ఆదిలాబాద్ అగ్రికల్చర్ : పంట సాగులో ఇబ్బందులు ఎదుర్కొం టున్నారా..? తెగుళ్లు, చీడపీడల నివారణకు ఏ మందు పిచికారీ చేయాలో తెలియడం లేదా..? పంటలో ఎదుగుదల లోపించిందా..? అయితే ఒక్క ఫోన్ కొట్టండి చాలు. ఇట్టే పరిష్కారం మార్గం లభిస్తుంది. చేనులోనే ఉండి పైసా ఖర్చు లేకుండా పంటలకు సంబంధించిన సస్యరక్షణ చర్యలు తెలుసుకోవచ్చు.
అందుకు రైతుల వద్ద సెల్‌ఫోన్ ఉంటే చాలు. ఎలాంటి సమస్యనైనా అధిగమించవచ్చు. ‘కిసాన్ కాల్‌సెంటర్’కు ఫోన్ చేస్తూ అక్కడ ఉండే వ్యవసాయ శాఖ ప్రతినిధులు రైతుల సమస్యలు తెలుసుకుని సలహాలు, సూచనలు అందిస్తారు.
సమస్యలు తెలియజేసేందుకు..
సాగులో ఎదుర్కొంటున్న పంటల చీడపీడల నివారణకు కిసాన్ కాల్ నంబర్లు 1551 లేదా 18001801551, 18004251556, 18004251110కు ఫోన్ చేస్తే ‘కిసాన్ కాల్ సెంటర్’కు స్వాగతం అని వినిపిస్తుంది. కాసేపటి తర్వాత అక్కడి ప్రతినిధులు మిమ్మల్ని పలుకరిస్తారు. జిల్లా, మండలం, గ్రామం, రైతు పేరు, పంట సాగు విస్తీర్ణంపై ప్రశ్నలు అడుగుతారు.
పంటల సాగులో సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి ఏం చేయాలో సూచిస్తారు. ఉదయం 6గంటల నుంచి రాత్రి 10గంటల వరకు వీరు అందుబాటులో ఉంటారు. రాత్రి 11గంటల తర్వాత ఫోన్ చేసినా కూడా మీ నంబరు అక్కడ రికార్డు అవుతుంది. ఉదయం కాల్‌సెంటర్ సిబ్బంది రాగానే ఫోన్ చేసి సందేహాలను నివృత్తి చేస్తారు.
సంక్షిప్తంగా సూచనలు కావాలంటే..
సాంకేతిక సమాచారం సలహా, సూచనలను సంక్షిప్త సందేశం ద్వార వినేందుకూ ఇందులో వీలుంది. ఇం దుకోసం చేయాల్సిందల్లా.. ‘అగ్రిస్.నెట్’ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఎస్సెమ్మెస్ ద్వారా సూచనలు పొందేందు కు అంటూ కనిపించే అక్షరాలపై నొక్కాలి. ప్రత్యక్షమయ్యే దరఖాస్తు పత్రంలో పేరు, ఫోన్ నంబరు, రాష్ట్రం, మండలం, గ్రామం, విస్తీర్ణం వివరాలు నింపాలి.
సలహాలు, సూచనలు మెస్సెజ్ ద్వారా కావాలా..? ఫోన్ ద్వారా వినాలనుకుంటున్నారా..? అనే రెండింటిలో ఏదో ఒక దాన్ని ఎంచుకోవాలి. అనంతరం వ్యవసాయం, పశువైద్యం, ఉద్యానవన, మత్స్యశాఖకు సంబంధించి ఏది అవసరమైతే దానిని ఎంపిక చేసుకోవాలి. వివరాలను అందులో పొందుపరిస్తే ‘కిసాన్ కాల్‌సెంటర్’ నుంచి సలహాలు, సూచనలు అందుతాయి.
ఫోన్ కొట్టు.. పరిష్కారం పట్టు..
Published Thu, Oct 2 2014 1:49 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement