‘ఉపాధి’ జోరు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ కూలీలకు పని కల్పించే ప్రక్రియ ఊపందుకుంది. గత కొద్ది నెలలుగా జిల్లాలో వ్యవసాయపనులు ముమ్మరంగా కొనసాగుతుండటం, వరి, పత్తి, మిరప, పెసర, శనగ వంటి పంటలు వేయడంతో కూలీలకు చేతినిండా పని దొరికింది. దీంతో ఉపాధి హామీ పనులు తగ్గిపోయాయి. అయితే ఇప్పటికే కొన్ని పంటలు చేతికి రావడం, మరికొన్ని పంటలు ఫిబ్రవరి మొదటి వారం వరకు పూర్తి కానుండడంతో కూలీలకు పని కల్పించేందుకు డ్వామా అధికారులు పకడ్బందీ ప్రణాళికలు రూపొందించారు. ఉపాధి కోసం జిల్లా నుంచి ఏ ఒక్కరూ వలస వెళ్లకుండా ప్రతి గ్రామంలో పని కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని భద్రాచలం మినహా 39 మండలాల్లోని 669 గ్రామాల్లో వచ్చేనెల మొదటివారం నాటికి ప్రతి గ్రామంలో కనీసం ఒక పని ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు.
ఒక్కో పనికి పది మందికి తగ్గకుండా కూలీలకు ఉపాధి కల్పించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. వ్యవసాయ పనులు పూర్తయిన గ్రామాలు, మండలాల కూలీలు తమకు పని కల్పించాలని కోరడంతో గత నాలుగు రోజులుగా పనులు చేపడుతున్నారు. తొలి రోజు 1600 మందికి ఉపాధి చూపించిన అధికారులు.. శుక్రవారం వరకు రోజుకు 3వేల మంది చొప్పున ఉపాధి కల్పించారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు గ్రామాల్లో కూలీలకు పని ఉండదు. దీన్ని పరిగణనలోకి తీసుకుని దాదాపు రూ.100 కోట్లతో 4.50 లక్షల మందికి ఉపాధి కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందుకు గాను 12,878 పనులను గ్రామాల వారీగా కేటాయించారు.
ఏ ఒక్క కూలీకి ఉపాధి లభించలేదన్న భావన కలగకుండా గ్రామాల్లో ఉన్న శ్రమశక్తి సంఘాలు అడిగిన మరుక్షణం ఆ గ్రామంలో పని కల్పించేలా చర్యలు తీసుకోవాలని క్షేత్రస్థాయి సిబ్బందికి డ్వామా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లాలోని నర్సరీలలో పనులు నిర్వహిస్తుండగా, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి సంబంధించిన పనులు కూడా వేగవంతంగా కొనసాగుతున్నాయి. మార్చితో ముగియనున్న ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.100 కోట్ల విలువైన పనులను గ్రామాల వారీగా పూర్తి చేయడం ద్వారా కూలీలకు ఉపాధి కల్పించనున్నారు. ఈజీఎస్ ద్వారా లింక్ రోడ్లు, కొత్త రోడ్ల నిర్మాణం, కచ్చారోడ్లపై గ్రావెల్ వేయడం వంటి పనులతోపాటు గ్రామాల్లో గుర్తించిన పనులు చేపట్టనున్నారు. కేటాయించిన పనికి సంబంధించిన బడ్జెట్‌లో 60 శాతం సొమ్ము పనిచేసిన వారికి ఇవ్వాలని, 40 శాతం మెటీరియల్ కాంపౌండింగ్‌కు కంపోనెంట్‌గా వినియోగించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లాలో 26 వేల వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించారు. వీటికి సంబంధించిన బిల్లులను సైతం పూర్తిస్థాయిలో చెల్లించారు.
ఇంకా 13వేల మరుగుదొడ్లు అసంపూర్తిగా మిగిలాయి. వీటిని ఈనెల 31 నాటికి పూర్తి చేయించేలా చర్యలు తీసుకోవాలని క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశించారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ పథకాన్ని ఈజీఎస్ నుంచి మినహాయించి స్వచ్ఛభారత్‌లో కలపడంతో.. నిర్మాణ పనులు వేగవంతం చేయకపోతే ఇందుకు సంబంధించిన నిధులు వెనక్కుపోయే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. దీంతో గ్రామాల్లో ఈ పనులు కొంతమేర ఊపందుకుంటున్నాయి. జిల్లాలో ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించేలా గ్రామాల వారీగా కొత్త పనులను గుర్తించే ప్రక్రియకు సైతం డ్వామా అధికారులు శ్రీకారం చుట్టారు. ఇప్పుడు గుర్తించే పనులను వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించేలా ప్రణాళికలు తయారు చేస్తున్నారు.