ఓ ప్రవాస భారతీయుడు చొరవతో మేలైన సంకరజాతి మేకల జాతిని ఉత్పత్తి చేశారు. ఇది మాంసోత్పత్తికి, పాల దిగుబడికి రెండు విధాలుగా ఉపయోగపడే మేకల జాతి కావడం విశేషం. వేగంగా పెరగడంతో పాటు రుచికరమైన మాంసాన్ని అందిస్తుంది. ఈ జాతి మేకలు రోజుకు రెండు లీటర్ల వరకు పాలు కూడా ఇస్తుండటంతో రైతుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.
డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రరల్ మండలం భట్లపాలెం చెందిన కె.నాగేశ్వరరావు 21 ఏళ్లుగా సింగపూర్‌లో ఓ నిర్మాణ సంస్థలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నారు. కరోనా సమయంలో స్వస్థలానికి వచ్చిన ఆయన ఇక్కడే వ్యవసాయాన్ని వాణిజ్య స్థాయిలో చేపట్టాలని నిర్ణయించుకున్నారు. కొంతకాలం ఆక్వా సాగు చేసిన తర్వాత మేకల పెంపకంపై దృష్టిసారించారు. మేలైన విదేశీ మేకలను తీసుకువచ్చి స్థానిక మేకలతో క్రాసింగ్ చేయించారు. అమలాపురం సమీపంలోని కామనగరువులోని వ్యవసాయ క్షేత్రంలో వీటిని పెంచుతూ చక్కని ఫలితాలు సాధిస్తున్నారు.
దక్షిణాఫ్రికా బోయర్ రకం
ఇటు మాంసం ఉత్పత్తికి, అటు పాల దిగుబడికి ఉపయోగపడే దక్షిణాఫ్రికాకు చెందిన బోయర్ రకం మేకల మాంసం రుచిగా ఉంటుంది. వేగంగా పెరుగుతుంది. ఒక్కోటి రూ.3 లక్షల వ్యయంతో దక్షిణ ఆఫ్రికా బోయర్ రకం విత్తన పొట్టేళ్లను దిగుమతి చేసుకున్నారు. ఈ పొట్టేలు బరువు ఏకంగా 140 కేజీల వరకు ఉంటుంది. ఆ జాతి విత్తన పొట్టేళ్లను దిగుమతి చేసుకొని స్థానిక జాతులతో సంకరం చేయటం వల్ల ఉత్తమ ఫలితాలు ఉంటాయని భావించారు. ఆ విధంగానే పొటేళ్లను దిగుమతి చేసుకొని.. రాజస్థాన్‌కు చెందిన అజ్మీర్, సిరోహి, కేరళకు చెందిన తలచేరి, పంజాబ్‌కు చెందిన బిటిల్ రకాల మేకలతో సంకరం చేయించారు. దీంతో ప్రయోగం విజయవంతమైంది.
8 నెలల్లోనే 40 కిలోలు..
తమ వ్యవసాయ క్షేత్రంలో ఈ క్రాస్ బ్రీడ్ (సంకర జాతి) మేకల సంతతి స్థానిక రకాల కన్నా వేగంగా బరువు పెరుగుతున్నట్లు నాగేశ్వరరావు తెలిపారు. స్థానిక దేశవాళి మేక రెండేళ్లలో గరిష్ఠంగా 40 కేజీలు బరువు పెరుగుతుంది. ఈ సంకరజాతి మేక 8 నెలల్లోనే ఈ బరువుకు పెరుగుతోంది. రెండేళ్లలో 70 కేజీలవుతోంది. ఆడ మేక రోజుకు రెండు లీటర్ల వరకు పాలు ఇస్తోందని ఆయన వివరించారు.
ఇంటిగ్రేటెడ్ పద్ధతిలో సంకర జాతి మేకలు పెంచుతున్నారు. ఇది ఖర్చుతో కూడుకున్న వ్యహారమే అయినా మేకలు 2–3 రెట్ల బరువు పెరుగుతాయి. నాణ్యమైన, రుచికరమైన మాంసం ద్వారానే కాకుండా, పాల ద్వారా రోజువారీ ఆదాయాన్ని పొందే అవకాశముంది. బోయర్ జాతి లక్షణాలు 100 శాతం స్థానిక బ్రీడ్‌లో తెప్పించే దిశగా ప్రయత్నిస్తున్నారు.
క్రాస్ బ్రీడింగ్ ద్వారా వచ్చే సంతతిని రైతులకు ఒక పొట్టేలుకు 20 మేకలను యూనిట్‌గా విక్రయిస్తున్నారు. మాంసం రిటెయిల్ విక్రయించడానికి అవుట్‌లెట్ ఏర్పాటు చేయబోతున్నామని నాగేశ్వరరావు వివరించారు. వీటికి క్రమం తప్పకుండా వ్యాక్సినేషన్ చేస్తే జబ్బుల బారినపడే అవకాశం చాలా తక్కువని నాగేశ్వరరావు అన్నారు.
– నిమ్మకాయల సతీష్ బాబు,
సాక్షి, అమలాపురం
నాణ్యమైన బ్రీడ్ అభివృద్ధే లక్ష్యంమన ప్రాంతంలో దేశవాళీ మేక మాంసం కన్నా నాణ్యమైన, రుకరమైన మాంసం అందించే సంకర జాతి బ్రీడ్‌ను అందుబాటులోకి తేవాలన్నదే నా కోరిక. విదేశీ బ్రీడ్ మేక పిల్లలను దిగుమతి చేసుకొని ఇక్కడ పెంతే స్థానిక వాతావరణానికి ఎంతగా తట్టుకుంటాయో చెప్పలేం. అందుకే దక్షిణాఫ్రికా బోయర్ రకంతో స్థానిక రకాలను సంకరం చేసి కొత్త బ్రీడ్‌ను రపొందిస్తున్నాం. తద్వారా మేలు రకం వంసం ఉత్పత్తి చేయగలుగుతున్నాం. ఈ సంకర జాతి మేకలు పూర్తిస్థాయిలో బోయర్ గుణగణాలను సంతరించుకునేందుకు మూడు, నాలుగేళ్ల సమయం పడుతుంది. ఈ సంకరజాతి మేకలు స్థానిక వాతావరణాన్ని తట్టుకుంటాయి.
– కె. నాగేశ్వరరావు (99235 44777), కామనగరువు,
డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా శాస్త్రీయ పద్ధతిలో మేలు జాతి ఉత్పత్తి
స్థానిక దేశవాళీ మేకల పెంపకం కన్నా మేలైన రకాల నుంచి ఉత్పత్తి అయ్యే సంకర జాతి మేకలు త్వరగా ఎదుగుతాయి. నాణ్యమైన మాంసం ఉత్పత్తి అవుతుంది. రైతు నాగేశ్వరరావు శాస్త్రీయ పద్ధతిలో మేలు జాతి మేకలను ఉత్పత్తి చేస్తున్నారు. ఈ జాతి ద్వారా మేకల పెంపకందారులు అధిక మాంసం, పాల దిగుబడి సాధించే అవకాశముంది.
– విజయ రెడ్డి, సహాయ సంచాలకులు, పశు సంవర్ధక శాఖ,
అమలాపురం, డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా
నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్.
Comments
Please login to add a commentAdd a comment