లక్సెట్టిపేట/జైపూర్ : ప్రస్తుత తరుణంలో వ్యవసాయం రైతులకు భారంగా మారుతోంది. పంటల సాగుకు పెట్టుబడిని తగ్గించుకుని ఉన్న వనరులతో పంటలు సాగు చేస్తే నష్టాలను అధిగమించి లాభాలు సాధించవచ్చని లక్సెట్టిపేట, జైపూర్ మండలాల వ్యవసాయాధికారులు ప్రభాకర్, సుధాకర్ వివరించారు. జీరో టిల్లేజ్ పద్ధతిలో మొక్కజొన్న సాగు చేస్తే రైతులకు లాభదాయకంగా ఉంటుంది. అధిక దిగుబడి వస్తుంది.
పాత పద్ధతిలో మొక్కజొన్న సాగు చేయాలంటే ఖరీఫ్ వరి కోసిన తర్వాత పొలాన్ని రెండుసార్లు దుక్కిదున్ని నీటిని బాగా పట్టించాల్సి వచ్చేది. తేమ తగ్గిన తర్వాత మక్కలు వేయాల్సి వచ్చేది. ఇదంతా జరగడానికి సుమారు 25 రోజుల సమయం వృథా అయ్యేది. జీరో టిల్లేజ్ పద్ధతిలో మొక్కజొన్న సాగు చేయాలంటే వరి కోసిన తర్వాత దున్నకుండానే ఒకసారి నీళ్లు పట్టించి ఆరిన వెంటనే మక్కలు వేస్తే చాలు మొలకెత్తుతాయి. ఐదు రోజుల్లో మొలకెత్తి 60 రోజుల్లో అధిక దిగుబడితో పంట చేతికొస్తుంది.
జీరోటిల్లేజ్ సాగు ద్వారా లాభాలు
వరి పంట కోసిన తర్వాత పొలం దున్నకుండానే మొక్కజొన్న విత్తడాన్ని జీరో టిల్లేజ్ పద్ధతి అంటారు.
నాణ్యమైన సంకర జాతి విత్తనాన్ని ఎంచుకోవాలి.
దుక్కి దున్నాల్సిన పని లేకుండా సాగు చేయవచ్చు. దీని వల్ల ఎకరానికి సుమారు రూ.2వేల వరకు ఖర్చు తగ్గుతుంది.
జీరో టిల్లేజ్ పద్ధతిలో దున్నడం, బోదెలు చేయడం ఉండదు. దీంతో రైతుకు ఒక ఎకరానికి రూ.1500-2000 వరకు ఖర్చు ఆదా అవుతుంది.
నీటిని, పంట కాలాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.
ఎకరం విస్తీర్ణంలో వరి సాగుకు సరిపడా సాగు నీటితో ఒకటిన్నర నుంచి రెండెకరాల మొక్కజొన్న పండించవచ్చు.
వరి తర్వాత మొక్కజొన్న సాగు చేయడం వల్ల పంట మార్పిడితోపాటు చీడపీడల సమస్య తగ్గుతుంది.
బయంత్ర పరికరాలతో దుక్కి చేయకపోవడం వల్ల పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చు.
అధిక దిగుబడితోపాటు నాణ్యత గల మొక్కజొన్న పంట చేతికి వస్తుంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
విత్తడానికి వీలుగా ఖరీఫ్ వరిని కింది వరకు నేలకు దగ్గరగా కోయాలి.
వరి కోసిన తర్వాత నేలలో తగినంత తేమ లేనట్లయితే ఒక తేలికపాటి నీటి తడి ఇచ్చి మొక్కజొన్న విత్తుకోవాలి.
తాడును ఉపయోగించి వరుసకు వరుసకు మధ్య 60 సెంటీమీటర్లు, మొక్కకు మొక్కకు మధ్య 20 సెంటీమీటర్లు దూరం ఉండేలా విత్తుకోవాలి. వరుసలను తూర్పు పడమరలుగా విత్తుకోవాలి.
సస్యరక్షణ
వరి మాగాణిల్లో భూమిని దున్నడం ఉండదు కనుక కలుపు ఎక్కువగా వస్తుంది. దీని నివారణకు విత్తనం విత్తిన 48గంటల్లోపు ఎకరాకు కిలో అట్రాజిన్ 50శాతం పొడిమందును 200 లీటర్ల నీటిలో కలిపి నేలపై పిచికారీ చేయాలి.
వరి దుబ్బులు చిగురు వేయకుండా పారాక్యాట్ డైక్లోరైడ్ ఒక లీటరు 200 లీటర్ల నీటిలో కలిపి విత్తేముందు పిచికారీ చేయాలి.
అట్రాజిన్ మందు కలుపు రాకుండా నివారిస్తుంది. ప్యారాక్యాట్ డైక్లోరైడ్ కొయ్యకాల్లని మొలకెత్తకుండా చేస్తుంది.
విత్తనం మొలకెత్తిన 25 నుంచి 30 రోజల వ్యవధిలో వెడల్పు ఆకు గడ్డి జాతి మొక్కల నివారణకు 2, 4డీ సోడియం సాల్ట్ 500 గ్రాములు 200లీటర్ల నీటిలో కలిపి ఎకరానికి పిచికారీ చేయాలి.
తక్కువ ఖర్చు.. అధిక దిగుబడి
Published Wed, Nov 26 2014 3:07 AM | Last Updated on Sat, Sep 2 2017 5:06 PM
Advertisement
Advertisement