kurella
-
విజ్ఞాన సంపదను పంచడమే ‘కూరెళ్ల’ లక్ష్యం
రామన్నపేట : పద్మశ్రీ డాక్టర్ కూరెళ్ల విఠలాచార్యపై గవర్నర్ తమిళసై ప్రశంసలు కురింపించారు. ఒక మారుమూల ప్రాంతంలో అద్భుతమైన లైబ్రరీని స్థాపించేందుకు ఆచార్య విఠలాచార్యులు ముందుకు రావడం గొప్ప విషయమని కొనియాడారు. రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో ఆచార్య కూరెళ్ల గ్రంథాలయం పై అంతస్తులో నిర్మించిన సాయి సమావేశ మందిరాన్ని జస్టిస్ కూనురు లక్ష్మణ్‌తో కలిసి గవర్నర్ తమిళసై ప్రారంభించారు. నా వంతు సహకారం అందిస్తా : గవర్నర్ తమిళిసై కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ తమిళసై సౌందరరాజన్ కూరెళ్ల విఠలాచార్యా కృషిని కొనియాడారు. ఆయన ఏర్పాటు చేసిన గ్రంథాలయానికి రూ. 10లక్షల 63 వేల రూపాయలు, 8వేల పుస్తకాలు, వెయ్యి నోట్ బుక్స్ డొనెట్ చేస్తానని హామీ ఇచ్చారు. "ఆచార్య విఠలాచార్యుల గురించి మన్ కి బాత్ లో మాట్లాడిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు, విఠలాచార్యులు తన ఇంటిని గ్రంథాలయంగా మార్చారు. ఆయన సేవలకు ధన్యవాదాలు. పుస్తకాల వల్ల విజ్ఞానం పెరుగుతుంది. రాజ్ భవన్‌ను వెల్లంకికి తీసుకొచ్చిన మహాన్నత వ్యక్తి విఠలాచార్యులు" అని అభినందించారు. విఠలాచార్య అందించిన విజ్ఞాన సంపద ఇది : జస్టిస్ కూనూరు లక్ష్మణ్ డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య రాసిన కూరెళ్ల శతకం ద్వితీయ ముద్రణను సినీ గేయ రచయిత కనుకుంట్ల సుభాస్‌చంద్రబోస్, కలెక్టర్ హనుమంతు కె.జెండగేతో కలిసి ఆవిష్కరించిన హైకోర్టు జడ్జి జస్టిస్ కూనూరు లక్ష్మణ్.. విఠలాచార్య సేవలను కొనియాడారు. "భావితారాలకు విజ్ఞాన సంపదను పంచడమే ఆచార్య కూరెళ్ల గ్రంథాలయం ఏర్పాటు ప్రధాన లక్ష్యమని అన్నారు. చదువుకునేందుకు తాను పడిన ఇబ్బందులు ఇతరులకు ఎదురు కాకూడదని బాల్యంలో కూరెళ్ల మదిలో వచ్చిన ఆలోచన కూరెళ్ల గ్రంథాలయం ఏర్పాటుకు నాంది పలికిందని తెలిపారు. ఉపాధ్యాయ ఉద్యోగ విరమణ అనంతరం కూరెళ్ల ఇంటిని గ్రంథాలయంగా మలచి తన పింఛన్ డబ్బులతో నిర్వహించడం ఆదర్శనీయమన్నారు. కూరెళ్లకు కూతుళ్లు అందిస్తున్న సహకారం అభినందనీయమని కొనియాడారు. భవిష్యత్తులో గ్రంథాలయ నిర్వహణకు ప్రజలు సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. కూరెళ్ల గ్రంథాలయం అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని" తెలిపారు. మాతృభాషను మరవొద్దు ఆస్కార్ అవార్డు గ్రహీత ప్రముఖ సినీ గేయరచయిత కనుకుంట్ల చంద్రబోస్ మాట్లాడుతూ "పరభాషా వ్యామోహంలోపడి మాతృభాషను మరువవద్దని కోరారు. కలెక్టర్ హనుమంతు కె. జెండగే మాట్లాడుతూ జిల్లాకు చెందిన ఇద్దరు ప్రముఖులకు పద్మశ్రీ పురస్కారాలు రావడం గర్వకారణమని" తెలిపారు. విద్యార్థులు, యువకులు పఠనాసక్తిని పెంచుకోవాలని చెప్పారు. ప్రతీ పురస్కారం గ్రామానికే అంకితం తనకు వచ్చిన ప్రతీ పురస్కారం గ్రామానికే అంకితమిచ్చినట్లు గ్రంథాలయ వ్యవస్థాపకుడు, పద్మశ్రీ పురస్కారానికి ఎంపికై న డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య చెప్పారు. రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన రూ.25లక్షల నగదు పురస్కారంతోపాటు మరో రూ.20లక్షలను సమకూర్చి గ్రంథాలయ నిర్వహణ నిధిని ఏర్పాటు చేస్తానని తెలిపారు. గవర్నర్చేతుల మీదుగా గ్రంథాలయంను ప్రారంభించుకోవడం తన జీవితంలో మరపురాని రోజు అని తెలిపారు.అంతకుముందు అతిథులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు డాక్టర్ పోరెడ్డి రంగయ్య, గ్రంథాలయ అధ్యక్షుడు కూరెళ్ల నర్సింహాచారి, అధికార ప్రతినిధి కూరెళ్ల నర్మద సభ్యులు కూరెళ్ల తపతి, సరస్వతి గ్రంథపాలకుడు తాటిపాముల స్వామి, తాజామాజీ సర్పంచ్ ఎడ్ల మహేందర్‌రెడ్డి, ఎంపీటీసీలు ఎర్రోళ్ల లక్ష్మమ్మ,మహేందర్‌రెడ్డి, ఆర్డీఓ శేఖర్‌రెడ్డి, తహసీల్దార్, ఎంపీడీఓ పాల్గొన్నారు. -
నిరసనలు ఉధృతం చేస్తాం
ప్రభుత్వానికి అఖిలపక్షం హెచ్చరిక కోహెడ: కరీంనగర్ జిల్లాలో హుస్నాబాద్ – కోహెడ మండలాలను కొనసాగించాలని సోమవారం మండలంలోని కూరెల్లలో అఖిల పక్షం నాయకులు కళ్ల, చెవులు, నోరు మూసుకొని ప్రభుత్వానికి నిరసన తెలిపారు. ఈ సందర్బంగా అఖిల పక్షం నాయకులు మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలను పక్కన పెట్టి సిద్దిపేటలో రెండు మండలాలను కలిపేందుకు ఎమ్మెల్యే సతీశ్‌కుమార్, ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల అభిప్రాయలు గౌరవించి కరీంనగర్‌లోనే కోహెడ, హుస్నాబాద్ మండలాలను ఉంచాలని డిమాండ్ చేశారు. 21 గ్రామాలలో 16 గ్రామాలు కరీంనగర్ జిల్లాలో ఉంటామని తీర్మానాలు చేశారని గుర్తు చేశారు. 16 గ్రామాలలో రోజుకు ఒక్క పద్దతిలో ప్రభుత్వానికి నిరసన తెలుపుతామన్నారు. కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ సభ్యుడు బండారి బాలరాజు, మాజీ సర్పంచ్ తాళ్లపల్లి ఎల్లయ్యగౌడ్, వలుస సుభాష్, అఖిల పక్షం నాయకులు ఖమ్మం వెంకటేశం, గవ్వ వంశీధర్‌రెడ్డి, చెపూరి తిరుపతి, గాజుల వెంకటేశ్వర్లు, బందెల బాలకిషన్, పిల్లి నర్సయ్య, రాజశేఖర్‌చారి, జాగిరి కుమార్, బండి రవి, కిషన్, వెంకన్న పాల్గొన్నారు. -
కేజీవీల్స్ కిందపడి బాలుడి మృతి
తండ్రే చంపాడని తల్లి ఆరోపణ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు కోహెడ : మండలంలోని కూరెల్ల గ్రామానికి చెందిన కోనవేణి రంజిత్(12) అనుమానాస్పదంగా ట్రాక్టర్ కేజీవీల్స్ కిందపడి మృతి చెందాడు. రంజిత్ తల్లి రాజేశ్వరి, గ్రామస్తుల కథనం ప్రకారం.. కూరెల్లకు చెందిన రాజేశ్వరికి ఇదే గ్రామానికి చెందిన కోనవేణి సంజీవ్‌తో 14 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు. పెళ్లి సమయంలో రాజేశ్వరి తల్లిదండ్రుల వరకట్నంగా రెండెకరాల వ్యవసాయ భూమి ఇచ్చారు. ఆర్థిక ఇబ్బందులతో ఈ భూమి అమ్మాలనుకున్నాడు. అయితే భూమి విక్రయానికి రాజేశ్వరి అంగీకరించకపోవడంతో మార్చి 20న భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. భూమి అమ్మేందుకు ఒప్పుకోవాలని రాజేశ్వరిని తీవ్రంగా కొట్టాడు. అప్పటి నుంచి మద్యానికి బానిసైన సంజీవ్ భార్యను వేధించడం ప్రారంభించాడు. దీంతో రాజేశ్వరి అదేరోజు తన చిన్న కొడుకును తీసుకుని పుట్టింటికి వెళ్లింది. పెద్ద కొడుకు రంజిత్ తండ్రి సంజీవ్ వద్దనే ఉంటున్నాడు. రాజేశ్వరి కాపురానికి రాకపోవడంతో విడాకులు ఇవ్వాలని ఒత్తిడి పెంచగా.. ఆమె నిరాకరించింది. దీంతో భార్యపై సంజీవ్ కక్ష పెంచుకున్నాడు. సోమవారం తన ట్రాక్టర్‌తో పొలం దున్ని ఇంటికి వచ్చాడు. సాయంత్రం రంజిత్‌ను తీసుకుని మళ్లీ పొలం వద్దకు వెళ్లాడు. పొద్దుపోయిన తర్వాత తన కొడుకు కనిపించడంలేదని సంజీవ్ ఊళ్లోకి వచ్చాడు. స్థానికుల సాయంతో గ్రామంలో గాలించాడు. ఈ క్రమంలో రాత్రి 10 గంటలకు పొలం వద్ద తన ట్రాక్టర్ కిందనే అనుమానాస్పదంగా మృతిచెంది కనిపించాడు. తాను భూమి అమ్మడానికి, విడాకులు ఇవ్వడానికి ఒప్పుకోకపోవడంతో తన భర్తే కొడుకును పొట్టన పెట్టుకున్నాడని రాజేశ్వరి గుండెలు పగిలేలా రోదించింది. స్థానికుల ఫిర్యాదు మేరకు హుస్నాబాద్ సీఐ దాసరి భూమయ్య మంగళవారం ఉదయం సంఘటన స్థలాన్ని సందర్శించారు. రాజేశ్వరి ఫిర్యాదుమేరకు సంజీవ్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై రాజేందర్ తెలిపారు.