వ్యవసాయ రంగంలో నూతన పథకాలు.. ఆవిష్కరణలు
అందుబాటులోకి నీటి లభ్యత.. మేలైన వంగడాల వృద్ధి
విత్తనాల దిగుమతి నుంచి ఎగుమతి స్థాయికి తెలంగాణ
‘సాక్షి’తో వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం
‘వ్యవసాయ రంగంలో తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతోంది.. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు పోతున్నాం.. విత్తనాల తయారీ, ఉత్పత్తిలో ముందడుగు వేశాం.. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ విత్తనాలపై ఆధారపడి ఇప్పుడు విత్తనాలు ఎగుమతి చేసే స్థాయికి వచ్చాం.. వివిధ రాష్ట్రాల నుంచి మన విత్తనాలు కావాలని ఇండెంట్ పెడుతున్నారు’ అని వరంగల్ వ్యవసాయ పరిశోధన స్థానం సహ పరిశోధన సంచాలకుడు డాక్టర్ ఆర్.ఉమారెడ్డి తెలిపారు. ఆదివారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
స్వరాష్ట్రంలో మూడు వ్యవసాయ కళాశాలలు..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయమే ఉండగా.. తెలంగాణ రాష్ట్రంలో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, పీవీ.నరసింహారావు వెటర్నటీ, కొండా లక్ష్మణ్‌బాపూజీ ఉద్యాన యూనివర్సిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వరంగల్, జగిత్యాల, పాలెం (మహబూబ్‌నగర్ జిల్లా)లో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానాలకు అనుబంధంగా వ్యవసాయ కళాశాలలను నెలకొల్పింది. గతంలో ఇతర రాష్ట్రాలకు వెళ్లి వ్యవసాయ విద్యనభ్యసించేవారు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలోని వ్యవసాయ కళాశాలలలో విద్యార్థులకు పరిశోధనతోపాటు బోధన జరుగుతోంది. వరంగల్‌కు వెటర్నరీ కళాశాల కూడా వచ్చింది.
పెరిగిన సాగువిస్తీర్ణం..
సమృద్ధిగా వర్షాలు కురవడంతోపాటు ప్రాజెక్టులు నిర్మాణం పూర్తి అయ్యింది. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో నీటి ల«భ్యత, సాగు విస్తీర్ణం పెరిగింది. ధాన్యం, పత్తి దిగుబడి ఎక్కువగా వస్తోంది. ఇతర రాష్ట్రాలకు ధాన్యం ఎగుమతి చేస్తున్నాం. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు పోతున్నాం. సాగులో వినూత్న పద్ధతులు అవలంబిస్తూ అధిగ దిగుబడి సాధిస్తున్నాం. కూలీల కొరతను అధిగవిుంచేందుకు యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి.
మెరుగైన రైతుల ఆర్థికపరిస్థితి..
సాంకేతికతతో పంట దిగుబడులు పెరగడంతో రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగైంది. అధిక సాంద్రత పత్తితో రైతులు లాభసాటి సాగు చేస్తున్నారు. పత్తి తీసివేసిన తర్వాత మరో పంట సాగు చేస్తున్నారు. గతంలో పత్తి తర్వాత ఈ భూమిలో పంట వేయకుండా వదిలేసే వారు. రైతులు పెట్టుబడి కోసం ఎదురుచూడకుండా ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని తీసుకొచి్చంది. సకాలంలో పెట్టుబడి అందుతుండడంతో విత్తనాలు, ఎరువులు సమకూర్చుకుంటున్నారు. ‡రైతుబీమా రైతు కుటుంబానికి భరోసా కల్పించింది. ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లిస్తోంది. బీమా చేయించిన రైతు చనిపోతే ఆ కుటుంబానికి రూ.5 లక్షల సొమ్ము వస్తుంది.
అనుబంధ రంగాలకు ప్రోత్సాహం..
వ్యవసాయ అనుబంధ రంగాల్లో నూతన పథకాలు అమలవుతున్నాయి. పశువైద్య, పశుసంవర్థక శాఖ ద్వారా గొర్రెల పంపిణీ పథకం చేపట్టారు. దీంతో పెంపకందారులకు ఆదాయం సమకూరుతోంది. అదేవిధంగా ఉచితంగా చేప పిల్లల పంపిణీతో మత్స్యకారులకు జీవనోపాధి కలుగుతోంది. ఉద్యానశాఖ ద్వారా పండ్ల తోటలు, ఆయిల్‌పామ్ తోటల పెంపకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.
ప్రతీ 5 వేల ఎకరాలకు ఒక క్లస్టర్..
ఏఓలు, ఏఈఓల నియామకాన్ని ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టింది. ప్రతి 5 వేల ఎకరాలకు ఒక క్లస్టర్‌ను ఏర్పాటు చేసి ఒక ఏఈఓను నియమించింది. రైతులకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అందించేందుకు, రైతుల సందేహాలు తీర్చుకునేందుకు ప్రతి క్లస్టర్‌లో రైతు వేదిక నిర్మించింది. రైతు నేస్తం కార్యక్రమం ద్వారా ప్రతి మంగళవారం శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు రైతులకు అందిస్తున్నారు.
వాట్సాప్ ద్వారా రైతుల సందేహాల నివృత్తి..
వారంలో రెండు రోజులు వాతావరణ పరిస్థితులు వివరిస్తుండడంతో రైతులు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటునానరు.అదేవిధంగా పీజేటీఎస్ ఏయూ యూట్యూబ్ చానల్ ప్రారంభించి సాగులో అవలంబించాల్సిన పద్ధతులను వివరిస్తున్నారు. వాట్సా ప్ ద్వారా కూడా రైతుల సందేహాలు తీరుస్తున్నాం.
మేలైన వంగడాల వృద్ధి..
రాష్ట్రం ఏర్పాటు తర్వాత వరి, మొక్కజొన్న, జొన్న, కంది, పెసర, మినుములు, పెసర, కుసుమ, నువ్వు తదితర మేలు రకమైన వంగడాలు వృద్ధి చేశాం. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 1010 వరి రకానికి ప్రత్యామ్నాయంగా కునారం సన్నాలు, జేజీఎల్–2423 వంగడాలను తీసుకొచ్చాం. బీపీటీ–5204కు ప్రత్యామ్నాయంగా షుగర్ లెస్ వరి విత్తనం ఆర్‌ఎన్‌ఆర్–1504 (తెలంగాణ సోనా)ను రైతులకు అందుబాటులోకి తెచ్చాం. కందిలో ఎల్‌ఆర్‌జీ–41కి ప్రత్యామ్నాయంగా డబ్ల్యూజీఎల్–97 వంటి విత్తనాలను ఉత్పత్తి చేస్తున్నాం. ఇప్పుడు మన విత్తనాలను ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాల రైతులు సాగు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం మే 24న విత్తన మేళా నిర్వహించి రైతులకు విత్తనాలు అందుబాటులో ఉంచుతున్నాం.
విలువ ఆధారిత ఉత్పత్తులకు ప్రోత్సాహం..
విలువ ఆధారిత ఉత్పత్తులు సాధించేలా రైతులను ప్రోత్సహిస్తున్నాం. పంట ఉత్పత్తులకు విలువను జోడిస్తే రైతుకు అధిక ఆదాయం వస్తుంది. ఉదాహరణకు మిర్చి, పసుపును పొడిగా మార్చి విక్రయిస్తే రైతులకు అధిక ఆదాయం వస్తుంది. భవిష్యత్‌లో ఈ విధానం పెద్ద ఎత్తున ఆచరించే అవకాశముంది. తాండూరు కంది పప్పు జీఐ ట్యాగ్ సాధించింది.
రైతుల వద్దకే వ్యవసాయ అధికారులు..
జిల్లాల పునర్విభజన తర్వాత రైతుల ముంగిటికి జిల్లా వ్యవసాయf అధికారులు వస్తున్నారు. జిల్లా వ్యవసాయ అధికారుల సంఖ్య గతంలో కంటే పెరిగింది. తద్వారా రైతులకు వ్యవసాయ అధికా రుల సేవలు మరింత అందుబాటులోకి వచ్చాయి. ఏజీ హబ్ ద్వారా గ్రామీణ ప్రాంత యువ రైతులను వ్యవసాయ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఎంటర్‌ప్రెన్యూర్ స్కిల్స్ అందుబాటులోకి తీసుకొచ్చాం.
– డాక్టర్ ఆర్.ఉమారెడ్డి, సహ పరిశోధన సంచాలకుడు
Comments
Please login to add a commentAdd a comment