సాక్షి, ఖమ్మం : నాణ్యత లేని విత్తనాలతో ఏటా ఖరీఫ్‌లో వరి సాగు చేసిన రైతులు నష్టపోతున్నారు. గత ఏడాది ఏపీ సీడ్స్, ఇతర కంపెనీలు సరఫరా చేసిన వరి విత్తనాలు నాసిరకమని తేలగా, ఈ ఖరీఫ్‌లో కూడా ఇదే పరిస్థితి తలెత్తింది. కారేపల్లి మండలంలో నాటిన పదిహేను రోజులకే బెరుకులు రావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
గత ఖరీఫ్‌లో సత్తుపల్లి డివిజన్‌లోని సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ, కొణిజర్ల, ఖమ్మం రూరల్ మండలాల్లో లక్ష ఎకరాల్లో వరిసాగు చేశారు. ఏపీ సీడ్స్ సరఫరా చేసిన బీపీటీ-5204, నాగార్జున, గ్రోమోర్ కంపెనీలకు చెందిన సాంబమసూరి విత్తనాలు వేశారు. నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలో ఉన్న ఈ మండలాల్లో అప్పట్లో సాగు చేసిన వరి మరో నెలరోజుల్లో చేతికి వస్తుందనుకున్న తరుణంలో బెరుకులు కనిపించాయి.
పంటంతా ఇలాగే రావడంతో రైతులు తీవ్రంగా ఆందోళన చేశారు. ఈ కంపెనీలు సరఫరా చేసిన విత్తనాల్లో ఇతర రకాల వరి విత్తనాలు కలవడంతో పంటలో ఎక్కువగా బెరుకులు వచ్చాయి. ప్రధానంగా రైతులకు నమ్మకం కలిగించాల్సిన ఏపీ సీడ్స్ సరఫరా చేసిన విత్తనాల్లోనే నాణ్యత లేకపోవడం గమనార్హం. తమకు పరిహారం చెల్లించాలని అప్పట్లో రైతులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఫలితం లేకుండా పోయింది.
రైతులు తీవ్రంగా నష్టపోయినా ఇప్పటి వరకు వారికి ప్రభుత్వం నుంచి పరిహారం మాత్రం అందలేదు. ఈ విత్తనాలు సాగు చేసి నష్టపోయిన వారిలో ఎక్కువ మంది కౌలురైతులే. ఇక ఈ ఖరీఫ్‌లో వర్షాభావ పరిస్థితులున్నా సాగర్ ఆయకట్టుతో పాటు బోరు, బావులు, చెరువుల కింద రైతులు వరి సాగు చేశారు. ప్రస్తుతం పొలాలు కలుపు తీసే దశలో ఉన్నాయి. అయితే నాటిన పదిహేను రోజులకే బెరుకులు వస్తుండడంతో తాము వేసిన విత్తనాలు నాణ్యత లేనివని గ్రహించి రైతులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా కారేపల్లి మండలంలో నాణ్యతలేని విత్తనాలతో వరినాట్లు వేయడంతో బెరుకులు వచ్చాయి.
కారేపల్లిలో 500 ఎకరాల్లో..
ఈ ఖరీఫ్‌లో కారేపల్లి మండలంలో చెరువులు, బోరు బావుల కింద వరి సాగు చేశారు. ఎక్కువ దిగుబడి వస్తుందనే ఆశతో 1010 రకం విత్తనాలు వేశారు. రావోజితండా, గేటుకారేపల్లి, సీతరాంపురం, కమలాపురం, విశ్వనాథపల్లి, కారేపల్లి, చీమలగూడెం, పేరుపల్లి, మాదారం, మాణిక్యారం గ్రామాల్లో సుమారు 500 ఎకరాల్లో ఈ విత్తనాలే వేసినట్లు సమాచారం.
రావోజితండా, గేటుకారేపల్లి, కారేపల్లిలో నాటిన పదిహేను రోజులకే వరిలో బెరుకు కంకులు రావడంతో రైతులు ఈ విత్తనాలు కొనుగోలు చేసిన దుకాణాల వద్ద ఆందోళన చేశారు. బెరుకులు వచ్చిన విషయాన్ని కంపెనీలకు తెలియజేస్తామని దుకాణదారులు అంటున్నారు. అయితే తమ నష్టాన్ని ఎవరు పూడ్చుతారని రైతులు ఆందోళన చెందుతున్నారు. మూడు నెలల్లో చేతికి రావాల్సిన పంట అప్పుడే బెరుకుల కంకులు రావడంతో లబోదిబోమంటున్నారు. వేలకు వేలు అప్పులు తెచ్చి సాగు చేసిన పంట చేతికందే పరిస్థితి లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
ఎవరిదీ పాపం..
ఏసీ సీడ్స్, ఇతర ప్రైవేట్ డీలర్లు విక్రయించే విత్తనాలు నాణ్యమైనవేననే నమ్మకంతో రైతులు సాగు చేస్తున్నారు. అయితే వేలకు వేలు పెట్టుబడి పెట్టి, శారీరకంగా శ్రమించి.. తీరా పంట చేతికొచ్చే తరుణంలో ఇలా నష్టపోవాల్సి రావడంతో ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయశాఖ ముందస్తుగా మేల్కొని ఖరీఫ్ సీజన్‌లో పలు కంపెనీలు సరఫరా చేసే విత్తనాల నాణ్యత పరిశీలించాలి. కానీ ఇదేమి చేయకుండా ఆయా కంపెనీల వద్ద సదరు అధికారులు ముడుపులు తీసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి.
ఫలితంగా నాణ్యత లేని విత్తనాలతో కంపెనీలు రైతుల మీద ప్రయోగం చేస్తుండడంతో చివరకు అన్నదాతలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. గత ఖరీఫ్‌లో బెరుకుల వ్యవహారంతో జిల్లా రైతాంగం ఆందోళనతో కన్నెర్రజేసినా వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం ఇంకా నిద్రావస్థలోనే ఉండడం గమనార్హం.
బెరుకు..బెంగ
Published Mon, Oct 6 2014 2:50 AM | Last Updated on Sat, Sep 2 2017 2:23 PM
Advertisement
Advertisement