అన్ని రంగాల్లో దూసుకుపోతున్న స్వయం సహాయక సంఘాల మహిళలు సాగులోనూ సగం అని నిరూపిస్తున్నారు. మండల పరిధిలోని కంబాలపల్లి, వెల్టూర్ గ్రామాల్లో ఎన్‌పీఎం ఆధ్వర్యంలో వీరు పండిస్తున్న పంటలు సాగు రంగానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. వీటిని పరిశీలించేందుకు వస్తున్న దేశ, విదేశాల ప్రతినిధులు, అధికారులు భేష్ అని మెచ్చుకుంటున్నారు. మండలంలో ప్రస్తుతం 15 గ్రామాల్లో ఈ పద్ధతిన పలు రకాల పంటలు సాగవుతున్నాయి.
400 గ్రూపులకు చెందిన 4,792 మంది మహిళా రైతులు 10,393 ఎకరాల్లో శ్రీవరి, పసుపు, కంది, బెం డ, కాకర, వంకాయ, మిర్చి, టమాటా, సోరకాయ, బీరకాయ, ఆకు కూరలతో పాటు ఉల్లిగడ్డ తదితర పంటలను పండిస్తూ మంచి లాభాలు పొందుతున్నారు. ఎన్‌పీఎం తరఫున కంబాలపల్లి, పొట్టిపల్లి, మద్దికుంట, వెల్టూర్, నిజాంపూర్ గ్రామాలకు 50 వేలు మంజూరయ్యాయి. సేంద్రియ సాగుకు ముందుకు వచ్చే మహిళలకు ఎన్‌పీఎం నిధులను సమానంగా పంపిణీ చేశారు. స్త్రీనిధి ద్వారా కూడ కూరగాయల పంటలు పండించేందుకు మహిళలు డబ్బులు రుణంగా తీసుకున్నారు.
పంటచేతికి వచ్చిన తరువాత నెలసరి వాయిదాల్లో వీటిని తిరిగి చెల్లిస్తున్నారు. సేంద్రియ ఎరువులు తయారు చేసి విక్రయించేందుకు ముందుకు వచ్చిన గ్రామానికి చెందిన ఒక్కో మహిళకు రూ.10 వేలు అందజేశారు. ఈమె ఇంటి వద్ద ఎన్‌పీఎం దుకాణం ఏర్పాటు చేసి ఒక లీటరుకు రూ.2 నుంచి రూ.5 వరకు తీసుకుంటుంది. ఎన్‌పీఎం ఆధ్వర్యంలో మహిళలు పండించిన కూరగాయలను సదాశివపేట పట్టణానికి తరలించి విక్రయిస్తున్నారు.
ఎరువుల తయారీ ఇలా
రసాయనిక ఎరువులు వాడకుండా సేంద్రియ ఎరువులతోనే మహిళలు కూరగాయల పంటలు పండిస్తున్నారు. చీడపీడల నివారణకు ఎన్‌పీఎం దుకాణంలో ఎరువులు, మందులు కొనుగోలు చేస్తున్నారు. ఇందులో నాడెపు కంపోస్టు ఎరువు, నీమాస్త్రం, బ్రహ్మాస్త్రం, ఎరువులను వాడుతున్నారు.
నాడెపు కంపోస్టు
దీని తయారీకి ఇంటి వద్ద పెరట్లో ఇటుకలతో 60 ఫీట్ల పొడవు, మూడు ఫీట్ల వెడల్పు, మూడు ఫీట్ల ఎత్తులో గొయ్యి తీస్తారు. దీనిలో 100 కిలోల ఆకులు (ఏవైనా), వ్యర్థాలు వేసి వాటిపై ఆవుపేడ పూసి మూడు నెలల పాటు నిల్వ ఉంచ డంతో నాడెపు కంపోస్టు తయారవుతుంది. దీన్ని పంట వేసే ముందు దుక్కుల్లో వేసుకుంటే భూసారం పెరగడంతో పాటు మిత్ర పురుగులు వృద్ధి చెందుతాయి.
నీమాస్త్రం
కూరగాయ మొక్కలు మొలకెత్తాక ఎలాంటి చీడపీడలు సోకకుండా నీమాస్త్రం అందించాలి. ఒక ఎకరాకు సరిపడా ఎరువు, ద్రావణ తయారీకి.. 10 లీటర్ల ఆవు మూత్రం, 5 కిలోల ఆవుపేడ తీసుకుని డ్రమ్ములో వేసి 100 లీటర్ల నీటితో కలియబెట్టాలి. ఇలా 48 గంటలపాటు ఉంచాక నీమాస్త్రం తయారవుతుంది. దీన్ని నీటి కాలువల ద్వారా కానీ, మొక్కలపై కానీ పిచికారీ చేసుకోవాలి. 15 రోజులకు ఒకసారి దీన్ని మొక్కలకు అందించాలి.
బ్రహ్మాస్త్రం
మొక్కలకు తెగుళ్లు సోకకుండా దీన్ని వాడతారు. దీని తయారికి ఐదు రకాల చెట్ల ఆకులను 2 కిలోల చొప్పున తీసుకుని ముద్దగా నూరి 10 లీటర్ల ఆవు మూత్రంలో కలపాలి. ఒక పాత్రలో పోసి మూతపెట్టి అరగంటపాటు ఉడకబెట్టాలి. ద్రావణం చల్లారిన తర్వాత గుడ్డతో వడబోయాలి. ఇది ఒక ఎకరాకు సరిపోతుంది. 100 లీటర్ల నీటికి 2 నుంచి 3 లీటర్ల బ్రహ్మాస్త్రాన్ని కలిపి 10 రోజులకు ఒకసారి మొక్కలపై స్ప్రే చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
సాగులో.. స్వయంకృషి
Published Tue, Nov 18 2014 11:47 PM | Last Updated on Sat, Sep 2 2017 4:41 PM
Advertisement
Advertisement