నర్కూడ (శంషాబాద్ రూరల్ ): రైతులు ‘జీరో టిల్లేజ్’ పద్ధతిలో మొక్కజొన్న సాగు చేసుకుంటే పెట్టుబడి వ్యయం తగ్గడమే కాకుండా సమయం కలిసివస్తుందని డాట్ శాస్త్రవేత్త డాక్టర్ అమ్మాజీ సూచించారు. శుక్రవారం మండలంలోని నర్కూడలో రైతు రామారావు వ్యవసాయ క్షేత్రంలో పొలం బడి నిర్వహించారు. వరి సాగులో చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యలపై శిక్షణ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుతం వరికోతలు పూర్తి చేసుకున్న రైతులు అదే పొలంలో దున్నే అవసరం లేకుండా జీరో టిల్లేజ్ పద్ధతిలో మొక్కజొన్నను నేరుగా విత్తుకోవచ్చన్నారు. ఇందులో కలుపు నివారణకు అట్రాజిన్ కలుపు మందు పిచికారీ చేయాలన్నారు. ఈ పద్ధతిలో నెల సమయం ఆదా కావడమే కాకుండా పంట త్వరగా కోతకు వస్తుందన్నారు. వరి పంటకు ప్రస్తుత వాతావరణం కారణంగా కంకినల్లి, దోమ తెగుళ్లు ఆశించినట్లు తెలిపారు.
కంకినల్లి నివారణ కోసం డైకోఫాల్ 2 మి.లీ. ఒక లీటరు నీళ్లలో కలిపి లేదా 2 మి.లీ. ప్రొఫెనోఫాస్‌ను ఒక లీటరు నీళ్లలో కలిపి పంటపై పిచికారీ చేయాలన్నారు. పంటలో పొట్ట ఆకుపై గోధుమరంగు చారలు కనిపించిన వెంటనే మందులను పిచికారీ చేస్తే గింజలు రంగు మారడం తగ్గుతుందన్నారు. అంతేకాకుండా వరిలో తెగుళ్లు ఆశించకుండా రైతులు తప్పనిసరిగా కాలిబాటను వదులుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏడీ మోహన్‌రెడ్డి, ఇన్‌చార్జి ఏఓ విద్యాధరి, ఏఈఓలు ఉదయ్‌సింగ్, రాఘవేందర్, ‘ఆత్మ’ బీటీఎం సూర్యమూర్తి, ఎస్‌ఎంఎస్ జ్యోత్స్న పాల్గొన్నారు.
‘జీరో టిల్లేజ్’ పద్ధతిలో మొక్కజొన్న సాగు మేలు
Published Sat, Nov 8 2014 12:47 AM | Last Updated on Sat, Sep 2 2017 4:02 PM
Advertisement