సమన్వయం చేస్తూ అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో భాస్కర్‌రెడ్డి పోటీ చేస్తారన్న ప్రచారం ఊపందుకుంది. స్పీకర్ వయసు పైబడుతుండడంతో ఆయనకు బదులు కొడుకులు పోటీ దిగుతారని పార్టీ శ్రేణుల్లోనూ చర్చ జరిగింది. అయితే సీఎం కేసీఆర్ ఆదేశాలు, పార్టీ నేతల అభిప్రాయాల మేరకు తానే పోటీ చేస్తానని స్పీకర్ ప్రకటించడంతో ప్రచారానికి తెరపడినట్టయ్యింది.
జనం మధ్యలో..
సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఎమ్మెల్యేలంతా తమ నియోజకవర్గాల్లోనే ఎక్కువ సమయం గడుపుతు న్నారు. కొత్త పింఛన్ కార్డులు, సీఎం సహాయ నిధి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేస్తూ జనానికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కో ఊరిలో గంటల కొద్దీ సమయం కేటాయిస్తున్నారు. అభివృద్ధి పనుల ప్రారం¿ోత్సవాల్లో పాల్గొంటున్నారు. వీధులన్నీ తిరుగుతున్నారు. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు. పనిలోపనిగా ఎవరైనా అనారోగ్యానికి గురైనా, మరణించినా వారి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు.
ఎన్నికల ప్రచారాన్ని తలపించేలా....
ఇటీవలి కాలంలో ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు చేస్తున్న హడావుడిని చూస్తుంటే ఎన్నికలు వచ్చాయా అనిపిస్తోంది. ఓ రకంగా ఎన్నికల ప్రచారాన్ని తలపించేలా అందరినీ కలుస్తున్నారు. ప్రజలు తమ గల్లీకి రావాలని కోరగానే అటు పరుగులు తీస్తున్నారు. అక్కడికక్కడే కొన్ని సమస్యలు పరిష్కారం చేస్తున్నారు. ఎన్నికలు వచ్చాయా అన్న రీతిలో వారి పర్యటనలు సాగుతున్నాయి. జనంతో మమేకమవుతూ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు.
వచ్చే ఎన్నికల్లో నేనే పోటీ చేస్తా..
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బాన్సువాడ నియోజకవర్గం నుంచి మళ్లీ తానే ఎన్నికల బరి ఉంటానని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం బాన్సువాడ సరస్వతి ఆలయ కల్యాణ మండపంలో బీర్కూర్ మండలంలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఎల్లప్పుడు సమీక్ష అవసరమన్నారు. అప్పుడే లోటుపాట్లు బయటకి వస్తాయన్నారు.
ఎవరు తప్పు చేసినా అది ప్రజలలో వ్యతిరేకతకు దారి తీస్తుందన్నారు. మంచి పనులు చేస్తే ప్రజలు బ్రహ్మరథం పడతారని, తప్పులు చేస్తే తరిమికొడతారని పేర్కొన్నారు. ఎవరైనా అనవసర విమర్శలు చేస్తే సమర్థవంతంగా తిప్పికొట్టాలన్నారు. బాన్సువాడ నియోజకవర్గానికి రాష్ట్రంలో మంచి పేరుందని, దానిని నిలబెట్టుకుందామని పేర్కొన్నారు. సమావేశంలో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి పోచారం సురేందర్‌రెడ్డి, ఎంపీపీ రఘు, పార్టీ మండల అధ్యక్షుడు వీరేశం, ఏఎంసీ చైర్మన్ ద్రోణవల్లి అశోక్, మాజీ జెడ్పీటీసీ ద్రోణవల్లి సతీశ్, నాయకులు శశికాంత్, నారాయణ, గంగారాం, సాయిలు తదితరులు పాల్గొన్నారు.
సిట్టింగ్‌లకే టికెట్లన్న సీఎం..
టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల పనితీరు, సర్వేల ఆధారంగా టికెట్ల కేటాయింపు ఉంటుందని గతంలో ప్రచారం జరిగింది. అయితే ఇటీవల జరిగిన సమావేశంలో సిట్టింగులకే టికెట్లు ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. సిట్టింగ్‌లకే అవకాశం ఇస్తామని, ఎవరి నియోజకవర్గంలో వారు కష్టపడాలని ఆదేశించారు. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజక వర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలే పోటీ చేస్తారని భావిస్తున్నారు. బాన్సువాడనుంచి వచ్చే ఎన్నికల్లోనూ తానే పోటీ చేస్తానని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి బుధవారం ప్రకటించారు. కామారెడ్డి అసెంబ్లీ నియోజకవ ర్గం నుంచి ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎల్లారెడ్డిలో జాజాల సురేందర్, జుక్కల్‌లో హన్మంత్‌సింధేలకే అవకాశాలు దక్కనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment