రామన్నపేట : పద్మశ్రీ డాక్టర్ కూరెళ్ల విఠలాచార్యపై గవర్నర్ తమిళసై ప్రశంసలు కురింపించారు. ఒక మారుమూల ప్రాంతంలో అద్భుతమైన లైబ్రరీని స్థాపించేందుకు ఆచార్య విఠలాచార్యులు ముందుకు రావడం గొప్ప విషయమని కొనియాడారు. రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో ఆచార్య కూరెళ్ల గ్రంథాలయం పై అంతస్తులో నిర్మించిన సాయి సమావేశ మందిరాన్ని జస్టిస్ కూనురు లక్ష్మణ్‌తో కలిసి గవర్నర్ తమిళసై ప్రారంభించారు.
నా వంతు సహకారం అందిస్తా : గవర్నర్ తమిళిసై
కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ తమిళసై సౌందరరాజన్ కూరెళ్ల విఠలాచార్యా కృషిని కొనియాడారు. ఆయన ఏర్పాటు చేసిన గ్రంథాలయానికి రూ. 10లక్షల 63 వేల రూపాయలు, 8వేల పుస్తకాలు, వెయ్యి నోట్ బుక్స్ డొనెట్ చేస్తానని హామీ ఇచ్చారు. "ఆచార్య విఠలాచార్యుల గురించి మన్ కి బాత్ లో మాట్లాడిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు, విఠలాచార్యులు తన ఇంటిని గ్రంథాలయంగా మార్చారు. ఆయన సేవలకు ధన్యవాదాలు. పుస్తకాల వల్ల విజ్ఞానం పెరుగుతుంది. రాజ్ భవన్‌ను వెల్లంకికి తీసుకొచ్చిన మహాన్నత వ్యక్తి విఠలాచార్యులు" అని అభినందించారు.
విఠలాచార్య అందించిన విజ్ఞాన సంపద ఇది : జస్టిస్ కూనూరు లక్ష్మణ్
డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య రాసిన కూరెళ్ల శతకం ద్వితీయ ముద్రణను సినీ గేయ రచయిత కనుకుంట్ల సుభాస్‌చంద్రబోస్, కలెక్టర్ హనుమంతు కె.జెండగేతో కలిసి ఆవిష్కరించిన హైకోర్టు జడ్జి జస్టిస్ కూనూరు లక్ష్మణ్.. విఠలాచార్య సేవలను కొనియాడారు. "భావితారాలకు విజ్ఞాన సంపదను పంచడమే ఆచార్య కూరెళ్ల గ్రంథాలయం ఏర్పాటు ప్రధాన లక్ష్యమని అన్నారు. చదువుకునేందుకు తాను పడిన ఇబ్బందులు ఇతరులకు ఎదురు కాకూడదని బాల్యంలో కూరెళ్ల మదిలో వచ్చిన ఆలోచన కూరెళ్ల గ్రంథాలయం ఏర్పాటుకు నాంది పలికిందని తెలిపారు. ఉపాధ్యాయ ఉద్యోగ విరమణ అనంతరం కూరెళ్ల ఇంటిని గ్రంథాలయంగా మలచి తన పింఛన్ డబ్బులతో నిర్వహించడం ఆదర్శనీయమన్నారు. కూరెళ్లకు కూతుళ్లు అందిస్తున్న సహకారం అభినందనీయమని కొనియాడారు. భవిష్యత్తులో గ్రంథాలయ నిర్వహణకు ప్రజలు సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. కూరెళ్ల గ్రంథాలయం అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని" తెలిపారు.
మాతృభాషను మరవొద్దు
ఆస్కార్ అవార్డు గ్రహీత ప్రముఖ సినీ గేయరచయిత కనుకుంట్ల చంద్రబోస్ మాట్లాడుతూ "పరభాషా వ్యామోహంలోపడి మాతృభాషను మరువవద్దని కోరారు. కలెక్టర్ హనుమంతు కె. జెండగే మాట్లాడుతూ జిల్లాకు చెందిన ఇద్దరు ప్రముఖులకు పద్మశ్రీ పురస్కారాలు రావడం గర్వకారణమని" తెలిపారు. విద్యార్థులు, యువకులు పఠనాసక్తిని పెంచుకోవాలని చెప్పారు.
ప్రతీ పురస్కారం గ్రామానికే అంకితం
తనకు వచ్చిన ప్రతీ పురస్కారం గ్రామానికే అంకితమిచ్చినట్లు గ్రంథాలయ వ్యవస్థాపకుడు, పద్మశ్రీ పురస్కారానికి ఎంపికై న డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య చెప్పారు. రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన రూ.25లక్షల నగదు పురస్కారంతోపాటు మరో రూ.20లక్షలను సమకూర్చి గ్రంథాలయ నిర్వహణ నిధిని ఏర్పాటు చేస్తానని తెలిపారు.
గవర్నర్‌చేతుల మీదుగా గ్రంథాలయంను ప్రారంభించుకోవడం తన జీవితంలో మరపురాని రోజు అని తెలిపారు.అంతకుముందు అతిథులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు డాక్టర్ పోరెడ్డి రంగయ్య, గ్రంథాలయ అధ్యక్షుడు కూరెళ్ల నర్సింహాచారి, అధికార ప్రతినిధి కూరెళ్ల నర్మద సభ్యులు కూరెళ్ల తపతి, సరస్వతి గ్రంథపాలకుడు తాటిపాముల స్వామి, తాజామాజీ సర్పంచ్ ఎడ్ల మహేందర్‌రెడ్డి, ఎంపీటీసీలు ఎర్రోళ్ల లక్ష్మమ్మ,మహేందర్‌రెడ్డి, ఆర్డీఓ శేఖర్‌రెడ్డి, తహసీల్దార్, ఎంపీడీఓ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment