Charity Organization
-
CABI: 'కాబి' ఉచిత డిజిటల్ టూల్స్..
అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ ‘సెంటర్ ఫర్ అగ్రికల్చర్ అండ్ బయోసైన్స్ ఇంటర్నేషనల్’ (సిఎబిఐ – కాబి) రైతులకు అవసరమైన ప్రామాణికమైన శాస్త్రీయ సమాచారాన్ని తన వెబ్సైట్, యాప్‌ల ద్వారా తెలుగులో కూడా అందుబాటులోకి తెచ్చింది. గత 110 సంవత్సరాల నుంచి పురుగులు, తెగుళ్ల యాజమాన్యంపై పరిశోధనలు చేస్తున్న ‘కాబి’తో 48 దేశాలకు చెందిన వ్యవసాయ సంస్థలు కలసి పనిచేస్తున్నాయి. మన ఐసిఎఆర్ కూడా ఇందులో మెంబరే.ఈ నేపథ్యంలో సుస్థిర వ్యవసాయ కేంద్రం తోడ్పాటుతో ప్లాంట్వైస్ ప్లస్ టూల్ కిట్’ పేరుతో డిజిటల్ టూల్స్‌ని ‘కాబి’ ఇటీవల తెలుగు, హిందీల్లోనూ అందుబాటులోకి తెచ్చింది. రైతులకు, విస్తరణ అధికారులకు, డీలర్లకు, విద్యార్థులకు, పరిశోధకులకు ఇవి ఉపయోగకరం.వెబ్సైట్, అనేక యాప్‌ల ద్వారా రైతులకు శాస్త్రీయంగా సరైన సలహాలు పొందొచ్చు. ఇందులో నాలెడ్జ్ బ్యాంక్ పోస్టర్లు, కరపత్రాలు, రైతుల కోసం ఫ్యాక్ట్షీట్లు, వీడియో ఫ్యాక్ట్షీట్లు అందుబాటులో ఉన్నాయి. పంట ఆరోగ్యంపై సమాచారం తెలుసుకోవటం, పురుగుమందుల మోతాదులను లెక్కించటం, ఎరువుల అవసరాలను నిర్ణయించటం, పంట సమస్యను గుర్తించటం, చీడపీడల నియంత్రణకు పురుగుమందులను కనుగొనటం, పురుగులను– తెగుళ్లను గుర్తించే నైపుణ్యాలను మెరుగుపరచుకోవటం, చీడపీడల నియంత్రణ పద్ధతులను సిఫారసు చేయటం, తెగుళ్ల నిర్వహణపై శిక్షణ.. తదితర సమాచారం / నైపుణ్యాలను కాబి వెబ్సైట్, డిజిటల్ టూల్స్ అందిస్తాయి.కాబి బయోప్రొటెక్షన్ పోర్టల్ యాప్ కోసం ఈ క్యుఆర్ కోడ్‌ను స్కాన్ చేయండిఇవన్నీ తెలుగులో ఉచితంగా అందుబాటులో ఉండటం వల్ల మహిళా రైతులు కూడా సులువుగా వాడుకునేందుకు వీలవుతుంది. ఈ వనరులను ఉపయోగించుకోవడానికి మనకు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ లేదా టాబ్లెట్ లేదా కంప్యూటర్ /ల్యాప్‌టాప్‌తో ఇంటర్నెట్ సదుపాయం ఉంటే చాలు.మొక్కల ఆరోగ్య సమాచారం విభాగంలో.. మన దేశానికి సంబంధించిన పంటల ఆరోగ్యం, తెగుళ్ల నిర్వహణపై సమాచారం ఉచితంగా అందుబాటులో ఉంటుంది. ప్లాంట్వైజ్ ఫ్యాక్ట్‌షీట్ లైబ్రరీ’ అనే ఉచిత యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని తెగుళ్ల నిర్థారణ, సురక్షిత నిర్వహణకు ఉపయోగపడే తాజా సమాచారం తెలుసుకోవచ్చు. మొక్కల రక్షణ మద్దతు విభాగంలో.. ‘క్రాప్ స్ప్రేయర్ యాప్’ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.కాబి క్రాప్ స్ప్రేయర్ యాప్ కోసం ఈ క్యుఆర్ కోడ్‌ను స్కాన్ చేయండిసురక్షితమైన పురుగుమందులు, వాటి మోతాదును లెక్కించడానికి సహాయపడుతుంది. ‘కాబి బయోప్రొటెక్షన్ పోర్టల్’ అనే ఉచిత వెబ్సైట్ పంట తెగుళ్లను నయం చేయటానికి స్థానికంగా నమోదైన బయో పెస్టిసైడ్స్‌ను కనుగొనటంలో, ఉపయోగించటంలో సహాయపడుతుంది. రైతులకు లోతైన అవగాహన కలిగించడం కోసం డిజిటల్ లెర్నింగ్ కోర్సులు కూడా ఉన్నాయి. పంట తెగులు నిర్థారణ కోర్సు, పంటల చీడపీడల యాజమాన్య కోర్సు, బయోప్రొటెక్షన్ ్రపోడక్ట్స్ కోర్సు అందుబాటులో ఉంది.26న ‘బయోచార్ కార్బన్ క్రెడిట్స్’పై సదస్సు..బయోచార్ (కట్టె బొగ్గు)ను పంట వ్యర్థాలు, తదితర బయోమాస్‌తో భారీ ఎత్తున యంత్రాలతో ఉత్పత్తి చేస్తూ ‘కార్బన్ క్రెడిట్స్’ పొందుతున్న వాణిజ్య సంస్థల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇటువంటి సంస్థలకు మార్గదర్శకత్వం నెరిపేందుకు హైదరాబాద్ కేంద్రంగా ప్రొగ్రెసివ్ బయోచార్ సొసైటీ’ ఇటీవల ఏర్పడింది. దీని ఆధ్వర్యంలో ‘బయోచార్ ఉత్పత్తి పరికరాలు–కార్బన్ క్రెడిట్స్’ అనే అంశంపై జూన్ 26న ఉ. 9.30 గం. నుంచి హైదరాబాద్ యూసఫ్‌గూడలోని నిమ్స్‌మే ఆడిటోరియంలో జాతీయ సదస్సు జరగనుంది. ‘మేనేజ్’ డైరెక్టర్ జనరల్ డా. పి. చంద్రశేఖర ముఖ్య అతిథి. రిజిస్ట్రేషన్ వివరాలకు.. 63051 71362.– నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
Nayi Disha Seema Seth: కార్పొరేట్ రంగం నుంచి కార్మిక లోకానికి...
కార్పొరేట్ ప్రపంచంలో మూడు దశాబ్దాల పాటు పనిచేసిన హరియాణాలోని గురుగ్రామ్‌కు చెందిన సీమా సేథ్ ఇక ఆ రంగంలో మరింత ముందుకు వెళ్లాలనుకోలేదు. ఒకసారి వెనక్కి తిరిగి చూసింది. ఒకరోజు ఒక ఆటోడ్రైవర్‌తో మాట్లాడుతున్నప్పుడు చదువుకు దూరమైన నిరుపేద పిల్లల గురించి తెలుసుకుంది. ఈ క్రమంలో కార్పొరేట్ ప్రపంచాన్ని వదిలి ‘నయీ దిశ’ పేరుతో స్వచ్ఛంద సంస్థను ప్రారంభించి కొత్తదారిలో ప్రయాణిస్తోంది. అట్టడుగు వర్గాలకు చెందిన పిల్లలను విద్యావంతులను చేస్తోంది. తాను కూడా టీచర్‌గా మారి పిల్లలకు పాఠాలు చెబుతోంది.... ‘ఇంజినీర్ కావాలనేది నా లక్ష్యం’ అంటున్న బప్పన్ దాస్ ‘నయీ దిశ’ గురించి ఎంతో గొప్పగా మాట్లాడుతాడు. బప్పన్ తొమ్మిది నెలల వయసు ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఉపాధి వెదుక్కుంటూ పశ్చిమ బెంగాల్ నుంచి గురుగ్రామ్‌కు వచ్చారు. ‘ఈరోజు తిండి దొరికేతే చాలు’ అన్నట్లుగా ఉండేది వారి ఆర్థిక పరిస్థితి. దీంతో చదువు మాట అటుంచి బప్పన్ కనీసం బడిముఖం కూడా చూడలేకపోయాడు. ‘నయీ దిశ’ పుణ్యమా అని బప్పన్ ఎనిమిది సంవత్సరాల వయసులో బడిలోకి అడుగు పెట్టాడు. ‘సీమా మేడమ్ నుంచి పాఠాలు వినడమే కాదు ఆమెతో కలిసి ఆడుకున్నాం. సరదాగా ఎన్నో ప్రాంతాలు తిరిగాం’ అంటాడు బప్పన్. బడి అంటే భయపడే స్థితి నుంచి బడికి ఇష్టంగా వెళ్లడం వరకు బప్పన్‌ను మార్చివేసింది సీమ. ‘నిరుపేద పిల్లల జీవితాల్లో మార్పు తెచ్చే ప్రయత్నం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఒక మార్గం మరో మార్గంలోకి తీసుకువెళ్లి మరిన్ని మంచిపనులు చేయిస్తుంది’ అంటుంది సీమ. ఉద్యోగం చేస్తున్న రోజుల్లో ప్రతి రోజూ సాయంత్రం సికిందర్‌పూర్‌లోని ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి పిల్లలకు ఇంగ్లీష్ పాఠాలు బోధించేది. ఈ పని తనకు ఎంతో ఉత్సాహాన్ని, బలాన్ని ఇచ్చేది. తనను రోజూ స్కూల్‌కు తీసుకెళ్లే ఆటోడ్రైవర్ ‘పిల్లలకు పాఠాలు చెప్పడానికి డబ్బులు తీసుకుంటారా?’ అని అడిగాడు. ‘లేదు’ అని చెప్పింది సీమ. తాను ఉండే కాలనీ పేరు చెప్పి ‘అక్కడ చాలామంది పిల్లలు బడికి వెళ్లడం లేదు’ అని చెప్పాడు. ‘ఎందుకు?’ అని అడిగింది సీమ. ‘పిల్లలను బడికి పంపించే స్తోమత తల్లిదండ్రులకు లేదు’ అని చెప్పాడు ఆటోడ్రైవర్. ఆ తరువాత... ‘మేడమ్... మీరు అక్కడ స్కూల్ పెట్టండి. ఎంతోమంది పిల్లలు చదువుకొని బాగుపడతారు’ అన్నాడు ఆటోడ్రైవర్. సీమ ఆలోచనలో పడింది. ఆ తరువాత ఆసక్తి పెరిగింది. ‘మీ కాలనీలో స్కూల్ ఎక్కడ స్టార్ట్ చేయాలో చెబితే అక్కడే చేస్తాను’ అన్నది సీమ. ఆటోడ్రైవర్ నివసించే పేద ప్రజల కాలనీలో ఒక గోదాములో సీమ స్కూల్ స్టార్ట్ చేసింది. 35మంది పిల్లలతో ‘నయీ దిశ’ ప్రస్థానం మొదలైంది. కొద్దిమంది పిల్లలతో ఒక గదిలో మొదలైన స్కూల్ ఆ తరువాత వందమంది పిల్లలతో ఎనిమిది గదుల్లోకి విస్తరించింది. గురుగ్రామ్‌లోని వివిధ కళాశాలలలో చదివే విద్యార్థులు ఈ స్కూల్‌కు వచ్చి కంప్యూటర్ నుంచి థియేటర్ వరకు ఎన్నో విషయాలు బోధిస్తున్నారు. విద్యాసంబంధమైన కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా ‘నయీ దిశ’ కేంద్రంగా మారింది. ‘నయీ దిశ’ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎంతోమంది నిరుపేద పిల్లలకు అకాడమిక్ పునాదిని ఏర్పాటు చేసింది సీమ. ఇప్పుడు ఆ పునాది మీదే పిల్లలు ఎన్నో కలలు కంటున్నారు. ‘తమ పిల్లల్లో వచ్చిన మార్పును చూసి తల్లిదండ్రులు సంతోషించారు. నయీ దిశ పిల్లలకు ఎంత విలువ ఇస్తుందో దగ్గరనుంచి చూశారు. పిల్లలకు బడి అంటే స్వేచ్ఛ అనుకునేలా చేశాం. పిల్లలు తమ మనసులోని భావాలను అందంగా వ్యక్తీకరించడం నుంచి ఇంగ్లీష్‌లో మాట్లాడడం వరకు ప్రతిక్షణం అభ్యాస వేడుకే’ అంటుంది సీమ. ‘మొదటి నుంచీ పిల్లలకు ఎన్నో సబ్జెక్ట్‌లు బోధిస్తూ వారి ఎదుగుదలను చూశాను. మొదట్లో క్రమశిక్షణా రాహిత్యంతో ఉండే పిల్లలు... కాలక్రమేణా మాట, మర్యాద నేర్చుకున్నారు’ అంటుంది ‘నయి దిశ’ స్కూల్లో పని చేస్తున్న నిషా అనే టీచర్. ‘నయీ దిశ’ విజయంతో ఇందిరా కాలనీలో మరో స్కూల్‌ను ప్రారంభించించి సీమ. ఈ స్కూల్లో 65 మంది నిరుపేద పిల్లలు చదువుకుంటున్నారు. సిలబస్‌ను సరిగ్గా అనుసరిస్తున్నారో లేదో తెలుసుకోవడానికి, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సవాళ్లను అర్థం చేసుకోవడానికి నెలకొకసారి టీచర్ ట్రైనింగ్ క్లాసులు నిర్వహిస్తున్నారు. ప్రతి నెల పేరెంట్స్–టీచర్ మీటింగ్ కూడా ఉంటుంది. ‘మా అబ్బాయికి చదువు పట్ల ఉండే శ్రద్ధ చూస్తుంటే ముచ్చట వేస్తోంది. ఇదంతా నయీ దిశ పుణ్యమే. డాక్టర్ కావాలనేది మా అబ్బాయి కల. పదిమందికి ఉపయోగపడే కల కంటే అది తప్పక నెరవేరుతుంది అని సీమ మేడమ్ ఒక మీటింగ్‌లో చెప్పారు’ అంటున్నాడు అశోక్‌రావు అనే పేరెంట్. వినే వారు తప్పకుండా ఉంటారు మన మనసులో మంచి ఆలోచన ఉన్నప్పుడు, అది వినడానికి ఈ విశ్వంలో ఎవరో ఒకరు తప్పనిసరిగా ఉంటారు. ‘ఆలోచన బాగానే ఉంది గానీ.. అసలు ఇది నెరవేరుతుందా...’ అనుకున్న ఎన్నో ఆలోచనలు నెరవేరాయి. మంచి పని కోసం ప్రయాణం ప్రారంభించినప్పుడు దారే తన వెంట తీసుకువెళుతుంది. ఎన్ని అవరోధాలు ఉన్నా వాటంతట అవే తొలగిపోతాయి. – సీమ, నయీ దిశ– వ్యవస్థాపకురాలు -
విజ్ఞాన సంపదను పంచడమే ‘కూరెళ్ల’ లక్ష్యం
రామన్నపేట : పద్మశ్రీ డాక్టర్ కూరెళ్ల విఠలాచార్యపై గవర్నర్ తమిళసై ప్రశంసలు కురింపించారు. ఒక మారుమూల ప్రాంతంలో అద్భుతమైన లైబ్రరీని స్థాపించేందుకు ఆచార్య విఠలాచార్యులు ముందుకు రావడం గొప్ప విషయమని కొనియాడారు. రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో ఆచార్య కూరెళ్ల గ్రంథాలయం పై అంతస్తులో నిర్మించిన సాయి సమావేశ మందిరాన్ని జస్టిస్ కూనురు లక్ష్మణ్‌తో కలిసి గవర్నర్ తమిళసై ప్రారంభించారు. నా వంతు సహకారం అందిస్తా : గవర్నర్ తమిళిసై కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ తమిళసై సౌందరరాజన్ కూరెళ్ల విఠలాచార్యా కృషిని కొనియాడారు. ఆయన ఏర్పాటు చేసిన గ్రంథాలయానికి రూ. 10లక్షల 63 వేల రూపాయలు, 8వేల పుస్తకాలు, వెయ్యి నోట్ బుక్స్ డొనెట్ చేస్తానని హామీ ఇచ్చారు. "ఆచార్య విఠలాచార్యుల గురించి మన్ కి బాత్ లో మాట్లాడిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు, విఠలాచార్యులు తన ఇంటిని గ్రంథాలయంగా మార్చారు. ఆయన సేవలకు ధన్యవాదాలు. పుస్తకాల వల్ల విజ్ఞానం పెరుగుతుంది. రాజ్ భవన్‌ను వెల్లంకికి తీసుకొచ్చిన మహాన్నత వ్యక్తి విఠలాచార్యులు" అని అభినందించారు. విఠలాచార్య అందించిన విజ్ఞాన సంపద ఇది : జస్టిస్ కూనూరు లక్ష్మణ్ డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య రాసిన కూరెళ్ల శతకం ద్వితీయ ముద్రణను సినీ గేయ రచయిత కనుకుంట్ల సుభాస్‌చంద్రబోస్, కలెక్టర్ హనుమంతు కె.జెండగేతో కలిసి ఆవిష్కరించిన హైకోర్టు జడ్జి జస్టిస్ కూనూరు లక్ష్మణ్.. విఠలాచార్య సేవలను కొనియాడారు. "భావితారాలకు విజ్ఞాన సంపదను పంచడమే ఆచార్య కూరెళ్ల గ్రంథాలయం ఏర్పాటు ప్రధాన లక్ష్యమని అన్నారు. చదువుకునేందుకు తాను పడిన ఇబ్బందులు ఇతరులకు ఎదురు కాకూడదని బాల్యంలో కూరెళ్ల మదిలో వచ్చిన ఆలోచన కూరెళ్ల గ్రంథాలయం ఏర్పాటుకు నాంది పలికిందని తెలిపారు. ఉపాధ్యాయ ఉద్యోగ విరమణ అనంతరం కూరెళ్ల ఇంటిని గ్రంథాలయంగా మలచి తన పింఛన్ డబ్బులతో నిర్వహించడం ఆదర్శనీయమన్నారు. కూరెళ్లకు కూతుళ్లు అందిస్తున్న సహకారం అభినందనీయమని కొనియాడారు. భవిష్యత్తులో గ్రంథాలయ నిర్వహణకు ప్రజలు సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. కూరెళ్ల గ్రంథాలయం అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని" తెలిపారు. మాతృభాషను మరవొద్దు ఆస్కార్ అవార్డు గ్రహీత ప్రముఖ సినీ గేయరచయిత కనుకుంట్ల చంద్రబోస్ మాట్లాడుతూ "పరభాషా వ్యామోహంలోపడి మాతృభాషను మరువవద్దని కోరారు. కలెక్టర్ హనుమంతు కె. జెండగే మాట్లాడుతూ జిల్లాకు చెందిన ఇద్దరు ప్రముఖులకు పద్మశ్రీ పురస్కారాలు రావడం గర్వకారణమని" తెలిపారు. విద్యార్థులు, యువకులు పఠనాసక్తిని పెంచుకోవాలని చెప్పారు. ప్రతీ పురస్కారం గ్రామానికే అంకితం తనకు వచ్చిన ప్రతీ పురస్కారం గ్రామానికే అంకితమిచ్చినట్లు గ్రంథాలయ వ్యవస్థాపకుడు, పద్మశ్రీ పురస్కారానికి ఎంపికై న డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య చెప్పారు. రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన రూ.25లక్షల నగదు పురస్కారంతోపాటు మరో రూ.20లక్షలను సమకూర్చి గ్రంథాలయ నిర్వహణ నిధిని ఏర్పాటు చేస్తానని తెలిపారు. గవర్నర్చేతుల మీదుగా గ్రంథాలయంను ప్రారంభించుకోవడం తన జీవితంలో మరపురాని రోజు అని తెలిపారు.అంతకుముందు అతిథులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు డాక్టర్ పోరెడ్డి రంగయ్య, గ్రంథాలయ అధ్యక్షుడు కూరెళ్ల నర్సింహాచారి, అధికార ప్రతినిధి కూరెళ్ల నర్మద సభ్యులు కూరెళ్ల తపతి, సరస్వతి గ్రంథపాలకుడు తాటిపాముల స్వామి, తాజామాజీ సర్పంచ్ ఎడ్ల మహేందర్‌రెడ్డి, ఎంపీటీసీలు ఎర్రోళ్ల లక్ష్మమ్మ,మహేందర్‌రెడ్డి, ఆర్డీఓ శేఖర్‌రెడ్డి, తహసీల్దార్, ఎంపీడీఓ పాల్గొన్నారు. -
‘శాంతి లైఫ్’ ఎన్నో గ్రామాల ముఖచిత్రాన్ని మార్చింది!
‘ఎవరైనా సరే నిద్రలేస్తూనే నేను ఉద్యోగం కోసం ఎదురు చూడడం లేదు. పదిమందికి ఉపాధి కల్పించడం కోసం ఎదురుచూస్తున్నాను’ అనుకోవాలి. ‘ఆశాపూరిత ప్రపంచాన్ని ఊహించుకున్నప్పుడే, దాన్ని నిజంగా సృష్టించగలం. నీ మార్గం ఏమిటి అనే విషయంలో స్పష్టత ఉంటేనే అక్కడికి చేరుకుంటావు. అలా చేరుకోవడానికి నీలోని ఉత్సాహం, అంకితభావం ఇంధనంలా ఉపయోగపడతాయి’...‘మైక్రోఫైనాన్స్ దారిదీపం’గా ప్రసిద్ధుడైన మహ్మద్ యూనస్ చెప్పిన ఇలాంటి మాటలెన్నో శాన్ఫ్రాన్సిస్కోలోని షీతల్ మెహతా వాల్ష్కు ఇష్టం. ఆ ఇష్టమే ఆమెను యూనస్ బాటలో నడిపించి ‘శాంతి లైఫ్’కు శ్రీకారం చుట్టేలా చేసింది. సూక్ష్మారుణ సంస్థగా మొదలైన ‘శాంతి లైఫ్’ ఎన్నో గ్రామాల ముఖచిత్రాన్ని మార్చింది.. శాంతి లైఫ్ కెనడాలో పెరిగిన షీతల్ అక్కడి గుజరాతీ అసోసియేషన్‌లో భాగం కావడంతో ఎన్నోకుటుంబాలతో పరిచయం ఏర్పడింది. కమ్యూనిటీ లైఫ్‌లో భాగం కావడం ద్వారా పాశ్చాత్యజీవన విధానానికి భిన్నమైన భారతీయ జీవన విధానాన్ని చూసింది. ఎన్నో విలువలు నేర్చుకుంది. వెంచర్–క్యాపిటల్ ఫండింగ్ సెక్ట్చ్డర్లో రెండు దశాబ్దాల అనుభవాన్ని సంపాదించిన షీతల్ బంగ్లాదేశ్ సోషల్ ఎంటర్ప్రెన్యూర్ మహ్మద్ యూనస్ స్ఫూర్తితో అహ్మదాబాద్ కేంద్రంగా ‘శాంతి లైఫ్’ అనే సూక్ష్మారుణ సంస్థను ప్రారంభించింది. ఇది పేద మహిళల జీవితాల్లో వెలుగులు నింపింది. గతంలో ఎలా ఉండేదంటే... పేద మహిళలకు రుణాలు లభించడం కష్టం. ఒకవేళ లభించినా బారెడు వడ్డీ కట్టలేక అష్టకష్టాలు పడేవాళ్లు. ఇలాంటి పరిస్థితుల్లో తక్కువ వడ్డీతో ‘శాంతి లైఫ్’ రుణాలు ఇవ్వడం మొదలు పెట్టింది. ఎన్నో గ్రామాల్లో ఎంతోమంది మహిళలు రుణాలు తీసుకొని వ్యాపారాలు చేస్తూ సొంతకాళ్ల మీద నిలబడ్డారు. కేవలం రుణాలు ఇవ్వడమే కాకుండా గ్రామీణప్రాంత మహిళలకు స్కిల్స్ ట్రైనింగ్, ఫైనాన్షియల్ లిటరసీ... మొదలైన వాటిలో శిక్షణ ఇస్తోంది శాంతి లైఫ్. క్షేత్రస్థాయిలో పనిచేయడం ద్వారా అక్కడి పరిస్థితులపై స్పష్టమైన అవగాహన రావడానికి షీతల్‌కు అవకాశం ఏర్పడింది. ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, వాటిని దూరం చేయాలంటే ఏంచేయాలి... మొదలైన విషయాలను తెలుసుకుంది షీతల్. ‘శాంతి లైఫ్’ ఎన్నో గ్రామాలను దత్తత తీసుకుంది. పారిశుద్ధ్య లోపం వల్ల గ్రామీణ ప్రాంతాలలో మహిళలు అనారోగ్యానికి గురవుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ‘సేఫ్ శానిటేషన్’ నినాదంతో గ్రామీణప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. ఈ అవగాహనతో వారు డబ్బు పొదుపు చేసి మరుగుదొడ్లు నిర్మించుకున్నారు. ‘రుణం తీసుకోవడం అనేది ఆర్థిక వ్యవహారమే కాదు. ఒక బాధ్యతను నిరంతరం గుర్తు చేస్తుంది. శాంతి లైఫ్ ద్వారా రుణం తీసుకున్న ఒక మహిళ రిక్షా కొనుగోలు చేసింది. ఈ రిక్షాను ఆమె భర్త నడిపేవాడు. గతంలో అతడి ప్రవర్తన ఎలా ఉన్నా ఇప్పుడు మాత్రం క్రమశిక్షణతో నడుచుకుంటున్నాడు. ఏరోజు డబ్బును ఆరోజే భార్యకు ఇస్తుంటాడు. భార్య పేరు మీద లోన్ ఉంది కాబట్టి ఆమెకు చెడ్డ పేరు రావద్దని అనుకునేవాడు భర్త. ఇలాంటి భర్తలు ఎందరో! రుణసహాయం మాత్రమే కాదు క్రమశిక్షణ పాదుకొల్పడంలో ‘శాంతి లైఫ్’ తనదైన పాత్ర నిర్వహిస్తోంది. గ్రామీణ వృత్తికళాకారులు తయారు చేసిన యోగా బ్యాగులు, చీరెలు, దుప్పట్లను ఆన్లైన్ ద్వారా అమ్మడం మొదలుపెట్టింది. ‘ప్రతి ఒక్కరికీ తమదైన నైపుణ్యం ఉంటుంది. అది ఇతరుల కంటే ఏ రకంగా భిన్నమైనది, ఆ నైపుణ్యం సమాజానికి ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేది ఆలోచించాలి. నైపుణ్యాలను ఉపయోగించి క్షేత్రస్థాయిలో పనిచేయడం ద్వారానే పేదరికాన్ని దూరం చేయవచ్చు’ అంటుంది షీతల్. లాభాలు గడించాలనే దృష్టితో కాకుండా సమాజానికి తిరిగి ఇవ్వాలి అనే అవహగానతో ‘శాంతి లైఫ్’కు శ్రీకారం చుట్టింది షీతల్. సామాజిక నిబద్ధతతో మొదలైన ‘శాంతి లైఫ్’ అనుకున్న లక్ష్యాన్ని చేరుకుందా అని ప్రశ్నించుకుంటే ‘అంతకంటే ఎక్కువే’ అని జవాబు చెప్పుకోవచ్చు. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఫైనాన్స్, టెక్నాలజీలకు సంబంధించి నైపుణ్యాల శిక్షణ ద్వారా గుజరాత్‌లోని ఎన్నోగ్రామాల ముఖచిత్రాన్ని‘శాంతి లైఫ్’ మార్చింది. (చదవండి: తండ్రికి కూడా ప్రసూతి సెలవులు ఇవ్వాల్సిందే! హైకోర్టు జస్టిస్ ఆదేశం! ) -
Kaushal Shetty: పచ్చటి గూడుతో...
ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు నిరాశ్రయులైన ప్రజల కోసం 27 సంవత్సరాల కౌశల్ శెట్టి ‘నోస్టోస్ హోమ్స్’ పేరుతో స్వచ్ఛందసంస్థను ప్రారంభించి దేశవ్యాప్తంగా సహాయక కార్యక్రమాలలో పాల్గొంటున్నాడు. నిరాశ్రయుల కోసం ఈ సంస్థ తేలికపాటి, ఈజీ ట్రాన్స్‌పోర్టబుల్ షెల్టర్స్‌ను రూపొందించింది... ‘అనుభవమైతేగానీ తత్వం బోధపడదు’ అంటారు. ‘తత్వం’ మాట ఎలా ఉన్నా కౌశల్ షెట్టికి ‘కర్తవ్యం’ బోధపడింది. షెట్టిదీ కర్నాటకలోని ఉడిపికి సమీపంలోని మది అనే గ్రామం. పచ్చదనానికి ఈ గ్రామం పర్ఫెక్ట్ అడ్రస్. అలాంటి పచ్చటి ఊరు కాస్తా ఘటప్రభ నది పొంగి పొర్లడంతో అల్లకల్లోలం అయింది. అంతెత్తు చెట్లు నిలువునా కూలి పోయాయి. పొలాలు మునిగిపోయాయి. ఇండ్లు ఘోరంగా దెబ్బతిన్నాయి. ఇంట్లో ఉండలేని పరిస్థితి. దీంతో ప్రజలు తట్టాబుట్టా సర్దుకొని ఊరు విడిచి తోచిన దిక్కుకు వెళ్లారు. షెట్టి కుటుంబం ముంబైకి వెళ్లింది. ముంబైకి వెళుతున్నప్పుడు షెట్టి మనసు బాధతో నలిగిపోయింది. దీనికి కారణం...ఎటు పోవాలో తెలియక, గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆ ఊళ్లోనే ఉండిపోయిన ప్రజలు. సంవత్సరాలు గడుస్తున్నా ఆ బాధ తన నుంచి దూరం కాలేదు. ఖరగ్‌పూర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదుకునే రోజుల్లో మరోసారి తుఫాను బీభత్సాన్ని, బాధితులు, నిరాశ్రయుల కష్టాలు, కన్నీళ్లను దగ్గర నుంచి చూశాడు. ‘ఇలా బాధ పడుతూ కూర్చోవడం తప్ప నేను ఏం చేయలేనా!’ అనుకున్నాడు షెట్టి. ఎన్నో రకాలుగా ఆలోచించిన తరువాత... తన స్నేహితుడు మాధవ్ దత్తో కలిసి ‘నోస్టోస్ హోమ్’ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించాడు. ‘ప్రకృతి వైపరీత్యాల కారణంగా ప్రతి సంవత్సరం వందలాది మంది ప్రజలు నిరాశ్రయులవుతున్నారు. అలాంటి వారికి నిలువ నీడ కల్పించడానికి మా సంస్థ ద్వారా కృషి చేస్తున్నాం’ అంటున్నాడు షెట్టి. తమ సంస్థ ట్రాన్స్‌పోర్టబుల్ హోమ్స్ గురించి చెబుతూ... ‘పర్సనల్ డిగ్నిటీ, ప్రైవసీతో కూడిన హోమ్స్ ఇవి’ అంటాడు షెట్టి. ‘నోస్టోస్ హోమ్’ సంస్థ అస్సాం, నాగాలాండ్ రాష్ట్రాలతో పాటు ఆఫ్రిక దేశాలలోనూ సేవలు అందిస్తోంది. కౌశల్ చేపట్టే సేవాకార్యక్రమాలకు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు లభిస్తున్నాయి. ‘తక్కువ సమయంలోనే బాధితులకు సహాయం అందించి నిరాశ్రయులకు అండగా నిలబడింది కౌశల్ బృందం. నిపుణుల సహాయంతో సౌకర్యాలు సమకూర్చారు’ అంటున్నాడు హాబిటాట్ ఫర్ హ్యూమానిటీ మలావి నేషనల్ డైరెక్టర్ కపీరా. ఇక షెట్టి భవిష్యత్ లక్ష్యం విషయానికి వస్తే... తన సేవాకార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలనుకుంటున్నాడు. మారుమూల ప్రాంతాలలో వైద్య సౌకర్యాల మెరుగుదల కోసం కృషి చేయాలనుకుంటున్నాడు. ‘నోస్టోస్ హోమ్’తో తొలి అడుగు వేసినప్పుడు ‘నిజంగా నేను చేయగలనా?’ అనే సందేహం షెట్టికి వచ్చేది. మంచి పని కోసం బయలు దేరినప్పుడు ఎన్నో ద్వారాలు మన కోసం తెరుచుకుంటాయి...అన్నట్లుగా షెట్టికి ఎంతోమంది ఎన్నో రకాలుగా సహాయం అందించారు. కొన్ని అడుగులు పడిన తరువాత శెట్టికి తనపై తనకు ఎంతో నమ్మకం వచ్చింది. ఆ నమ్మకమే మరిన్ని సేవాకార్యక్రమాలు చేపట్టాలనే లక్ష్యం నిర్దేశించుకోవడానికి కారణం అయింది. -
Ashneer Grover : ఎన్నాళ్లు ఇలా ప్రభుత్వాలకు ఊడిగం చేయాలి? :
విదేశాల్లో అంతర్జాతీయ క్రెడిట్ కార్డుల ద్వారా చేసే చెల్లింపులపై కేంద్రం టీసీఎస్ (ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్) ను వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ కొత్త పన్ను విధానాన్ని, అందులోని లోపాల్ని భారత్ పే మాజీ సహ వ్యవస్థాపకులు అశ్నీర్ గ్రోవర్ విమర్శిస్తూ వస్తున్నారు. తాజాగా, మరో సారి ట్యాక్స్ పేయర్లు ప్రభుత్వాలకు ఊడిగం చేస్తున్నారంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పైగా పన్నులు చెల్లించడం ఓ శిక్షే’నని అన్నారు. ఈ మేరకు పన్ను చెల్లింపులపై పలు మార్లు గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఎన్నాళ్లు ఇలా ఊడిగం చేయాలి కేంద్రం పన్నుల చెల్లింపు దారుల నుంచి 30 నుంచి 40 శాతం వరకు ట్యాక్స్ వసూలు చేస్తుందని, ప్రతిగా ఎలాంటి ప్రతిఫలం పొందలేకపోతున్నారని అశ్నీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ట్యాక్స్ పేయర్లు తమ సంపాదనలో కొంత బాగాన్ని దేశానికి ఇస్తున్నారు. కానీ వాళ్లు ఎలాంటి లబ్ధి పొందడం లేదు. రూ.10 మనం (ట్యాక్స్ పేయర్లను ఉద్దేశిస్తూ) సంపాదిస్తే అందులో రూ.4 ప్రభుత్వానికే ఇస్తున్నాం. దీంతో 12 నెలల సమయంలో 5 నెలలు ప్రభుత్వానికే పనిచేస్తున్నారు. అయినా ఇలా ట్యాక్స్ పేయర్లు వారీ జీవితంలో ప్రభుత్వాలకు ఎన్నాళ్లు ఇలా ఊడిగం చేయాలని ప్రశ్నించారు. కానీ పరిస్థితుల్ని బట్టి నడుచుకోవాల్సిందే తప్పదు’’ అని వ్యాఖ్యానించారు. ఉద్యోగులు ట్యాక్స్ ఎగవేతకు పాల్పడలేరు అంతేకాదు, వ్యాపారస్థులకు ట్యాక్స్ కట్టకుండా ఎలా తప్పించుకోవాలో తెలుసు. కానీ ఉద్యోగుల పరిస్థితి అలా కాదు. వేరే ప్రత్యామ్నాయం లేదు. శాలరీ నుంచే ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. పైగా 18 శాతం జీఎస్టీ చెల్లిస్తున్నారు. అందుకే ట్యాక్స్ అనేది శిక్షతో సమానమేనన్న అభిప్రాయం వ్యక్తం చేశారు అశ్నీర్ గ్రోవర్. నేనే రాజకీయ నాయకుడిని అయితే దేశంలో ఆదాయపు పన్ను రేటును తగ్గించేందుకు ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. ప్రతి ఒక్కరూ 10 నుంచి 15 శాతం ట్యాక్స్ కట్టేలా నిర్ధేశిస్తా. తద్వారా ఇప్పుడు ఎక్కువ పన్నులు కట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎగ్గొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే పన్ను తక్కువగా ఎగవేతకు ప్రయత్నించరు. ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందని అన్నారు. పార్టీలకు ఇచ్చే డొనేషన్లపై జీరో ట్యాక్సా గత నెలలో విదేశాల్లో క్రెడిట్ కార్డ్ వినియోగంపై 20 శాతం టీసీఎస్ వసూలు చేయడాన్నీ గ్రోవర్ తప్పుబట్టారు. విదేశాల్లో క్రెడిట్‌కార్డు వాడకంపై 20 శాతం పన్ను పార్టీలకు ఇచ్చే డొనేషన్లకు మాత్రం జీరో ట్యాక్స్ అంటూ ఎద్దేవా చేశారు. చదవండి👉 ‘విలాసాల రుచి మరిగి’..అశ్నీర్ గ్రోవర్, అతని భార్య మాధురి జైన్ గ్రోవర్‌కు మరో ఎదురు దెబ్బ! -
కరుణ రథం.. సేవ అమోఘం
సమాజంలో కొందరు మానవతావాదులు అందిస్తున్న సేవలు ఎందరికో స్ఫూర్తిదాయకంగా ఉంటున్నాయి. తోటి మనుషులు పడుతున్న బాధలను చూసి చలించిపోయి చేతనైన మేర సాయం అందిస్తూ గొప్ప మానవత్వాన్ని చాటుకుంటున్నారు. ఏ ఆసరా లేని అనాథ వృద్ధుల ఆకలి తీరుస్తూ అండగా ఉంటున్నారు. ఎదుటి మనిషి కన్నీరు తుడవడానికి ఏ బంధమూ ఉండనక్కర్లేదని.. స్పందించే హృదయం ఉంటే చాలని నిరూపిస్తున్నారు. అంధకారమయమైన వారి జీవితాల్లో వెలుగురేఖలా నిలుస్తున్నారు కృష్ణాజిల్లా నాగాయలంక మండలం తలగడదీవి గ్రామంలోని కరుణ రథం హోమ్ నిర్వాహకులు. - కృష్ణ డెస్క్ కుటుంబ సభ్యుల ఆసరా లేని అనేక మది వృద్ధులను ఆదుకోవాలనే తలంపు, జన్మభూమి రుణం తీర్చుకోవాలనే భావనతో తెలుగు లోగిలి అనే ఓ స్వచ్ఛంద సేవా సంస్థ కరుణ రథం హోమ్ ఏర్పాటు చేసి అందిస్తున్న సేవలు చూసి అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిరుపేద అనాథ వృద్ధుల ఇంటి వద్దకే నేరుగా ఆహారం పంపిస్తున్నారు. నిత్య భోజన క్యారియర్ల సేవా పథకం గత ఆరేళ్లుగా కొనసాగిస్తూ సంస్థ ముందుకు సాగుతోంది. నాగాయలంక మండలంలోని తలగడదీవి గ్రామంలో గాంధీజీ జయంతి నేపథ్యంలో 2017 అక్టోబర్‌లో కరుణ రథం హోమ్ ఆవిర్భవించింది. ముందుకొచ్చిన దాతలు.. సామాజిక సేవా తత్పరత కలిగిన భోగాది శ్రీరామలక్ష్మి వృద్ధులకు సేవలు అందించాలనే ఆలోచనతో స్ఫూర్తి పొందిన రియల్టర్ (హైదరాబాద్), సేవా సంస్థల నిర్వాహకుడు పేర్ల శ్రీనివాసరావు (పీఎస్ రావు) దాతగా ముందుకు వచ్చారు. జన్మనిచ్చిన తన గ్రామం రుణం తీర్చుకుంటానని ఆసరాలేని అనాథ వృద్ధులకు నిత్యం వారి ఇళ్లకే భోజనం పంపించి ఆదరిస్తాననే ప్రతిపాదన చేయడంతో గ్రామ ప్రముఖుడైన గణపేశ్వరాలయం ధర్మకర్త మండల రాంబాబు వంటశాల నిర్మాణానికి స్థలం ఇస్తానని ముందుకొచ్చారు. అందుకు అనుగుణంగా కరుణ రథం హోమ్ ఆవిర్భవించింది. న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ ప్రోత్సాహం.. అప్పటి ఉభయ తెలుగు రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ ఈ వినూత్న ఆశ్రమ ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. తనకు జన్మనిచ్చిన తలగడదీవి గ్రామంలో నిరుపేద, ఆసరా లేని అనాథ వృద్ధులు భోజనానికి ఎలాంటి ఇబ్బందులు పడరాదని భావించారు. ఆ ఉద్దేశంతో ప్రత్యేకంగా నిర్మించిన భోజనశాలలో వంటచేసి భోజనాలను క్యారియర్ల ద్వారా ఇళ్లకు పంపించే ఏర్పాటు చేశారు. పూర్తి నిర్వహణ, పంపిణీ బాధ్యతను సేవానిరతి కలిగిన భోగాది రామలక్ష్మికి అప్పగించినట్లు తెలుగు లోగిలి సంస్థ అధ్యక్షుడు డాక్టర్ పేర్ల శ్రీనివాసరావు (పీఎస్‌రావు) వివరించారు. ఆరేళ్లుగా ముగ్గురు మహిళలు.. ఆరేళ్లుగా నిరంతరాయంగా వృద్ధులకు భోజన సేవలు అందిస్తున్నట్లు రామలక్ష్మి పేర్కొన్నారు. ఈ అరుదైన సేవలకు ముగ్గురు మహిళలు నిర్వహణ భారం వహిస్తున్నారని తెలిపారు. మొదట్లో 40 మంది వృద్ధులకు భోజన క్యారియర్లు రెండు పూటలా పంపేవారమని చెప్పారు. కొందరు చనిపోవడం ఇతర కారణాలతో ప్రస్తుతం ఆ సంఖ్య 25 మందికి చేరిందన్నారు. ఒక్కొక్కరికీ రెండు క్యారియర్లు కేటాయించారు (ఒకటి ఇచ్చి ఒకటి తెస్తారు). ఉదయం, సాయంత్రం రెండు సార్లు భోజనం అందిస్తారు. వంటశాలలో వంట చేయడానికి ఒక బేబి అనే మహిళ , భోజన క్యారియర్ చేర్చడం, తీసుకురావడానికి కోటేశ్వరమ్మ అనే మరో మహిళ సేవా కోణంలోనే నామమాత్రపు వేతనంపై పని చేస్తున్నారు. ఉదయం వేళలో 200 గ్రాముల వైట్ రైస్, కూర, పచ్చడి, మజ్జిగతో, సాయంత్రం ఒక కూరతో భోజన క్యారియర్లు పంపిస్తున్నారు. మనిషి జన్మకు సంతృప్తి.. మనిషిగా పుట్టిన ప్రతిఒక్కరూ తమ జన్మకు సంతృప్తి, స్వాంతన చేకూరాలంటే ఇలాంటి సేవలే ఊతమిస్తాయి. వృద్ధులకు సాయం లాంటి సామాజిక సేవ చేయాలనే తలంపు ఉన్నప్పటికీ సాధ్యం కాదు. పీఎస్‌రావు లాంటి సేవామూర్తులు ముందుకు రావడంతోనే ఈ భోజన క్యారియర్లు అందించగలుగుతున్నాం. – భోగాది రామలక్ష్మి, హోమ్ పర్యవేక్షణ, భోజన సేవల నిర్వాహకురాలు. హోమ్ ఆదరణ మాటలతో చెప్పలేం ప్రతి రోజు రెండు పూటలా భోజనం క్యారియర్లను ఇంటికి తెచ్చి ఇస్తారు. ఎవరి ఆసరా లేకుండా ఒంటరిగా ఉంటున్న నాకు కరుణ రథం హోమ్ అందించే భోజన సేవలు ఎంతగానో ఆదుకుంటున్నాయి. పీఎస్ రావు, రామలక్ష్మి లాంటి వారి సేవలకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నా. –దోవారి శశిరేఖ, ఒంటరి వృద్ధురాలు, గుజ్జల రవీంద్రనగర్ ఎస్సీ కాలనీ మాకు జవసత్వాలు కలిగిస్తున్నారు గ్రామంలో గొప్ప కార్యక్రమం చేపట్టి ఒంటరిగా జీవిస్తున్న మాలాంటి వారికి భోజనం పెట్టి జవసత్వాలు కలిగిస్తున్నారు. రెండు పూటలా క్యారియర్లతో మాకు భోజనం అందించడం సామాన్య విషయం కాదు. ఈ వయస్సులో మాకు ఆసరాగా నిలిచిన దాత, సేవకులకు చేతులెత్తి మొక్కాల్సిందే. –నాదెళ్ల భాస్కరరావు, వృద్ధుడు, ఎస్సీ కాలనీ -
ఓ బాలుడి సాహసం..మూడేళ్లుగా టెంట్లోనే నిద్రపోయి..
ఓ యువకుడు క్యాపంగ్ ద్వారా అత్యధిక డబ్బులు సేకరించిన వ్యక్తిగి రికార్డు సృష్టించాడు. ది బాయ్ ఇన్ ది టెన్త్‌గా పేరుగాంచి ఈ రికార్డు సాధించాడు. ఒక ఛారిటీ కోసం ఇంత పెద్ద మొత్తంలో నిధులు కూడ బెట్టిన తొలి వ్యక్తి ఆ టీనేజర్. వివరాల్లోకెళ్తే..యూకేకి చెందిన మాక్స్ వూసే అనే యువకుడు తమ పొరుగన ఉండే ఫ్యామిలీ స్నేహితుడిని క్యాన్సర్ వ్యాధి కారణంగా కోల్పోవడంతో..అలాంటి సమస్యను ఎదుర్కొనే వాళ్లకు సాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగానే నార్త్ డెవాన్ ఛారిటీ కోసం మూడేళ్లుగా క్యాంపింగ్ నిర్వహించి అత్యధికంగా డబ్బును సేకరించాడు. ఇలా అతను సుమారు రూ. 7.6 కోట్లను వసూలు చేశాడు. అందుకోసం పలుచోట్లకు టెంట్ తోసహా తిరిగేవాడు. అక్కడ క్యాంపింగ్ నిర్వహించి టెంట్లోనే నిద్రపోయేవాడు. అలా మూడేళ్లు అదే ధ్యాసలో గడిపాడు. దీంతో వూసే 'ది బాయ్ ఇన్ ది టెన్ట్'గా పేరుగాంచాడు. ఇలా వూసే తన ఫ్యామిలీ స్నేహితుడు రిక్ అబాట్ మరణించిన తర్వాత నుంచి అంటే.. వూసేకి 10 ఏళ్ల ప్రాయం నుంచి నిధుల సేకరణ ప్రారభించాడు. సరిగ్గా మార్చి 2020లో నిధుల సేకరించడం మొదలుపెట్టాడు. తన స్నేహితుడి రిక్కు వూసే కుటుంబం ఆర్థిక సాయం అందిచిన్పటికీ వైద్యులు అతన్ని రక్షించలేకపోయారు. ఆస్పత్రి కూడా అతడు బతకాలని ఎంతగానో కోరింది గానీ సఫలం కాలేదు. ఆ ఘటన ఫ్యామిలీ స్నేహితుడిలాంటి వారి కోసం ఏదో చేయమన్నట్లు తన మనసుకు బలంగా అనిపించిందని చెబుతున్నాడు. ఐతే వూసే నిధుల సేకరణ మొదలు పెట్టే సమయంలోనే కరోనా, తుపానులు పెద్ద సవాళ్లుగా మారాయి. తీవ్రమైన గడ్డకట్టే మంచుకుని సైతం అధిగమించి ఎన్నో ప్రయాసలకు ఓర్చి ఈ నిధులను సమకూర్చాడు. ఒకనొక సమయంలో తుపాను కారణంగా వూసే టెంట్ కూడా కూలిపోయింది. అయినా లెక్క చేయక మొక్కవోని దీక్షతో నిధులు సేకరించాడు. ఈ ప్రయాణంలో గొప్ప గొప్ప వ్యక్తులను కలుసుకున్నాను, ఎన్నో అద్భుతమైన అనుభవాలను పొందాను అని చెబుతున్నాడు వూసే. ఇక ఏప్రిల్ 2023 నాటికి తన నిదుల సేకరణను ఆపేసి తనకెంతో ఇష్టమైన రగ్బీపై దృష్టిపెట్టనున్నట్లు తెలిపాడు. ఇంత చిన్న వయసులో ఇంత నిబద్ధత, నిస్వార్థపూరితమైన అతని గొప్ప మనసుని చూసి అందరూ ఫిదా అవుతున్నారు. చిన్నపిల్లలైనా వారు కూడా ఇలాంటి సేవ కార్యక్రమాలు చేయగలరు అని నిరూపించాడు వూసే. (చదవండి: వెల్లువలా ఉత్తర కొరియా అరాచకాలు..వెలుగులోకి విస్తుపోయే దారుణాలు) -
‘నిజం తెలుసుకున్నా, ఆ కంపెనీ నాకొద్దు’.. ఊహించని షాకిచ్చిన బిలియనీర్!
వ్యాపారస్తులు ఉన్నత శిఖరాలకు చేరి బిలియనీర్లుగా తనకంటూ పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు. ఇక్కడి వరకు వారి పయనం ధనార్జన, పేరు ప్రఖ్యాతలంటూ ఒకేలా ఉన్నప్పటికీ ఎక్కడో ఒక దగ్గర సంపాదన మాత్రమే జీవితం కాదని కొందరు తెలుసుకుంటున్నారు. అందుకే చాలా మంది ధనవంతులు ఛారిటీలకు, సామాజిక అభివృద్ధి వంటి కార్యక్రమాలకు వారి సంపదను ఖర్చు పెడుతుంటారు. ఇంకొందరు మరో అడుగు ముందేసి తమ ఆస్తిలో సగం భాగం లేదా మొత్తం కూడా ఇచ్చేస్తుంటారు. తాజాగా ఒక సంపన్నుడు తీసుకున్న షాకింగ్ నిర్ణయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం! యూఎస్ లోని ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ చైన్ హాబీ లాబీ (Hobby Lobby) వ్యవస్థాపకుడు డేవిడ్ గ్రీన్ తాను ఇన్ని సంవత్సరాలు కష్టపడి సంపాదించిన సంపదను శాపంగా పేర్కొన్నారు. అందుకే తన కంపెనీని వదులుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ షాక్‌కి గురిచేశారు. తన కంపెనీని విడిచి పెట్టడంపై స్పందిస్తూ తాను కేవలం నిర్వాహకుడినేనని.. తన వ్యాపారానికి దేవుడే నిజమైన యజమానని నిజం తెలుసుకున్నాని, దాని ఫలితమే ఈ నిర్ణయమని చెప్పారు. తన విజయానికి తన విశ్వాసమే "నిజమైన మూలం" అని వివరించాడు. యజమానిగా, కంపెనీని విక్రయించే హక్కుతో సహా కొన్ని హక్కులు, బాధ్యతలు కూడా ఉన్నాయన్నారు. అయితే తన కంపెనీ విస్తరించే కొద్దీ, ఆ ఆలోచన తనని మరింత బాధపెట్టడం ప్రారంభించిందని తెలిపాడు. ఇంకా చెప్పాలంటే సంపద ఓ రకంగా శాపంలాంటిదని అభిప్రాయపడ్డాడు. అయితే గ్రీన్ తన కంపెనీని ఎలా వదులుకుంటున్నాడు అనే వివరాలు మాత్రం అస్పష్టంగా ఉన్నాయి. అయితే గత వారం ఫాక్స్ & ఫ్రెండ్స్ వీకెండ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, కంపెనీ ఓటింగ్ స్టాక్‌లో 100% ట్రస్ట్‌కు తరలించబడిందని ఆయన చెప్పారు. చదవండి: ఐటీలో అసలేం జరుగుతోంది! ఉద్యోగుల తొలగింపు, ఆఫర్ లెటర్స్ లేవు.. అన్నింటికీ అదే కారణమా -
గిన్నిస్ బుక్‌లోకి.. ‘హూ ఈజ్ హుస్సేన్?
వైరల్: హూ ఈజ్ హుస్సేన్ సరికొత్త గిన్నిస్ రికార్డు సృష్టించింది! హుస్సేన్ ఎవరంటూనే గిన్నిస్కెక్కిందంటున్నారు ఏమిటా అని అవాక్కవుతున్నారా.. ఇంతకీ విషయం ఏమిటంటే.. హూ ఈజ్ హుస్సేన్ అనేది బ్రిటన్‌లోని ఓ సామాజిక న్యాయ దాతృత్వ సంస్థ. గత నెల 27న భారీ స్థాయిలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది. ఏ రేంజ్లో అంటే... ఒకేరోజులో 27 దేశాల నుంచి ఏకంగా 37,018 మంది రక్తదానం చేశారు. న్యూజిలాండ్‌లో 27న తెల్లవారగానే మొదలైన రక్తదానం అమెరికాలోని పశ్చిమ తీర ప్రాంతాల్లో అదేరోజు వలంటీర్లు చేసిన రక్తదానంతో ముగిసింది. ఈ ప్రక్రియను ఆసాంతం పరిశీలించిన గిన్నిస్ బుక్ నిర్వాహకులు.. హూ ఈజ్ హుస్సేన్ సంస్థ సరికొత్త గిన్నిస్ రికార్డు సృష్టించినట్లు ఈ నెల 17న అధికారికంగా ధ్రువీకరించారు. 2020లో ఒకేరోజు 34,723 మంది చేసిన రక్తదానం రికార్డును హూ ఈజ్ హుస్సేన్ బద్దలుకొట్టిందని పేర్కొన్నారు. కరోనా వ్యాప్తి తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆస్పత్రులు, బ్లడ్ బ్యాంకుల్లో రక్త నిల్వలకు తీవ్ర కొరత ఏర్పడిన నేపథ్యంలో తాము గ్లోబల్ బ్లడ్ హీరోస్ పేరిట విస్తృత ప్రచారం చేపట్టి ఒక్కరోజులోనే 37 వేల మందికిపైగా వలంటీర్లలో స్ఫూర్తినింపగలిగామని హూ ఈజ్ హుస్సేన్ నిర్వాహకులు తెలిపారు. ఒక్కో వ్యక్తి చేసే రక్తదానం ద్వారా ముగ్గురి రోగుల వరకు ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుందని.. ఈ లెక్కన తాము 37 వేల మందికిపైగా దాతల నుంచి సేకరించిన రక్తం ద్వారా ఏకంగా 1.10 లక్షల మంది రోగులను కాపాడొచ్చని చెప్పారు. అంతా బాగానే ఉంది కానీ.. ఈ హుస్సేన్ పేరు ఏమిటని సంస్థ నిర్వాహకులను అడిగితే సుమారు వెయ్యేళ్ల కిందట జీవించిన మొహమ్మద్ ప్రవక్త మనవడు హుస్సేన్ ఇబిన్ అలీ తన జీవితాంతం చేసిన నిస్వార్థ సేవలకు గుర్తుగా ఈ పేరు పెట్టినట్లు వివరించారు. ఇదీ చదవండి: హిజాబ్ నిరసనల్లో ఆరుగురు మృతి -
ప్రగతి చారిటీస్‌కు వేమిరెడ్డి రూ.3 లక్షల విరాళం
నెల్లూరు(సెంట్రల్): నెల్లూరులోని ప్రగతి చారిటీస్‌కు రాజ్యసభసభ్యుడు, వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ప్రశాంతిరెడ్డి దంపతులు రూ.3 లక్షల విరాళాన్ని అందజేశారు. మంగళవారం నెల్లూరులోని తన స్వగృహంలో వేమిరెడ్డి చెక్కు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15 సంవత్సరాలుగా మానసిక వికలాంగులైన చిన్నారులకు చేయూతనివ్వడం తమకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందన్నారు. విద్యార్థినికి అభినందన పదో తరగతి ఫలితాల్లో 581 మార్కులు సాధించిన నెల్లూరు రూరల్ పరిధిలోని వీపీఆర్ విద్య విద్యార్థిని వైష్ణవిని రాజ్యసభసభ్యుడు, వీపీఆర్ ఫౌండేషన్ చైర్మన్ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఫౌండేషన్ చైర్పర్సన్ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మంగళవారం అభినందించారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి మాట్లాడుతూ ప్రతిభ చూపిన అమ్మా యిని ఫౌండేషన్ ద్వారా చదివిస్తామన్నారు. తమ విద్యాసంస్థలో చదివి ప్రథమ స్థానంలో వచ్చిన వారి ఉన్నత చదువులకు ఫౌండేషన్ ద్వారా సహకారం అందిస్తామన్నారు. వైష్ణవి వారికి ధన్యవాదాలు తెలిపింది. -
ఆశ చూపించి.. ఉసూరుమనిపించి..
ఎంవీపీ కాలనీ(విశాఖ తూర్పు): నిధుల సేకరణలో కమీషన్లు ఆశ చూపించి మా ప్రేమ సంస్థ యజమాని ముకుందా తమను మోసం చేశారంటూ ఓ వికలాంగ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎంవీపీ కాలనీలోని మా ప్రేమ సంస్థ కార్యాలయం ఎదుట సోమవారం వారు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బాధితుడు, వికలాంగుడైన ముద్దులు సంతోష్‌కుమార్ మాట్లాడుతూ ఏడాది క్రితం వరకు మా ప్రేమ సంస్థలో వలంటీర్‌గా పని చేశానన్నారు. చారిటీ పేరిట సేకరించిన నిధుల్లో ప్రతి రోజు సగం కమిషన్‌గా ఇస్తానని సంస్థ అధినేత ముకుందా నమ్మబలికాడన్నారు. దీంతో తెన్నేటి పార్కు నుంచి ఆర్కే బీచ్ వరకు పర్యాటకుల నుంచి రోజూ రూ.2 వేలు నుంచి రూ.3 వేలు వరకు సేకరించి ముకుందాకు ఇచ్చేవాడినన్నారు. కొన్ని రోజులు కమీషన్ సక్రమంగానే ఇచ్చిన ముకుందా.. తరువాత ఆపేశారని ఆరోపించారు. దీనికి తోడు జాలరిపేటకు చెందిన పలువురు మహిళలకు బ్యాంకు రుణాలు ఇప్పిస్తానని నమ్మబలికి, వారి నుంచి డిపాజిట్ కింద రూ.3 వేలు తీసుకోవాలని తనకు సూచించాడన్నారు. దీంతో పదుల సంఖ్యలో మహిళల నుంచి నిధులు సేకరించినట్లు తెలిపారు. అయితే వారికి ఎలాంటి రుణాలు ఇవ్వకపోవడంతో వారిలో కొందరు డబ్బులు తిరిగి ఇవ్వకపోతే తనను చంపేస్తానని బెదిరిస్తున్నారని సంతోష్‌కుమార్ తెలిపారు. డబ్బులు విషయంపై ప్రశ్నించడంతో తనను వలంటీర్‌గా తొలగించాడన్నారు. న్యాయం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నానని, ఎంవీపీ పోలీసు స్టేషన్లో ముకుందాపై ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు. ఇప్పటికైనా ముకుందాపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. (చదవండి: అలలపై కలల నావ..!) -
అదర్ సైడ్.. నేను సైతం...
బాలీవుడ్లో పరిచయం అక్కర్లేని పేరు... యామీ గౌతమ్. ‘ఇప్పుడు నా కెరీర్‌పై పూర్తిగా దృష్టి పెట్టాలనుకుంటున్నాను’ అనే మాట సెలబ్రిటీల నోటి నుంచి వింటుంటాం. యామీ మాత్రం తన కెరీర్‌తో పాటు సామాజిక విషయాలపై దృష్టి కేటాయించాలనుకుంటుంది. అందుకు ఉదాహరణ... మజిలీస్, పరి అనే స్వచ్ఛందసంస్థలతో కలిసి ఆమె పనిచేయాలని నిర్ణయించుకోవడం. అత్యాచార, లైంగికదాడి బాధితులకు అండగా నిలిచే సంస్థలు ఇవి. ముంబై కేంద్రంగా పనిచేస్తున్న మజిలీస్ విషయానికి వస్తే, 1991లో ఫ్లావియ ఈ సంస్థను ప్రారంభించారు. ఆమె ఒకప్పుడు గృహహింస బాధితురాలు. ‘మజిలీస్’లో 25 మంది సభ్యులు ఉన్నారు. ఎక్కువమంది లాయర్లే. దిల్లీ కమిషన్ ఫర్ వుమెన్ కార్యాలయంలో యామీ గౌతమ్ అత్యాచార బాధితులకు అండగా నిలవడమే కాదు, స్త్రీ సాధికారత, హక్కులు, చట్ట, న్యాయ సంబంధిత విషయాల గురించి అవగాహన కలిగించడంతోబాటు ఫెలోషిప్ ప్రోగ్రామ్స్ చేపడుతుంది మజిలీస్. అయితే చాలాసార్లు ఈ సంస్థకు నిధుల కొరత అవరోధంగా ఉంటోంది.. యామీలాంటి పేరున్న నటులు చేయూత ఇస్తే ఆ సంస్థ మరిన్ని కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఏర్పడుతుంది. ‘అత్యాచారాలకు సంబంధించిన వార్తల గురించి వింటున్నప్పుడు మనసు బాధతో నిండిపోయేది. ఆ మానసిక పరిస్థితి నుంచి బయటికి రావడం చాలా కష్టంగా ఉండేది. పని ఒత్తిడిలో ఆ బాధను తాత్కాలికంగా మరిచిపోయినా నా ముందు ఎప్పుడూ ఒక ప్రశ్న మాత్రం నిలుచుండేది. మనం ఏమీ చేయలేమా? ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడానికే స్వచ్ఛందసంస్థలతో కలిసి పనిచేయాలనుకుంటున్నాను. ఇది ఆరంభం మాత్రమే. మహిళల భద్రతకు సంబంధించిన విషయాలలో మరిన్ని కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నాను’ అంటుంది యామీ. బాలీవుడ్లో పది సంవత్సరాల అనుభవాన్ని గడించిన యామీ గౌతమ్ తొలి రోజులు నల్లేరు మీద నడకేమీ కాదు. రక రకాల సమస్యలు ఎదుర్కొంది. ఇదంతా ఒక ఎత్తయితే తన మీద తనకు అపనమ్మకం. ‘మన మీద మనకు అపనమ్మకం ఏర్పడ్డప్పుడు, ఇక వేరే శత్రువు అంటూ అక్కర్లేదు. మనల్ని పూర్తిగా వెనక్కి తీసుకెళ్లే ప్రతికూలశక్తి దానికి ఉంది. మా అమ్మ మాటల బలంతో ఆ ప్రతికూల భావన నుంచి బయటికి రాగలిగాను. అందుకే నా మాట సహాయం కోరి వచ్చే వారికి నువ్వు కచ్చితంగా నెగ్గగలవు, నీలో ఆ శక్తి ఉంది అని ధైర్యం ఇస్తుంటాను’ అంటున్న యామీ తొలిరోజుల్లో స్క్రిప్ట్ వినేటప్పుడు... ‘ఈ సినిమాలో నా పాత్ర ఏమిటీ?’ అనే వరకు పరిమితమయ్యేది. ఇప్పుడు మాత్రం ‘ఈ సినిమాలో నా పాత్ర ఇచ్చే సందేశం ద్వారా సమాజానికి ఏమైనా ఉపయోగం ఉందా?’ అనే కోణంలో ఆలోచిస్తుంది. ‘లాస్ట్’ సినిమాలో క్రైమ్ రిపోర్టర్, ‘దాస్వీ’లో ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలు పోషించడం ఆమె ఆలోచన« దోరణిలో వచ్చిన మార్పుకు అద్దం పడతాయి. తాజా చిత్రం ‘ఏ థర్స్ డే’కు మంచి ప్రశంసలు లభిస్తున్నాయి. నైనా జైస్వాల్ అనే అత్యాచార బాధితురాలి పాత్రలో నటించింది యామీ గౌతమ్. వ్యవస్థ లోపాలను ప్రశ్నించడంతో పాటు, మన కర్తవ్యాన్ని ఈ సినిమా గుర్తు చేస్తుంది. -
అయ్యో పాపం! రెండేళ్ల బాలుడికి ప్రపంచంలోనే అరుదైన వ్యాధి.. చికిత్స కోసం?
మానవత్వం మాయం అవుతున్న ఈ రోజుల్లో.. ఇంకా కొందరు తమలో జాలి, దయ, ప్రేమ ఉన్నాయని నిరూపించారు. ప్రపంచంలోనే అరుదైన వ్యాదితో భాదపడుతున్న 2 ఏళ్ల బాలుడిని కాపాడటం కోసం సింగపూర్ వాసులందరు ఒక్కటయ్యారు. భారత సంతతికి చెందిన రెండేళ్ల బాలుడు సింగపూర్ వాసుల సహాయంతో ప్రపంచంలోనే అరుదైన స్పెనల్ మస్కులర్ అట్రోఫీ(ఎస్ఎంఏ) వ్యాధి నుంచి కోలుకున్నాడు. బాలుడు చికిత్స కోసం దాదాపు 30 లక్షల సింగపూర్ డాలర్లు(రూ.16.68 కోట్లు) విరాళంగా ఇచ్చి సింగపూర్ వాసులు తమ సహృదయాన్ని మరోసారి చాటారు. దేవదాన్ దేవరాజ్ భారత సంతతికి చెందిన ప్రభుత్వోద్యోగి డేవ్ దేవెరాజ్, ఇంటీరియర్ డిజైనర్ భార్య షు వెన్ దేవరాజ్(చైనీస్ సంతతి)ల ఏకైక సంతానం. భార్యాభర్తలిద్దరూ 33 సంవత్సరాల వయస్సు కలిగి ఉన్నారు. దేవదాన్ అనే చిన్నారి అరుదైన స్పెనల్ మస్కులర్ అట్రోఫీ(ఎస్ఎంఏ) వ్యాధితో బాధపడుతున్నాడు. అయితే, ఈ వ్యాధి నయం చేయాలంటే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఔషధంగా పిలిచే జోల్గెన్స్మా ఇంజెక్షన్ అవసరం. దీనిని అమెరికా సంస్థ తయారు చేస్తోంది. దీని ఖరీదు రూ.16 కోట్లు. ఈ ఔషధానికి అమెరికా ఎఫ్‌డీఏ అనుమతిని ఇచ్చినప్పటికీ, సింగపూర్ హెల్త్ సైన్సెస్ అథారిటీ మాత్రం ఆమోదించలేదు. కానీ స్పెషల్ యాక్సెస్ రూట్ కింద ఈ ఇంజెక్షన్‌ను దిగుమతి చేసుకోవచ్చు. చిన్నారి ప్రాణాలను కాపాడటం కోసం తల్లిదండ్రులు పడుతున్న ఆవేదనను అర్ధం చేసుకున్న “రే ఆఫ్ హోప్ ” అనే స్వచృంద సంస్థ ఆన్లైన్ ద్వారా విరాళాలను సేకరించే పనిని ప్రారంభించింది. స్వచ్ఛంద సంస్థ విరాళను సేకరించడం ప్రారంభించిన కేవలం 10 రోజుల్లోనే భారత సంతతి చిన్నారి ప్రాణాలను రక్షించేందుకు స్థానిక సింగపూర్ వాసులు అందరూ కలిసి రూ.16.68 కోట్లను విరాళ రూపంలో అందజేశారు. దేవదాన్ చికిత్స కోసం క్రౌడ్ ఫండింగ్ ఛారిటీ 'రే ఆఫ్ హోప్' ద్వారా సుమారు 30,000 మంది విరాళం ఇచ్చినట్లు ఛారిటీ పేర్కొంది. రే ఆఫ్ హోప్ జనరల్ మేనేజర్ టాన్ ఎన్ మాట్లాడుతూ.. మేము ఇప్పటి వరకు సేకరించిన విరాళలో ఇదే పెద్ద మొత్తం అని తను పేర్కొన్నారు. చిన్నారి తల్లి షువెన్ మాట్లాడుతూ.. దేవదాన్‌ను రక్షించడానికి ముందుకు వచ్చిన దాతలందరికి కృతజ్ఞతలు తెలిపారు. (చదవండి: దేశంలో కొనసాగుతున్న డిజిటల్ చెల్లింపుల హవా..!) -
అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన పలని సేవాదళ్ నిర్వాహకులు
వరంగల్: భద్రకాళి దేవాలయం వద్ద పలని సేవాదళ్ నిర్వాహకులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్నదానానికి మించిన దానం మరేదీ లేదని, గత మూడు సంవత్సరాలుగా పలని సేవాదళ్ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం గొప్ప విషయమని ప్రజలు అన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం పట్ల నిర్వాహకులను ప్రజలు అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు తుమ్మ శ్రీధర్ రెడ్డి, పలణి సేవాదళ్ నిర్వాహకులు గుండా అమర్నాథ్, పబ్బతి సత్యనారాయణ, మోదె నాగెందర్ ,నూతన్ కుమార్, దేవా అరవింద్,గరినే శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. సుమారు 600 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. చదవండి: Mahabubabad: టీఆర్ఎస్ అధిష్టానం రహస్య సర్వే! -
దుస్తులు వేలం వేసిన నిత్యామీనన్
చెన్నై : కరోనా మహమ్మారి మానవాళిని అతలాకుతలం చేస్తోంది.ముఖ్యంగా పేదల జీవితాలు దయనీయంగా మారాయి. అలాంటి వారిని ఆదుకోవడానికి పలువురు ముందుకొస్తున్నారు. సినీ ప్రముఖులు తమ వంతు సాయం చేస్తున్నారు. నటి నిత్యామీనన్ నేను సైతం అంటూ సిద్ధమయ్యారు. తన దుస్తులను వేలం వేసి తద్వారా వచ్చిన డబ్బును కరోనా బాధితులకు అందించాలని నిర్ణయించుకున్నారు. దీని గురించి నిత్యామీనన్ తన ట్విట్టర్లో పేర్కొంటూ.. ఇటీవల ఒక ఫ్యాషన్ షోలో పాల్గొన్నానని చెప్పింది. తాను ధరించిన దుస్తులను తన స్నేహతురాలు, డిజైనర్ కరోని ప్రత్యేకంగా తయారు చేసిందని చెప్పింది. కాగా ప్రస్తుతం కరోనా మహమ్మారి పేదల జీవితాలను చిధ్రంగా మార్చేసిందని..అలాంటి వారు మళ్లీ నిలదొక్కుకోవడానికి సాయం చేయాలని భావించినట్లు పేర్కొంది. దీంతో తాను ఫ్యాషన్ షోలో ధరించిన దుస్తులతో పాటు సినిమాలో ధరించిన ఖరీదైన దుస్తులను వేలం వేయాలని నిర్ణించానని పేర్కొంది. తద్వారా వచ్చిన డబ్బును నూరు శాతం అర్పణం ట్రస్టుకు చేరుతుందని చెప్పింది. ఆ ట్రస్ట్ పేద కుటుంబాలకు సాయం చేస్తుందని నిత్యామీనన్ చేప్పింది. -
పిల్లలు పస్తులు ఉండకూడదు
కోవిడ్ 19 (కరోనా వైరస్) కారణంగా ప్రపంచవ్యాప్తంగా పాఠశాలలు మూతపడ్డాయి. కొన్ని ప్రభుత్వ విద్యాలయాల్లో పిల్లలకు ఉచిత భోజన సౌకర్యం ఉంటుంది. ఇప్పుడు పాఠశాలలు మూతబడడంతో పేద కుటుంబాలకు చెందిన పిల్లలకు సరైన ఆహారం అందే పరిస్థితి లేదు. అందుకే ప్రముఖ హాలీవుడ్ నటి ఏంజెలినా జోలీ ‘నో కిడ్ హంగ్రీ’ అనే సేవా సంస్థకు దాదాపు 7 కోట్లకు పైగా విరాళంగా ప్రకటించారు. ‘‘కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది పిల్లలు స్కూల్‌కు వెళ్లలేకపోతున్నారు. చాలామంది పిల్లలకు స్కూల్ టైమింగ్స్‌లో పౌష్టికాహారం అందుతుంది. అమెరికాలోనే అలాంటి వారు 22 మిలియన్లు ఉన్నారు. అందుకే నా వంతుగా విరాళం ఇస్తున్నా. పిల్లలు పస్తులుండకూడదు’’ అని పేర్కొన్నారు ఏంజెలినా. -
ఓ అనామిక కథ!
ఆ చిన్నారి ఐదేళ్ల వయసులో ఒడిశాలో తప్పిపోయింది. తల్లిదండ్రులు అప్పట్లో వెతికినా బిడ్డ ఆచూకీ దొరకలేదు. ఆశలు వదులుకుని వారు స్వగ్రామానికి వచ్చేశారు. ఆ బాలికను ఒడిశా ప్రభుత్వం సంరక్షించి చదివిస్తోంది. ఎప్పటికైనా తన తల్లిదండ్రులను చూడకపోతానా అని ఆశతోనే ఉండేది. అధికారుల సాయంతో తన స్వస్థలం వీకోట మండలంలోని బోడిగుట్టపల్లెగా తెలుసుకుంది. అయితే తల్లిదండ్రులు మృతి చెందారని తెలిసి కన్నీరుమున్నీరవుతోంది. సాక్షి, పలమనేరు:చిన్న తనంలో ఒడిశాలో తప్పిపోయిన బాలికకు పదేళ్ల తర్వాత తన పుట్టిన నేల గురించి తెలిసినా.. ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. పూర్తి వివరాలు తెలుసుకునే సరికి కన్నవారు లేరన్న నిజం జీర్ణించుకోలేకపోతోంది. కనీసం తన కుటుంబీకులను కలుసుకోవాలని ఆరాటపడుతోంది. పదేళ్ల తర్వాత ఆమెకు తన వివరాలు ఎలా లభించాయి. అసలు ఏం జరిగిందంటే.. వీకోట మండలం బోడిగుట్టపల్లెకు చెందిన పరమేష్, లక్షమ్మ భార్యాభర్తలు. వారికి ఇద్దరు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు. బతుకుదెరువు కోసం పదేళ్ల క్రితం చిన్న కూతురితో పాటు ఒడిశా రాష్ట్రం పూరి సమీపంలోని కనాస్ ప్రాంతానికి వలసకూలీలుగా వెళ్లారు. అక్కడ బిడ్డ తప్పిపోయింది. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. ఫిర్యాదు చేసేందుకు పోలీసుస్టేషన్‌కు వెళ్లారు. బాలిక ఫొటో కావాలన్నారు. తమవద్ద లేదని చెప్పడంతో కేసు కూడా నమోదుచేయలేదు. కొన్నాళ్లు తప్పిపోయిన ప్రాంతంలో వెతికి చేసేదిలేక స్వగ్రామానికి తిరిగొచ్చేశారు. ఇక్కడ కూలిపనులు చేసుకుంటూ ఉండిపోయారు. వికోట మండలం బోడిగుట్టపల్లిలో బాలిక కుటుంబ సభ్యులను విచారిస్తున్న అధికారులు బాలికను చేరదీసిన స్వచ్ఛంద సంస్థ ఒడిశాలోని కనాస్లో అనాథగా తిరుగుతున్న చిన్నారిని నిలాచల్ సేవా ప్రతిష్టాన్ అనే స్వచ్ఛంద సంస్థ గుర్తించింది. అక్కడి ఐసీపీఎస్ (ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్) అధికారులకు అందజేసింది. వారు అక్కడి ప్రభుత్వ చిల్డ్రన్ హోమ్(దయావిహార్)కు అప్పగించారు. ఆ సంస్థ నిర్వాహకులు ఆ బాలికకు అనామిక అని పేరు పెట్టి అక్కడే చదివిస్తున్నారు. బాలిక పెరిగి పెద్దయ్యాక రెండేళ్ల క్రితం తమది ఆంధ్రరాష్ట్రం చిత్తూరు జిల్లాలోని బోడిగుట్టపల్లె అని చెప్పింది. అక్కడి అధికారులు చిరునామా కనుగొనేందుకు బాలిక 8వ తరగతి ఫొటోను చిత్తూరు ఐసీడీఎస్ అధికారులకు పంపారు. బోడిగుట్టపల్లి పేరిట పలమనేరు, కుప్పం నియోజకవర్గాల్లో రెండు, మూడు గ్రామాలుండడంతో స్థానిక సీడీపీఓలు రెండేళ్లుగా చిరునామా కోసం విచారిస్తున్నానే ఉన్నారు. ఇలా ఉండగా వికోట మండలం బోడిగుట్టపల్లెకు చెందిన ఓ బాలిక ఒడిశాలో తప్పిపోయిందని స్థానికుల ద్వారా సీడీపీఓ రాజేశ్వరికి సమాచారం అందింది. ఆమె నాన్ ఇన్స్టిట్యూషన్ కేర్ ప్రొటెక్షన్ ఆఫీసర్ శివకు ఆ విషయం తెలిపారు. ఆయన బోడిగుట్టపల్లికి చేరుకుని బాలికకు సంబంధించిన ఫొటో, వివరాలను చెప్పారు. కుటుంబ సభ్యుల ఫొటోలను ఒడిశాలో బాలిక ఉంటున్న చైల్డ్‌హోమ్‌కు వాట్సాప్‌లో పంపారు. వారిని చూసిన బాలిక తన అన్న, అక్కలుగా గుర్తించింది. అంతలోనే కన్నీరుమున్నీరు తన వారిని గుర్తించిన బాలిక తల్లిదండ్రులు ఎలా ఉన్నారో చూపాలని ఆత్రుతగా అడిగింది. వారు మృతి చెందారనే సమాచారం తెలుసుకుని బాలికకు చెప్పారు. దీంతో అనామిక కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. కనీసం తన బంధువుల వద్దకు వెళతానని బాలిక కోరింది. దీంతో జిల్లా ప్రొటెక్షన్ ఆఫీసర్, స్థానిక సీడీపీఓలు మంగళవారం బోడిగుట్టపల్లెలోని కుటుంబ సభ్యులను విచారించారు. వీడియో కాల్ ద్వారా బాలికతో మాట్లాడించారు. ఈ వివరాలతో నివేదికను ఒడిశా ప్రభుత్వానికి పంపి ఆపై బాలికను కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్టు సీడీపీఓ రాజేశ్వరి తెలిపారు. కాగా అనామిక ప్రస్తుతం అక్కడి పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. పరీక్షలు పూర్తయ్యాక ఇక్కడికి పంపనున్నట్లు అక్కడి అధికారులు తెలిపారని విచారణకు వచ్చిన అధికారి శివ తెలిపారు. 10 ఏళ్ల క్రితం తప్పిపోయిన బిడ్డ బతికే ఉందని, ఆ బాలిక ఇప్పుడెలా ఉందో చూడాలని వారి కుటుంబ సభ్యులే కాదు.. ఆ గ్రామస్తులంతా వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. -
ఫుడ్ ఏటీఎం
రైతు కష్టపడి పండించిన పంటను మనం ఇంటికి తెచ్చుకుని వండుకుని తింటున్నాం. వండుకున్నది మిగిలిపోతే పడేస్తున్నాం. రైతు పడిన కష్టం మనకు తెలియదు. అందుకే ఆహారం విలువ కూడా తెలియట్లేదు. విందు వినోదాలలోనైతే టన్నుల కొద్దీ ఆహారం వృథా అవుతుంటుంది. ఈ వృథాను అరికట్టేందుకు కొన్ని సేవా సంస్థలు మిగిలిన పదార్థాలను సేకరించి పేదలకు అందజేస్తుంటాయి. తాజాగా ఒడిశాలోని సంబల్పూర్లో ‘తృప్తి’ పేరున ఒక ఏటీఎంను నెలకొల్పారు. పేదలకు ఉచితంగా తినడానికి ఇంత ముద్ద అందజేయడం కోసమే ఈ ఏటీఎంను ఏర్పాటు చేశారు. ‘స్వచ్ఛ’ అనే ఒక స్వచ్ఛంద సంస్థ సహకారంతో సంబల్పూర్ మునిసిపల్ కౌన్సిల్ ఈ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించింది. ముందుగా తమ దగ్గరకు వచ్చిన ఆహారం స్వచ్ఛంగా, శుభ్రంగా ఉందో లేదో పరీక్షించిన తరువాత మాత్రమే ఏటీఎంలో భద్రపరుస్తామని స్వచ్ఛ సంస్థ సభ్యులలో ఒకరైన దిలీప్ పాండా చెబుతున్నారు. అది కూడా కేవలం ప్యాక్డ్ శాకాహారం మాత్రమే విరాళంగా అందజేయాలట. పేదవారికి, అనాథలకు ఉచితంగా ఆహారం అందజేయడం కోసమే ఈ పథకాన్ని ప్రారంభించారు. ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఇక్కడ ఆహారం దొరుకుతుంది. పేరుకు ఏటీఎం అయినా.. ఇందుకు కార్డులేమీ అవసరం లేదు. ఆకలి ఉంటే చాలు. 700 లీటర్ల సామర్థ్యం గల రిఫ్రిజిరేటర్లో ఈ ఆహారాన్ని నిల్వ చేస్తున్నారు. సంబల్ పూర్ జిల్లా హెడ్ క్వార్టర్స్ ఆసుపత్రి దగ్గర ఇది కనిపిస్తుంది. -
గొంతు తగ్గించాల్సిన విషయం కాదు
కొన్ని విషయాలను మనమింకా గొంతు తగ్గించే మాట్లాడుతున్నాం. అయితే రుతుక్రమం విషయంలో స్వేచ్ఛగా బయటికి మాట్లాడితేనే సమాజంలో పేరుకు పోయిన నిషిద్ధ భావనను తొలగించగలం.. అని యు.కె.కి చెందిన చార్లెట్ అంటున్నారు. ‘‘గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రులు తమ కూతుళ్లను చదివిస్తున్నారు, ఉద్యోగాలకు పంపిస్తున్నారు. అయినప్పటికీ వాళ్లు చాలా సందర్భాల్లో మగపిల్లలతో పోటీ పడాల్సిన పరుగులో ఒకింత వెనకడుగు వేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఇండియాలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన అమ్మాయిల విషయంలో ఇలా జరుగుతోంది. మెన్స్ట్రువల్ పీరియడ్స్ వల్ల క్లాసులు మిస్ అవడం ఇందుకు ప్రధాన కారణం. ఒక ఇంజనీర్, ఒక డాక్టర్, ఒక ఎంట్రప్రెన్యూర్, ఒక ఆస్ట్రోనాట్... ఇలా ఎన్నో రంగాల్లో మహిళలకు అవకాశాలున్నాయి. వీటన్నింటిలోనూ అబ్బాయిలు ఉన్నంత సంఖ్యలో అమ్మాయిలు లేరు. పీరియడ్స్ అంటే సమాజంలో కరడు గట్టిపోయి ఉన్న ఒక కళంకిత భావనను తొలగించగలితే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అందుకోసమే యూకే నుంచి ఇండియాకి వచ్చాను’’ అన్నారు చార్లెట్ లియోన్హార్డ్సెన్. మాంచెస్టర్‌లోని ‘ద బ్యూరో కమ్యూనిటీ వెల్ బీయింగ్’ సంస్థలో హెల్త్ అండ్ వెల్ బీయింగ్ మేనేజర్‌గా ఉన్న చార్లెట్ బుధవారం ఇండియా వచ్చారు. మెదక్ జిల్లా, ఇస్నాపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించడానికి వెళ్తూ హైదరాబాద్‌లో సాక్షితో మాట్లాడారు. ‘‘కొన్ని మతపరమైన నిబంధనలు భారతీయ మహిళకు కనిపించని సంకెళ్లుగా మారుతున్నాయి. రుతుక్రమం అపరిశుభ్రం అనే భావనను వదిలించుకున్నప్పుడే సమాజం సమానత్వం దిశగా నడుస్తుంది. మరొక ప్రాణికి జన్మనివ్వాల్సిన ప్రకృతి సహజమైన ఏర్పాటును మలినం అని ఎలాగంటారు? ఈ విషయంలో మహిళలకు అవగాహన కల్పించడం అన్నది మనకు బయటకు కనిపిస్తున్న అంశం. నిజానికి మగవాళ్లను సెన్సిటైజ్ చేయడం అవసరం. మహిళల్లో ఈ కళంకిత భావనను తొలగించాలంటే వీలయినంత ఎక్కువగా దీని గురించి మాట్లాడడం ఒక్కటే మార్గం’’ అన్నారు చార్లెట్. ‘‘లండన్‌లో కొన్ని మారుమూల ప్రాంతాల్లో కూడా ఇలాంటి భావన ఉంది. కానీ అక్కడ స్కూళ్లలో ఆడపిల్లలకు, మగపిల్లలకు కూడా పదేళ్ల వయసు నుంచే స్త్రీ–పురుష దేహాల మధ్య ఉండే తేడాలను వివరిస్తారు. అది అక్కడ పాఠ్యాంశాలలో భాగం. అలా పెరిగిన పిల్లలకు మెన్స్ట్రువల్ సైకిల్ అనేది గొంతు తగ్గించి మాట్లాడాల్సిన విషయంగా అనిపించదు. ఓపెన్‌గా మాట్లాడగలిగినప్పుడు ఇక సిగ్గుతో ముడుచుకోవాల్సిన అవసరమే ఉండదు కదా? బజారు నుంచి వచ్చేటప్పుడు స్టోర్ నుంచి తన కోసం శానిటరీ పాడ్స్ తీసుకురమ్మని అక్కడ ఒక మహిళ భర్తను అడగగలుగుతుంది. ఇండియాలో చదువుకున్న మహిళ కూడా భర్త ఎదురుగా స్టోర్ నుంచి శానిటరీ నాప్కిన్స్ పాకెట్ తీసుకోవడానికి బిడియ పడుతుంటుంది. ఇండియాలో ఉన్నంత తీవ్రంగా కాకపోయినప్పటికీ ప్రపంచంలో మరికొన్ని చోట్ల ఇలాంటి భావన ఇంకా ఉంది. దాని నుంచి మహిళకు విముక్తి కలిగించాలి. అందుకోసం ప్రపంచ దేశాల్లోని స్కూళ్లు, కాలేజ్‌లు, యూనివర్సిటీలను సందర్శించడమే పనిగా పెట్టుకున్నాను. వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు రీ యూజబుల్ నాప్కిన్స్ని పరిచయం చేయడం కూడా నా పర్యటనలో ముఖ్యమైన భాగం. ఇస్నాపూర్ ప్రభుత్వ పాఠశాలను ఇండియాలోని ‘రోజ్’ అనే స్వచ్ఛంద సంస్థ దత్తత తీసుకుంది. అమ్మాయిల కోసం స్కూల్లో ఆ సంస్థ ప్యాడ్స్ వెండింగ్ మెషీన్ ఏర్పాటు చేసిన విషయం మాకు తెలిసింది. అక్కడి అమ్మాయిలకు టైలరింగ్ కూడా నేర్పిస్తున్నారు. వారికి రీ యూజబుల్ నాప్కిన్స్ తయారీలో శిక్షణ ఇవ్వడానికి వెళ్తున్నాను. తప్పని సరిగా పర్యావరణ హితమైన జీవనశైలితోపాటు, వ్యక్తిగత ఆరోగ్యకరమైన జీవనశైలిని పరిచయం చేయడమే నా ఈ పర్యటన ఉద్దేశం’’ అన్నారు చార్లెట్. – వాకా మంజులారెడ్డి -
మేధా వారధి
సాధారణంగా పైచదువుల కోసం విదేశాలకు వెళ్లినవారు, చదువు మీదే దృష్టి పెడతారు. కాని మేధ మాత్రం చదువుతో పాటు సామాజిక సేవా చేస్తున్నారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి హెల్త్ సైకాలజీలో ఇంటిగ్రేటెడ్ ఎం.ఎస్సి. చేసిన మేధ, స్కాలర్షిప్ మీద పిట్స్బర్గ్ యూనివర్సిటీలో చేరి మాస్టర్స్ ఇన్ సోషల్ వర్క్ రెండో సంవత్సరం చదువుతున్నారు. అక్కడ చేరిన మూడు నెలలకే ‘వాయిస్ ఫర్ గర్ల్స్’ స్వచ్ఛంద సంస్థలో శిక్షణ పొందారు. ఒక పక్కన చదువులో రాణిస్తూనే మరో పక్క సంఘ సేవపై శ్రద్ధ పెట్టారు. మేధ సెంట్రల్ యూనివర్సిటీలో చేరిన మొదటి సంవత్సరమే వాయిస్ ఫర్ గర్ల్స్ సంస్థ తరఫున పనిచేయడానికి కాంపస్ నుండి ఎన్నికయ్యారు. ఈ సంస్థ ప్రధాన లక్ష్యం సాంఘిక సేవ. ముఖ్యంగా మహిళలకు సంబంధించిన సమస్యల గురించి అవగాహన కల్పించి, వాటిని ఎదుర్కొనేలా వారిలో ఆత్మవిశ్వాసం కలిగించడం. అంతే కాదు.. అట్టడుగు వర్గాలకు చెందిన టీనేజర్స్‌కి ఆర్థిక, సాంఘిక సమానత్వం సాధించుకునేలా ‘వాయిస్’ వలంటీర్లు అవగాహన కల్పిస్తారు. జీవనోపాధికి ఉపయోగపడే మార్గాలను ఎంచుకునేలా తీర్చిదిద్దుతారు. గ్రామాలలో, చిన్న చిన్న పట్టణాలలో ఉండే బాలికల ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి, వారికి జీవన నైపుణ్యాలు నేర్పుతారు. వ్యక్తిగత పరిశుభ్రత, ఋతు సమయంలో పాటించవలసిన పరిశుభ్రత, న్యాప్కిన్స్ వాడటం వల్ల కలిగే ఉపయోగాల గురించి తెలియచేస్తారు. ‘‘మొదట్లో వారికి నా మాటలు నచ్చలేదు. వారం రోజులు గడిచేసరికి పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. ఆ తరవాత ఆచరించడం ప్రారంభించారు’’ అన్నారు మేధ.ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పిల్లలకు ఇంగ్లీషు అక్షరాలు రాయడం, చిన్న పదాలు చదవడం వచ్చు. ఎవరైనా ఇంగ్లీషు మాట్లాడితే అర్థం చేసుకోగలరు, కాని మాట్లాడాలంటే సిగ్గు పడతారు. అటువంటివారికి నెల రోజుల పాటు స్పోకెన్ ఇంగ్లీషు తరగతులు నిర్వహించి, ధైర్యంగా మాట్లాడేలా తయారుచేశారు. వారి మీద జరిగే లైంగిక అత్యాచారాల గురించి అవగాహన కలిగించారు. వారికి ఉండే మౌలిక హక్కులను వారికి తెలియపరిచారు. స్వచ్ఛంద సంస్థల వారధివిద్య పరంగా వెనుకబడిన చోట బాల్యవివాహాలు ఎక్కువగా జరుగుతాయి. అటువంటి వివాహాలు జరగకుండా జాగ్రత్త పడాలని వారికి అర్థమయ్యేలా వివరించడం తన బాధ్యతగా భావించారు మేధ. అలాగేజీవితం లో ఎదుర య్యే ఆటంకాలను అధిగమించేలా పాఠ్య ప్రణాళికను రూపొందించి, ప్రభుత్వ పాఠశాలలలో చదువుకునే బాలికలకు బోధించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సహకారం కూడా ఉంది. ప్రభుత్వ పాఠశాలలో శిబిరాలు నిర్వహించి, ప్రభుత్వ పాఠశాలకు, స్వచ్ఛంద సంస్థలకు వారధిగా, ఇతర కౌన్సెలర్లకు మార్గదర్శిగా కూడా వ్యవహరించారు మేధ. ఎమ్.ఎస్సీ హెల్త్ సైకాలజీలో భాగంగా హైదరాబాద్‌లోని గ్లోబల్ హాస్పిటల్లో ఎనిమిది నెలలు ఇంటర్న్‌షిప్ చేసిన సమయంలో రోగుల మానసికస్థితిని పూర్తిగా గమనించారు. – వైజయంతి పురాణపండ బాపూ అభిమాని అమెరికా పిట్స్బర్గ్ యూనివర్సిటీలో నేర్చుకున్న విషయాలను, భారత దేశంలోని గ్రామాల అభివృద్ధి, బాలల హక్కుల పరిరక్షణ, బాలికల అభ్యున్నతి, సంక్షేమం కోసం వినియోగించాలనేది మేధ ఆశయం. సితార్ వాదనం, శాస్త్రీయసంగీతం, శాస్త్రీయ నృత్యంలో కూడా మేధకు ప్రవేశం ఉన్నది. నాట్యం అంటే మక్కువ. కవిత్వం, సామాజిక అంశాల మీద వ్యాసాలు రాస్తారు. చక్కటి చిత్రకారిణి కూడా. ఆమె అభిమాన చిత్రకారులు జామిని రాయ్, బాపు, వాంగో. అంతర్జాతీయ పురస్కారం ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీ ఆఫ్ పిట్స్బర్గ్ లో ఎమ్.ఎస్ సోషల్ వర్క్‌లో స్కాలర్ షిప్‌తో సీటు వచ్చిన మూడు నెలలకే యూనివర్సిటీ సోషల్ వర్క్ విభాగం నుండి అంతర్జాతీయ ప్రతినిధిగా ఎంపికయ్యారు. తర్వాత ఆరు నెలలకు ఐరిస్ మేరియాన్ యంగ్ అనే ప్రముఖ రాజకీయశాస్త్రవేత్త, అంతర్జాతీయ సమస్యల అధ్యయనకర్త పేర నెలకొల్పిన ఉత్తమ సేవా పురస్కారం అందుకున్నారు. పట్టభద్రులలో ఒకరికి, ఇంకా పట్టభద్రులు కాని గ్రాడ్యుయేట్ విద్యార్థులలో ఒకరికి, అధ్యాపకులలో ఒకరికి ఈ పురస్కారం ప్రదానం చేస్తారు. బాలల హక్కుల సంస్థలో విద్యాబోధనకై తను ప్రవేశపెట్టిన సృజనాత్మక బోధన పరికరాలకు, నేతృత్వ స్ఫూర్తికి మేధ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. -
‘రోటరీ’కి రూ.100 కోట్ల విరాళం
బెంగళూరు: స్వచ్ఛంద సంస్థ రోటరీ ఇంటర్నేషనల్‌కు బెంగళూరు స్థిరాస్తి వ్యాపారి రూ.100 కోట్లు విరాళంగా ఇచ్చి తన పెద్ద మనసు చాటుకున్నాడు. స్వాతంత్య్ర సమరయోధుడి కుమారుడైన డి.రవిశంకర్ ఈ మొత్తాన్ని ఇచ్చినట్లు బెంగళూరు రోటరీ క్లబ్ ప్రతినిధి, బెంగళూరు క్రెడాయ్ ఉపాధ్యక్షుడు సురేశ్ హరి వెల్లడించారు. రవిశంకర్ ఇచ్చిన సొమ్మును చిన్నారుల ఆరోగ్యం సహా రోటరీ ఇంటర్నేషనల్ నిర్వహిస్తున్న చారిటీ కార్యక్రమాలకు వెచ్చిస్తామని హరి తెలిపారు. రవిశంకర్ తండ్రి కామేశ్.. వినోబాబావే భూదాన ఉద్యమంలో పాల్గొని తన భూమినంతా దానం చేశారు. -
బతుకు... బతికించు!
ఈ రోజుల్లో అప్పు పుట్టాలంటే... ఎన్నికష్టాలో! కొద్దో గొప్పో పరపతి ఉండాలి. లేదంటే.. లాభాలు తెచ్పిపెట్టే వ్యాపారమైనా ఉండాలి. అదీ కాదంటే... బోలెడంత ఆస్తి వెనకేసుకోనైనా ఉండాలి! ఇన్ని ఉన్నా... సవాలక్ష రూల్స్ చెప్పిగానీ బ్యాంకులు కాసు విదల్చవు. మరి... ఇవేవీ లేని నిరుపేద రైతుకు రుణం కావాలంటే...? నేతన్న నూలు కొనేందుకు రూకలు కావాలంటే..? బిడ్డలు స్కూలుకెళ్లేందుకు సాయం కావాలని అమ్మలు అడిగితే...? బ్యాంకులు ఎలాగూ ఇవ్వవుగానీ.. అందరం ఒక చేయి వేద్దాం... పేదలందరినీ ఆదుకుందాం అంటోంది రంగ్ దే! బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ పేరు రంగ్ దే! స్వాతంత్య్ర పోరాట సమయంలో ఎందరికో స్ఫూర్తినిచ్చిన పాట ‘రంగ్ దే బసంతి చోలా’ తొలి పదాలే పేరుగా ఏర్పడిన ఈ సంస్థ దేశంలో పేదరికమన్నది ఎందుకుండాలి? అని ప్రశ్నిస్తోంది. సమాజంలో తోటివాడిని సాయం చేయాలన్న స్పృహ ఉన్న కొంతమంది చేతులు కలిపితే ఇదేమీ కష్టం కాదని తొమ్మిదేళ్లుగా ఈ సంస్థ పదే పదే నిరూపిస్తోంది కూడా. దేశం మారుమూలల్లోని స్వచ్ఛంద సంస్థలతో చేతులు కలిపిన రంగ్ దే... ఆ ప్రాంతాల్లోని పేదల అవసరాలను... గుర్తిస్తుంది. సాయం అందించేందుకు ముందుకు రమ్మని తమ వెబ్సైట్ వేదికగా దాతలను ఆహ్వానిస్తుంది. ఆ కష్టాలు మిమ్మల్ని కదిలిస్తే చాలు... ఎప్పుడో అనుభవించి, అధిగమించిన కష్టాలను గుర్తు చేస్తేచాలు... మనసు మూలల్లో నిద్రపోతున్న మానవత్వాన్ని తట్టిలేపితే చాలు.. మీరే వారి ఆప్తమిత్రులు కావచ్చు! వారిని ఆదుకోవచ్చు. అలాగని మీరు వారికేమీ డబ్బు ఊరికే దానమే చేయాలని రూలేమీ లేదు. పెట్టుబడిగా పెట్టండి... నామమాత్రపు వడ్డీతోనైనా సరే.. మీ డబ్బు తిరిగి పొందండి అంటోంది రంగ్ దే. ఇందుకోసం చేయాల్సింది కూడా చాలా సింపుల్. రంగ్ దే వెబ్సైట్లోకి వెళ్లడం... మీ వివరాలు నమోదు చేసుకుని... ఎవరికి సాయం చేయాలనుకుంటున్నారో (సాయం కావాల్సిన వారి వివరాలు వెబ్సైట్లోనే ఉంటాయి) నిర్ణయించుకోవడం. మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటున్న మొత్తాన్ని ఖాతాలో జమచేయడం. మిగిలిన విషయమంతా రంగ్ దే చూసుకుంటుంది. వంద రూపాయల నుంచి వేలు, లక్షల వరకూ ఎంతైనా పెట్టుబడి పెట్టవచ్చు. ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన 12 వేల మందిలో చాలామంది తమ డబ్బు వెనక్కు తీసేసుకోగా.. కొందరు పేదల కోసం మళ్లీ మళ్లీ పెట్టుబడులు పెడుతూనే ఉన్నారు. ఎందరి జీవితాల్లోనో ఆనందపు రంగులు నింపుతున్నారు! దిగ్గజాలతో బృందం... రంగ్ దేను స్థాపించింది స్మిత, రామకృష్ణ దంపతులే అయినా ఈ ఆలోచనను ముందుకు తీసుకెళ్లింది మాత్రం దర్శకుడు నగేశ్ కుకునూన్, సంగీత కళాకారుడు రఘు దీక్షిత్, నాటితరం హీరోయిన్ వహీదా రెహమాన్ వంటి దిగ్గజాలే. బ్రాండ్ అంబాసిడర్లుగా వీరు రంగ్ దే? స్ఫూర్తిని వేదికలపై ఎలుగెత్తి చాటారు. సంస్థ డైరెక్టర్ల బృందం కూడా ఘనమైందే. హార్వర్డ్ బిజినెస్ స్కూల్ పూర్వ విద్యార్థి మనోజ్ కుమార్, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత, కర్ణాటక పల్లెప్రాంతాల్లో సోలార్ విప్లవాన్ని తీసుకొచ్చిన హరీశ్ హందే, నాబార్డ్ మాజీ ఉన్నతాధికారి ప్రొఫెసర్ అలోక మిశ్రా, మాజీ సాఫ్ట్వేర్ ఇంజినీర్ పునుకొల్లు శుభ, ఐటీ కంపెనీ సీనియర్ ఉద్యోగిగా పనిచేసిన చైతన్యా నాడ్కర్ణి, ఆక్స్‌ఫామ్ వంటి అంతర్జాతీయ ఎన్జీవోల్లో పనిచేసిన స్మితా సతీశ్ వంటి వారు రంగ్ దే పాలక మండలి సభ్యులు. జీవితాల్లో కొత్త రంగులు.. అజయ్ కుమార్ కొన్నేళ్ల క్రితం ఉపాధి కోసమని కుటుంబంతో కలిసి ఢిల్లీ నుంచి బెంగళూరుకు వలస వచ్చాడు. సరైన అవకాశాలు దొరక్కపోవడంతో చివరకు చెత్త ఏరుకుని దాంతోనే కడుపు నింపుకోవడం మొదలుపెట్టాడు. రోడ్లపై పడేసిన ప్లాస్టిక్ బాటిళ్లు, ఇతర చెత్త ఏరుకునేందుకు వెళితే.. నిత్యం పోలీసుల అనుమానపు కన్నులు వెంటాడేవి. ఈ పరిస్థితుల్లో అతడికి హసిరుదళ పరిచయమైంది. నగరం ఉత్పత్తి చేసే చెత్త నుంచి పనికొచ్చే వాటిని వేరు చేసి అమ్ముకోవడం ద్వారా ఉపాధి మార్గం చూపే సంస్థ ఇది. బెంగళూరు కార్పొరేషన్ ద్వారా గుర్తింపు కార్డు ఇప్పిస్తాం. పోలీసుల వేధింపులు ఉండవు... గొట్టిగెర ప్రాంతంలో చెత్త నిర్వహణ కేంద్రాన్ని నడుపుకో అనే ఆఫర్ ఇచ్చింది. ఒకే అన్నాడు అజయ్. కానీ కేంద్రం పెట్టాలంటే డబ్బు కావాలిగా? అంటే.. హసిరుదళ అతడిని రంగ్ దేకు పరిచయం చేసింది. అతితక్కువ వడ్డీకి రూ.40 వేల అప్పు అది కూడా ఎలాంటి గ్యారెంటీ లేకుండా దక్కడంతో అజయ్ ఇక వెనుదిరిగి చూసుకోలేదు. బిలాసినీ దేవి... మణిపూర్‌లోని థౌబల్ జిల్లాలోని కుగ్రామం బిలాసినీ దేవిది. భర్త వడ్రంగి. తనేమో ఇంట్లోనే చిన్న బడ్డీ కొట్టు నడుపుతూండేది. ఇద్దరు పిల్లలు రాబర్ట్, రోజర్ల చదువుల కోసం నెలకు రూ.4000 చొప్పున ఆదా చేసేవారు. పిల్లల నెలవారీ ఖర్చులు నడిచిపోయేవిగానీ.. ఏటా వచ్చే స్కూల్ ఫీజులు, సెమిస్టర్ ఫీజుల కోసం అప్పు చేయక తప్పేది కాదు. ఇంతకాలం అధిక వడ్డీలతో ఇలాగే నెట్టుకొచ్చినా... రంగ్ దే పుణ్యమా అని గత ఏడాది పరిస్థితిలో మార్పు వచ్చింది. ఇద్దరు పిల్లల ఫీజుల కోసం రూ.19,000 అప్పు దొరికింది. దీంతోపాటే హోల్‌సేల్ ధరల్లో సరుకులు కొని తన బడ్డీ కొట్టులో అమ్ముకునేందుకు మరికొంత మొత్తం కూడా రుణంగా అందింది. ఆదాయమూ కొంత పెరగడంతో పిల్లల కోసం చేసిన అప్పు దశలవారీగా తీర్చేసింది కూడా. చిన్నోడు రోజర్ ఇంఙనీరింగ్ ఆశలూ నెరవేరతాయంటోంది బిలాసిని! తమిళనాడులోని కడలూర్ జిల్లా సిలాంబినాథన్ పేటలోని అంబరిసి పరిస్థితి కూడా ఇలాంటిదే. 36 ఏళ్లకే భర్త పోయాడు. కుటుంబ భారం మోయాలంటే చేతిలో ఇంకో రెండు గొర్రెలుంటే బావుణ్ననుకుంది. రంగ్ దే వెబ్సైట్లో అంబరసి విజ్ఞప్తికి స్పందనగా అప్పు సమకూరింది. వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంటానంటోంది అంబరసి! బతకడానికి పోరాటం చేసే వారికి బతుకునిచ్చే ఆసరా రంగ్‌దే. – గిళియార్ గోపాలకృష్ణ మయ్యా ప్రస్థానం.. బంగ్లాదేశ్‌లో గ్రామీణ్ బ్యాంక్ వ్యవస్థాపకుడైన మహమ్మద్ యూనస్‌కు నోబెల్ బహుమతి లభించిన 2006లో రంగ్ దే ఆలోచన మొదలైంది అంటారు ఎన్.కే.రామకృష్ణ, స్మిత దంపతులు. ఇంటర్నెట్ అనే టెక్నాలజీ సమాజంలో ఒక వర్గానికి మాత్రమే ఉపయోగపడుతోందే.. దీన్ని పేదలకూ పనికొచ్చేలా వాడుకుంటే బాగుండూ అన్న భావన వీరి మనసులను తొలుస్తూండేది. అలా పుట్టిన ఐడియానే... పీర్ టు పీర్ లెండింగ్. సమాజంలోని కొందరు.. తోటివారికి సాయపడేందుకు చిన్న మొత్తాల్లో రుణాలు ఇవ్వడం ద్వారా అతితక్కువ వడ్డీలకే పేదలకు సాయపడవచ్చునని అంచనా వేశారు వీరు. దేశంలో పేదరికాన్ని రూపుమాపేందుకు ఇదో మేలైన మార్గమన్న నమ్మకంతో 2008 జనవరి 26న రంగ్ దే కార్యకలాపాలు మొదలయ్యాయి! పని చేసేదిలా.. రంగ్ దే సంస్థకు దేశంలోని అనేక రాష్ట్రాల్లో స్వచ్ఛంద సంస్థలతో భాగస్వామ్యం ఉంది. ఈ సంస్థలు తమ పరిధిలో డబ్బు అవసరమైన పేదవారిని గుర్తిస్తారు. వారి వివరాలు మొత్తాన్ని సేకరించి రంగ్ దేకు అందిస్తారు. రైతులు, చేనేత కార్మికులు, విద్యార్థులు ఇలా దాదాపు వెయ్యి మంది వరకూ ఇతరుల సాయం కోసం ఎదురుచూస్తున్న వారు మీకు కనిపిస్తారు. వీరిలో మీకు నచ్చిన వారిని ఎవరినైనా మనం ఎన్నుకోవచ్చు. వాళ్ల ఆర్థిక స్థితి గతులను అభివృద్ధి చేసేందుకు మీరు వారికి సాయం చేయవచ్చు. లేదంటే దానమైనా ఇవ్వవచ్చు. రంగ్ దే వీరి నుంచి నిర్దిష్ట మొత్తంలో వడ్డీ వసూలు చేస్తుంది. స్థానిక భాగస్వాములకు కొంత, రంగ్ దే నిర్వహణకు రెండు శాతం మినహాయించుకుని మిగిలిన వడ్డీని పెట్టుబడి పెట్టిన వారికి చెల్లిస్తారు. ఇలా తిరిగి వచ్చిన పెట్టుబడిని మీరు మళ్లీ ఇతరులకైనా అందివ్వవచ్చు లేదంటే వడ్డీతోపాటు మీరు వెనక్కు తీసుకోవచ్చు. -
‘విలేజ్ వినాయకుడు’
సాక్షి, సిటీబ్యూరో: రెడ్ ఎఫ్ఎం 93.5 ఆధ్వర్యంలో ‘విలేజ్ వినాయకుడు’ పేరిట వినూత్న కార్యక్రమం చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. విరాళాలు సేకరించి స్వచ్ఛంద సంస్థలకు అందజేసి... ఆ నిధులతో చిలుకూరు సమీపంలోని ఒక బడిని దత్తతకు తీసుకొని... దాన్ని పునరుద్ధరించడం ద్వారా చిన్నారుల నవ్వులకు కారణం కావాలన్నదే ఈ కార్యక్రమం ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమానికి ‘సాక్షి’ మీడియా పార్ట్నర్గా వ్యవహరిస్తోందన్నారు. ప్రముఖ నటులు ఎన్టీఆర్, సినీ ప్రముఖులు కొరటాల శివ, అవసరాల శ్రీనివాస్, విజయ్ దేవరకొండ, రెజీనా, నాని తదితరులు ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపారన్నారు. చిలుకూరు దేవస్థానం సమీపంలో జరిగిన రెడ్ ఎఫ్ఎం ‘విలేజ్ వినాయకుడు’ ఉత్సవాలకు ప్రముఖ నటుడు శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా నటించిన ‘నిర్మలా కాన్వెంట్’ చిత్రంలో హీరోయిన్గా నటించిన శ్రియాశర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారని చెప్పారు. కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారని తెలిపారు. -
ఫేస్బుక్లో కొత్త ఫీచర్
హూస్టన్ : విరాళాలను ఆన్లైన్లో పొందేందుకు చారిటీలు, లాభాపేక్షలేని సంస్థలకు సాయపడే కొత్త ఫీచర్‌ను సామాజిక మాధ్యమం ఫేస్బుక్ అందుబాటులోకి తెచ్చింది. ఈ అధునాతన ఫీచర్‌ను అమెరికాలోని చారిటీ సంస్థలతోపాటు ఇకమీదట వ్యక్తిగత యూజర్లు సైతం వాడుకోవచ్చు. ప్రస్తుతం ఈ ‘ఫండ్‌రైజర్స్’ ఫీచర్ అమెరికాలోని ఒక శాతం యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉందని, వచ్చే కొద్దివారాల్లో మొత్తం అమెరికన్లకు ఈ ఫీచర్‌ను పరిచయంచేస్తామని సంస్థ తెలిపింది. ఎన్జీఓలు నేరుగా ఫేస్బుక్ నుంచి విరాళాలు పొందొచ్చు.