శీతాకాలంలో గొర్రెల, మేకల సంరక్షణ | Care of sheep and goats in the winter | Sakshi
Sakshi News home page

శీతాకాలంలో గొర్రెల, మేకల సంరక్షణ

Published Tue, Dec 17 2019 2:44 AM | Last Updated on Tue, Dec 17 2019 2:44 AM

Care of sheep and goats in the winter - Sakshi

పశువులకు శీతాకాలం ఒక గడ్డు కాలం. వీటి ఉత్పాదకత తగ్గకుండా చలి బారి నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. పెద్ద పొట్ట పశువులే కాకుండా, గొర్రెలు, మేకలు కూడా శీతాకాలం ప్రభావానికి లోనవుతాయి. మెలకువలు పాటించడం శ్రేయస్కరం.

శీతాకాలంలో గొర్రెల యాజమాన్యం:
1.    గొర్రెలకు తప్పనిసరిగా గృహవసతి ఉండాలి. కనీసం చెట్టు నీడనన్నా ఉంచాలి. ముఖ్యంగా రాత్రి వేళల్లో మంచు బారిన పడకుండా చూడాలి.
2.    ఇటీవల ఉన్నిని కత్తిరించిన గొర్రెలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. చలి నుంచి రక్షణ ఇవ్వాలి.
3.    అప్పుడే పుట్టిన గొర్రెపిల్లల మీద ఉన్న మాయ తాలూకు తడిని వెంటనే శుభ్రం చేయాలి. లేదంటే శరీర ఉష్ణోగ్రత తగ్గిపోయి ‘హైపోధర్మియ’ అనే పరిస్థితి ఏర్పడుతుంది.
4. ఈతకు వచ్చిన గొర్రెలను శ్రద్ధగా పర్యవేక్షించాలి.
5.    రెండు నెలల వయస్సున్న గొర్రె పిల్లలు చలిని తట్టుకుంటాయి. కానీ షెడ్లలో తేమతో కూడిన వాతావరణం ఉన్నట్లయితే న్యూమోనియా ప్రబలే అవకాశముంది.
6.    శీతాకాలంలో శరీర ఉష్ణాన్ని కాపాడుకునేందుకు శరీరంలో జీర్ణప్రక్రియ ద్వారా ఉత్పత్తి అయ్యే వేడిని గొర్రెలు బయటకు పంపవు. కాబట్టి శరీర ఉష్ణ నిర్వహణకు పీచు పదార్థం గల మేతను మేపాలి.
7.    చూడి 15 వారాల సమయంలో సుమారు 2 కిలోల పచ్చిమేతను అందించాలి. జొన్న, మొక్కజొన్న, సజ్జ లాంటివన్నమాట. చివరి 4 వారాల చూడి దశలో వీటితోపాటుగా 500 గ్రాముల మొక్కజొన్న పిండిని ఇవ్వాలి.
8.    గొర్రె ఈనిన తర్వాత 2.5 కిలోల పచ్చిమేతతోపాటుగా 15% ప్రొటీను గల సమీకృత దాణాను ఒక కిలో ఇవ్వాలి.
9.    మంచి నీరు నిల్వ లేకుండా అవసరాన్ని బట్టి అందుబాటులో ఉంచాలి.


మేకల యాజమాన్యం
1.    మందమైన పొడవాటి వెంట్రుకలు చలి నుంచి కాపాడుతాయి.
2.    పరిశుభ్రమైన వెచ్చటి గడ్డితో కూడుకున్న పక్కను ఏర్పాటు చేయాలి.
3.    పెద్ద మేకలకు గృహవసతి లేకున్నా.. చిన్న పిల్లలకు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి.
4.    గొర్రెలకన్నా మేకలు ఎక్కువ పీచును జీర్ణం చేసుకోగలుగుతాయి. ఎక్కువ పీచు పదార్థాలు కలిగిన చెరకు పిప్పి, పొద్దుతిరుగుడు మొక్కలు, ఎండిన కంది కట్టె వంటి వాటిని మేపవచ్చు.
5.    మేకల్లో ఈ సీజన్‌లో ఎక్కువగా పేలు కనబడతాయి. వాటి నుంచి రక్షణ అవసరం.
6.    ఖనిజ లవణ ఇటుకలను షెడ్లలో గాని, చెట్లకు గాని వేలాడదీయాలి.

– డా. ఎం.వి.ఎ.యన్‌. సూర్యనారాయణ (99485 90506), ప్రొఫెసర్‌ – అధిపతి, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ లైవ్‌స్టాక్‌ ఫామ్‌ కాంప్లెక్స్, కాలేజ్‌ ఆఫ్‌ వెటర్నరీ సైన్స్, తిరుపతి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement