పేదింటి కల.. సాకారం దిశగా | - | Sakshi
Sakshi News home page

పేదింటి కల.. సాకారం దిశగా

Mar 29 2025 1:08 AM | Updated on Mar 29 2025 1:06 AM

పైలట్‌ ప్రాజెక్టుగా 17 గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం

సాక్షి, యాదాద్రి : నిరుపేదల సొంతింటి కల సాకారం చేసేందుకు ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. జిల్లాలో ఎంపిక చేసిన 17 గ్రామ పంచాయతీల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. 724 ఇళ్లు మంజూరు కాగా కొన్ని పిల్లర్ల దశలో, మరికొన్ని పునాది దశలో ఉన్నాయి. ఉగాది తరువాత ఇళ్ల నిర్మాణ పనులు జోరందుకునేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.

తొలి విడతలో 724 ఇళ్లు మంజూరు

ప్రజాపాలన కార్యక్రమంతో పాటు ప్రత్యేకంగా నిర్వహించిన గ్రామ సభల్లో ఇందిరమ్మ ఇళ్ల కోసం 52,109 దరఖాస్తులు వచ్చాయి. తొలి విడతలో ప్రయోగాత్మకంగా జిల్లాలోని 17 మండలాల్లో 17 గ్రామాలను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఆయా గ్రామాల్లో 724 మంది లబ్ధిదారులతో జాబితా రూపొందించి ఇళ్లు మంజూరు చేసింది. వీరందరికీ ఇందిరమ్మ పథకం ప్రారంభం రోజు జనవరి 26న అధికారులు ప్రొసీడింగ్స్‌ అందజేశారు. ఇందులో ఈనెల 28వ తేదీ నాటికి 260 ఇళ్ల గ్రౌండింగ్‌ పూర్తయ్యింది. ఇందులో 15 ఇళ్లు పునాది స్థాయిలో, మరికొన్ని పిల్లర్ల దశలో ఉన్నాయి. ఇళ్ల నిర్మాణం సలువుగా సాగేలా గృహనిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో మండలానికి ఒకటి చొప్పున మోడల్‌ ఇల్లు కూడా నిర్మిస్తున్నారు.

400 చదరపు అడుగులకు మించొద్దు

ఇందిరమ్మ ఇళ్ల జాబితాను ప్రభుత్వం మూడు విభాగాలుగా (ఎల్‌–1, ఎల్‌–2, ఎల్‌–3)గా విభజించింది. ఇందులో సొంతంగా ఇంటి స్థలం ఉన్నవారిని ఎల్‌–1 జాబితాలో చేర్చింది. వీరందరూ తొలి విడతలో ఇళ్లు నిర్మంచుకునేలా ప్రభుత్వం చేయూతనిస్తోంది. అయితే ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 400 చదరపు అడుగుల విస్తీర్ణంలోనే ఇల్లు నిర్మించుకోవాలి. అంతకుమించవద్దు. ఇంటిలోపల బెడ్రూమ్‌(అటాచ్‌ బాత్రూమ్‌), ఒక హాల్‌, కిచెన్‌ రానున్నాయి. పనులు ప్రారంభించే ముందు ఖాళీ స్థలం ఫొటో తీసి ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి. బేస్మెంట్‌, గోడలు, లెంటల్‌, శ్లాబులెవల్‌, ఇంటికి రంగులు వేసే ప్రతి స్థాయిలో ఫొటోలు తీసి యాప్‌లో తప్పనిసరిగా అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఇంటినిర్మాణం కోసం ప్రభుత్వం విడతల వారీగా రూ.5 లక్షలు మంజూరు చేస్తుంది. బేస్మెంట్‌ దశలో రూ.1 లక్ష, గోడలు పూర్తికాగానే రూ.1 లక్ష, శ్లాబులెవల్‌ రూ.2 లక్షలు, ఇంటికి రంగులు వేశాక రూ.1 లక్ష లబ్ధిదారు ఖాతాలో జమ చేయనుంది.

ఆర్థిక సాయం పెంచాలంటున్న లబ్ధిదారులు

లూజ్‌ సాయిల్‌, చౌడు లక్షణాలున్న భూముల్లో నిర్మించే ఇళ్లకు ప్రభుత్వం అందజేసే ఆర్థిక సాయం సరిపోదని లబ్ధిదారులు అంటున్నారు. అక్కడ బేస్మెంట్‌, శ్లాబు లెవల్‌లో రెండు దఫాలు బీములు పోయాల్సి ఉంటుందని, అదనంగా మరో లక్ష రూపాలు పెంచాలని కోరుతున్నారు.

ఫ 724 గృహాలకు 260 గ్రౌండింగ్‌

ఫ కొన్ని బేస్మెంట్‌, మరికొన్ని పిల్లర్ల దశలో..

ఫ ఉగాది తరువాత పనులు జోరందుకునే అవకాశం

నిర్మాణాలు సకాలంలో పూర్తయ్యేలా ప్రణాళికలు

ఇందిరమ్మ ఇళ్లు నిబంధనల ప్రకారం నిర్మించుకోవాలి. పాత ఇళ్లకు, గతంలో నిర్మించిన, అసంపూర్తి ఇళ్లకు ఇందిరమ్మ పథకంలో బిల్లులు ఇవ్వ డం కుదరదు. ఉగాది తర్వాత ఇళ్ల నిర్మాణం వేగం పుంజుకుంటుంది. సకాలంలో పనులు పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించాం. లబ్ధిదారులకు ప్రభుత్వమే ఉచితంగా ఇసుక సరఫరా చేస్తుంది.

–విజయ్‌సింగ్‌, హౌసింగ్‌ పీడీ

పేదింటి కల.. సాకారం దిశగా1
1/1

పేదింటి కల.. సాకారం దిశగా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement