భారీ పరిశ్రమగా గొర్రెల పెంపకం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గొర్రెల పెంపకాన్ని భారీ పరిశ్రమగా అభివృద్ధి చేసే సంకల్పంతో ప్రభుత్వం ఉందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. ఆదివారం ప్రగతి భవన్‌లో గొర్రెల పెంపకం, మత్స్య పరిశ్రమ అభివృద్ధిపై ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు. తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధిలో గొర్రెల పెంపకం, మత్స్య పరిశ్రమ కీలకం కానున్నా యని అన్నారు. ఇతర దేశాలకు గొర్రె మాంసాన్ని ఎగుమతి చేసే స్థాయికి గొర్రెల పెంపకం పరిశ్రమ ఎదగాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.
ఈ రెండు రంగాలను విస్తృతంగా అభివృద్ధి చేయడానికి అవసరమైన ప్రణాళిక రూపొం దించేలా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఇందులో మంత్రులు ఈటల రాజేందర్, జోగు రామన్న, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, జూపల్లి కృష్ణారావు, జగదీశ్‌రెడ్డిలను సభ్యులుగా నియమించారు. నీటిపారుదల రంగం ద్వారా ప్రజలకు భారీ మేలు జరగనుందని, వివిధ వృత్తులపై ఆధారపడిన ప్రజలకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించే ప్రణాళికను ప్రభుత్వం రూపొం దిస్తోందని సీఎం చెప్పారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలన్నదే ప్రభుత్వ అభిమతమన్నారు.
గొర్రెల పెంపకానికి శాఖాపరంగా అవసరమైన సహాయ సహకారాలు అందించాలని అధికారులను ఆదేశించారు. గొర్రెల సంపద అభివృద్ధి ద్వారా యాదవులంతా ఆర్థికంగా ఎదగాలన్నారు. సమావేశంలో స్పీకర్ మధుసూదనచారి, మంత్రులు నాయిని, ఈటల, తలసాని, పోచారం, తుమ్మల, ఎంపీ వినోద్, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చైర్మన్ పెద్దిరెడ్డి సుదర్శన్‌రెడ్డి, గొర్రెల పెంపకందారుల ఫెడరేషన్ చైర్మన్ రాజయ్య యాదవ్, పశు సంవర్ధకశాఖ చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేశ్ చందా, డైరెక్టర్ వెంకటేశ్వరరావు, సీఎంవో అధికారి భూపాల్ రెడ్డి, మెదక్ జెడ్పీ చైర్మన్ మురళీధర్ యాదవ్ పాల్గొన్నారు.