The cultivation of Corn
-
తక్కువ ఖర్చు.. అధిక దిగుబడి
లక్సెట్టిపేట/జైపూర్ : ప్రస్తుత తరుణంలో వ్యవసాయం రైతులకు భారంగా మారుతోంది. పంటల సాగుకు పెట్టుబడిని తగ్గించుకుని ఉన్న వనరులతో పంటలు సాగు చేస్తే నష్టాలను అధిగమించి లాభాలు సాధించవచ్చని లక్సెట్టిపేట, జైపూర్ మండలాల వ్యవసాయాధికారులు ప్రభాకర్, సుధాకర్ వివరించారు. జీరో టిల్లేజ్ పద్ధతిలో మొక్కజొన్న సాగు చేస్తే రైతులకు లాభదాయకంగా ఉంటుంది. అధిక దిగుబడి వస్తుంది. పాత పద్ధతిలో మొక్కజొన్న సాగు చేయాలంటే ఖరీఫ్ వరి కోసిన తర్వాత పొలాన్ని రెండుసార్లు దుక్కిదున్ని నీటిని బాగా పట్టించాల్సి వచ్చేది. తేమ తగ్గిన తర్వాత మక్కలు వేయాల్సి వచ్చేది. ఇదంతా జరగడానికి సుమారు 25 రోజుల సమయం వృథా అయ్యేది. జీరో టిల్లేజ్ పద్ధతిలో మొక్కజొన్న సాగు చేయాలంటే వరి కోసిన తర్వాత దున్నకుండానే ఒకసారి నీళ్లు పట్టించి ఆరిన వెంటనే మక్కలు వేస్తే చాలు మొలకెత్తుతాయి. ఐదు రోజుల్లో మొలకెత్తి 60 రోజుల్లో అధిక దిగుబడితో పంట చేతికొస్తుంది. జీరోటిల్లేజ్ సాగు ద్వారా లాభాలు వరి పంట కోసిన తర్వాత పొలం దున్నకుండానే మొక్కజొన్న విత్తడాన్ని జీరో టిల్లేజ్ పద్ధతి అంటారు. నాణ్యమైన సంకర జాతి విత్తనాన్ని ఎంచుకోవాలి. దుక్కి దున్నాల్సిన పని లేకుండా సాగు చేయవచ్చు. దీని వల్ల ఎకరానికి సుమారు రూ.2వేల వరకు ఖర్చు తగ్గుతుంది. జీరో టిల్లేజ్ పద్ధతిలో దున్నడం, బోదెలు చేయడం ఉండదు. దీంతో రైతుకు ఒక ఎకరానికి రూ.1500-2000 వరకు ఖర్చు ఆదా అవుతుంది. నీటిని, పంట కాలాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఎకరం విస్తీర్ణంలో వరి సాగుకు సరిపడా సాగు నీటితో ఒకటిన్నర నుంచి రెండెకరాల మొక్కజొన్న పండించవచ్చు. వరి తర్వాత మొక్కజొన్న సాగు చేయడం వల్ల పంట మార్పిడితోపాటు చీడపీడల సమస్య తగ్గుతుంది. బయంత్ర పరికరాలతో దుక్కి చేయకపోవడం వల్ల పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చు. అధిక దిగుబడితోపాటు నాణ్యత గల మొక్కజొన్న పంట చేతికి వస్తుంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు విత్తడానికి వీలుగా ఖరీఫ్ వరిని కింది వరకు నేలకు దగ్గరగా కోయాలి. వరి కోసిన తర్వాత నేలలో తగినంత తేమ లేనట్లయితే ఒక తేలికపాటి నీటి తడి ఇచ్చి మొక్కజొన్న విత్తుకోవాలి. తాడును ఉపయోగించి వరుసకు వరుసకు మధ్య 60 సెంటీమీటర్లు, మొక్కకు మొక్కకు మధ్య 20 సెంటీమీటర్లు దూరం ఉండేలా విత్తుకోవాలి. వరుసలను తూర్పు పడమరలుగా విత్తుకోవాలి. సస్యరక్షణ వరి మాగాణిల్లో భూమిని దున్నడం ఉండదు కనుక కలుపు ఎక్కువగా వస్తుంది. దీని నివారణకు విత్తనం విత్తిన 48గంటల్లోపు ఎకరాకు కిలో అట్రాజిన్ 50శాతం పొడిమందును 200 లీటర్ల నీటిలో కలిపి నేలపై పిచికారీ చేయాలి. వరి దుబ్బులు చిగురు వేయకుండా పారాక్యాట్ డైక్లోరైడ్ ఒక లీటరు 200 లీటర్ల నీటిలో కలిపి విత్తేముందు పిచికారీ చేయాలి. అట్రాజిన్ మందు కలుపు రాకుండా నివారిస్తుంది. ప్యారాక్యాట్ డైక్లోరైడ్ కొయ్యకాల్లని మొలకెత్తకుండా చేస్తుంది. విత్తనం మొలకెత్తిన 25 నుంచి 30 రోజల వ్యవధిలో వెడల్పు ఆకు గడ్డి జాతి మొక్కల నివారణకు 2, 4డీ సోడియం సాల్ట్ 500 గ్రాములు 200లీటర్ల నీటిలో కలిపి ఎకరానికి పిచికారీ చేయాలి. -
బోదె పద్ధతిలో మొక్కజొన్న
ట్రాఫిక ల్టర్ సహజంగా రైతులు మొక్కజొన్న సాగు చేయడానికి పొలాలు దున్ని సాళ్లుగా చేసి సాళ్లలో విత్తనాలు చల్లి ఎదపెడతారు. ఇది పాత పద్ధతి. వర్షాలు అధికంగా కురిసినప్పుడు సాళ్లలో నీరు నిల్వ ఉండి విత్తనాలు దెబ్బతినే ప్రమాదం ఎక్కువ . ఒకవేళ వర్షాలు తక్కువగా ఉంటే.. మొక్కలకు నీరందక చనిపోయే ప్రమాదం ఉంది. వీటిని అధిగమించడానికి బోదె పద్ధతి మొక్కజొన్న సాగులో ఇక్రిశాట్ ప్రయోగాత్మకంగా చేపట్టింది. ఈ బోదెలు చేసే యంత్రాన్ని ట్రాఫికల్టర్ అంటారు. దీన్ని ట్రాక్టర్‌కు అమర్చి ఉపయోగించవచ్చు. బాడుగ భరించలేని రైతులు ఎడ్లతో లాగించి మొక్కజొన్న విత్తనాలు నాటుకోవచ్చు. ముందుగా బోదె పద్ధతిలో మొక్కజొన్న సాగు చేయాలనుకున్న పొలాన్ని ఎంచుకుంటారు. ఈ పద్ధతికి నల్లరేగడి నేలలు బాగా అనుకూలమైనవి. చేను ఎటు వైపు నుంచి ఎత్తుగా ఉంది. ఎటు వైపునకు పల్లంగా ఉం దో చూసుకుని ట్రాక్టరుకు బోదెలు చేసే యంత్రాన్ని తగిలించి నేలను సరిచేస్తారు. బోదెల మధ్య 1.5 మీటర్లు ఖాళీ ఉండే విధంగా సాళ్లు ఏర్పాటు చేస్తారు. అధిక వర్షాలు పడినప్పుడు బోదెలపై ఉన్న నీరు సాళ్లలోకి జారిపోవడమేగాక, సాళ్లలో ట్రాక్టర్లు, ఎడ్లు, చక్రా లు నడవడానికి కూడా పనికి వస్తాయి. ఈ పద్ధతిలో బోదెపై మూడు వరుసలు వస్తాయి. ఎకరానికి 28 వేల మొక్కలు పడతాయి. 8 కిలోల విత్తనాలు సరిపోతాయి. బోదెలు చేసిన తర్వాత విత్తనాలను యంత్రంతోనే నాటుతారు. బోదె పద్ధతి వల్ల ఉపయోగాలు బోదె పద్ధతిలో మొక్కజొన్న సాగు చేస్తే మామూలు విధానంలో కన్నా 20 శాతం అధికంగా దిగుబడి వస్తుందని ఇక్రిశాట్ పరిశోధనలో తేలింది. ఈ పద్ధతిలో మొక్కజొన్న, కంది, శనగ, వేరుశనగ, సోయాబీన్ సాగు చేసుకోవచ్చు. వర్షపాతం ఎక్కువగా ఉన్నప్పుడు పంట దెబ్బ తినకుండా బోదెలపైన ఉన్న నీరు వెంటనే సాళ్ల ద్వారా బయటకు వెళ్తుంది. వర్షపాతం తక్కువగా ఉన్నప్పుడు బోదెల్లో ఉన్న తేమ పంట దెబ్బతినకుండా కాపాడుతుంది. పొలం వాలు, ఎత్తు పల్లాలను కొలిచి బోదెలు చేసుకుంటాం కాబట్టి నేల కోతకు గురికాకుండా కాపాడుతుంది. బోదెల్లో నీరు ఇంకిపోయేలా చేయడం ద్వారా పంట బెట్టకు వచ్చే అవకాశం తక్కువ. =సాళ్ల మధ్య దూరం 18 అంగుళాలు ఉంటుంది. అదే మామూలు పద్ధతిలో సాగు చేస్తే 22 అంగుళాలు ఉంటుంది. దీని వల్ల స్థలం కలిసి వస్తుంది. బోదెలు పెరుగుతాయి. మొక్కల సంఖ్య పెరుగుతుంది -
‘జీరో టిల్లేజ్’ పద్ధతిలో మొక్కజొన్న సాగు మేలు
నర్కూడ (శంషాబాద్ రూరల్ ): రైతులు ‘జీరో టిల్లేజ్’ పద్ధతిలో మొక్కజొన్న సాగు చేసుకుంటే పెట్టుబడి వ్యయం తగ్గడమే కాకుండా సమయం కలిసివస్తుందని డాట్ శాస్త్రవేత్త డాక్టర్ అమ్మాజీ సూచించారు. శుక్రవారం మండలంలోని నర్కూడలో రైతు రామారావు వ్యవసాయ క్షేత్రంలో పొలం బడి నిర్వహించారు. వరి సాగులో చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యలపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుతం వరికోతలు పూర్తి చేసుకున్న రైతులు అదే పొలంలో దున్నే అవసరం లేకుండా జీరో టిల్లేజ్ పద్ధతిలో మొక్కజొన్నను నేరుగా విత్తుకోవచ్చన్నారు. ఇందులో కలుపు నివారణకు అట్రాజిన్ కలుపు మందు పిచికారీ చేయాలన్నారు. ఈ పద్ధతిలో నెల సమయం ఆదా కావడమే కాకుండా పంట త్వరగా కోతకు వస్తుందన్నారు. వరి పంటకు ప్రస్తుత వాతావరణం కారణంగా కంకినల్లి, దోమ తెగుళ్లు ఆశించినట్లు తెలిపారు. కంకినల్లి నివారణ కోసం డైకోఫాల్ 2 మి.లీ. ఒక లీటరు నీళ్లలో కలిపి లేదా 2 మి.లీ. ప్రొఫెనోఫాస్‌ను ఒక లీటరు నీళ్లలో కలిపి పంటపై పిచికారీ చేయాలన్నారు. పంటలో పొట్ట ఆకుపై గోధుమరంగు చారలు కనిపించిన వెంటనే మందులను పిచికారీ చేస్తే గింజలు రంగు మారడం తగ్గుతుందన్నారు. అంతేకాకుండా వరిలో తెగుళ్లు ఆశించకుండా రైతులు తప్పనిసరిగా కాలిబాటను వదులుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏడీ మోహన్‌రెడ్డి, ఇన్చార్జి ఏఓ విద్యాధరి, ఏఈఓలు ఉదయ్‌సింగ్, రాఘవేందర్, ‘ఆత్మ’ బీటీఎం సూర్యమూర్తి, ఎస్ఎంఎస్ జ్యోత్స్న పాల్గొన్నారు.