మండల పరిధిలో సోయాబీన్ సాగు చేస్తున్న వారికి రెండేళ్లుగా మంచి దిగుబడులు వస్తుండటంతో రైతులు ఈ పంట సాగుపై ప్రత్యేక దృష్టి సారించారు.
కంగ్టి: మండల పరిధిలో సోయాబీన్ సాగు చేస్తున్న వారికి రెండేళ్లుగా మంచి దిగుబడులు వస్తుండటంతో రైతులు ఈ పంట సాగుపై ప్రత్యేక దృష్టి సారించారు. అయితే ఈ ఏడాది ఖరీఫ్‌లో వర్షాలు ఆలస్యం కావడంతో సకాలంలో విత్తనాలు వేయలేకపోయారు. బోర్లు, బావులు ఉన్న కొంత మంది మాత్రం పంటలు సాగు చేశారు.
వర్షాధారం కింద సోయా వేసిన రైతులు రెండు నెలలు ఆలస్యంగా విత్తనం నాటారు. వీరిలో కంగ్టికి చెందిన దుబాయ్ దత్తు (దత్తాగౌడ్) వేసిన పంట ఏపుగా పెరిగి పూత, కాతతో కళకళలాడుతోంది. గతంలో బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లిన ఈయన ఆరేళ్ల పాటు అక్కడ ఎలక్ట్రీషియన్‌గా పనిచేశాడు. ఐదేళ్ల క్రితం స్వగ్రామానికి వచ్చి ఇక్కడే వ్యవసాయం చేస్తున్నాడు. తనకున్న నాలుగు ఎకరాల భూమిలో బోరు వేయగా పుష్కలంగా నీళ్లు వచ్చాయి. దీంతో పక్కనే ఉన్న తమ పాలోళ్ల (దాయాదుల) భూమిని కూడా కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు.
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా బిలోలి గ్రామంలో ఉండే తమ బంధువులు గతేడాది ఖరీఫ్ సీజన్‌లో ఎకరానికి 15 కిలోల విత్తనాన్ని మాత్రమే వాడి తక్కువ ఖర్చుతో మూడు ఎకరాల్లో 50 క్వింటాళ్ల దిగుబడులు సాధించారని తెలిపాడు. కానీ ఇక్కడి రైతులు మాత్రం ఎకరానికి పలు కంపెనీలకు చెందిన 30 కిలోలు విత్తితే ఇంతవరకు ఎకరాకు 7 నుంచి 8 క్వింటాళ్లకు మించి దిగుబడి పొందలేదని చెప్పాడు. తమ బంధువుల సలహా మేరకు మహారాష్ట్రలో కాలిఫోర్నియా రకానికి చెందిన 30 కిలో విత్తనాలను కొనుగోలుచేసి తెచ్చాడు.
వీటిని గత జూలై 15న తన రెండెకరాల పొలంలో విత్తాడు. ప్రస్తుతం మంచి పూత, కాతతో మూడు ఫీట్ల ఎత్తులో ఏపుగా పెరిగింది. ఒక్కో పైరుకు 100 నుంచి 150 వరకు సోయాబీన్ పిందెలు ఉన్నాయి. దున్నకాలు, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, కలుపు నివారణ కోసం రెండెకరాలకు మొత్తం రూ.15వేల పెట్టుబడి వచ్చిందని రైతు దత్తాగౌడ్ తెలిపాడు. ఎకరానికి 15 క్వింటాళ్ల దిగుబడి ఆశిస్తున్నట్లు పేర్కొన్నాడు. ఈ విత్తనంతో మరింత మంది సాగుకు ముందుకు రావాలని కోరుతున్నాడు.