టాలీవుడ్ తోపు డైరెక్టర్లలో పూరీ జగన్నాథ్ ఒకరు. ఎన్నో కష్టాలు పడి ఇండస్ట్రీలోకి వచ్చిన ఈయన బద్రి సినిమాతో దర్శకరచయితగా కెరీర్ ఆరంభించాడు. ఇడియట్‌తో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోవాల్సిన పని లేకుండా పోయింది. ఈయన తనయుడు ఆకాశ్ పూరి కూడా హీరోగా రాణిస్తున్నాడు. తాజాగా పూరీ తల్లి అమ్మాజీ తన కుమారుడి గురించి ఎన్నో విషయాలు పంచుకుంది.
తన కష్టం చూసి ఏడ్చేశా..
ఆమె మాట్లాడుతూ.. 'ఏడో తరగతి నుంచే పూరీకి సినిమాలంటే ఇష్టం. అనకాపల్లిలో డిగ్రీ చదివాడు. తను సినిమా ఇండస్ట్రీకి వెళ్లాలని ప్రయత్నించిన రోజుల్లో ఇంటి నుంచి డబ్బులు పంపించేవాళ్లం. అవి సరిపోక తను కూడా కష్టపడేవాడు. ఆఫీసుల చుట్టూ కాలినడకన తిరిగేవాడు. ఒకసారి నేను వెళ్లినప్పుడు తన పాదాలు వాచిపోయి సాక్సులు వేసుకోవడానికి రాలేదు. అది చూసి ఏడ్చేశాను. ఇంత కష్టమెందుకు? ఊరికి వచ్చేయ్, పొలం పని చేసుకుందామన్నాను. కానీ తను ఒప్పుకోలేదు. దేవుడు నా కష్టం చూడకపోతాడా? అని అలాగే ప్రయత్నించాడు. పన్నెండు సంవత్సరాలు కష్టపడ్డాడు. అన్నం తినకుండా మంచినీళ్లు మాత్రమే తాగిన రోజులున్నాయి. నా కొడుకు పడ్డ కష్టాలు ఎవరూ పడకూడదు.
కోట్లు మోసం చేశాడు
పూరీ దగ్గర పనిచేసే ఓ కుర్రాడు దాదాపు రూ.80 కోట్లు కొట్టేశాడు. మేమందరం ఏడ్చేశాం. ఓ సినిమా తీసి కూడా నష్టపోయాడు. ఈ అప్పు తీర్చేందుకు ఐదారు ఇళ్లు అమ్మేశాడు. తనను మోసం చేసినవాడి కాళ్లూచేతులు విరిచేద్దామా అని ఎవరో సలహా ఇస్తే ఒప్పుకోలేదు. ఏ జన్మలో అతడికి రుణపడి ఉన్నామో అని వదిలేశాడు. ఒంట్లో సత్తువ ఉన్నంతవరకు కష్టపడతానన్నాడు. నా కుమారుడు అంతటి దయామయుడు. ఒకసారి ఓ వ్యక్తి సాయం కావాలని వస్తే ఇంట్లో ఉన్న రూ.4 లక్షలూ ఇచ్చేశాడు. తనకంటూ ఏదీ ఉంచుకోడు. ఊరిలో కూడా ఓ గుడి కట్టించాడు' అని చెప్పుకొచ్చింది అమ్మాజి.
Comments
Please login to add a commentAdd a comment