18 ఏళ్ల తర్వాత తల్లిదండ్రుల చెంతకు...
వెల్దండ: మతిస్థిమితం కోల్పోయిన ఓ వ్యక్తి 18 ఏళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అతని ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు వెతకని చోటంటూ లేదు. చివరకు మరణించాడనుకొని ఆశలు వదులుకున్నారు. అయితే మంగళవారం అతను ప్రత్యక్షమవడంతో ఇది కలనా.. నిజమా అని కుటుంబ సభ్యులు సంభ్రమాశ్చర్యంలో మునిగితేలారు. వివరాలు.. మహబూబ్‌నగర్ జిల్లా వెల్దండకు చెందిన కనుగుల కృష్ణయ్య అలియాస్ గున్నకు మతిస్థిమితం సక్రమంగా లేకపోవడంతో 18 ఏళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఈ క్రమంలోనే రెండు నెలల క్రితం మహారాష్ట్ర, గుజరాత్ సరిహద్దులో అక్కడి స్వచ్ఛంద సంస్థ అయిన శ్రద్ధ రిహాబిలిటేషన్ ఫౌండేషన్‌కు దొరికాడు.
నిర్వాహకులు ముంబైలోని గుంజ్ మానసిక వైద్య కేంద్రంలో చికిత్సలు చేయించడంతో సాధారణ వ్యక్తిగా మారాడు. అనంతరం తన చిరునామా చెప్పడంతో సంస్థ సభ్యులు వసంత్, సిద్దు మంగళవారం స్వగ్రామానికి తీసుకొచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో ఆ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. కాగా తమ సంస్థను 1986లో ఏర్పాటు చేశామని, ఇప్పటివరకు సుమారు నాలుగు వేల మంది బాధితులను బాగుపరిచి వారి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు వసంత్, సిద్దు వివరించారు.