అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ ‘సెంటర్ ఫర్ అగ్రికల్చర్ అండ్ బయోసైన్స్ ఇంటర్నేషనల్’ (సిఎబిఐ – కాబి) రైతులకు అవసరమైన ప్రామాణికమైన శాస్త్రీయ సమాచారాన్ని తన వెబ్‌సైట్, యాప్‌ల ద్వారా తెలుగులో కూడా అందుబాటులోకి తెచ్చింది. గత 110 సంవత్సరాల నుంచి పురుగులు, తెగుళ్ల యాజమాన్యంపై పరిశోధనలు చేస్తున్న ‘కాబి’తో 48 దేశాలకు చెందిన వ్యవసాయ సంస్థలు కలసి పనిచేస్తున్నాయి. మన ఐసిఎఆర్ కూడా ఇందులో మెంబరే.
ఈ నేపథ్యంలో సుస్థిర వ్యవసాయ కేంద్రం తోడ్పాటుతో ప్లాంట్‌వైస్ ప్లస్ టూల్ కిట్’ పేరుతో డిజిటల్ టూల్స్‌ని ‘కాబి’ ఇటీవల తెలుగు, హిందీల్లోనూ అందుబాటులోకి తెచ్చింది. రైతులకు, విస్తరణ అధికారులకు, డీలర్లకు, విద్యార్థులకు, పరిశోధకులకు ఇవి ఉపయోగకరం.
వెబ్‌సైట్, అనేక యాప్‌ల ద్వారా రైతులకు శాస్త్రీయంగా సరైన సలహాలు పొందొచ్చు. ఇందులో నాలెడ్జ్ బ్యాంక్ పోస్టర్లు, కరపత్రాలు, రైతుల కోసం ఫ్యాక్ట్‌షీట్‌లు, వీడియో ఫ్యాక్ట్‌షీట్లు అందుబాటులో ఉన్నాయి. పంట ఆరోగ్యంపై సమాచారం తెలుసుకోవటం, పురుగుమందుల మోతాదులను లెక్కించటం, ఎరువుల అవసరాలను నిర్ణయించటం, పంట సమస్యను గుర్తించటం, చీడపీడల నియంత్రణకు పురుగుమందులను కనుగొనటం, పురుగులను– తెగుళ్లను గుర్తించే నైపుణ్యాలను మెరుగుపరచుకోవటం, చీడపీడల నియంత్రణ పద్ధతులను సిఫారసు చేయటం, తెగుళ్ల నిర్వహణపై శిక్షణ.. తదితర సమాచారం / నైపుణ్యాలను కాబి వెబ్‌సైట్, డిజిటల్ టూల్స్ అందిస్తాయి.
కాబి బయోప్రొటెక్షన్ పోర్టల్ యాప్ కోసం ఈ క్యుఆర్ కోడ్‌ను స్కాన్ చేయండి
ఇవన్నీ తెలుగులో ఉచితంగా అందుబాటులో ఉండటం వల్ల మహిళా రైతులు కూడా సులువుగా వాడుకునేందుకు వీలవుతుంది. ఈ వనరులను ఉపయోగించుకోవడానికి మనకు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ లేదా టాబ్లెట్ లేదా కంప్యూటర్ /ల్యాప్‌టాప్‌తో ఇంటర్నెట్ సదుపాయం ఉంటే చాలు.
మొక్కల ఆరోగ్య సమాచారం విభాగంలో.. మన దేశానికి సంబంధించిన పంటల ఆరోగ్యం, తెగుళ్ల నిర్వహణపై సమాచారం ఉచితంగా అందుబాటులో ఉంటుంది. ప్లాంట్‌వైజ్ ఫ్యాక్ట్‌షీట్ లైబ్రరీ’ అనే ఉచిత యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని తెగుళ్ల నిర్థారణ, సురక్షిత నిర్వహణకు ఉపయోగపడే తాజా సమాచారం తెలుసుకోవచ్చు. మొక్కల రక్షణ మద్దతు విభాగంలో.. ‘క్రాప్ స్ప్రేయర్ యాప్’ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
కాబి క్రాప్ స్ప్రేయర్ యాప్ కోసం ఈ క్యుఆర్ కోడ్‌ను స్కాన్ చేయండి
సురక్షితమైన పురుగుమందులు, వాటి మోతాదును లెక్కించడానికి సహాయపడుతుంది. ‘కాబి బయోప్రొటెక్షన్ పోర్టల్’ అనే ఉచిత వెబ్‌సైట్ పంట తెగుళ్లను నయం చేయటానికి స్థానికంగా నమోదైన బయో పెస్టిసైడ్స్‌ను కనుగొనటంలో, ఉపయోగించటంలో సహాయపడుతుంది. రైతులకు లోతైన అవగాహన కలిగించడం కోసం డిజిటల్ లెర్నింగ్ కోర్సులు కూడా ఉన్నాయి. పంట తెగులు నిర్థారణ కోర్సు, పంటల చీడపీడల యాజమాన్య కోర్సు, బయోప్రొటెక్షన్ ్రపోడక్ట్స్ కోర్సు అందుబాటులో ఉంది.
26న ‘బయోచార్ కార్బన్ క్రెడిట్స్’పై సదస్సు..
బయోచార్ (కట్టె బొగ్గు)ను పంట వ్యర్థాలు, తదితర బయోమాస్‌తో భారీ ఎత్తున యంత్రాలతో ఉత్పత్తి చేస్తూ ‘కార్బన్ క్రెడిట్స్’ పొందుతున్న వాణిజ్య సంస్థల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇటువంటి సంస్థలకు మార్గదర్శకత్వం నెరిపేందుకు హైదరాబాద్ కేంద్రంగా ప్రొగ్రెసివ్ బయోచార్ సొసైటీ’ ఇటీవల ఏర్పడింది. దీని ఆధ్వర్యంలో ‘బయోచార్ ఉత్పత్తి పరికరాలు–కార్బన్ క్రెడిట్స్’ అనే అంశంపై జూన్ 26న ఉ. 9.30 గం. నుంచి హైదరాబాద్ యూసఫ్‌గూడలోని నిమ్స్‌మే ఆడిటోరియంలో జాతీయ సదస్సు జరగనుంది. ‘మేనేజ్’ డైరెక్టర్ జనరల్ డా. పి. చంద్రశేఖర ముఖ్య అతిథి. రిజిస్ట్రేషన్ వివరాలకు.. 63051 71362.
– నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్
Comments
Please login to add a commentAdd a comment