పంట రుణ పద్దుకు ‘ఉపాధి’ సొమ్ము | Banks shock to farmers | Sakshi
Sakshi News home page

పంట రుణ పద్దుకు ‘ఉపాధి’ సొమ్ము

Published Wed, Feb 17 2016 4:29 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

పంట రుణ పద్దుకు ‘ఉపాధి’ సొమ్ము - Sakshi

పంట రుణ పద్దుకు ‘ఉపాధి’ సొమ్ము

రైతులకు బ్యాంకుల షాక్!
♦ నేరుగా బ్యాంకుల్లోనే సర్దుబాటు
♦ కూలీలుగా మారిన కర్షకులపై బ్యాంకర్ల కర్కశత్వం
 
 సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: కర్షకుల పట్ల బ్యాంకులు కర్కశంగా వ్యవహరిస్తున్నాయి. రైతు ఖాతాల్లోని నగదును దొడ్డిదారిన పంట రుణ బకాయిల కింద జమ చేసుకుంటున్నాయి. కరువుతో వ్యవసాయ పనులు మందగించడంతో ఉపాధి కూలీలుగా మారిన రైతుల నుంచి కూలి సొమ్మును లాగేసుకుంటున్నాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో వీధినపడిన అన్నదాతలకు అంతో ఇంతో ఉపాధి హామీ పథ కం (ఈజీఎస్) అండగా నిలుస్తోంది. ఈ క్రమంలో ఉపాధి పథకం కింద పనులు చేస్తున్న రైతులపై బ్యాంకులు రికవరీ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నాయి. కూలి పనితో వచ్చే నాలుగు పైసలను బ్యాంకర్లు పంట రుణ ఖాతాలోకి మళ్లిస్తున్నారు. కేవలం పంట రుణాలేకాదు.. సహకార రుణాలు, ఆర్థిక చేయూత, లింకు రుణాల వసూలులోనూ ఇదే పద్ధతి అవలంబిస్తున్నారు. పాత బకాయిల సర్దుబాటుపై కనీస సమాచారం ఇవ్వకపోవడంతో రైతాంగం లబోదిబోమంటోంది. కరువుతో సాగుసాగక.. కూలి పనులు చేసుకుంటుంటే బ్యాంకు లు తమ కష్టార్జితాన్ని చడీచప్పుడు లేకుండా జమ చేసుకుంటుండడం అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తోంది.

 20 శాతం కూడా సేద్యానికి నోచుకోలేదు
 వర్షాభావ పరిస్థితులతో జిల్లాలో కరువు తాండవిస్తోంది. ప్రస్తుత రబీ సీజన్‌లో 50 వేల హెక్టార్ల సాధారణ విస్తీర్ణంలో కనీసం 20 శాతం కూడా సేద్యానికి నోచుకోలేదు. పశుగ్రాసం కొరత, తాగునీటి ఎద్దడి నేపథ్యంలో జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలని యంత్రాంగం ప్రభుత్వానికి నివేదిక పంపింది. దీనిపై ఇప్పటివరకు సానుకూల స్పందన రానప్పటికీ, ఉపాధి పథకం కింద 150 రోజుల పని దినాలు కల్పించాల్సిందిగా ఆదేశించింది. కనీసం ఈ రూపంలోనైనా ఉపాధి దొరుకుతుందని ఆశించిన రైతులకు బ్యాంకర్లు షాక్ ఇచ్చారు. ఉపాధి చెల్లింపులను నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి ఆన్‌లైన్ పద్ధతిలో జమ చేస్తుండడాన్ని అనువుగా మలచుకున్నారు.

మూడు రోజులకోసారి జిల్లా నీటియాజమాన్య సంస్థ(డ్వామా) కూలి డబ్బును కూలీల వ్యక్తిగతఖాతాలో జమ చేస్తున్నాయి. ఇదే అదనుగా బ్యాంకర్లు ఆ నిధులను పంట రుణ పద్దు కింద బదలాయిస్తున్నారు. గత రెండ్రోజులుగా ఇబ్రహీంపట్నం, యాచారం, మంచాల తదితర మండలాల్లో వందల సంఖ్యలో రైతుల ఈజీఎస్ ఖాతాల నుంచి పంట రుణాల ఖాతాకు మళ్లించారు. కనీస సమాచారం ఇవ్వకుండా నిధులు దారి మళ్లిస్తుండడంతో రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. మంగళవారం యాచారం మండల కేంద్రంలోని ఎస్‌బీహెచ్ వద్ద పలువురు రైతులు బ్యాంకు మేనేజర్‌తో వాగ్వాదానికి దిగారు. ఉపాధి అధికారులు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది.

 కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తా..
 రైతుల ఖాతా నుంచి కూలి సొమ్మును పంట రుణ ఖాతాలో సర్దుబాటు చేసిన అంశంపై ఫిర్యాదు అందింది. ఈ విషయంపై బ్యాంకర్లతో సంప్రదింపులు జరుపుతున్నాం. యాచారంలో చోటుచేసుకున్న సంఘటనను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తా.  
 - హరిత, ప్రాజె క్టు డెరైక్టర్, జిల్లా నీటి యాజమాన్య సంస్థ
 
 నాకు తెలియకుండానే నొక్కేశారు..
 బోర్లు ఎండిపోవడంతో విధిలేని పరిస్థితుల్లో ఉపాధి పనులు చేస్తున్న. కూలి డబ్బును బ్యాంకు ఖాతాలో జమ చేసినట్లు ఈజీఎస్ అధికారులు రెండ్రోజుల క్రితం చెప్పారు. దీంతో నిధులను విత్‌డ్రా చేసేందుకు బ్యాంకుకు వెళ్లా. అయితే (62070346933) ఖాతాలో డబ్బులు లేవని చెప్పడంతో బ్యాంకు అధికారులను ప్రశ్నించా.. పంట రుణ ఖాతాలోకి రూ.1,800 జమచేసినట్లు చెప్పారు. నా ప్రమేయం లేకుండా నిధులను ఎలా మళ్లిస్తారంటూ నిలదీశా.. బ్యాంకర్ నిర్లక్ష్యంగా సమాధానమివ్వడంతో ఈజీఎస్ ఏపీడీ తిరుపతయ్యకు ఫిర్యాదు చేశా.     
- గడల అంజయ్య, ఉపాధి కూలి, యాచారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement