ఒంగోలు టూటౌన్ : జిల్లాలో మల్బరీ తోటలు సాగే చేసే రైతులకు మంచి రోజులొచ్చాయి. మల్బరీ తోటల సాగును ఉపాధి హామీ పథకానికి అనుసంధానించారు. దీంతో సన్న, చిన్నకారు, బలహీన వర్గాల రైతులకు మేలు జరగనుంది. మల్బరీ సాగుపై ఆసక్తి ఉన్నా ఆర్థిక స్థోమత లేక వెనుకంజ వేసిన చిన్న, సన్నకారు రైతులు ఇప్పుడు ముందుకొస్తున్నారు. పథకం కింద పొలం దున్నడం దగ్గర నుంచి పంట చేతికొచ్చే వరకు యజమానికే ఉపాధి హామీ పథకం కింద కూలి డబ్బులు చెల్లించనున్నారు.
ఎకరం పొలం ఉన్న రైతుకు మూడేళ్లలో రూ.1.63 లక్షలు, రెండు ఎకరాలు ఉన్న రైతుకు రూ.3.26 లక్షలు మంజూరు చేస్తారు. మొదటి ఏడాది రూ.63 వేలు, రెండో ఏడాది రూ.50 వేలు, మూడో సంవత్సరం మరో రూ.50 వేలు మంజూరవుతాయి. ఈ ఏడాది నుంచే ఈ పథకం ప్రారంభించారు. ఒంగోలు, మార్కాపురం డివిజన్లలోని కనిగిరి, పొన్నలూరు, చీమకుర్తి, కొనకనమిట్ల, అద్దంకి, ముండ్లమూరు ప్రాంతాల్లో మల్బరీ తోటలు ఎక్కువగా సాగు చేస్తారు.
సొంత పొలం, నీటి వసతి కలిగి, జాబ్ కార్డు ఉన్న రైతులను క్షేత్ర స్థాయిలో ఇప్పటికే 120 మందిని గుర్తించారు. ప్రస్తుతం జిల్లాలో 800 మంది రైతుల వరకు మల్బరీ తోటలు సాగు చేస్తున్నారు. వీరిలో పెద్ద రైతులే అధికంగా ఉన్నారు. సన్న, చిన్నకారు రైతులు చాలా తక్కువ మంది ఉన్నారు. ఆసక్తి కలిగి, అర్హులైన రైతులకు చేయూతనివ్వాలనే లక్ష్యంతో ఉపాధి హామీ పథకానికి అనుసంధానం చేశారు. కేవలం ఒకటి లేక రెండు ఎకరాలు ఉన్న రైతులకు వర్తించే విధంగా పథకాన్ని రూపకల్పన చేశారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఇప్పటికే 8 జిల్లాల్లో ఈ పథకం అమలుకు శ్రీకారం చుట్టారు. అందులో ప్రకాశం జిల్లా కూడా ఉంది.
ప్రయోజనాలు ఇవీ..
అర్హులకే పథకం వర్తింపు
ఒకసారి ఈ పథకం కింద ఎంపికైతే మూడేళ్లు లబ్ధిదారుడికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. రైతు తన పొలంలో తాను చేసుకునే పనికి కూలి దక్కుతుంది. పొలం దున్నకం, మొక్కల ఖరీదు, నాటుకోవడం వంటి వాటికి ఏ రోజుకారోజుకు సంబంధించి పట్టు పరిశ్రమ శాఖ అధికారులు గుర్తించి డ్వామా సిబ్బందికి తెలియజేస్తారు.
ఎరువులు, పురుగు మందుల ఖరీదు, సస్యరక్షణ చర్యలకు ఎప్పటికప్పుడు నగదు అందజేస్తారు. నగదు రైతు బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. రైతుకు సొంత డబ్బులు పైసా ఖర్చు కావు. నెలనెలా ఆదాయం వచ్చే పంట కావడం వల్ల గ్రామీణ నిరుద్యోగులకు ఇది మంచి అవకాశం. అర్హులైన రైతులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని పట్టుపరిశ్రమ శాఖ ఏడీ సీహెచ్ చిత్తరంజన్ శర్మ తెలిపారు.
‘మల్బరీ’కి మంచి రోజులు
Published Thu, Nov 13 2014 3:36 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement