భయపెడుతున్న వర్షాలు
ముందస్తు నూర్పిడి
కృత్తివెన్ను : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. గురువారం ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు పడటంతో ఆందోళన మరింత పెరింగింది. ప్రస్తుతం వరిచేలు అధికశాతం పాలు పోసుకుంటున్న, పొట్ట దశల్లో ఉన్నాయి. ఈ సమయంలో ఏమాత్రం గాలులు వీచినా, భారీ వర్షం పడినా పంట నీటిపాలవుతుందని రైతులు భయపడుతున్నారు. మండలంలో చాలా చోట్ల రబీ విత్తనాల కోసం కోసిన వరి పంటను పూర్తిగా ఎండకుండానే రైతులు హడావుడిగా నూర్చుకున్నారు.
జి.కొండూరు : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రైతులను కలవర పెడుతోంది. పంటలు చేతికి అందే సమయంలో కురుస్తున్న ఈ వర్షాలతో నష్టమేనని రైతులు భయపడుతున్నారు. తీతలకు సిద్ధంగా ఉన్న పత్తితో పాటు కోత దశకు చేరుతున్న వరి, టమోటా పంటలు దెబ్బతినే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు.
ముమ్మరంగా పత్తి తీతలు
నియోజకవర్గంలో జి.కొండూరు, మైలవరం, రెడ్డిగూడెం, ఇబ్రహీంపట్నం, విజయవాడ రూరల్ మండలాల్లో దాదాపు 30 వేల ఎకరాల్లో రైతులు పత్తి సాగుచేస్తున్నారు. ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లో మొదటి తీతలు పూర్తవుతున్నాయి. తీతలు ముమ్మరంగా సాగుతున్న గ్రామాల్లో పత్తి కొనుగోళ్లు కూడా ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఎకరాకు సుమారుగా ఐదు క్వింటాళ్ల వరుకు పత్తి దిగుబడి వస్తోంది.
కొన్ని పొలాల్లో పత్తి తీతకు సిద్ధంగా ఉండగా, మరి కొన్ని పొలాల్లో కాయలు పగిలే దశలో ఉన్నాయని రైతులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో పడుతున్న ఈ వర్షాలకు పత్తి పూర్తిగా దెబ్బతినటంతో పాటు మొక్క కింది భాగంలోని కాయలు కుళ్లిపోయే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. వర్షాలకు ముందు తీసిన పత్తి క్వింటాకు గరిష్టంగా రూ.3500లకు మించి వ్యాపారులు కొనుగోలు చేయని పరిస్థితి నెలకొందని, వర్షాలకు ధర మరింత తగ్గించి అడుగుతారని రైతులు పేర్కొంటున్నారు.
కోత దశకు చేరుకుంటున్న వరి...
ఇబ్రహీంపట్నం, విజయవాడ రూరల్, రెడ్డిగూడెం మండలాల్లో చెరువులు, బోర్ల కింద ముందస్తుగా సాగు చేసిన వరి చేలు కంకి దశకు చేరుకున్నాయి. ఈ తరుణంలో పడుతున్న వర్షాలకు పైరు నేలవాలి, కంకులపై నీరు చేరితే పూర్తిగా దెబ్బతింటామని రైతులు ఆందోళన చెందుతున్నారు. రెండు, మూడు సంవత్సరాల నుంచి వరి కోత దశకు చేరుకుంటున్న తరుణంలో కురుస్తున్న వర్షాల కారణంగా పైరు నేల వాలి దెబ్బతింటోందని ముత్యాలంపాడు గ్రామానికి చెందిన రైతు కోటేశ్వరరావు వాపోయారు. మరో వైపు టమోటా కోతలు ప్రారంభమయ్యాయి. తేలికపాటి నేలల్లో సాగయ్యే ఈ పంటకు నేలలో తేమ అధికమైతే మొక్కలు వడలి చనిపోయే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.