- తండ్రే చంపాడని తల్లి ఆరోపణ
- అనుమానాస్పద మృతిగా కేసు నమోదు
కేజీవీల్స్ కిందపడి బాలుడి మృతి
Published Tue, Aug 2 2016 9:15 PM | Last Updated on Fri, Jul 12 2019 3:02 PM
కోహెడ : మండలంలోని కూరెల్ల గ్రామానికి చెందిన కోనవేణి రంజిత్(12) అనుమానాస్పదంగా ట్రాక్టర్ కేజీవీల్స్ కిందపడి మృతి చెందాడు. రంజిత్ తల్లి రాజేశ్వరి, గ్రామస్తుల కథనం ప్రకారం.. కూరెల్లకు చెందిన రాజేశ్వరికి ఇదే గ్రామానికి చెందిన కోనవేణి సంజీవ్‌తో 14 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు. పెళ్లి సమయంలో రాజేశ్వరి తల్లిదండ్రుల వరకట్నంగా రెండెకరాల వ్యవసాయ భూమి ఇచ్చారు. ఆర్థిక ఇబ్బందులతో ఈ భూమి అమ్మాలనుకున్నాడు. అయితే భూమి విక్రయానికి రాజేశ్వరి అంగీకరించకపోవడంతో మార్చి 20న భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. భూమి అమ్మేందుకు ఒప్పుకోవాలని రాజేశ్వరిని తీవ్రంగా కొట్టాడు. అప్పటి నుంచి మద్యానికి బానిసైన సంజీవ్ భార్యను వేధించడం ప్రారంభించాడు. దీంతో రాజేశ్వరి అదేరోజు తన చిన్న కొడుకును తీసుకుని పుట్టింటికి వెళ్లింది. పెద్ద కొడుకు రంజిత్ తండ్రి సంజీవ్ వద్దనే ఉంటున్నాడు. రాజేశ్వరి కాపురానికి రాకపోవడంతో విడాకులు ఇవ్వాలని ఒత్తిడి పెంచగా.. ఆమె నిరాకరించింది. దీంతో భార్యపై సంజీవ్ కక్ష పెంచుకున్నాడు. సోమవారం తన ట్రాక్టర్‌తో పొలం దున్ని ఇంటికి వచ్చాడు. సాయంత్రం రంజిత్‌ను తీసుకుని మళ్లీ పొలం వద్దకు వెళ్లాడు. పొద్దుపోయిన తర్వాత తన కొడుకు కనిపించడంలేదని సంజీవ్ ఊళ్లోకి వచ్చాడు. స్థానికుల సాయంతో గ్రామంలో గాలించాడు. ఈ క్రమంలో రాత్రి 10 గంటలకు పొలం వద్ద తన ట్రాక్టర్ కిందనే అనుమానాస్పదంగా మృతిచెంది కనిపించాడు. తాను భూమి అమ్మడానికి, విడాకులు ఇవ్వడానికి ఒప్పుకోకపోవడంతో తన భర్తే కొడుకును పొట్టన పెట్టుకున్నాడని రాజేశ్వరి గుండెలు పగిలేలా రోదించింది. స్థానికుల ఫిర్యాదు మేరకు హుస్నాబాద్ సీఐ దాసరి భూమయ్య మంగళవారం ఉదయం సంఘటన స్థలాన్ని సందర్శించారు. రాజేశ్వరి ఫిర్యాదుమేరకు సంజీవ్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై రాజేందర్ తెలిపారు.
Advertisement
Advertisement