మండలంలోని గూడెం ఊరు రైతులంతా శ్రీవరి సాగు పద్ధతిని పాటిస్తున్నారు. దీంతో చుట్టుపక్కల గ్రామాల రైతులు వీరిని ఆదర్శంగా తీసుకుంటున్నారు.
షాబాద్: మండలంలోని గూడెం ఊరు రైతులంతా శ్రీవరి సాగు పద్ధతిని పాటిస్తున్నారు. దీంతో చుట్టుపక్కల గ్రామాల రైతులు వీరిని ఆదర్శంగా తీసుకుంటున్నారు. నాలుగేళ్ల క్రితం గూడెం గ్రామానికి చెందిన రైతు శ్రీవరి పద్ధతికి శ్రీకారం చుట్టారు. గ్రామంలోని మిగతా రైతులకు వివరించారు. మొదట తనకున్న ఎకరం పొలంలో శ్రీవరి సాగుచేశారు. ఈ పద్ధతిలో ఒక పంట పొందేందుకు సంప్రదాయ పద్ధతిలో అవసరమయ్యే నీటిలో కేవలం 40 శాతం నీరు ఉంటే చాలు.
నీటి సమస్య, విద్యుత్ సమస్యలు ఉన్నప్పటీకీ శ్రీవరి సాగు ద్వారా పంట నష్టపోవడం ఉండదని గ్ర హించారు. దిగుబడి బాగా రావడంతో మిగతావారు అదే పద్ధతిలో వరి సాగు చేయడం మొదలుపెట్టారు. మండలంలోని రైతులు ప్రస్తుతం 30 ఎకరాల్లో సాగు చేశారు. సంప్రదాయ పద్ధతిలో సాగు చేసిన వరి ఎకరాకు 25 నుంచి 30 బస్తాలలోపు దిగుబడి చేతికొస్తుంది. శ్రీవరి పద్ధతిలో ఐతే ఎకరాకు 40 నుంచి 60 బస్తాల వరకు దిగుబడి పొందుతున్నారు.
శ్రీవరి సాగు ఇలా..
మొదట సాగు పొలాన్ని కరిగెటుగా సిద్ధం చేసుకోవాలి. ఎంచుకున్న వరి విత్తనాలను ఒకరోజు నీటిలో నానబెట్టి మరుసటి రోజు మండె కట్టాలి. వరినారు మడి ఎత్తులో ఉండేందుకు పశువుల ఎరువు వేసి అర్ధ అడుగు ఎత్తు పెంచుకోవాలి. అనంతరం మూడవరోజు నారుమడి మొలక వచ్చిన విత్తనాన్ని చల్లాలి. లేత నారు (12 రోజుల లోపు) నాటువేయాలి.
నాటు విధానంలో కొలతలు...
నాటు వేసే విధానంలో శ్రీవరికి కొన్ని కొలతలున్నాయి. పొడవు, వెడల్పులో అనగా సాళ్ల మధ్య 10 ఇంచుల దూరం పాటించి నాటు పెట్టాలి. దీని ద్వారా మొక్కలకు గాలి విరివిగా సోకి ఏపుగా పెరుగుతాయి. ప్రతి 10 రోజులకోసారి కలుపుతీత వేర్లకు పిలకలు ఎక్కువ రావడానికి సాళ్ల మధ్యన వీడర్ అనే చిన్నపాటి పరికరంతో తిప్పాలి. పొలంలో నీళ్లు పలుచని పార మాదిరి పెట్టి తొలగించాలి. సస్యరక్షణకు సాధారణ పద్ధతులు వాడవచ్చు.