అనువైన నేలలు
సారవంతమైన నీరు నిలిచే తేలికపాటి నేలలు, మురుగు నీరు నిల్వని నల్లరేగడి నేలలు అనుకూలం.
సాగు భూమిని 2 నుంచి 4 సాళ్లు మెత్తగా దున్నుకోవాలి.
ఎకరాకు రబీ సీజన్‌లో 7 నుంచి 8 కిలోలు, ఖరీఫ్‌లో అయితే ఐదు కిలోల విత్తనం సరిపోతుంది.
విత్తన రకాలు
పర్బనీ క్రాంతి అనే రకం మొక్కలు కొమ్మలు వేయకుండా ముదురు ఆకుపచ్చగా ఉంటాయి.
అర్క అనామిక రకం విత్తిన 55 రోజుల్లో కాపుకొస్తుంది.
అర్క అభయ రకం విత్తనాలు రోగ నిరోధక శక్తిని కలిగి ఉంటాయి.
సంకర జాతికి చెందిన వర్ష, విజయ్, మహికో హైబ్రిడ్ నంబరు 10, 64, ప్రియ, అవంతిక, సుప్రియ, ఐశ్వర్య, సింజెంటా ఓహెచ్ 597, తులసి తదితర రకాల విత్తనాలు వేసుకోవచ్చు.
ఈ రకాల విత్తనాలు ఎకరాకు 4 నుంచి 5 టన్నుల వరకు దిగుబడినిస్తాయి.
విత్తనశుద్ధి, నాటే విధానం
కిలో విత్తనానికి 5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్‌తో తర్వాత 4 గ్రాముల ట్రైకోడెర్మా విరిడితో కలిపి విత్తన శుద్ధి చేయాలి.
నేలను 4 నుంచి ఐదు సార్లు దున్నిన తర్వాత బోజెలు వేసుకోవాలి.
వీటి మధ్య దూరం 45 సెంటీమీటర్లు ఉండేలా జాగ్రత్త పడాలి.
ఒక్కో మొక్క మధ్య దూరం 15 సెంటీమీటర్లు ఉండాలి.
విత్తనం విత్తిన వెంటనే నీటి తడి పెట్టాలి. అనంతరం నాలుగు రోజులకు ఒకసారి నీరు అందించాలి.
ఎరువుల యాజమాన్యం
రబీలో సాగు కోసం ఆఖరి దుక్కిలో ఎకరాకు ఆరు టన్నుల పశువుల ఎరువును వేసుకోవాలి.
అలాగే భాస్వరం వేసుకుంటే పంట బాగా ఎదుగుతుంది.
ఎకరాకు 48 కిలోల నత్రజనిని రెండు విడతలుగా 30 నుంచి 45 రోజుల మధ్యలో వేయాలి.
విత్తనం వేసిన నెల రోజుల వ్యవధిలో నత్రజని ఎరువును వేసుకోవాలి.
పంట పూత దశలో లీటరు నీటిలో 10 గ్రాముల యూ రియా కలిపి పిచికారీ చేయాలి. తద్వారా 25 శాతం వరకు నత్రజని ఆదాతోపాటు అధిక దిగుబడి పెరుగుతుంది.
మొవ్వ, కాయ తొలుచు పురుగు
విత్తిన 30 రోజుల నుంచి ఈ పురుగు మొక్కలను ఆశిస్తుంది.
మొవ్వు, పూత, కాయలను తొలిచి వేయడం ద్వారా నష్టం కలిగిస్తుంది.
ఈ పురుగులు మొవ్వు, పూత కాయలకు రంధ్రాలు చేసి లోనికి వెళతాయి. అక్కడి పదార్థాన్ని తినేయడం వల్ల కొమ్మలు వాలిపోవడం, కాయలు పుచ్చులుగా మారడం, పూత రాలిపోవడం వంటివి జరుగుతాయి.
నివారణ చర్యలు...
మొవ్వు పురుగుల నివారణకు లీటరు నీటిలో 3 గ్రాముల కార్బరిల్ లేదా 2 మిల్లీలీటర్ల క్వినాల్‌ఫాస్, ప్రొఫెనోఫాస్ మందును కలిపి 10 రోజల వ్యవధిలో రెండు సార్లు కాయలు కోసిన తర్వాత పిచికారీ చేయాలి.
శంకు లేదా పల్లాకు తెగులు
బెండ పంటపై ఆశించే తెగుళ్లలో ఇది అత్యంత ప్రమాదకరమైనది.
దీనిని వైరస్ తెగులు అని కూడా అంటారు. తెగులు సోకిన మొక్కలు ఆకులు పసుపు రంగులోకి మారి కాయలు గిడసిబారి తెల్లగా మారిపోతాయి.
ఆకులు చిన్నవిగా ముడతపడి దిగుబడి తగ్గిపోవడం జరుగుతుంది.
నివారణ చర్యలు...
తెగుళ్లను తట్టుకునే అర్కఅనామిక, అర్కఅభయ్ రకాల విత్తనాలను విత్తుకోవాలి.
లీటరు నీటికి 2 మిల్లీ లీటర్ల డైమిథోయేట్ లేదా 1.5 గ్రాముల ఎసిఫేట్ కలిపి పిచికారీ చేయడం ద్వారా తెగులును వ్యాప్తి చేసే తెల్ల దోమను అరికట్టవచ్చు.
మచ్చతెగులు
ఇది సోకితే ఆకుల అడుగు భాగాన నల్లటి మచ్చలు ఏర్పడుతాయి.
దీనినే మచ్చతెగులు అంటారు. ఈ తెగులు పెరినోస్లిరోపారా అనే శిలీంద్రం వల్ల వ్యాప్తి చెందుతుంది.
ఎరిసావిటిల్లా అనే రెక్కల పురుగు ద్వారా ఒక మొక్క నుంచి మరో మొక్కకు వ్యాపిస్తుంది.
ఈ పురుగు ఆకు పచ్చ రంగులో ఉంటుంది.
ఆకులపై మచ్చలు వచ్చినట్లు గుర్తిస్తే లీటరు నీటికి 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ కలిపి వారంలో రెండుసార్లు పిచికారీ చేయాలి.
తెల్లదోమ, బూడిద తెగులు
తెల్లదోమ ఆశిస్తే బెండ రైతులకు భారీ నష్టం వాటిల్లుతుంది.
ఇవి ఆకులు అడుగు భాగాన చేరి రసం పీలుస్తాయి.
దీనివల్ల ఆకులు పసుపు రంగులోకి మారి రాలిపోతాయి.
దీని నివారణకు 5 మిల్లీలీటర్ల వేపనూనె కలిపి పిచికారీ చేయాలి.
బూడిద తెగులు సోకితే ఆకుల పైభాగంలో, కింది భాగంలోను బూడిద వంటి పొడితో కప్పబడి ఉంటాయి.
దీని నివారణకు లీటరు నీటిలో 3 గ్రాముల కరిగే గంధకపు పొడి లేదా 1 మి.లీ. డైనోకాప్, 2 మి.లీ. హెక్సాకోనజోల్ స్ప్రే చేయాలి.
బెండంత అండ!
Published Thu, Nov 13 2014 12:07 AM | Last Updated on Sat, Sep 2 2017 4:20 PM
Advertisement