వలస కూలీలు విలవిల
- పనుల్లేక పస్తులు
- దూర ప్రాంతాలకు వెళ్లి తిరిగి వచ్చేస్తున్న వైనం
- జిల్లాకు వలస వచ్చిన వారి పరిస్థితీ అంతే!
వలస కూలీలకు సైతం బతుకు భారంగా మారింది. జిల్లాకు చెందిన పలు ప్రాంతాల నుంచి ఇతర జిల్లాలకు వలస వెళ్లి బతుకుబండి నడిపించే కూలీలకు ఆ ప్రాంతంలో పనులు దొరక్కపోవడంతో ఉసూరుమంటూ తిరిగొస్తున్నారు. అలాగే ప్రతి ఏటా వరినాట్ల సమయానికి జిల్లాకు వలస వస్తున్న ఇతర జిల్లాల కూలీలకు ఇక్కడ అదే పరిస్థితి ఎదురవుతోంది.
చల్లపల్లి/ఘంటసాల/పెడన రూరల్/కైకలూరు/ విజయవాడరూరల్ : ప్రతి ఏటా పనులులేని సమయంలో దూరప్రాంతాలకు వెళ్లి పనులు చేసుకునే వలస కూలీలు ప్రస్తుతం పనులు లేక పస్తులుంటున్నారు. వలసవెళ్లిన ప్రాంతాల నుంచి రెండుమూడు రోజులకే మళ్లీ స్వగ్రామాలకు చేరుతున్నారు. దీనికి తగ్గట్టు ఉపాధి హామీ పనులు నిలిచిపోవడంతో వ్యవసాయకూలీలు, సన్నకారు రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
ప్రతి ఏటా వ్యవసాయ పనులు ప్రారంభించకముందు బయట ప్రాంతాల్లో పనులు చేసుకునేందుకు అవనిగడ్డ, పెడన, కైకలూరు నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాల నుంచి కూలీలు వలసలు వెళ్లడం పరిపాటి. నాగాయలంక మండలంలోని ఎదురుమొండి దీవులకు చెందిన నాచుగుంట, జింకపాలెం, గొల్లమంద, ఎదురుమొండి, ఏసుపురం, కోడూరు మండలంలోని జరుగువానిపాలెం, ఊటగుండం, బసవవానిపాలెం, రామకృష్ణాపురం, అవనిగడ్డ మండలంలోని పాత ఎడ్లంక, తుంగలవారిపాలెం నుంచి వేల సంఖ్యలో వలస వెళ్లేవారు.
అలాగే పెడన మండలంలోని బల్లిపర్రు, కాకర్లమూడి, మడక, నందమూరు, పుల్లపాడు, జింజేరు, చోడవరం, పెనుమల్లి, నందిగామ, కూడూరు, నడుపూరు, చెన్నూరు, చేవేండ్ర, ఉరివి, లంకలకలవగుంట, కమలాపురం, కొప్పల్లి, ముచ్చర్ల తదితర గ్రామాల నుంచి సుమారు 5 వేల మందికి పనుల కోసం వలస వెళ్లేవారు. అలాగే కైకలూరు నియోజకవర్గ పరిధిలోని కొల్లేరు ప్రాంత గ్రామాల నుంచి వేలాదిగా వలసబాట పట్టేవారు.
ఏలూరు, రాజమండ్రి, విశాఖపట్నం, గుంటూరు, హైదరాబాద్, చెన్నై ,ప్రకాశం, గోదావరి జిల్లాలతోపాటు కృష్ణాజిల్లాలోని పలు ప్రాంతాలకు వీరు వలసలు వెళుతూ పనులు పూర్తయిన తర్వాత తిరిగి వచ్చేవారు. ఈ ఏడాది ఎక్కడా సాగునీరు లేకపోవడంతో పనుల కోసం ఆశతో పలు ప్రాంతాలకు వెళ్లిన కూలీలు అక్కడా పనులు ప్రారంభం కాకపోవడంతో నిరాశతో వెనుదిరిగి వస్తున్నారు.
ఆవేదన వర్ణనాతీతం
పలు జిల్లాలనుంచి వచ్చిన వలస కూలీలకు జిల్లాలో పనులు లేకపోవడంతో పస్తులుండాల్సిన పరిస్థితులు దాపురించాయి. ఏటా మాదిరిగా ఈ ఏడాది కూడా ప్రకాశం జిల్లా మార్కాపురం, దర్శి, కొచ్చర్లకోట, బసిరెడ్డి గ్రామాల నుంచి పనుల కోసం పిల్లలతో సహా నున్న గ్రామం వచ్చిన కూలీలకు పనులు దొరకడలేదు. ఆయా ప్రాంతాలనుంచి ప్రతిఏటా 500నుంచి700మంది వ్యవసాయ కూలీలు వరినాట్ల సమయంలోవచ్చి వెళుతుంటారు. గతంలో ఎన్నడూ ఇలాంటి దయనీయ పరిస్థితులు లేవని మార్కాపురం నుంచి వచ్చిన ముఠామేస్త్రీ తలపాటి కేశవులు చెప్పారు.
రెండు రోజులకే తిరిగొచ్చాం
ఇక్కడ పనులు ప్రారంభం కాకపోవడంతో పెనుమత్స శివారు చోరగూడికి పనులకోసం వెళ్లాం. అక్కడ బోర్లుపై నీటితో రెండు రోజులు పనులు చేశాం. సాగునీరు లేకపోవడంతో పనులు లేక తిగిరి వచ్చేశాం.
- మండే భాస్కరరావు, తాడేపల్లి, ఘంటసాల మండలం
వ్యవసాయం కన్నా కూలి పనులే నయం
ప్రస్తుతం వ్యవసాయం చేయడం కంటే కూలీ పనులకు వెళ్లడమే నయంలా ఉంది. మా గ్రామంలో ఐదెకరాల రైతు కూడా కూలి పనుల కోసం వలస వెళ్తున్నారు. వ్యవసాయ పనులు మానేసి విజయవాడలో సీలింగ్ పనులకు వెళ్తున్నా... అయితే కరెంట్ కోత వల్ల అక్కడా పనులుండడం లేదు.
- గూడపాటి నాగరాజు, కాకర్లమూడి గ్రామవాసి