నిజామాబాద్ వ్యవసాయం:నిజామాబాద్ జిల్లాకేంద్రానికి చెందిన బైర సుభాష్ ఉన్నత చదువులు చదివారు. ఉపాధి కోసం హైదరబాద్‌తో పాటు వివిధ దేశాలకు వెళ్లారు. అలా సింగపూర్ వెళ్లినప్పుడు ఆయన ఓ గోట్ డెయిరీని చూశారు. బర్రెలు, ఆవుల డెయిరీల గురించే తెలిసిన ఆయన దాన్ని ఆసక్తిగా పరిశీలించారు. ఆ దేశంలో పాల కోసం మేకలను పెంచుతారు.
అయితే మనదేశంలో మేకలు, గొర్రెల మాంసానికి మంచి డిమాండ్ ఉంటుందన్న విషయాన్ని గ్రహించారు. అలా సుభాష్ స్వదేశానికి తిరిగి వచ్చి నాలుగేళ్ల క్రితం డిచ్‌పల్లి మండలం రాంపూర్ గ్రామ శివారులో సుమారు 25ఎకరాల్లో గొర్రెలు, మేకల పెంపకం కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వాటికి కావల్సిన దాణాను సైతం స్వయంగా సమకూర్చుకుంటున్నారు.
పెట్టుబడి
గొర్రెల పెంపకం కేంద్రానికి కావల్సిన పెట్టుబడి, ఖర్చులు, ఆదాయం వివరాలను సుభాష్ వివరించారు. మొత్తం పెట్టుబడి రూ.12లక్షలు అవసరం ఉంటుంది. రూ.3లక్షలు పెడితే.. మిగితా రూ.9లక్షలు బ్యాంకు రుణం ఇస్తుంది. దీనికి రూ.రెండున్నర లక్షలు సబ్సిడీని జాతీయ పశుగణాభివృద్ధి సంస్థ(నేషనల్ లైవ్ స్టాక్‌మిషన్) ద్వారా వస్తుంది.
ఏర్పాటు చేయడానికి స్థలం
వంద ఆడ గొర్రెలు, ఐదు మగ గొర్రెలు(పొట్టేళ్లు) కలిపి ఒక యూనిట్ అంటారు. వీటికి మూడు ఎకరాల స్థలం కావాలి. ఇందులో రెండు ఎకరాల్లో గడ్డిజాతి పశుగ్రాసం, ఎకరంలో పప్పుజాతి పశుగ్రాసం పెంచాలి.
ఖర్చు
పెంపకం కేంద్రం నడపడానికి ఇద్దరు కార్మికులు అవసరం. వీరికి నెలకు రూ.6వేల చొప్పున ఇద్దరికి కలిపి రూ.12వేలు అవుతుంది. పశుగ్రాసం పెంపకం కోసం రూ.6వేలు, ఆరోగ్య సంబంధ టీకాలు, మందుల కోసం రూ.6వేలు, మిశ్రమ దాణా కోసం రూ.15వేలు. మొత్తం ఒక నెలకు రూ.39వేలు ఖర్చు అవుతుంది. ఈ లెక్కన 8 నెలలకు మొత్తం రూ.3లక్షల 12వేలు ఖర్చు.
లాభాలు
పుట్టిన గొర్రె పిల్లలను 8 నెలలు పెంచాలి. ఈ 8 నెలల్లో దాదాపుగా 30 కిలోల బరువు పెరుగుతుంది. ఒక్కో కిలోకు రూ.250 చొప్పున 30కిలోలకు రూ.7500 వస్తాయి. వంద గొర్రెలను పెంచితే అందులో పదిశాతం మృతిచెందినా దాదాపు 81పిల్లలు ఉంటాయి. 8 నెలల తర్వాత అవి 30 కిలోల బరువు అవుతాయి. ఈలెక్కన 81 గొర్రెలకు 2,430 కిలోల మాంసం అవుతుంది. దీన్ని కిలో రూ. 250 చొప్పున విక్రయిస్తే రూ. 6లక్షల 7వేల 5వందలు వస్తాయి. ఇందులో నుంచి పెట్టుబడి రూ.3లక్షల 12వేలు తీసివేస్తే.. రూ.2లక్షల 95వేల 5వందలు మిగులుతాయి. ఇది 8 నెలల ఆదాయం.
జీవాలతో జీవానోపాధి
Published Thu, Nov 20 2014 3:31 AM | Last Updated on Sat, Sep 2 2017 4:45 PM
Advertisement
Advertisement