ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు నిరాశ్రయులైన ప్రజల కోసం 27 సంవత్సరాల కౌశల్ శెట్టి ‘నోస్టోస్ హోమ్స్’ పేరుతో స్వచ్ఛందసంస్థను ప్రారంభించి దేశవ్యాప్తంగా సహాయక కార్యక్రమాలలో పాల్గొంటున్నాడు. నిరాశ్రయుల కోసం ఈ సంస్థ తేలికపాటి, ఈజీ ట్రాన్స్‌పోర్టబుల్ షెల్టర్స్‌ను రూపొందించింది...
‘అనుభవమైతేగానీ తత్వం బోధపడదు’ అంటారు. ‘తత్వం’ మాట ఎలా ఉన్నా కౌశల్ షెట్టికి ‘కర్తవ్యం’ బోధపడింది. షెట్టిదీ కర్నాటకలోని ఉడిపికి సమీపంలోని మది అనే గ్రామం. పచ్చదనానికి ఈ గ్రామం పర్‌ఫెక్ట్ అడ్రస్. అలాంటి పచ్చటి ఊరు కాస్తా ఘటప్రభ నది పొంగి పొర్లడంతో అల్లకల్లోలం అయింది. అంతెత్తు చెట్లు నిలువునా కూలి పోయాయి.
పొలాలు మునిగిపోయాయి. ఇండ్లు ఘోరంగా దెబ్బతిన్నాయి. ఇంట్లో ఉండలేని పరిస్థితి. దీంతో ప్రజలు తట్టాబుట్టా సర్దుకొని ఊరు విడిచి తోచిన దిక్కుకు వెళ్లారు. షెట్టి కుటుంబం ముంబైకి వెళ్లింది. ముంబైకి వెళుతున్నప్పుడు షెట్టి మనసు బాధతో నలిగిపోయింది. దీనికి కారణం...ఎటు పోవాలో తెలియక, గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆ ఊళ్లోనే ఉండిపోయిన ప్రజలు. సంవత్సరాలు గడుస్తున్నా ఆ బాధ తన నుంచి దూరం కాలేదు.
ఖరగ్‌పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదుకునే రోజుల్లో మరోసారి తుఫాను బీభత్సాన్ని, బాధితులు, నిరాశ్రయుల కష్టాలు, కన్నీళ్లను దగ్గర నుంచి చూశాడు. ‘ఇలా బాధ పడుతూ కూర్చోవడం తప్ప నేను ఏం చేయలేనా!’ అనుకున్నాడు షెట్టి. ఎన్నో రకాలుగా ఆలోచించిన తరువాత...
తన స్నేహితుడు మాధవ్ దత్‌తో కలిసి ‘నోస్టోస్ హోమ్’ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించాడు. ‘ప్రకృతి వైపరీత్యాల కారణంగా ప్రతి సంవత్సరం వందలాది మంది ప్రజలు నిరాశ్రయులవుతున్నారు. అలాంటి వారికి నిలువ నీడ కల్పించడానికి మా సంస్థ ద్వారా కృషి చేస్తున్నాం’ అంటున్నాడు షెట్టి.
తమ సంస్థ ట్రాన్స్‌పోర్టబుల్ హోమ్స్ గురించి చెబుతూ... ‘పర్సనల్ డిగ్నిటీ, ప్రైవసీతో కూడిన హోమ్స్ ఇవి’ అంటాడు షెట్టి. ‘నోస్టోస్ హోమ్’ సంస్థ అస్సాం, నాగాలాండ్ రాష్ట్రాలతో పాటు ఆఫ్రిక దేశాలలోనూ సేవలు అందిస్తోంది. కౌశల్ చేపట్టే సేవాకార్యక్రమాలకు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు లభిస్తున్నాయి. ‘తక్కువ సమయంలోనే బాధితులకు సహాయం అందించి నిరాశ్రయులకు అండగా నిలబడింది కౌశల్ బృందం. నిపుణుల సహాయంతో సౌకర్యాలు సమకూర్చారు’ అంటున్నాడు హాబిటాట్ ఫర్ హ్యూమానిటీ మలావి నేషనల్ డైరెక్టర్ కపీరా.
ఇక షెట్టి భవిష్యత్ లక్ష్యం విషయానికి వస్తే... తన సేవాకార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలనుకుంటున్నాడు. మారుమూల ప్రాంతాలలో వైద్య సౌకర్యాల మెరుగుదల కోసం కృషి చేయాలనుకుంటున్నాడు. ‘నోస్టోస్ హోమ్’తో తొలి అడుగు వేసినప్పుడు ‘నిజంగా నేను చేయగలనా?’ అనే సందేహం షెట్టికి వచ్చేది. మంచి పని కోసం బయలు దేరినప్పుడు ఎన్నో ద్వారాలు మన కోసం తెరుచుకుంటాయి...అన్నట్లుగా షెట్టికి ఎంతోమంది ఎన్నో రకాలుగా సహాయం అందించారు.
కొన్ని అడుగులు పడిన తరువాత శెట్టికి తనపై తనకు ఎంతో నమ్మకం వచ్చింది. ఆ నమ్మకమే మరిన్ని సేవాకార్యక్రమాలు చేపట్టాలనే లక్ష్యం నిర్దేశించుకోవడానికి కారణం అయింది.
Kaushal Shetty: పచ్చటి గూడుతో...
Published Fri, Jul 21 2023 5:31 AM | Last Updated on Fri, Jul 21 2023 2:38 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment