వంద రోజులు.. కొందరికే !
- పనులు చూపించలేకపోతున్న అధికారులు
- ఉపాధి హామీ కూలీల ఇక్కట్లు
- పనిచేసిన వారికీ దక్కని గిట్టుబాటు కూలి
చెన్నూర్ : జిల్లా వ్యాప్తంగా ఉపాధి హామీ కూలీలకు వంద రోజుల పని లభించడంలేదు. పనులు లేక చేసిన పనులకు కూలి గిట్టుబాటు కాక పలువురు వలస బాట పట్టాల్సిన దుస్థితి నెలకొంది. వేసవి కాలంలో కోటపల్లి, వేమనపల్లి మండలాలకు చెందిన గ్రామీణ కూలీలు పట్టణ ప్రాంతాలకు ఇటుక తయారీ పనుల కోసం వలస వెళ్లారు. ఇలాగే జిల్లాలోని చాలా ప్రాంతాల నుంచి కూలీలు వలస వెళ్లినట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లోనైనా అధికారులు మేల్కొని కూలీ లకు సరైన రీతిలో పని కల్పించని పక్షంలో ఈ వల సలు పెరిగే అవకాశం లేకపోలేదు.
చట్టం ఏం చెబుతోంది..
కూలీలు పనుల కోసం వలస బాట పట్టకుండా ఉం డేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2005లో ఉపాధి హామీ చట్టాన్ని తీసుకవచ్చాయి. ఈ చట్టం ప్రకారం ప్రతి కూలీకి 100 రోజులు పని కల్పించాల్సి ఉంది. జిల్లాలో 5,33,346 లక్షల మంది జాబ్ కార్డులు పొం దగా, ఇందులో 3,92,744 మంది కూలీలు పని చేస్తున్నారు. 2014 నుంచి 2015 జూలై వరకు 14,801 మంది కూలీలు మాత్రమే 100 రోజులు పని కల్పిం చగా, మిగతా 3,77,743 మందికి అరకొరగానే పను లు దక్కాయి. అంతే కాకుండా గతంలో రూ.150 ఉన్న కూలిని రూ.180కి పెంచారు. కానీ పొద్దంతా పని చేసిన కూలీలకు రూ. 80 నుంచి రూ. 100 వరకే అందుతోంది. ఒక్కో రోజు రూ. 60 వచ్చిన సందర్భాలు ఉన్నాయని కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి స్థాయిలో పనులు కల్పించకపోవడమే కాకుం డా చేసిన పనికి గిట్టుబాటు కూలి దక్కకపోవడంతో కూలీల పరిస్థితి దయనీయంగా మారింది.
పది రోజులకు మించడం లేదు...
జిల్లా అధికారుల లెక్కల ప్రకారం ఉపాధి హామీ కూలీలకు నెలకు పది రోజులకు మించి పని చూపిం చలేకపోతున్నారు. ఆర్థిక సంవత్సరంలోనే మండలా ల వారీగా పనులను గుర్తిస్తున్నారు. గ్రామీణ ప్రాం తాల్లో వేసవి మూడు నెలల పాటు పనులు లభించక కూలీలు వలస వెళ్లాల్సి వస్తోంది. ఇక మార్చి నుంచి జూన్ వరకు నెలలో 25 రోజులైనా ప ని కల్పించాలి. అధికారులు సమయానికి పనులు చూపించలేకపోవడంతో కూలీలు ఇబ్బంది పడుతున్నారు.
డబ్బు చెల్లింపులో జాప్యం
రెక్కాడితేనే డొక్కాడే ఉపాధి కూలీలకు కూలీ పనులు దక్కకపోవడం ఓ సమస్య అయితే.. చేసిన పనులకు సంబంధించిన కూలి చెల్లింపులో జాప్యం జరుగుతుండడం మరింత ఇబ్బందికి గురి చేస్తోంది. పను లు చేసిన వారికి నెలల తరబడి డబ్బు చెల్లించకపోవవడంతో కూలీలు ఉపాధి హామీ పనులపై ఆసక్తి చూప డం లేదు. ఏదైనా పని లభిస్తే పట్టణ ప్రాంతాలకు వలస వెళ్లాల్సిందేనని చెబుతున్నారు.
చెన్నూర్ నియోజకవర్గంలో...
నియోజకవర్గంలోని చెన్నూర్, జైపూర్, కోటపల్లి, మందమర్రి మండలాల్లో 34,701 మంది కూలీలు ఉ న్నారు. ఇందులో 1,407 మంది కూలీలకు మాత్రమే 100 రోజుల పని కల్పించారు. మిగితా 33,204 మం ది కూలీలకు సంవత్సర కాలంలో 50 నుంచి 60 రో జుల పని కల్పించిన దాఖలాలు లేవు. చెన్నూర్ మం డలంలోని 8,619 మంది కూలీల్లో 317మందికి, జై పూర్‌లో 10,545 మంది కూలీల్లో 517మందికి, కోట పల్లిలో 11,110 మందిలో 388మందికి, మందమర్రిలోని 4,427 మందిలో 185 మంది కూలీలకే వంద రోజుల పని దక్కింది.
ఈ లెక్కన 35 శాతం కూలీలు మాత్రమే 100 రోజులు పనులు చేస్తున్నారు. ఇక వం ద రోజులు పని చేసిన కూలీలకు ప్రభుత్వం ప్రకటిం చిన రోజు వారి కూలి రూ.180 గిట్టుబాటు కావడం లేదని చెబుతున్నారు. ఇళ్లు, పిల్లలను వదిలి పట్టణాలకు వెళ్లలేక.. ఇంటి వద్దే పని చేసుకోవచ్చని ఉపాధి హామీని నమ్ముకుంటే ప్రభుత్వం తమకు అన్యాయం చేస్తోందని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్య వసాయ పనులు కరువైన ప్రస్తుత తరుణంలోనైనా ప్రభుత్వం స్పందించి ఉపాధి హామీ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయకపోతే కూలీలకు న్యాయం జరిగే అవకాశం ఉండదు.